ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు | Burden on AP Govt treasury with Amaravathi capitals master plan | Sakshi
Sakshi News home page

రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో లోపం.. ఖజానాపై భారం రూ.1,472.50 కోట్లు

Mar 25 2026 5:07 AM | Updated on Mar 25 2026 5:40 AM

Burden on AP Govt treasury with Amaravathi capitals master plan

2016లో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ తయారీ పనులు నామినేషన్‌పై సింగపూర్‌ సంస్థకు అప్పగింత

మాస్టర్‌ ప్లాన్‌ కోసం సుర్బానా–జురాంగ్‌కు రూ.20.28 కోట్లను చెల్లించడాన్ని తప్పుబట్టిన ‘కాగ్‌’

220 కేవీ, 400 కేవీ విద్యుత్‌ లైన్‌లను విస్మరించి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించిన సింగపూర్‌ సంస్థ

ఇప్పుడు రాజధానిలో వివిధ నిర్మాణాలకు ఆ విద్యుత్‌ లైన్‌లు అడ్డంకిగా మారాయంటున్న సీఆర్‌డీఏ

వాటిని మార్చే పనులు 8.98, 8.99 శాతం అధిక ధరలకు అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన వైనం

మనోళ్లకు ఇస్తే మురికివాడ నిర్మిస్తారంటూ అప్పట్లో ఇంజనీర్లను అవహేళన చేసిన చంద్రబాబు

మాస్టర్‌ ప్లాన్‌లో లోపాల వల్ల ఖజానాపై పడిన భారం సంగతేమిటంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: అమరావతి పేరుతో ఒకవైపు అంతులేని అప్పులు.. మరోవైపు యథేచ్ఛగా ప్రజా­ధనం దుర్వినియోగం! రాజధాని నిర్మాణంలో చంద్రబాబు సర్కారు నిర్వాకాలకు ఇది మరో నిద­ర్శనం! సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌ రూపొం­దించిన రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లోని లోపాల కారణంగా రాష్ట్ర ఖజానాపై రూ.1,472.50 కోట్ల భారం పడింది. రాజధానిలో 220 కేవీ, 400 కేవీ విద్యుత్‌ లైన్‌లను విస్మరించి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. దీనివల్ల ఇప్పుడు నిర్మాణాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆ విద్యుత్‌ లైన్‌లు అడ్డంకిగా మారాయని.. వాటిని మార్చాల్సిందేనని సీఆర్‌డీఏ­(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించింది. 

ఆ మేరకు ఆ పనులను ప్యాకేజీల కింద విడగొట్టి.. వాటిని 8.98, 8.99 శాతం అధిక ధరలకు ముఖ్యనేతకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. రాజధాని పనులు మనోళ్లకు అప్పగిస్తే మురికివాడలు నిర్మిస్తారని 2016లో సీఎం చంద్రబాబు మన ఇంజనీర్లను అవహేళన చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు. మరి.. సింగపూర్‌ సంస్థ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ లోపాల వల్ల ఖజానాపై పడిన భారీ భారం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు.

తప్పుబట్టిన ‘కాగ్‌’..
217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నిర్మించడానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే పనులను నిబంధనలకు విరుద్ధంగా  సింగపూర్‌ సంస్థ సుర్బానా–జురాంగ్‌కు 2016లో నామినేషన్‌పై చంద్రబాబు సర్కార్‌ అప్పగించడాన్ని కాగ్‌ (కాంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) తప్పుబట్టింది.. మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించిన ఆ సంస్థకు రూ.20.28 కోట్లను అప్పట్లో ప్రభుత్వం చెల్లించింది. ఆ ప్లాన్‌ ప్రకారమే అప్పట్లో రాజధాని నిర్మాణ పనులను ప్రారంభించింది. కానీ.. రాజధాని ప్రాంతంలో గతంలో 38 కి.మీ.ల పొడవున వేసిన 400 కేవీ విద్యుత్‌ లైన్, 55 కిమీల పొడవున వేసిన 220 కేవీ లైన్‌లు నిర్మాణాలకు అడ్డంకిగా మారాయి. ఇది మాస్టర్‌ ప్లాన్‌లో లోపాలను బహిర్గతం చేసింది. దాంతో ఆ విద్యుత్‌ లైన్‌లను మార్చే పనులకు గతేడాది సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది.

నిబంధనలు తుంగలో తొక్కి..
రాజధాని ప్రాంతంలో ఎన్‌–10 రహదారి నుంచి ఎన్‌–13–ఈ–11 రహదారుల జంక్షన్‌ వరకు 220 కేవీ ఎక్స్‌ట్రా హైవోల్టేజీ(ఈహెచ్‌వీ) లైన్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఏర్పాటుకు సంబంధించి మిగిలిన పనులకు రూ.993.25 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్దేశించి ఒక ప్యాకేజీ కింద సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజధానిలో ఏపీ ట్రాన్స్‌కో 18 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ(డైరెక్ట్‌ కరెంట్‌) లైన్స్‌లో మిగిలిన పనులు, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 20 కి.మీ.ల పొడవున చేపట్టిన 400 కేవీ డీసీ లైన్స్‌లో మిగిలిన పనుల పూర్తికి రూ.283.57 కోట్ల అంచనా వ్యయంతో మరో ప్యాకేజీ కింద సీఆర్‌డీఏ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

220 కేవీ లైన్‌ను మార్చే పనులను 8.98 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌కు రూ.1,082.44 కోట్లకు కట్టబెట్టింది. అంతేకాదు.. కాంట్రాక్టు విలువ కంటే 8.99 శాతం అధిక ధరకు కోట్‌ చేసిన పీవీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌–కె.రామచంద్రరావు ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌(జేవీ)కి 400 కేవీ లైన్‌ను మార్చే పనులను రూ.390.06 కోట్లకు అప్పగించింది. కాగా టెండర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి 2004 నవంబర్‌ 20న ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం జీవో 133 జారీ చేసింది. 

దాని ప్రకారం కాంట్రాక్టు విలువ కంటే 5 శాతానికి మించి అధికంగా కాంట్రాక్టర్లు కోట్‌ చేస్తే ఆ టెండర్‌ను రద్దు చేయాలి. మళ్లీ టెండర్‌ పిలవాలి. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు అప్పగించడం వల్ల ఖజానాకు రూ.114.68 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆ మేరకు కాంట్రాక్టర్లకు ప్రయోజనం చేకూరింది. ఈ పనులను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తూ గతేడాది మార్చి 19న సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

రూ.10,319.11 కోట్లు ప్రయోజనమంటూ వితండవాదన..
విద్యుత్‌ లైన్‌లను మార్చే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. దాంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో వాటికి అనుమతి ఇవ్వాలంటూ ఆర్థిక శాఖకు సీఆర్‌డీఏ ప్రతిపాదనలు పంపింది. 220 కేవీ లైన్‌ను మార్చడం వల్ల 271.82 ఎకరాలు, 400 కేవీ లైన్‌ను మార్చడం వల్ల 244.14 ఎకరాల భూమి మిగులుతుందని.. ప్రస్తుతం ఎకరం మార్కెట్‌ విలువ రూ.20 కోట్లు పలుకుతోందని.. దీనివల్ల మొత్తం రూ.10,319.11 కోట్ల ప్రయోజనం చేకూరుతుందని ఆ ప్రతిపాదనల్లో సీఆర్డీఏ పేర్కొంది. కానీ.. రాజధానిలో ఎకరం రూ.50 లక్షల చొప్పున ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కట్టబెట్టడం గమనార్హం. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. విద్యుత్‌ లైన్‌లను మార్చే పనులకు అనుమతి కోసం వితండవాదనతో కూడిన ప్రతిపాదనను ఆర్థిక శాఖకు సీఆర్‌డీఏ పంపిందన్నది స్పష్టమవుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement