ఇక మంటలే! | Maximum temperatures likely to increase by an additional 2 to 4 degrees | Sakshi
Sakshi News home page

ఇక మంటలే!

Mar 25 2026 5:31 AM | Updated on Mar 25 2026 5:31 AM

Maximum temperatures likely to increase by an additional 2 to 4 degrees

గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అదనంగా పెరిగే అవకాశం

అదే సమయంలో అక్కడక్కడా ఈదురుగాలులు, వర్షాలు

ఎల్‌నినో పరిస్థితులే కారణం 

నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశాలున్నట్లు వాతా­వరణ శాఖ తెలిపింది. గతం కంటె ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని తెలిపింది. ప్రధానంగా వచ్చే ఐదు రోజుల్లో వేడి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా తీర ప్రాంతాల్లో ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. 

ఒకవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మరోవైపు కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం నుంచి 28వ తేదీ వరకూ ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. 27, 28 తేదీల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించారు.

‘ఎల్‌నినో’నే కారణం
ఈ వాతావరణ మార్పులకు ఎల్‌నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్‌ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ వల్ల ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. 

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు వచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలకు వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రైతులు వాతావరణ హెచ్చరికలను గమనించి పంట కోత సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని 
అధికారులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement