నాలుగు ఐఐటీలు, జేఎన్‌యూ, బిట్స్ పిలానీకి చోటు
క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్ టాప్–50లో భారత్
నాలుగు ఐఐటీలు, జేఎన్‌యూ, బిట్స్ పిలానీకి చోటు.. సబ్జెక్టుల వారీగా ర్యాంకింగ్స్ ప్రకటన
టాప్ 50లో 27 సబ్జెక్టులకు చోటు
సాక్షి, అమరావతి: భారతదేశంలోని ప్రముఖ విద్యా సంస్థలు అందించే కోర్సులకు ప్రపంచంలో టాప్ కోర్సులుగా గుర్తింపు లభించింది. బుధవారం ప్రకటించిన తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మూడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు), జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్స్ పిలానీ) వివిధ సబ్జెక్టుల్లో ప్రపంచంలోని టాప్ –50 సంస్థల్లో స్థానం సంపాదించుకున్నాయి.
యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌కు పేరుగాంచిన లండన్‌కు చెందిన క్యూఎస్ క్వాక్వారెల్లి సైమండ్స్, సబ్జెక్ట్ వారీగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 16వ వార్షిక ఎడిషన్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలలో 1,900 విశ్వవిద్యాలయాలు అందిస్తున్న 21 వేలకు పైగా అకడమిక్ ప్రోగ్రామ్స్, 55 విభాగాలు ఐదు విస్తృత అధ్యాపక ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటించారు.
ఇందులో భారతదేశం నుంచి 27 సబ్జెక్టులు టాప్–50లో నిలిచాయి. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ యూనివర్సిటీ మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్‌లో ప్రపంచ వ్యాప్తంగా 21వ స్థానంలో నిలిచింది. ఐఐఎం అహ్మదాబాద్ బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, మార్కెటింగ్ రెండు కోర్సుల్లోనూ 21వ స్థానంలో నిలిచింది. భారతదేశంలోని ఓ విద్యా సంస్థ మార్కెటింగ్ సబ్జెక్టులో గ్లోబల్ ర్యాంకింగ్ సాధించడం ఇదే తొలిసారి.
టాప్–50లో ఐఐటీ ఢిల్లీ, బోంబే
ఈ సంవత్సరం దేశంలోని విద్యా సంస్థలు టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా మన నాణ్యమైన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఘనతను చాటాయి. దేశంలోని టాప్ కోర్సులు అందించే సంస్థల్లో ఢిల్లీ–ఐఐటీ అత్యధికంగా 6 కోర్సులతో టాప్–50లో ముందుంది.
ఇందులో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్ ఇంజినీరింగ్‌లో 36వ స్థానం, మెకానికల్, ఏరోనాటికల్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌లో 44వ స్థానం, సైన్స్ అండ్ టెక్నాలజీలో 45, కెమికల్ ఇంజినీరింగ్‌లో 48 స్థానంలో నిలిచాయి. మద్రాస్ ఐఐటీ పెట్రోలియం ఇంజినీరింగ్‌లో 29 ర్యాంకు సాధించగా, మినరల్ అండ్ మైనింగ్ ఇంజినీరింగ్‌లో ఐఐటీ ఖరగ్‌పూర్ 22వ ర్యాంకు, ఐఐటీ బోంబే 36వ ర్యాంకులు సాధించాయి.


