'గడ్డి'కి గడ్డుకాలం | Shortage of fodder in Annamayya district | Sakshi
Sakshi News home page

'గడ్డి'కి గడ్డుకాలం

Mar 26 2026 3:42 AM | Updated on Mar 26 2026 3:42 AM

Shortage of fodder in Annamayya district

మండుతున్న ధరలు 

వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు భలే డిమాండ్‌      

కిలో గడ్డి రూ.8 నుంచి రూ.10 

పశుపోషణ భారంగామారిందంటున్న పాడిరైతులు  

గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో  పాడిరైతులకు అవసరమైన గడ్డికి గడ్డుకాలం వచ్చిపడింది. ప్రస్తుత వేసవి కాలంలో పాడిఆవులకు గడ్డి దొరకడం కష్టంగా మారింది. వేసవిలో సాధారణంగా పాల దిగుబడి తగ్గుతుంది. దీనికితోడు భగ్గుమంటున్న గడ్డి ధరలు,కొండెక్కిన ఫీడ్‌ ధరలు పాడిరైతులకు మోయలేని భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం వరిగడ్డి కిలో రూ.8 నుంచి రూ.12 వరకు ధరలు పలుకుతున్నాయి.

వేరుశనగ పొట్టు లోడు రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకు పలుకుతుండడంతో పశుగ్రాసానికి డిమాండ్‌ ఏర్పడింది.పాలపై వచ్చే ఆదాయంలో 65 శాతానికిపైగా పశుగ్రాసం కొనడానికే సరిపోతుండడంతో పాడిరైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలో పాడిసంపదకు ప్రతి రోజు 7,128 టన్నుల గడ్డి అవసరముంది.  

వేధిస్తోన్న పశుగ్రాసం కొరత 
గత ఐదేళ్లు గడ్డి కొరత రాలేదు. ఎక్కడ చూసినా పుష్కలంగా గడ్డి లభించేది. ప్రస్తుతం కరువు కారణంగా వర్షాలు సక్రమంగా కురవలేదు. దీంతో చెరువులు, బావుల్లో చక్కునీరు కనిపించడంలేదు. కొండలు, గుట్టలు కాలిబూడిదయ్యాయి. సా«ధారణంగా ఈ సీజన్‌లో బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండేది. ప్రస్తు తం అన్నిచోట్లా నీటికి కరువొచ్చి పడింది. జిల్లాలో రోజు రోజుకు భూగర్భజలాలు అడుగంటిపోతున్నా యి. దీంతో అరకొరగా పశుగ్రాసం సాగు చేపట్టారు. ఇది ఏమాత్రం పాడిఆవులకు సరిపోవడం లేదు. చేసేదిలేక పాడిరైతులు బయట జిల్లాల నుంచి వరిగడ్డిని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

గడ్డి కోసం రోజుకు రూ.8.52 కోట్ల ఖర్చు
జిల్లాలో పాడిరైతులు పశుగ్రాసం కోసం ప్రతిరోజు రూ. 8.52 కోట్ల మేరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కిలో ఎండుగడ్టి ప్రస్తుతం రూ. 8 నుంచి రూ.12వరకు ధరలు పలుకుతున్నాయి. గతంలో ట్రాక్టర్లు, లారీల్లో లోడ్ల కింద జమకట్టి గడ్డిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం రోల్స్‌ రూపంలో ఎండుగడ్డిని బయట ప్రాంతాలనుంచి వ్యాపారులు తీసుకొచ్చి నియోజకవర్గంలో విక్రయిస్తున్నారు. ఒకరోల్‌లో 25 కిలోల మేరకు గడ్డి ఉంటుంది. 

ప్రస్తుతం ఒకరోల్‌ ధర రూ. 200నుంచి రూ.225 వరకు ధరలు పలుకుతున్నాయి.మొక్కజొన్న,జొన్న పచ్చిగడ్డి, ఉలవపొట్టు, వేరుశనగ పొట్టును పాడిరైతులు కొనుగోలు చేస్తున్నారు. అన్ని కలుపుకొంటే ఒక రోజుకు పాడిఆవుకు రూ. 100 నుంచి రూ.150 వరకు పశుగ్రాసం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పాడిరైతులు ఆవేదన చెందుతున్నారు. ఫీడ్, ఇతరత్రా మందుల ఖర్చు కలుపుకొంటే పశుపోషణ తడిసిమోపెడుగా మారుతోంది. 

గతంలో పాడిరైతులకు చేయూత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పాడిరైతులను ఆదుకున్నారు. గతంలో గడ్డికొరత ఏర్పడిన సమయంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీతో ఎండుగడ్డిని పాడిరైతులకు అందించింది. 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాల్లో గడ్డిని పెంచుకొనేందుకు ప్రభుత్వం చేయూతనిచ్చి రైతులను ఆదుకొంది. దీంతో పాడిరైతులు ఎన్నడూ గడ్డికోసం కష్టాలు పడలేదు. 

భారంగా మారిన పశపోషణ
రోజురోజుకు పశుపోషణ భారంగా మారుతోందని పాడిరైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్‌ ఏర్పడడంతో వైఎస్సార్, తిరుపతి జిల్లాల నుంచి ప్రతిరోజు ఎండుగడ్డిని దిగుమతి చేసుకొంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు 7.128 టన్నుల గడ్డి అవసరం ఉంది. ఇందుకోసం పాడిరైతులు రూ 8.52కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నారు. పచ్చిగడ్డికి తోడుగా వరిగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని రైతుల నమ్మకం. దీంతో పచ్చిగడ్డి ఉన్నా ఎండు వరిగడ్డి, వేరుశనగ పొట్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. 

నెలరోజుల క్రితం కిలో ఎండు వరిగడ్డి రూ. 5 ఉండేది. ప్రస్తుతం దళారులు ధరలు విపరీతంగా పెంచేసి రూ. 8 నుంచి రూ.10 వరకు పాడిరైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. రెండున్నర సెంట్ల పొలంలో ఉన్న మొక్కజొన్నలూ రూ. 2వేలకు, జొన్నలు రూ.1000, వేరుశనగ పొట్టు లోడు రు.25 వేల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.దీనికి తోడు ఫీడ్‌ దరలు రోజు రోజుకు ఆకాశనంటుతున్నాయి.  

గడ్డిధరలు మండిపోతున్నాయి 
ప్రస్తుతం ఎండు వరిగడ్డి ధరలు భగ్గుమంటుంటాయి. నెలరోజుల కిందట కిలో రూ.5 కే ఇచ్చేవారు. ఇప్పుడు కిలో రూ.8 నుంచి రూ.10కి పెంచేశారు. దళారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఈ కరువులో పశుపోషణ భారంగా మారింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా వస్తోంది. – నరసమ్మ, పాడిరైతు, కమ్మపల్లె  

పశుపోషణ భారంగా మారింది 
పశుపోషణ భారంగా మారింది. నాకు రెండు ఆవులు ఉన్నాయి. పుష్కలంగా గడ్డిదొరికే రోజుల్లో ఒక్కో ఆవు 5 లీటర్ల పాలు ఇచ్చేది. ప్రస్తుతం పాల దిగుబడి తగ్గిపోతోంది.   దీంతో పాలల్లో వచ్చే రాబడి ఎక్కువ శాతం పశుపోషణకే సరిపోతోంది. –రమణయ్య, పాడిరైతు, కురవపల్లె  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement