
కడెం (ఖానాపూర్): సర్పంచ్ పదవి తమకే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట నిర్ణయించుకున్నట్లుగా తమను కాదని గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా మరికొందరితో నామినేషన్ వేయించి, మానసిక క్షోభకు గురిచేశారంటూ నవాబ్‌పేట్ సర్పంచ్ అభ్యర్థి లావణ్య భర్త జెల్ల శంకరయ్య వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని శంకరయ్యను సముదాయించి వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దింపారు. ఎస్సై కృష్ణకుమార్ శంకరయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలు జరగాలని, అర్హత ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చని, బరిలో ఉండి గెలవాలే తప్ప న్యాయం చేయాలంటూ ఇలాంటి అఘా యిత్యాలకు పాల్పడవద్దని హితవు చెప్పారు.