ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల్లేవ్‌! | Severe shortage of medicines in government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల్లేవ్‌!

Mar 26 2026 3:32 AM | Updated on Mar 26 2026 3:32 AM

Severe shortage of medicines in government hospitals

2025–26కు సంబంధించి మందులకు అరకొర కేటాయింపులు 

రూ.112 కోట్లు అదనపు బడ్జెట్‌ కావాలని వైద్యశాఖ వినతి 

సకాలంలో ఇవ్వకుండా జాప్యం చేసిన చంద్రబాబు సర్కారు   

డిసెంబరులో ఇవ్వాల్సిన నాలుగో క్వార్టర్‌ పీఓలకు బడ్జెట్‌ లేమితో ఫిబ్రవరిలో మోక్షం 

ఫలితంగా ఆస్పత్రులకు ఇప్పటివరకు చేరని నాలుగో క్వార్టర్‌ మందులు  

దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన మందుల కొరత  

సాక్షి, అమరావతి: ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందించాలి. బయట కొనుగోలు చేసే పరిస్థితి వారికి రాకూడదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇది తూచా తప్పకుండా పాటించింది. అయితే, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో తీవ్ర మందుల కొరత ఏర్పడింది. డ్రగ్‌ స్టోర్స్‌లో 700 రకాలకు పైగా మందులకు గాను 300 నుంచి 450 రకాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఫలితంగా రోగులపై మోయలేనంత ఆరి్థక భారం పడుతోంది. రాష్ట్రంలో చిన్నా, పెద్ద అన్ని రకాల ప్రభుత్వాసుపత్రుల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి రాజ్యమేలుతోంది. 

సీఎంగా చంద్రబాబు గద్దెనెక్కిన నాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి బోధనాస్పత్రుల వరకూ అన్నిచోట్లా నిర్దేశించిన మేరకు మందులు, సర్జికల్స్‌ ఎప్పుడూ అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడీ సమస్య మరింత తీవ్రమైంది. మందుల కొనుగోలుకు అదనపు బడ్జెట్‌ ఇవ్వాలని వైద్యశాఖ కోరితే అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం విదల్చలేదు. 

దీంతో జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ క్వార్టర్‌కు సంబంధించిన మందులు, సర్జికల్స్‌ మార్చినెల ముగుస్తున్నా ఆస్పత్రులకు చేరలేదు. ఫలితంగా.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో మందులు, సర్జికల్స్‌కు తీవ్ర సంక్షోభం ఏర్పడింది. కనీసం దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న సమస్యలకు సైతం పేదలు మందులు బయట కొనుక్కోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.

కనికరంలేని సర్కారు.. 
రాష్ట్రవ్యాప్తంగా డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్, సెకండరీ హెల్త్, డీఎంఈ తదితర ఆస్పత్రుల్లో మందుల కోసం ఏటా రూ.700 కోట్ల మేర బడ్జెట్‌ అవసరమవుతుంది. 2025–26 సంవత్సరానికి రూ.600 కోట్ల మేర మాత్రమే కేటాయించారు. ఈ అరకొర బడ్జెట్‌ డిసెంబరు నాటికే ఖర్చయిపోయింది. దీంతో అత్యంత కీలకమైన డీఎంఈ పరిధిలోని టెరిషరీ కేర్‌ ఆస్పత్రులకు జనవరి నుంచి మందుల కొనుగోళ్లకు బడ్జెట్‌లేని హీన పరిస్థితి. ఈ క్రమంలో.. మందులు, మెడికల్‌ ఆక్సిజన్‌ కొనుగోలుకు అదనంగా రూ.112 కోట్ల బడ్జెట్‌ కావాలంటూ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. 

ఈ ఫైల్‌ను ప్రభుత్వం వివిధ కొర్రీలతో తిప్పి పంపినట్లు తెలిసింది. ఈ కొర్రీలకు బదులిస్తూ వైద్యశాఖ రెండోసారి ఫైల్‌ను పంపగా, నిధులు మంజూరు చేయకుండానే ప్రభుత్వం గత నెలలో ఫైల్‌ను మళ్లీ వెనక్కి పంపడంతో వైద్యారోగ్య శాఖాధికారులు తలలు పట్టుకున్నారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకున్నారు. పేదల ఆరోగ్యంపట్ల కనికరం లేకుండా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ఆ ప్రభావం నాలుగో క్వార్టర్‌ మందుల సరఫరాపై పడింది.  

ఫిబ్రవరి నెలలో పీఓ.. 
సాధారణంగా.. ప్రభుత్వాస్పత్రులకు నాలుగు క్వార్టర్‌లుగా ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) మందులు, సర్జికల్స్‌ సరఫరా చేస్తుంది. ప్రతి క్వార్టర్‌ ప్రారంభానికి ముందు నెలలోనే సరఫరా సంస్థకు పర్చేజ్‌ ఆర్డర్‌ (పీఓ) ఇస్తుంటారు. ఈ క్రమంలో..  ప్రస్తుత నాలుగో క్వార్టర్‌ పీఓలు గతేడాది డిసెంబరులో ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం అదనపు బడ్జెట్‌ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. 

చివరికి.. ఫిబ్రవరి నెలాఖరులో ఎంఎస్‌ఐడీసీ పీఓలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో.. ఇప్పటివరకు నాలుగో క్వార్టర్‌ మందులు, సర్జికల్స్‌ను సరఫరా సంస్థలు సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీసీ)లకు పంపలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఐడీసీ డ్రగ్‌ స్టోర్స్‌లో 700 రకాలకు పైగా మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా.. 300 నుంచి 450 రకాల మేర మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. సీడీఎస్‌లలోనే మందుల నిల్వలు లేవు.

కిడ్నీ రోగుల తీవ్ర అవస్థలు
ప్రభుత్వం మందులు, సర్జికల్స్‌ సరఫరా చేయకపోవడంతో వైద్యులు సూచించిన మందులను బయట కొనుగోలు చేసుకోవాలంటూ సిబ్బంది రోగులకు చీటీలు రాసిస్తున్నారు. మరోవైపు.. కిడ్నీ రోగులకు ప్రాణాధారమైన కంటిన్యూయస్‌ అంబులేటరీ పెరిటోనియల్‌ డయాలసిస్‌ (సీఏపీడీ) బ్యాగుల సరఫరా  కొన్నినెలలుగా ఎంఎస్‌ఐడీసీ నుంచి పూర్తిగా నిలిచిపోయింది. డయాలసిస్‌లో రక్తంలోని వ్యర్థాలను వడగట్టేందుకు ఈ బ్యాగ్‌లు ఉపయోగపడతాయి. 

ఇంతటి కీలకమైన సీఏపీడీ బ్యాగులు లేకపోవడంతో బయట కొనుగోలు చేయాలని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.500కు పైగా విలువచేసే ఈ బ్యాగులు నిత్యం కొనాలంటే రూ.వేలల్లో ఖర్చుచేయాల్సి వస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఉమ్మడి గుంటూరు జిల్లా సహా, వివిధ జిల్లాల్లోని సెకండరీ హెల్త్, పీహెచ్‌సీల్లో బీపీ, షుగర్‌ మందులకు కొరత ఏర్పడింది. చివరికి.. దగ్గు, జలుబు, జ్వరం సిరప్‌లకు కూడా దిక్కులేదు.  

Advertisement
 
Advertisement
Advertisement