‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ డిజైన్ల వ్యయంలో బాబు సర్కారు వరల్డ్ రికార్డు
డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు మరోసారి.. విచ్చలవిడిగా వ్యయం
‘ఏజీసీ’ మాస్టర్ ఆర్కిటెక్ట్‌గా 2016లో జపాన్ సంస్థ మకీ అసోసియేట్స్ ఎంపిక
కారణాలు చెప్పకుండానే ఆ టెండర్ రద్దు..
ఏపీలో పారదర్శకత ఉండదు.. అంతా లోపాయికారీ ఒప్పందాలేనన్న మకీ చైర్మన్ పుమిహికో
ఆ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బతీశాయన్న నిపుణులు
సచివాలయం, హెచ్‌వోడీ టవర్ల ఆర్కిటెక్చరల్ పనులు 2017లో జెనిసిస్ ప్లానర్స్‌కు రూ.112.58 కోట్లకు అప్పగింత.. వాటిని రద్దు చేసి 2024లో మళ్లీ టెండర్లు నిర్వహించిన చంద్రబాబు సర్కార్
వాటిని టెండర్లలో రూ.136.88 కోట్లకు దక్కించుకున్న అదే జెనిసిస్ ప్లానర్స్
లోపాయికారీ ఒప్పందానికి ఇదే తార్కాణమంటున్న నిపుణులు.. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల వ్యయమే కాదు.. భవనాల డిజైన్ల (ఆకృతులు) ఖర్చులోనూ చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు బద్ధలు కొడుతోందని ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ నిపుణులు నివ్వెరపోతున్నారు. డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి.. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ధారపోయటాన్ని తప్పుబడుతున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం (అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్) డిజైన్ల రూపకల్పన పనులను చంద్రబాబు సర్కారు ఏకంగా రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించటంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) డిజైన్ల రూపకల్పనకు 2016లో నిర్వహించిన టెండర్లలో జపాన్‌కు చెందిన ‘మకీ’ అసోసియేట్స్‌ను చంద్రబాబు సర్కార్ తొలుత ఎంపిక చేసింది. ఆ తర్వాత ఆ టెండర్‌ను రద్దు చేసిన సమయంలో మకీ ఛైర్మన్ పుమిహికో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఇంజనీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని, టెండర్లలో పారదర్శకత ఉండదని, లోపాయికారీ ఒప్పందాలే ఉంటాయని పుమిహికో చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తీవ్రంగా దెబ్బ తీశాయని పేర్కొంటున్నారు.
డిజైన్ల పేరుతో ఒకసారి.. ఆర్కిటెక్చరల్ డిజైన్లకు ఇంకోసారి..
రాజధానిలో నేలపాడు వద్ద 1,575 ఎకరాల్లో ‘ఏజీసీ’ని ప్రభుత్వం నిర్మిస్తోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల (హెచ్‌వోడీ) కోసం 39 అంతస్తులతో నాలుగు టవర్లు, 49 అంతస్తులతో మరో టవర్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఈ ప్రాంగణంలో నిర్మిస్తోంది. ఈ ఏడు భవనాలతోపాటు ఏజీసీ ప్రాంతాన్ని నిర్మించడం కోసం డిజైన్‌లకు 2016లో చంద్రబాబు సర్కార్ టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను తొలుత జపాన్‌కు చెందిన ‘మకీ’ సంస్థ దక్కించుకుంది. కానీ వాటిని 2016 అక్టోబర్ 24న ఎలాంటి కారణాలు లేకుండా రద్దు చేశారని మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత 2016 అక్టోబర్ 28న నాటి టీడీపీ సర్కారు మళ్లీ టెండర్లు పిలిచింది.
లండన్‌కు చెందిన ఫోస్టర్ పార్టనర్స్‌తో కలసి హఫీజ్ కాంట్రాక్టర్ జాయింట్ వెంచర్‌గా ఏర్పడి రూ.67,86,44,683కు ఏజీసీ మాస్టర్ ఆర్కిటెక్ట్ పనులను దక్కించుకుంది. ఆ సంస్థ రూపొందించిన డిజైన్లు, గ్రాఫిక్‌లను ప్రదర్శిస్తూ.. రాజధాని నిర్మాణం పూర్తయిందనే రీతిలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ఫోస్టర్ పార్టనర్స్–హఫీజ్ కాంట్రాక్టర్(జేవీ) సంస్థ రూపొందించిన డిజైన్‌లతోనే భవనాల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు గతేడాది ప్రభుత్వం అప్పగించింది. హైకోర్టు, అసెంబ్లీ భవనాల సమగ్ర ఆర్కిటెక్చరల్ డిజైన్‌లు రూపొందించే పనులకు 2024 అక్టోబర్ 27న టెండర్ల ద్వారా రూ.136,90,74,000కు హఫీజ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఏజీసీ ప్రాంతాన్ని జలమార్గం, బ్రిడ్జిలతో తీర్చిదిద్దే పనుల డిజైన్ రూపకల్పనకు 2025 ఆగస్టు 13న నిర్వహించిన టెండర్ల ద్వారా రూ.59,90,00,000కు హఫీజ్ కాంట్రాక్టర్ సంస్థకే కట్టబెట్టింది.
లోపాయికారీ ఒప్పందం కాకపోతే మరేమిటి?
సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాల కోసం ఏజీసీలో నిర్మిస్తున్న ఐదు టవర్లను కళాత్మకంగా తీర్చిదిద్ది ఆర్కిటెక్చరల్ సేవలు అందించే పనులను 2017 మే 2న చంద్రబాబు సర్కార్ నిర్వహించిన టెండర్లలో రూ.112,58,69,400కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. కానీ.. అప్పట్లో ఐదు టవర్ల నిర్మాణ పనులు ముందుకు సాగలేదు. దాంతో ఆ టెండర్లను 2024 అక్టోబర్ 27న రద్దు చేసి మళ్లీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లలో కూడా రూ.136,88,40,800కు జెనిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థే పనులు దక్కించుకోవడం గమనార్హం. దీన్ని బట్టి లోపాయికారీ ఒప్పందం జరిగిందన్నది స్పష్టమవుతోందని ఆర్కిటెక్చర్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కేవలం ఏజీసీలో భవనాల నిర్మాణం డిజైన్‌ల తయారీ పనులనే రూ.401.54 కోట్లకు కన్సల్టెన్సీలకు అప్పగించడం గమనార్హం. ఆర్కిటెక్ట్స్ అందరూ ఫోర్బ్స్ మ్యాగజైన్‌లా భావించే ‘ఆర్కిటెక్చరల్ డైజెస్ట్’ మ్యాగజైన్ 2017 ఏప్రిల్‌లో ప్రచురించిన సంచికలో మకీ సంస్థ ఛైర్మన్ పుమిహికో రాసిన వ్యాసంలో వెల్లడించిన అంశాలను పరిశీలిస్తే.. రాజధాని డిజైన్‌ల తయారీలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్లు వెల్లడవుతోందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి దుబారా చేస్తున్నట్లు స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.


