breaking news
Reunion Fest
-
నాటి జ్ఞాపకాలు.. నేటి ఆనందబాష్పాల్లో... 50 ఏళ్ల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): ‘‘ఏరా ఉదయ్ నువ్వేం మారలేదు. అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావురా, హేయ్ కేఆర్పీ చాలా రోజుల తర్వాత చూడటం హ్యాపీగా ఉంది. ఇప్పుడు కూడా చాలా యంగ్ ఉన్నావ్రా, రేయ్ నరోత్తమ్..క్యా బాత్హేబై బోత్ దిన్ కా బాద్, జయంత్ నీ అప్డేట్స్ అన్నీ వాట్సప్ స్టేటస్‌లలో చూస్తూనే ఉన్నారా’’ అంటూ 50ఏళ్ల తర్వాత నేరుగా కలిసిన ఆ పూర్వ విద్యార్థులంతా ఒకరినొకరు పలకరించుకుంటూ భావోద్వేగానికి గురైన సంఘటన హైదర్‌గూడలోని సెయింట్ పాల్స్ హైస్కూల్లో జరిగింది. ఒకరిపై మరొకరు సైటైర్లు, ఇతర స్కూల్లో అమ్మాయిలకు రాసిన లవ్ లెటర్స్, క్రికెట్ స్కోర్ కోసం స్కూల్ నుంచి పారిపోయిన సందర్భం, బస్టాప్‌లో నచ్చిన అమ్మాయికి సైట్ కొట్టే తుంటరి చేష్టలను నెమరువేసుకున్నారు. ఆనాటి సంఘటనలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ తరగతి గది వాతావరణాన్ని తెచ్చారు 1972 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి విద్యార్థులు. ఈ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు ఇక్కడ టెన్త్ చదివి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా బుధవారం స్కూల్లో గోల్డెన్ జూబ్లీ రీయూనియన్‌ను నిర్వహించగా.. 108 స్టూడెంట్స్‌లో 64 మంది హాజరయ్యారు. వీరితో పాటు అప్పుడు పాఠాలు బోధించిన టీచర్స్ రసూల్, కష్ణమూర్తి, మారెడ్డి, షకీనా, ఐరీన్, కిటీ, మెజీలను సైతం ఆహ్వానించారు. స్టూడెంట్స్ అంతా అప్పట్లో యూనిఫాం అయిన బిస్కెట్ కలర్ ప్యాంట్, వైట్‌కలర్ షర్ట్‌ను ధరించి ఉదయం 10 గంటలకు క్లాస్‌రూంలోకి అడుగుపెట్టారు. టెన్త్–సి క్లాస్ రూంలో వీరందరికీ సైన్స్ టీచర్ షకీనా క్లాస్ తీసుకున్నారు. రోల్నంబర్తో పిలుస్తూ..బ్యాగులు లేకుండా క్లాస్‌కు ఎందుకు అటెండ్ అయ్యారంటూ సరదాగా ఆటపట్టించారు. ఉదయ్‌కుమార్ నాయుడు, సేష్ నారాయణ్, కేఆర్పీ రెడ్డి, జితేన్‌కుమార్, అశోక్‌నాథ్, సీఎస్ రావు, జయంత్, నరోత్తమ్‌రెడ్డి తదితరులు తరగతి గదిలో కూర్చుని ఉండగా.. వీరిలో కొందరి సతీమణులు స్టూడెంట్స్‌గా కూర్చున్న భర్తల్ని ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సందడి వాతావారణాన్ని తెచ్చారు. స్కూల్‌కు 27 లక్షలు సాయం నేను ఈ స్కూల్లోనే చదివాను. 50 ఏళ్ల తర్వాత మేం కలిసిన ఈ సుభ సందర్భాన నా వంతుగా స్కూల్‌కు రూ.27లక్షలు డిపాజిట్ చేస్తున్నాను. దీనిలో రూ.18లక్షలు ఇక్కడ స్కూల్లో ఉన్న పేద విద్యార్థుల చదువు నిమిత్తం, రూ.9 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వినియోగిస్తాం. – డి.జయంత్, 1972 స్టూడెంట్ నా బాధలు పోయాయి కల్లా కపటం లేకుండా ఉండి నేడు ఉన్నత స్థానాలకు ఎదిగిన మీరంతా ఒకే వేదికపైకి రావడం ఆనందంగా ఉంది. ఈ వేదికపై 50 ఏళ్ల క్రితం మీకు పాఠాలు చెప్పిన మమ్మల్ని ఆహ్వానించడం అభినందించదగ్గ విషయం. ఈ వయసులో ఎన్నో బాధలు, సమస్యలతో సతమతం అవుతున్న మాకు మిమ్మల్ని చూడగానే బాధలన్నీ పోయాయి. – మారెడ్డి, తెలుగు టీచర్ -
హెచ్‌పీఎస్‌లో రీయూనియన్ ఈవెంట్
సాక్షి, హైదరాబాద్ : బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. 2005 నుంచి ప్రతిఏటా నిర్వహిస్తున్న ఈ రీయూనియన్ ఈవెంట్‌ను డిసెంబర్ 25, 26తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదేళ్ల, మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ భంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, మాజి కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అసదుద్దిన్ ఓవైసి, అక్బరుద్దిన్ ఓవైసి, పల్లం రాజు, కిరణ్ కుమార్‌రెడ్డిలాంటి ప్రముఖులెందరో ఇక్కడ విద్యనభ్యసించారు. ఈ ఏడాది నిర్వహించబోతున్న రీయూనియన్ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరువుతున్నారని తెలిపారు. -
నేడు సిల్వర్‌జూబ్లీ కాలేజీ ‘రీయూనియన్ ఫెస్ట్’
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాల సూపర్ సీనియర్స్ (1972- 75 మొదటి బ్యాచ్) ‘రీయూనియన్ ఫెస్ట్’ ఆదివారం హైదరాబాద్‌లో జరగనుంది. ‘సూపర్ సీనియర్స్’ పట్టభద్రులై 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ బ్యాచ్‌కు చెందిన 120 మంది పూర్వవిద్యార్థుల్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమాపతి (ఐపీఎస్), ఇద్దరు రిటైర్డు ఐఏఎస్ అధికారులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కీలకస్థానాల్లో ఉన్న హేమాహేమీలు ఎందరో ఉన్నారు. సుదీర్ఘకాలం తర్వాత మిత్రులతో కలిసేందుకు... 40 ఏళ్ల కిందట కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో కలిసి చదువుకున్న మిత్రులందరినీ సమావేశపరచాలని, వారి కుటుంబాలతో అనుభూతులు పంచుకోవాలని ఐవైఆర్ కృష్ణారావు యోచించి పలువురితో సంప్రదించారు. ఈ ఉత్సవానికి హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలోని సెంట్రల్ పార్కు హోటల్‌ను వేదికగా ఆదివారం ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ ఫెస్ట్‌కు సూపర్ సీనియర్స్తోపాటు వీరికి బోధించిన అధ్యాపకులు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవానికి కళాశాల మొదటి బ్యాచ్ వారు మాత్రమే కుటుంబాలతో హాజరుకావాలని కోరారు. రిజిస్ట్రేషన్ వీరికి మాత్రమే పరిమితమని నిర్వాహకులు వైఎస్ మూర్తి (ఫోన్ నంబరు-9885222825), ఆర్ఎస్ లక్ష్మణ్ (ఫోన్ నంబరు-9391007309) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.