‘ఇనార్బిట్‌’ చుట్టూ ఇగో పాలిటిక్స్‌ | Grand Opening of the Largest Inorbit Mall In Vishaka | Sakshi
Sakshi News home page

‘ఇనార్బిట్‌’ చుట్టూ ఇగో పాలిటిక్స్‌

Mar 24 2026 12:10 PM | Updated on Mar 24 2026 1:05 PM

Grand Opening of the Largest Inorbit Mall In Vishaka

పూర్తిగా జగన్‌ ముద్రేనని.. ఇనార్బిట్‌ మాల్‌ ప్రారంభానికి ప్రభుత్వం దూరం

విశాఖలో ఉన్నా.. హాజరుకాని ఐటీ మంత్రి లోకేష్‌ 

టీడీపీ ఎమ్మెల్యేలూ హాజరవ్వకూడదంటూ హుకుం

 చివరికి పోర్టు చైర్మన్‌ డా.అంగముత్తు చేతుల మీదుగా ప్రారంభోత్సవం 

2023 ఆగస్ట్‌ 1న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా మాల్‌కు శంకుస్థాపన

శరవేగంగా పనులు పూర్తి చేసి అద్భుతంగా నిర్మించిన రహేజా గ్రూప్‌

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రానికి పెట్టుబడులు, నిరుద్యోగులకు ఉద్యోగాలే లక్ష్యమని ప్రగల్భాలు పలికే చంద్రబాబు ప్రభుత్వ అసలు రంగు విశాఖ ఇనార్బిట్‌ మాల్‌ ప్రారంభోత్సవం వేళ బయటపడింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టుపై ఆయన ముద్ర చెరిగిపోలేదన్న కక్షతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి దూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాదిలోనే అతిపెద్దదైన ఈ మాల్‌ పనులు గత ప్రభుత్వ హయాంలోనే 70 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 600 కోట్లతో 8 వేల మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టు క్రెడిట్‌ ఎక్కడ జగన్‌కు దక్కుతుందోనన్న భయంతోనే విశాఖలోనే ఉన్న లోకేష్‌ సహా టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదని చర్చ జరుగుతోంది. నగరాభివృద్ధి కంటే రాజకీయ వైషమ్యాలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఈ ఘటన నిరూపిస్తోంది. 

అభివృద్ధిపై ‘చిన్నచూపు’.. లోకేష్‌ అక్కసు! 
రాష్ట్ర ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రిగా ఉండి ఇంత పెద్ద ఎత్తున ఉపాధి కలి్పంచే వేదికను ప్రోత్సహించాల్సింది పోయి, దాన్ని చిన్నచూపు చూడటం దారుణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను గ్లోబల్‌ సిటీగా మారుస్తామని ప్రగల్భాలు పలికే లోకేష్‌ .. కేవలం రాజకీయ వైరంతోనే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారన్న టాక్‌ వినిపిస్తోంది. కనీసం స్థానిక ఎమ్మెల్యేలను కూడా వెళ్లనివ్వకుండా కట్టడి చేయడం చూస్తుంటే, అభివద్ధి కంటే రాజకీయ స్వలాభం కోసమే ఈ ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తోందన్న చర్చ జరుగుతోంది.  ప్రభుత్వ పెద్దలు ఎవరూ హాజరుకాకపోవడంతో సోమవారం విశాఖ పోర్ట్‌ అథారిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు చేతుల మీదుగా ఇనార్బిట్‌ మాల్‌ను ప్రారంభించారు. ఈ నెల 27వ తేదీ నుంచి ప్రజలకు పూర్తిస్థాయిలో మాల్‌ అందుబాటులోకి రానుంది. కార్యక్రమానికి రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా, ఇనార్బిట్‌ మాల్‌ సీఈవో రజనీష్‌ మహాజన్, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్‌ రోషిణి అపరాంజి కోరాటి మాత్రమే హాజరయ్యారు.  

మాల్‌ను ప్రారంభించిన రహేజా గ్రూప్‌ ప్రతినిధులు, ఇనార్బిట్‌మాల్‌ సీఈవో రజనీష్‌ మహాజన్‌ , పోర్టు చైర్మన్‌ అంగముత్తు 

గత ప్రాజెక్టులపై వివక్ష 
ఈ మాల్‌ ద్వారా సుమారు 8 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.  ఎన్నికల ముందు ‘జాబ్‌ క్యాలెండర్‌’ అంటూ ఊదరగొట్టిన లోకేష్ ఇప్పుడు ప్రత్యక్షంగా ఉద్యోగాలు ఇచ్చే సంస్థల పట్ల ఇలాంటి వివక్ష చూపడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది నిరుద్యోగులను వంచించడమే అంటూ నిరుద్యోగులు పెదవి విరస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరు పట్ల పారిశ్రామిక, వ్యాపార వర్గాలు తప్పుబడుతున్నాయి. ఇదే ధోరణితో ప్రభుత్వం ఉంటే.. పెట్టుబడిదారుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement