చంద్రబాబు పాలనలో విద్యార్థులపై మోయలేని భారం
ఎంబీబీఎస్ నాలుగున్నరేళ్లు.. కానీ ఐదేళ్లకు ఫీజుల వసూళ్లు
ప్రైవేట్ వైద్య కళాశాలలే కాకుండా టీటీడీ ధార్మిక సంస్థదీ అదే తీరు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాష్ట్ర యువతకు వైద్య విద్య మోయలేని భారంగా మారుతోంది. ప్రైవేట్ వైద్య కళాశాలలే కాకుండా, టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పద్మావతి కాలేజీలోనూ ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి ఐదేళ్ల ఫీజులను బలవంతంగా వసూలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం, నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ) నిబంధనలను తుంగలో తొక్కి మరీ ధార్మిక సంస్థ కర్కశంగా వ్యవహరించడంపై విద్యార్థు లు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఐదో టర్మ్ ఫీజు కట్టడానికి గడువు విధించి, ఆలోపు చెల్లించకపోతే రోజువారీ పెనాల్టీ విధిస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల తరహాలో ఒత్తిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
హెల్త్ వర్సిటీ తీర్మానమూ బేఖాతర్
ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం ఎంబీబీఎస్ కోర్సు కాలపరిమితి నాలుగున్నరేళ్లు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు విద్యార్థులు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల్లో నడిచే వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి నాలుగున్నరేళ్లకు మాత్రమే ఫీజులు వసూలు చేయాలని గత ప్రభుత్వం జీవో–146ను విడుదల చేసింది.
నాలుగున్నరేళ్ల ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఇటీవల హెల్త్ వర్సిటీ కార్యవర్గమూ తీర్మానించింది. అయినా ఐదేళ్ల ఫీజు చెల్లించాలని ఈ నెల 14న పద్మావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఉషా ఆదేశాలు జారీ చేశారు. ఐదో టర్మ్(ఏడాది)ఫీజు చెల్లించడానికి బుధవారం(మార్చి 25) చివరి గడువు విధించారు. ఇదేమి అన్యాయమని తల్లిదండ్రులు ప్రశ్నించినా ప్రభుత్వ ఆదేశాలు తమకు వర్తించవని కళాశాల అధికారులు తేల్చి చెప్పినట్టు సమాచారం.
కోర్టు ఉత్తర్వులున్నా..
వైద్య కళాశాలలు నాలుగున్నరేళ్లకే ఎంబీబీఎస్ ఫీజు వసూలు చేయాలని కోర్టులు సైతం ఇప్పటికే పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చాయి. ఈ తీర్పులనూ పద్మావతితో పాటు, రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య కళాశాలలు బేఖాతరు చేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు విద్యార్థుల అడ్మిషన్ సమయంలోనే చివరి ఏడాది పూర్తి ఫీజు చెల్లించాలని షరతు పెడుతున్నాయి. అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్నా.. చంద్రబాబు సర్కారు పట్టించుకోవడం లేదు. కళాశాలలను నియంత్రించాల్సిన హెల్త్ వర్సిటీ చోద్యం చూస్తోంది.


