breaking news
shankaraiah
-
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
శంకరయ్య.. 4.58 కోట్లు.. 11 ప్లాట్లు..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూతగాదాల కేసులో రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్యపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కసరత్తు చేస్తోంది. గత శుక్రవారం శంకరయ్య ఇంట్లో సోదాల సందర్భంగా రూ.4.58 కోట్ల ఆస్తులను గుర్తించిన అధికారులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు, నగలు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంకరయ్యకు హైదరాబాద్, పూర్వ నల్లగొండ జిల్లాలో బినామీల పేరిట పలు ఆస్తులు ఉన్నట్లు తేలింది. సోదాల సందర్భంగా ఆయన ఇంట్లో రూ.17.88 లక్షల నగదు లభ్యంకాగా.. డాక్యుమెంట్ల ఆధారంగా11 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.2.28 కోట్లు. నిజామాబాద్ జిల్లా రెంజల్‌తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో 41.3 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీటి విలువ రూ.77 లక్షలని ఏసీబీ వెల్లడించింది. రూ.7 లక్షల విలువ చేసే కారు, రూ.21.44 లక్షల ఖరీదైన బంగారు ఆభరణాలు, రూ.6.13 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, రూ.81వేల విలువ చేసే వెండి సామగ్రిని ఏసీబీ అధికారులు గుర్తించారు. నగరంలో రెండు ఇళ్లు ఉండగా, వాటి విలువ రూ.1.05 కోట్లుగా నిర్ధారించారు. సీఐ స్థాయి అధికారికి ఇంత ఆస్తులు కూడబెట్టడంతో.. ఇవి అక్రమాస్తులుగా ఏసీబీ పరిగణించిందని, అందుకే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు రంగం సిద్ధం చేస్తోందని సమాచారం. -
పులివెందుల సీఐపై సస్పెన్షన్ వేటు
సాక్షి, కడప : పులివెందుల సీఐ శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసుకు సంబంధించిన విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆయనను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా కేసు వ్యవహారం ఓ కొలిక్కిరాలేదు.. సరికదా నిందితులెవరన్నది వెల్లడికాలేదు. హత్య జరిగిన తీరు పరిశీలిస్తే కిరాయి హంతకులు చేసిన పనేనని స్పష్టమవుతున్నా అందుకు సూత్రధారులు, పాత్రధారులు ఎవ్వరన్న విషయం తెలియలేదు. మరోవైపు తన తండ్రి హత్యకేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి నిన్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసి విజ్ఞప్తి చేశారు. -
సర్పంచ్ పదవి కోసం హంగామా
కడెం (ఖానాపూర్): సర్పంచ్ పదవి తమకే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట నిర్ణయించుకున్నట్లుగా తమను కాదని గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా మరికొందరితో నామినేషన్ వేయించి, మానసిక క్షోభకు గురిచేశారంటూ నవాబ్‌పేట్ సర్పంచ్ అభ్యర్థి లావణ్య భర్త జెల్ల శంకరయ్య వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని శంకరయ్యను సముదాయించి వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దింపారు. ఎస్సై కృష్ణకుమార్ శంకరయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలు జరగాలని, అర్హత ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చని, బరిలో ఉండి గెలవాలే తప్ప న్యాయం చేయాలంటూ ఇలాంటి అఘా యిత్యాలకు పాల్పడవద్దని హితవు చెప్పారు. -
రాష్ట్ర ఆర్చరీ సంఘం కోశాధికారిగా శంకరయ్య
ఖమ్మం స్పోర్ట్స్: తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ కోశాధికారిగా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి, కిన్నెరసాని ఆశ్రమ క్రీడా పాఠశాల క్రీడల ఇన్చార్జి, ఫిజికల్ డైరెక్టర్ పుట్టా శంకరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అదేవిధంగా జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాధుల సారంగపాణి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర స్థాయి తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్‌లో సముచిత స్థానం కల్పించడం పట్ల జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు సాధుల సారంగపాణి హర్షం వ్యక్తం చేశారు. -
శంకరయ్య కుటుంబానికి షర్మిల పరామర్శ