ఫ‌లించిన వైఎస్సార్‌సీపీ పోరాటం | YSRCP's Struggle Leads to FCRA Renewal for RTD Organization | Sakshi
Sakshi News home page

ఫ‌లించిన వైఎస్సార్‌సీపీ పోరాటం

Mar 24 2026 5:21 PM | Updated on Mar 24 2026 6:34 PM

YSRCP's Struggle Leads to FCRA Renewal for RTD Organization
  • ఆర్డీటీ సంస్థ‌కు ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించిన కేంద్ర ప్ర‌భుత్వం
  • హ‌ర్షం వ్య‌క్తం చేసిన‌ అనంత‌పురం వైఎస్సార్‌సీపీ నేత‌లు 
  • అనంతపురం జిల్లా కరువు పరిస్థితుల్లో ఆర్డీటీ కీలక సేవలు అందిస్తోంది
  •  2025 ఏప్రిల్‌ 21న కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ నిలిపివేసి నిధులు ఫ్రీజ్ చేసింది
  • వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఆదేశాల‌తో జిల్లాలో ఉవ్వెత్తున ప్ర‌జా ఉద్య‌మం
  • మాజీ ఎంపీ  తలారి రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీ, 19 రోజుల పాదయాత్ర
  • పోలీసుల ద్వారా ఉద్య‌మాన్ని అడ్డుకున్న కూట‌మి నేత‌లు
  • లక్ష పోస్టు కార్డుల ఉద్యమం ద్వారా నేరుగా ప్రధాన మంత్రికి విజ్ఞప్తులు
  • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ… ప్రజా పోరాటానికి లభించిన విజయం
  • క్రెడిట్‌ చోరీకి కూటమి నేత‌ల ప్ర‌య‌త్నాలు సిగ్గుచేటు:
  • భవిష్యత్తులో కూడా ఆర్డీటీకి అండగా ఉంటామని స్పష్టం చేసిన వైఎస్సార్‌సీపీ నేత‌లు

తాడేప‌ల్లి: వైఎస్సార్‌సీపీ పోరాటం ఫలించింది.. రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ (ఫారీన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యుల‌ర్ యాక్ట్‌) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్‌సీపీ అనంత‌పురం జిల్లా నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. క‌రువు జిల్లా అనంత‌పురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్‌సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్ప‌ష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ  మండిపడ్డారు. ప్రెస్‌మీట్‌లో అనంత‌పురం జిల్లా నేత‌లు ఇంకా ఏమ‌న్నారంటే..

వైఎస్‌ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు ప్ర‌జా ఉద్య‌మం: వెంక‌ట్రామిరెడ్డి
కరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్‌ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవ‌లు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేర‌కు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. 

ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన క‌ళ్యాణ‌దుర్గం నుంచి పోరాటం మొద‌లు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాద‌యాత్ర‌కు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండ‌గా నిలిచిన‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారికి, స‌హ‌క‌రించిన ప్ర‌జా సంఘాలు, జిల్లా ప్ర‌జ‌ల‌కు అనంత వెంక‌ట్రామిరెడ్డి అభినంద‌న‌లు, కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  

క్రెడిట్‌ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్
రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్‌ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్‌ చోరీ వారికి అలవాటైందని చ‌ర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్‌ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్న‌ది కూట‌మి నేత‌లు మ‌ర‌చిపోయారు.  ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.

కేంద్రంపై ఒత్తిడి తెచ్చాం
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాల‌ని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్‌ చోరీకి పాల్పడటం విడ్డూరం.  ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని సాకె శైల‌జ‌నాథ్ స్ప‌ష్టం చేశారు.

వైఎస్‌ జ‌గ‌న్ ఆశీస్సులు..ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో విజ‌యం: తలారి రంగయ్య
రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్‌ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్‌లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్‌ జగన్‌ ఆశీస్సుల‌తో పోరాటాన్ని కొన‌సాగించి విజ‌యం సాధించాం.  అనంత‌పురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్‌లో పార్టీ ఎంపీల‌తో క‌లిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.

ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని త‌లారి రంగ‌య్య‌ పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయ‌న స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement