
రూ.1.45కోట్లు పరిహారం చెల్లించాలి సీఐ జోగి శంకరయ్య డిమాండ్
వివేకా హత్య కేసులో తనపై బాబు శాసనసభ సాక్షిగా అసత్య ఆరోపణలు చేశారు
సీబీఐ కూడా నన్ను సాక్షిగానే పేర్కొంది.. నిందితుడిగా కాదు
నాకు డీఎస్పీ పదోన్నతి ఇవ్వలేదు.. ఇప్పటికీ సీఐనే
చంద్రబాబుకు లీగల్ నోటీసులు జారీచేసిన సీఐ శంకరయ్య
చంద్రబాబు వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించండి
స్పీకర్ అయ్యన్నపాత్రుడికి లేఖ
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై న్యాయపోరాటానికి సీఐ జోగి శంకరయ్య ఉపక్రమించారు. వైఎస్ వివేకా హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను తాను ధ్వంసం చేసినట్టు, మృతదేహాన్ని తరలించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో,మీడియా సమావేశాల్లో చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా తనను సాక్షిగా మాత్రమే పేర్కొంది గానీ నిందితుడిగా కాదనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
తన పరువుకు భంగకరంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై శంకరయ్య పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు రూ.1.45 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు శాసనసభలో తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు ఆయన ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రిపై ఓ సీఐ పరువు నష్టం దావా వేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి...
సీఎం చంద్రబాబుకు సీఐ శంకరయ్య తన న్యాయవాది ద్వారా ఈ నెల 18న నోటీసులు పంపించారు. వైఎస్ వివేకా హత్య ప్రదేశంలో ఆధారాలను తాను ధ్వంసం చేసినట్టు శాసనసభలో సీఎం మాట్లాడిన మాటలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయన్నారు. హత్య ప్రదేశంలో తాను రక్తం మరకలు తుడిచినట్టు, మృతదేహాన్ని తరలించినట్టు, పోలీసులు రాకముందే మృతదేహాన్ని ఐస్ బాక్స్‌లో పెట్టి అంత్యక్రియలకు తరలించేందుకు యతి్నంచినట్టు చంద్రబాబు శాసనసభలో చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ కూడా ఏనాడూ తాను ఆధారాలు ధ్వంసం చేసినట్టు అభియోగం మోపలేదన్నారు. సీబీఐ తనను సాక్షి( ఎల్‌డబ్ల్యూ)గానే పేర్కొందని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక హత్య ప్రదేశంలో ఆధారాలను ధ్వంసం చేసినందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తనకు సీఐ నుంచి డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు.
తాను ఇప్పటికీ సీఐగానే ఉన్నానన్నారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన చంద్రబాబు రెండు రోజుల్లో శాసనసభలోనూ మీడియా ముఖంగానూ తనకు క్షమాపణలు చెప్పాలని సీఐ శంకరయ్య డిమాండ్ చేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు చంద్రబాబు రూ.1.45కోట్లు పరిహారంగా చెల్లించాలన్నారు. లేకపోతే ఆయనపై న్యాయపరమైన చర్యలు చేపడతానన్నారు.
రికార్డుల నుంచి తొలగించాలి...
తనను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలను శాసనసభ రికార్డుల నుంచి తొలగించాలని సీఐ శంకరయ్య స్పీకర్ అయ్యన్నపాత్రుడిని కోరారు. ఈమేరకు స్పీకర్‌ను ఉద్దేశించి ఆయన రెండు లేఖలు రాసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తన రాజ్యాంగపరమైన, న్యాయపరమైన హక్కులకు భంగకరంగా ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో పోలీసు అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవిగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించడంతోపాటు ఆ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలని సీఐ శంకరయ్య కోరారు. తనకు క్షమాపణలు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఆదేశించాలని కూడా ఆయన స్పీకర్‌ను కోరారు.