కష్టాన్ని'కట్టె'బెట్టి! | Hotel workers lose their livelihood due to gas shortage | Sakshi
Sakshi News home page

కష్టాన్ని'కట్టె'బెట్టి!

Mar 26 2026 3:48 AM | Updated on Mar 26 2026 3:48 AM

Hotel workers lose their livelihood due to gas shortage

మూతపడుతున్న హోటళ్లు 

జీవనోపాధి కోల్పోయిన హోటల్‌ కార్మికులు

గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్‌ సరఫరా లేనట్టే! 

ధరల మోత, గ్యాస్‌ కొరతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు 

స్పందించని రాష్ట్ర ప్రభుత్వం

కర్నూలు(సెంట్రల్‌)/కర్నూలు(అగ్రికల్చర్‌): వంట గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూతపడుతున్నాయి. వేల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ప్రజలకు కష్టాన్ని కట్టబెట్టి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. పశ్చియాసియాలో యుద్ధం రెండువారాలుగా జరుగుతుండటంతో గ్యాస్‌ అందని పరిస్థితి ఏర్పడింది. కట్టెల పొయ్యి వాడటానికి వంట చెరకు అందడం లేదు. 

ఏదో విధంగా కష్టపడి వాటిని సాధిస్తే.. ఈ కట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి.. బిల్లులు చూపాలని అటవీ అధికారులు అడుగుతున్నారు. కేంద్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండగా.. గ్యాస్‌ కొరతను తీర్చి ప్రజలకు అండగా నిలవాల్సి ఉంది. సీఎం చంద్రబాబు ఈ దిశగా చర్యలు తీసుకోలేదని విమర్శలు వచ్చాయి. పట్టణాల్లో మూతపడిన హోటళ్లు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి.   

100 హోటళ్లు మూత 
ఉమ్మడి జిల్లాలో చిన్న, పెద్ద హోటళ్లు 600 ఉన్నాయి. కర్నూలు నగరంలో వీటి సంఖ్య 225 వరకు ఉంది. పశి్చయాసియాలోయుద్ధ మొదలైన వెంటనే హోటళ్లకు కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కర్నూలులో 20 వరకు చిన్న, పెద్ద హోటళ్లు మూతపడ్డాయి.

ఉమ్మడి జిల్లాలో 100 హోటళ్లు మూతపడటంతో వాటిలో పనిచేసే 10 వేల మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. హోటళ్లు మూత పడటంతో వాటికి అద్దెలు చెల్లించడం కూడా కష్టమవుతుందనే ఆందోళన నిర్వాహకుల్లో వ్యక్తం అవుతోంది. గ్యాస్‌ కొరత కారణంగా వంట చెరుకుకు డిమాండ్‌ ఏర్పడింది. యుద్ధానికి ముందు టన్ను వంట చెరుకు ధర రూ.5000 వరకు ఉండగా  నేడు రూ.10 వేలకు చేరింది.  

కరోనా కాలంలో ఎంతో మేలు! 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా వచ్చి ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఎగుమతులు, దిగుమతులు బంద్‌ అయ్యాయి. కరోనా కారణంగా అప్పట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఒక్క రోజు, రెండు రోజులు కాదు... రెండు నెలలకుపైగా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ అప్పటి ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసింది. అప్పట్లో అందరికీ గ్యాస్‌ అందింది. ధరలు అదుపులోనే ఉండేవి.  

బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారా? 
కర్నూలు జిల్లాలో 42 గ్యాస్‌ ఏజన్సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 6.68 లక్షల ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల కనెక్షన్నుల ఉన్నాయి. రోజుకు 11 వేల సిలిండర్లను డెలివరీ చేయవచ్చు. ఇదే సమయంలో రోజుకు 16 వేల సిలిండర్ల ప్రకారం గ్యాస్‌ నిల్వలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నిల్వలు ఉన్న సమయంలో డెలివరీ నెమ్మదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

గ్యాస్‌ ఏజెన్సీలు ఏమైనా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నాయా అన్న సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. అధికారులు మాత్రం అదేమి లేదని, బుకింగ్‌ ఎక్కువ మంది చేసుకుంటుండడంతో ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. అయితే బుక్‌ చేసిన సిలిండర్లలో దాదాపు 80 వేలు వెయిటింగ్‌లో ఉన్నాయి. 

గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్‌ ఇవ్వొద్దు!
పశి్చమాసియా యుద్ధంతో గ్యాస్‌ దిగుబడులు పడిపోయిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే గ్యాస్‌పై కేంద్రం ఆంక్షలు విధించింది. గతంలో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండర్‌ ఇచ్చే విధంగా ఆదేశాలు ఉన్నాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు 45 రోజులకు సిలిండరు అనే విధానానికి మంగళం పలికారు. వంట చెరకు అందుబాటులో ఉంటుందని వాడుకోవాలని సూచించారు. 

అయితే జిల్లా అధికారులు మాత్రం వంటకు కట్టెల వినియోగం వద్దు అని చెబుతున్నారు. గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు ఇండక్షన్, ఎలక్ట్రికల్‌ స్టౌలు వినియోగించాలని సూచిస్తున్నారు. గ్యాస్‌ రాదు.. కట్టెల పొయ్యి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయి.. జనజీవనం సాగేదెలా అని మహిళలు ఆందోళన చెందుతున్నారు.    

కట్టెల పొయ్యిమీదనే వంట
ఆదోని సెంట్రల్‌: గ్యాస్‌ కొరతతో  ఆదోని పట్టణంలోని కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యిపై భోజనాలను చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పౌర సరఫరాల అధికారులు హోటళ్లపై దాడులు చేసి గృహాలకు వినియోగించుకోవాల్సిన దాదాపు 107 డొమెస్టిక్‌  సిలిండర్లను సీజ్‌ చేశారు.  

మూతపడిన టీస్టాల్‌ 
పత్తికొండ రూరల్‌: గ్యాస్‌ సరఫరా మందగించడంతో  టీ, టిఫిన్‌ సెంటర్లు, భోజనం హోటళ్లు మూతబడ్డాయి. చిన్నాచితక హోటల్‌ నిర్వాహకులు గత కొన్నిరోజుల క్రిందటే మూసివేశారు. కొన్నిరోజుల నుంచి సమస్య తలెత్తినా ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇక నిర్వహణ చేతకాక హోటల్‌లు సర్దుకుని మూతేశారు. ఇతర రాష్ట్రాల నుంచి బతుకుతెరువు నిమిత్తం వచ్చిన రాజస్థాన్‌ హోటల్‌ నిర్వాహకులు హోటల్‌ సర్దుకుని వారి ప్రాంతానికి తరలివెళ్లారు.

డిమాండ్‌కు సరిపడేంత సరఫరా 
కర్నూలు జిల్లాలో తగినన్ని గ్యాస్‌ సిలిండర్ల నిల్వలు ఉ­న్నా­యి. వినియోగదారులు అందోళన చెందాల్సిన అవస­రం లేదు. ప్రస్తుతం జిల్లాలో 11 వేల సిలిండర్లు నిల్వ ఉన్నాయి. వీటికి అదనంగా మరో 7 వేల సిలిండర్లు వచ్చాయి. ప్రతిరోజు సగటున సుమారు 10 వేల సిలిండర్ల  సరఫరా జ­రు­గుతోంది. ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు సరిపడేంత సరఫరా కొనసాగుతోందన్నారు. హాస్పిటళ్లు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తాం. ఏమైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలి.      – నూరుల్‌ ఖమర్, జేసీ, కర్నూలు 

పన్ను మినహాయింపులు ఇవ్వాలి 
కరోనా సమయంలో కూడా మేం ఇంత ఇబ్బంది పడలేదు. మొదటిసారిగా హోటళ్లు నడుపలేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్‌ దొరకడం లేదు. కట్టెల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వం చొరువ తీసుకొని పన్ను మినహాయింపులు ఇవ్వాలి. పర్యాటకులకు ఆతిథ్యం ఇచ్చే హోటళ్లు మనుగడ కోల్పోకుండా చూడాలి.  – ఎం.విజయ తిరుపతిరెడ్డి, జిల్లా కార్యదర్శి, హోటల్స్‌ అసోసియేషన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement