భర్తతో ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు | High Court verdict on love marriage | Sakshi
Sakshi News home page

భర్తతో ఉంటే అది అక్రమ నిర్బంధం కాదు

Mar 26 2026 3:29 AM | Updated on Mar 26 2026 12:14 PM

High Court verdict on love marriage

ప్రేమ వివాహంపై హైకోర్టు తీర్పు 

తల్లిదండ్రుల హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ కొట్టివేత  

సాక్షి, అమరావతి: మేజర్‌ అయిన యువతి తన ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకుని భర్తతో ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు, అది అక్రమ నిర్బంధం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఇలాంటి వ్యవహారాల్లో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదంది. బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న తమ కుమార్తెను రోజూ వారి కూలీ అయిన ఆనందబాబు అనే వ్యక్తి అక్రమంగా నిర్బంధించారంటూ ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ వ్యాజ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు యువతిని ధర్మాసనం ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తులు ఆమెతో మాట్లాడారు. ఆనందబాబును ప్రేమించానని, ఇద్దరం ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు. తనను ఆనందబాబు నిర్బంధించలేదని తెలిపారు.

ఎవరితో కలిసి ఉండాలనుకుంటున్నావని ధర్మాసనం ప్రశ్నించగా తల్లిదండ్రులతో వెళ్లేందుకు ఆమె నిరాకరించారు. అయితే తమ కుమార్తెతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లయిన ఆమె తల్లిదండ్రులు కోరగా ధర్మాసనం అందుకు అనుమతినిచ్చింది. అర్థగంట పాటు కోర్టుహాలు బయట కుమార్తెతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడారు. అనంతరం కూడా ఆమె తాను ఆనందబాబుతోనే కలిసి ఉంటానని కోర్టుకు నివేదించారు. దీంతో ధర్మాసనం తల్లిదండ్రుల పిటిషన్‌కు విచారణార్హత లేదని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement