Rural Development Trust
-
ఫలించిన వైఎస్సార్సీపీ పోరాటం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ పోరాటం ఫలించింది.. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సేవలకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ (ఫారీన్ కంట్రిబ్యూషన్ రెగ్యులర్ యాక్ట్) పునరుద్ధరణ ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా నేతలు హర్షం వ్యక్తం చేశారు. కరువు జిల్లా అనంతపురంలో మళ్లీ యథాతథంగా ఆర్డీటీ సేవలు అందుబాటులోకి రానున్నాయని.. ఇది ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాట ఫలితమేనని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి సాకె శైలజనాథ్, అలాగే అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య స్పష్టం చేశారు. కానీ దీన్ని కూడా క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రెస్మీట్లో అనంతపురం జిల్లా నేతలు ఇంకా ఏమన్నారంటే..వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం: వెంకట్రామిరెడ్డికరువు సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ప్రజలకు జీవనాధారంగా నిలిచింది. భూగర్భ జలాల పెంపు, హరిజన–గిరిజనులు సహా పేదల అభ్యున్నతికి సంస్థ చేసిన సేవలు అమూల్యం. అయితే 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ నిలిపివేయడంతో సంస్థ సేవలు నిలిచిపోయి జిల్లా ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లాలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేపట్టాం. ఆర్డీటీ సంస్థ ప్రారంభించిన కళ్యాణదుర్గం నుంచి పోరాటం మొదలు పెట్టేందుకు మాజీ ఎంపీ రంగయ్య నేతృత్వంలో బైక్ ర్యాలీలు, 19 రోజుల పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు నిర్వహించాం.పాదయాత్రకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ ప్రజల మద్దతుతో పోరాటాన్ని కొనసాగించాం. లక్ష పోస్టుకార్డుల ఉద్యమం ద్వారా ప్రధాన మంత్రికి నేరుగా వినతులు పంపడం, అలాగే కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడం వంటి చర్యలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. ఈ సమగ్ర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరిస్తూ ఆర్డీటీ సేవలు కొనసాగించేలా నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమానికి అండగా నిలిచిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, సహకరించిన ప్రజా సంఘాలు, జిల్లా ప్రజలకు అనంత వెంకట్రామిరెడ్డి అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. క్రెడిట్ చోరీ కూటమి నేతలకు అలవాటుగా మారింది: శైలజనాథ్రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ లభించడం శుభపరిణామం. అయితే వెంటనే కూటమి ప్రభుత్వం ఈ విజయాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు క్రెడిట్ చోరీకి ప్రయత్నించడం దురదృష్టకరం. అనంతపురం జిల్లా ప్రజలు కూటమి నేతల తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రెడిట్ చోరీ వారికి అలవాటైందని చర్చించుకుంటున్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాసంఘాలు కలిసి సంవత్సరం పాటు పోరాటం చేసింది. కానీ కూటమి నేతలు ఒక్క నిరసన కూడా చేపట్టలేదు. 2025 ఏప్రిల్ 21న కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏను నిలిపివేసినప్పుడు రాష్ట్రం, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయన్నది కూటమి నేతలు మరచిపోయారు. ఏడాది పాటు నిధులు లేక ఆర్డీటీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. సేవా కార్యక్రమాలు నిలిచిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.కేంద్రంపై ఒత్తిడి తెచ్చాంవైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం నుంచి ఉద్యమాన్ని ప్రారంభించాలని తలారి రంగయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. పాదయాత్రలు, బైక్ ర్యాలీలు, లక్ష పోస్టుకార్డుల ఉద్యమం, ఢిల్లీలో నిరసనలు వంటి కార్యక్రమాలతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఇది ప్రజల పోరాట ఫలితం. కూటమి నేతలు ఎలాంటి పోరాటం చేయకపోయినా తమ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడం సిగ్గుచేటు. కేంద్రంలో భాగస్వాములైన టీడీపీ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడటం విడ్డూరం. ప్రజల పక్షాన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి భవిష్యత్తులో ఇలాంటి అవరోధాలు కలగకూడదని విజ్ఞప్తి చేస్తూ, ఏ సమస్య వచ్చినా వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని సాకె శైలజనాథ్ స్పష్టం చేశారు.వైఎస్ జగన్ ఆశీస్సులు..ప్రజల మద్దతుతో విజయం: తలారి రంగయ్యరూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) 1969 నుంచి ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న గొప్ప సంస్థ. అలాంటి సంస్థకు ఎఫ్సీఆర్ఏ నిలిపివేయడంతో సమస్యలు తలెత్తినప్పుడు, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాం. 2025 మే 17న బైక్ ర్యాలీ, జూన్‌లో 19 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించాం, పోలీసులు అడ్డుకున్నప్పటికీ ప్రజల మద్దతుతో వైఎస్ జగన్ ఆశీస్సులతో పోరాటాన్ని కొనసాగించి విజయం సాధించాం. అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, లక్ష పోస్టుకార్డుల కార్యక్రమం నిర్వహించడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. ఈ నెల 16న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసి వినతిపత్రం అందజేయడంతో పాటు పార్లమెంట్లో పార్టీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టాం. 10 నెలల నిరంతర పోరాట ఫలితంగానే కేంద్రం ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించడం శుభపరిణామం.ఈ విజయాన్ని ప్రజల గెలుపుగా అభివర్ణిస్తూ, శాంతియుత, గాంధేయ మార్గంలో సాధించిన ఫలితమని తలారి రంగయ్య పేర్కొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. -
కరవు నేలకు కల్పవల్లి
1969లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు పేదల అభ్యున్నతికి కృషి 3,244 గ్రామాల్లో కార్యకలాపాలు తన కోసం, తన కుటుంబం కోసం బతికేవారు కొందరు. సమాజం కోసం, పేదల అభ్యున్నతి కోసం జీవించేవారు కొందరు. రెండో కోవకు చెందిన వారే ఫాదర్ విన్సెంట్ ఫై. ఎక్కడో స్పెయిన్‌లో పుట్టి ఆంధ్రప్రదేశ్‌లోని కరవు నేలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 45 ఏళ్ల క్రితం అనంతపురంలో ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’(ఆర్డీటీ) స్థాపించి జిల్లా అభివృద్ధికి పాటుపడ్డారు. 2009లో తనువు చాలించినప్పటికీ పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఆర్డీటీలో చిన్నారుల ఆర్ట్ ఫెస్టివల్ ప్రారంభమైన సందర్భంగా సంస్థ విశేషాలు తెలుసుకుందాం. ఏర్పాటు స్పెయిన్ దేశానికి చెందిన ఫై 1952లో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. మహారాష్ట్రలోని మన్మాడ్‌లో కరవు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం చూసి చలించిపోయారు. మన్మాడ్‌లో ‘రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్’ ఏర్పాటు చేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి 3వేల బావులు తవ్వించారు. పేద రైతులకు ఉచితంగా మోటార్ బోర్లు ఇచ్చారు. తర్వాత 1969లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విన్సెట్ ఫై, అన్నె ఫై దంపతులు ‘రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి సేవలు విస్తృతం చేశారు. లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి ఆర్డీటీ కృషిచేస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 3,244 గ్రామాల్లో పనిచేస్తోంది. మహిళా సాధికారత, విద్య, ఆరోగ్యం, గృహ, వాటర్ షెడ్ల నిర్మాణంపై దృష్టిసారించింది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఉన్నత చదువులు చదివిస్తోంది. గ్రామాల్లో పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యా బోధన చేస్తోంది. ప్రస్తుతం ఫై కుమారుడు మాంచో ఫై ఆర్టీటీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సంస్థ నిర్వహణ కోసం స్పెయిన్ , యూరప్ దేశాలు ఆర్థికసాయం చేస్తున్నాయి. క్రీడల్లో మేటి విద్యతో పాటు క్రీడలకూ ఆర్డీటీ ప్రాధాన్యమిస్తోంది. అనంతపురం-కదిరి జాతీయ రహదారిలోని పంగల రోడ్డు సమీపంలో ‘క్రీడా గ్రామాన్ని’ నిర్మించింది. స్పెయిన్ దేశానికి చెందిన టెన్నిస్ రారాజు రాఫెల్ నాదల్ 2010 అక్టోబర్ 17న ‘నాదల్ టెన్నిస్ అకాడమీ’ని ఇక్కడ నెలకొల్పారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చుచేసి ఐదు టెన్నిస్ కోర్టులు నిర్మించారు. విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి అంతర్జాతీయ స్థాయిలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 170 మంది శిక్షణ పొందుతున్నారు. నిర్వహణ కోసం 2013-14లో రూ.37 లక్షలు విడుదల చేశారు. ఉచిత వైద్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది ఖరీదైన వైద్యం చేయించుకోలేక చనిపోవడం ఫైను కలచివేసింది. వారి కోసం కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి నిర్మించి ఉచితంగా వైద్యం అందివ్వాలని సంకల్పించారు. అనంతపురం జిల్లాలోని బత్తలపల్లిలో ‘ఆర్డీటీ ఆసుపత్రి’ నిర్మించారు. హాస్పిటల్లో చేరిన రోగులకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఆర్డీటీ సహకారంతో వైద్య విద్య అభ్యసించినవారు ఇక్కడ డాక్టర్లుగా సేవలందిస్తున్నారు. వాటర్ షెడ్లు నీటి ఎద్దడి కారణంగా పంటలు ఎండిపోతున్న విషయాన్ని ఆర్డీటీ గుర్తించింది. గ్రామాల్లో అనువైన ప్రాంతాల్లో వాటర్షెడ్ల నిర్మాణాన్ని చేపట్టింది. వర్షపు నీటి వృథా కట్టడిచేసింది. అనతి కాలంలోనే భూగర్భ జల వనరుల శాతం పెరిగింది. నీటి వాడకం తగ్గించేందుకు పేద రైతులకు ఉచితంగా బిందు, తుంపర సేద్య పరికరాలు ఇస్తోంది. పండ్ల తోటల సాగును ప్రోత్సహించింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చీనీ సాగు చేస్తున్నది అనంతపురం జిల్లాయే. గృహ కల్పన సొంత ఇళ్లు లేనివారికి ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తోంది. లబ్ధిదారులకు ఇంటి స్థలం ఉంటే చాలు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం ఆర్డీటీ భరిస్తుంది. నాణ్యాతా ప్రమాణాల్లో రాజీ పడకుండా నిర్మాణం చేపడుతుంది. అంతే కాకుండా వికలాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు ఇవ్వాలనే ఉద్దేశంతో కదిరి మండలంలోని మొటుకుపల్లిలో కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 7,899 స్వయం సేవా సంఘాలను ఆర్టీడీ నడుపుతోంది. -
అద్భుతం
రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్(ఆర్డీటీ) సంస్థ శుక్రవారం నిర్వహించిన ఆర్ట ఫెస్టివల్ ఆకట్టుకుంది. మొత్తం ఆరు విభాగాల్లో చిన్నారులు అద్భుత ప్రతిభను ప్రదర్శించారు. విదేశీయులు సైతం చిన్నారుల సృజనకు నీరాజనం పట్టారు. అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు జిల్లాలోని పది మండలాల నుంచి 204 మంది విద్యార్థులు ఆర్ట ఫెస్టివల్లో తమ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో 34 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో ముగ్గురు డిజబుల్డ్ చిన్నారులు కావడం విశేషం. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాల్య వివాహాలు, ఎయిడ్స్‌కి దూరంగా ఉండాలని, స్వచ్ఛ భారత్, వరకట్న వేధింపులకు గురవుతున్న మహిళ, దేవతామూర్తుల మట్టి శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. నవధాన్యాలు, ఆకులు, వివిధ రకాల పూల మొక్కలతో చిన్నారులు చేసిన పార్క్, ఆసిడ్ దాడులు వద్దంటూ, డాబా, పూరిళ్లు, పేపర్లతో తయారు చేసిన అనేక రకాల బొమ్మలను ప్రదర్శించారు. - అనంతపురం రూరల్ సత్తా చాటిన విభిన్న ప్రతిభావంతులు ఆర్డీటీ మెయిన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట ఫెస్టివల్లో విభిన్న ప్రతిభావంతులు మరోసారి సత్తా చాటుకున్నారు. మట్టి శిల్పాలు, పార్కలు, చిత్రలేఖనం తదితర రంగాలలో వారు అద్భుత ప్రతిభను కనపరిచి ఆహూతుల ప్రశంసలు అందుకున్నారు. చిన్నారుల ప్రదర్శనను ఆర్డీటీ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖర్ నాయుడు ప్రత్యేకంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఫెస్టివల్ రూపకర్త మైఖేల్‌పెర్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛో ఫై్ మాట్లాడుతూ... ‘ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను వెలికి తీసేందుకే ప్రతి ఏటా ఇలాంటి ఆర్ట్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నాం. చదువుతో పాటు సృజనాత్మకత అవసరం.’ అని అన్నారు. విజేతలు వీరే... ఆర్ట ఫెస్టివల్ విజేతలను ఆ సంస్థ ఎడ్యుకేషన్ డెరైక్టర్ చంద్రశేఖరనాయుడు ప్రకటించారు. రంగోలిలో అశ్విణి(జల్లిపల్లి), హేమలత(కురువల్లి), సహన(మరూరు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. మట్టి బొమ్మల తయారీలో మీనాక్షి(దేవరపల్లి), రాఘవ(కురువల్లి), ఆదిత్య(ఉప్పొండ), చిత్రలేఖనంలో రిషిక్(లత్తవరము), సుదర్శన్(కురువల్లి), సుహేల్(కదిరి), పేపర్ కటింగ్‌లో శంకరమ్మ(చంద్రగిరి, కనేకల్), మహేష్(సీబీఆర్ సెంటర్), స్వాతి(సీబీఆర్ సెంటర్), నాచురల్ కాలేజీలో శివయ్య(సీబీఆర్ సెంటర్), కవిత(సీబీఆర్ సెంటర్), చంద్రకళ(వెలిగొండ), చేతిరాతలో రాజ్‌కుమార్(పీఎండీ కాలనీ, పామిడి), వెంకటేష్(సీబీఆర్ సెంటర్), కావేరి(రాయలచెరువు, తాడిపత్రి) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు.


