ఇంటర్‌ కొత్త సిలబస్‌ కార్పొ‘రేట్‌’కు కాసుల పంట | Textbooks for private colleges before printing | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ కొత్త సిలబస్‌ కార్పొ‘రేట్‌’కు కాసుల పంట

Mar 25 2026 5:39 AM | Updated on Mar 25 2026 5:39 AM

Textbooks for private colleges before printing

ముద్రణకు ముందే ప్రైవేటుకాలేజీలకు పాఠ్యపుస్తకాలు 

తెలుగు అకాడమీకి రూ.కోట్లలో నష్టం  

బ్లాక్‌ లిస్టులో ఉన్న ముద్రణా సంస్థకు కాంట్రాక్టు అప్పగింత

టెండర్‌ నిబంధనలనేమార్చిన ప్రభుత్వం  

సిలబస్‌ను రూ.10 కోట్లకు అమ్ముకున్నట్టు ఆరోపణలు   

సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు తమ ఆ«దీ­నంలో ఉన్న సంస్థలకు పలురకాలుగా మేలు చేసేందుకు ప్రయత్నిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఓ ప్రైవేట్‌ సంస్థకు మేలు చేకూరుస్తూ, కోట్లాది రూపాయల విలువైన ముద్రణ టెండర్‌ను కట్టబెట్టడం వింతగా మారింది. ఇందుకోసం తెలుగు అకాడమీని సైతం బలి పశువును చేసింది. 

ఈ ప్రక్రియలో మొత్తం రూ.10 కోట్లు చేతులు మారినట్టు తెలుస్తోంది. బ్లాక్‌ లిస్టులో ఉన్న వీజీఎస్‌ ముద్రణా సంస్థ కోసం టెండర్‌ నిబంధనలు మార్చి ఇంటర్మీడియెట్‌ పుస్తకాల ముద్రణ కాంట్రాక్టు అప్పగించారని, ఇందుకోసం విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచే ప్రక్రియ నడిచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అసలే జరిగిందంటే..!  
2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ మారింది. తొలుత మొదటి సంవత్సరం సిలబస్‌ను మార్చారు. 2026–27లో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రవేశపెట్టారు. కొత్త పుస్తకాల ముద్రణను తెలుగు అకాడమీ ద్వారా రూ.19 కోట్ల కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్‌ సంస్థలు టెండర్లు ద్వారా పొందాయి. పుస్తకాల ముద్రణ ఇంకా పూర్తి కాకుండానే సిలబస్‌ సాఫ్ట్‌ కాపీలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడం గమనార్హం. దీని వెనుక వీజీఎస్‌ ముద్రణా సంస్థ ఉన్నట్టు గుర్తించిన తెలుగు అకాడమీ సదరు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

నిబంధనలకు పాతర.. 
గత ప్రభుత్వంలో పుస్తకాల ముదణ్రను ఐ­దు నుంచి ఆరు సంస్థలకు అప్పగించేవారు. ఇందుకోసం సంస్థల చరిత్ర, పనితీరుతో పాటు వాటిపై ఉన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునే కాంట్రాక్టు ఇచ్చేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో పారదర్శకతకు పూర్తిగా తిలోదకాలిచ్చి అడ్డగోలుగా రూ.కోట్ల విలువైన కాంట్రాక్టును వీజీఎస్, విక్రమ్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు టెండర్‌ నిబంధనలనే మార్చినట్టు ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా 2026–27 ఇంటర్మీడియెట్‌ రెండో ఏడాదిలో కొత్త సిలబస్‌తో రూ.19 కోట్లకు పుస్తకాల ముద్రణను వీజీఎస్‌కు 70 శాతం, విక్రమ్‌కు 30 శాతం కాంట్రాక్టును వారం రోజుల క్రితం అప్పగించింది. 

తెలుగు అకాడమీ సిద్ధం చేసిన సిలబస్‌ సాఫ్ట్‌ కాపీలను ఆయా సంస్థలకు అందించారు. రెండు రోజుల్లోనే ఫిజిక్స్, గణితం, మరికొన్ని సబ్జెక్టుల పుస్తకా­ల సాఫ్ట్‌ కాపీలు వాటా్సప్‌లలో హల్‌చల్‌ చే­శా­యి. అప్పటికే అవి పలు కార్పొరేట్, ప్రైవే­టు కాలేజీలకు చేరిపోయాయి. తెలుగు అకా­డమీ చరిత్రలో కాపీరైట్‌ పుస్తకాల కాపీలు ముద్రణకు ముందే కార్పొరేట్‌ సంస్థలకు వెళ్లిపోవడం దురదృష్టకరం. సాఫ్ట్‌కాపీలు అందించిన సదరు సంస్థలకు రూ.10 కోట్లు లబ్ధి చేకూరినట్టు విశ్వసనీయ సమాచారం.  

ఫిర్యాదు బుట్టదాఖలు  
ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు పొందిన ముద్రణ సంస్థలు మెటీరియల్‌ను ఇతరులకు విక్రయించడం లేదా ఇవ్వడం, చేరవేయడం చట్టరీత్యా నేరం. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ముద్రణ కాంట్రా­క్టును దక్కించుకుని, మరోపక్క ముద్రణకు ఇచ్చిన సిలబస్‌ సాఫ్ట్‌ కాపీలను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు అమ్ముకున్నారు. 

ఇంటర్‌ పుస్తకాల ముద్రణ దక్కించుకున్న వీజీఎస్‌ సంస్థ గతంలో కూడా కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించి ఎస్సీఈఆర్టీ సిలబస్‌ను ప్రైవేటు స్కూళ్లకు అమ్ముకుంది. దీనిపై పాఠశాల విద్యాశాఖ ఆ సంస్థకు నోటీసులు ఇచ్చి బ్లాక్‌ లిస్టులో పెట్టింది. ఈ ముద్రణా సంస్థపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోగా, ఆ కంపెనీకి మేలు చేసేందుకు ఏకంగా నిబంధనలే మార్చారు. దీంతో ఆయా సంస్థలు కాంట్రాక్టు దక్కించుకోవడంతో పాటు కాసుల వేటలో పడ్డాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement