breaking news
Rajani reddy
-
సేవా సంపన్నత
అది 1993, సెప్టెబర్ 13వ తేదీ. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఎక్కిందో పీజీ స్టూడెంట్. ఆ అమ్మాయి కడపలో దిగాలి. నడవలేని వ్యక్తి, అతడికి సహాయంగా మరో వ్యక్తి కూడా అదే కంపార్ట్మెంట్లో ఎక్కారు. రైలు కదిలింది. ఆ నడవలేని వ్యక్తి సీట్లో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ‘మేము తినాలి, పడుకోవాలి. మీరు లేవండి’ అని గట్టిగా చెబుతున్నారొకరు. అప్పుడర్థమైందా అమ్మాయికి ఆ వ్యక్తికి రిజర్వేషన్ లేదని... ఆ బెర్తును రిజర్వ్ చేసుకున్న వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని! అంతే... సీట్లో స్థిమితంగా కూర్చోవడం కష్టమైందామెకి. ఎదుటి వారు కష్టంలో ఉంటే ‘నాకెందుకు, నా బెర్త్ నాకుంది చాలు’ అనుకోలేని సున్నితమైన గుణమే... ఈ రోజు ఆమెను ఓ శ్రీమంతురాలిని చేసింది. శ్రీమంతుడు సినిమాలో రీల్ హీరో మహేశ్ బాబు ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం మనకు తెలుసు. ఈ రియల్ శ్రీమంతురాలు కామారెడ్డి జిల్లా, సీతారామ పల్లి గ్రామాన్ని దత్తత చేసుకుని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్రీమంతురాలి పేరు మారంరెడ్డి రజనీరెడ్డి. తండ్రి కడప గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్. పెళ్లితో పాతికేళ్ల కిందట తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జనగామలో అడుగుపెట్టారు. ఎల్ఐసీ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు తన లైఫ్ జర్నీని సాక్షితో పంచుకున్నారామె. ‘‘మాది విద్యావంతుల కుటుంబం. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవడమే లక్ష్యంగా ఉండేది. నా భర్త నన్ను బైక్ మీద ఎక్కించుకుని ఆఫీస్ దగ్గర దించి తాను ఆఫీస్‌కి వెళ్లాలని, సాయంత్రం పికప్ చేసుకుని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరాలని... నా ఊహలు సాగుతుండేవి. మా వారిది వ్యవసాయ కుటుంబం. ఆడవాళ్లు పెద్ద చదువులు చదవడం, ఉద్యోగం చేయడం అలవాటు లేదు. బాగా చదువుకుని ఉద్యోగం చేసే అమ్మాయి కోడలిగా రావడం మా మామయ్యకు ఇష్టంగా ఉండేది. కానీ ‘మన గ్రామాల్లో ఉండగలదా’ అనే సందేహం ఇంట్లో వాళ్లలో. మా అత్తమ్మ మాత్రం ‘ఒకమ్మాయికి మాట ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి పోకూడదు’ అని మా వారికి మద్దతుగా నిలిచింది. అలా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చాను. గొప్ప మలుపు అప్పట్లో మా దగ్గర డబ్బు పెద్దగా ఉండేది కాదు. ఓ రోజు మావారు ఒక దోమకొండ కుర్రాడి గురించి చెప్పారు. ఆ కుర్రాడికి టెన్త్ క్లాస్‌లో మంచి మార్కులు వచ్చాయి. కాలేజ్ ఫీజులు కట్టడం కూడా కష్టమే. దాంతో కాలేజ్ వాళ్లతో మాట్లాడి ఫీజు తగ్గించి, ఆ కుర్రాడికి ఐదు వేలు ఇవ్వగలిగాం. సుభాష్ బిల్డర్‌గా కామారెడ్డిలో చిన్న కాంట్రాక్ట్‌లు చేసినప్పటికీ జీవితం అప్పటికింకా గాడిలో పడలేదు. 2004లో హైదరాబాద్‌కి వచ్చేటప్పటికి కూడా మినిమమ్ గ్యారంటీ నా ఉద్యోగమే. అయితే హైదరాబాద్ రావడం మా లైఫ్‌లో గొప్ప టర్నింగ్ పాయింట్. ఒక ఏడాదిలోనే నిలదొక్కుకోగలిగాం. మరో ఏడాదికి భరోసా వచ్చింది. ‘కష్టపడినంత కాలం కష్టపడ్డావు, రోజూ హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్లడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఉద్యోగం మానేయచ్చు కదా’ అన్నారు. చదువుకోవడానికి వచ్చే బంధువుల పిల్లలతో నాకు ఇంటి బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. సమాజం గురించి ఆలోచించే సమయం వచ్చింది కూడా అప్పటి నుంచే. మా ఊరికి అవసరమైన పనులు చేసే వెసులుబాటు కూడా వచ్చింది. భర్త చదువుకున్న స్కూల్ జనగామలో ‘ఇంటిగ్రేటెడ్ సచివాలయం’ పేరుతో పంచాయితీ భవనం కట్టాం. అన్ని ఆఫీసులూ అందులోనే. ఆ తర్వాత లైబ్రరీ, వీథుల్లో ఎల్ఈడీ లైట్లు కూడా వేయించాం. మా ఊరిని చూసి పొరుగు గ్రామాల వాళ్లు కూడా అడిగేవాళ్లు. అలా మరో 30 గ్రామాలకు కూడా ఎల్ఈడీ లైట్లు వేయించాం. మంచి నీటి కోసం ఐదు గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు పెట్టించాం. బీబీపేటలో మా వారు చదువుకున్న స్కూల్‌ని పునర్నిర్మించాం. ఆ స్కూల్‌ని చూసిన వాళ్లు మా వారి చేతికి ఎముకలేదంటుంటారు. కోటితో మొదలు పెట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి ఆరు కోట్లకు చేరింది. ఆయన బిల్డర్ కావడం తో నాణ్యత విషయంలో రాజీ పడరు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే... మా ఊరిలో పేదవాళ్లకు ప్రభుత్వం కట్టించే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణమే. ఆ బడ్జెట్ నుంచి మిగుల్చుకోవడానికే చూస్తారెవరైనా. అత్తమామలు సుశీల – నారాయణ రెడ్డిల పేరిట బీబీపేటలో కట్టించిన స్కూల్ ఆయన మాత్రం ప్రతి ఇంటికి అదనంగా రెండు లక్షలు కలిపి యాభై రెండు ఇళ్లు మంచి క్వాలిటీతో కట్టారు. మన ఊరి వాళ్లకే కదా, లెక్క చూసుకోవడం ఎందుకన్నారు. మా ఊరితోపాటు జంగంపల్లిలో మరో యాభై ఇళ్లను కూడా అలాగే కట్టారు. నాలుగు నెలల కిందట సీతారామపల్లిని దత్తత చేసుకున్నాం. ఆరు వందల జనాభా ఉన్న గ్రామం అది. ఊరంతా డ్రైనేజ్ పనులు, సిమెంట్ రోడ్లు పూర్తయ్యాయి. ఇక ఇంటిగ్రేటెడ్ సచివాలయం, కమ్యూనిటీ హాలు, లైట్లు... చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇళ్లకు మంచి నీటి సరఫరా లైన్లు మామూలుగా వేస్తే ఊరంతటికీ సమంగా అందవు. కొన్ని ఇళ్లకు ప్రెషర్ బాగా ఉంటుంది, కొన్ని వీథులకు యావరేజ్‌గా, మరికొన్ని ఇళ్లకు అరకొరగా అందుతాయి. ఆ ఇబ్బంది లేకుండా న్యూమాటిక్ సిస్టమ్ అనుసరించాలని ఎక్స్‌పర్ట్‌లతో మాట్లాడుతున్నాం’’ అని వివరించారు రజని. ఇరవై శాతం సమాజం కోసం సమాజం కోసం ఇంతగా చేస్తున్నా ఎప్పుడూ వార్తల్లో కనిపించరామె. ‘‘గ్రౌండ్ వర్క్ నాది, ప్రశంసలందుకునేది మా వారు. మహేశ్‌బాబు నుంచి కేటీఆర్ వరకు ప్రశంస లు కురిపించేది ఆయనకే. ఆయన చేసే ప్రతి ప్రాజెక్టులో ఇరవై శాతం లాభాలు సొసైటీ కోసమే అనే నియమం పెట్టుకున్నాం. ఆయన లాభాలెంత, మిగులు ఎంత అనే లెక్క నా దగ్గరే ఉంటుంది. అందుకే ఎప్పుడు కొత్త పని తీసుకోవచ్చు, ఎంత బడ్జెట్లో తీసుకోవచ్చనే అంచనా కూడా నాకే బాగా తెలుసు. తన ఖర్చులకు కూడా డబ్బు నేనే ఇవ్వాలి’’ అన్నారామె నవ్వుతూ. వీటితో సంతృప్తి చెందినట్లేనా ఇంకా చేయాలనుకుంటున్నవేమైనా ఉన్నాయా అన్నప్పుడు... తన డ్రీమ్ ప్రాజెక్ట్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అన్నారు రజని. ‘మంచి వైద్యం కోసం మా గ్రామాల వాళ్లు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా ఎక్కువమందికి అనువైన ప్రదేశం చూసి చారిటీ హాస్పిటల్ కట్టించాలి. తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలి. కంఫర్టబుల్‌గా జీవించే అవకాశం వచ్చింది, ఇప్పుడైనా పదిమందికి ఉపయోగపడాలి కదా’ అన్నారామె సౌమ్యంగా. తన బెర్త్‌ను దివ్యాంగుడికి ఇచ్చి తాను నిలబడిన నాటి సౌమ్యతే ఇప్పుడు కూడా ఆమె మాటల్లో. రియల్ లవ్ స్టోరీ మా పరిచయం చాలా సినిమాటిక్‌గా, రీల్ లవ్‌స్టోరీలా జరిగింది. రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి వెళ్తున్నాను. ఆమె కడపకు వెళ్తోంది. చాలా సేపటి నుంచి నిలబడి ఉంది... బహుశా టికెట్ కన్ఫర్మ్ కాలేదేమో అనుకుని పలకరించాను. స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్‌కి తన బెర్త్ ఇచ్చి తాను నిలబడి ఉండడం నా మనసును కదిలించింది. అలా మాటలు కలిశాయి. ఆమె రైలు దిగి వెళ్లి పోతే ఇక ఎప్పటికీ కనిపించదేమోనని భయం పట్టుకుంది. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. పేపర్ మీద నా అడ్రస్ రాసి, ‘నేను తిరుపతి నుంచి తిరిగి మా ఊరికి వెళ్లేటప్పటికి మీ నుంచి ఉత్తరం ఉండాలని కోరుకుంటున్నాను’ అని ఆ కాగితాన్నిచ్చాను. నేను కోరుకున్నట్లే ఆమె నుంచి ఉత్తరం వచ్చింది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితంలో ప్రతి పనిలో నన్ను వెన్నంటి నడిపిస్తోంది. మనం సెటిల్ అయిన తర్వాత లాభాల్లో మిగులును సమాజానికి తిరిగి ఇవ్వాలనే తన పాలసీనే నేను ఫాలో అయిపోతున్నాను. – టి. సుభాష్ రెడ్డి, ఎం.డి, కెడాల్ డెవలపర్స్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
బీజేపీలో చేరిన రజనీరెడ్డి
-
కోట్లు కాజేసిన రజనీరెడ్డి ఆత్మహత్యాయత్నం
పంజగుట్ట : పెట్టిన పెట్టుబడికి కేవలం నలభైరోజుల్లోనే రెట్టింపు డబ్బు ఇస్తానని నమ్మబలికి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టిన పంజగుట్టకు చెందిన రజనీరెడ్డి ఆదివారం ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. పోలీసుల కథనం ప్రకారం... రజనీరెడ్డి మాటలు నమ్మి నగరానికి చెందిన పలువురు కూలీలు, చిన్నా చితక పనులు చేసుకునే సుమారు 700 మంది అప్పులు చేసి మరీ ఆమె వద్ద లక్షల్లో పెట్టుబడి పెట్టారు. ఆమె వారికి డబ్బులు తిరిగి ఇవ్వకుండా తిప్పుకుంటుండంతో పలువురు రజనీరెడ్డిపై పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. బాధితులు తమకు తక్షణం డబ్బు చెల్లించాలని రజనీరెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. తరచూ ఫోన్ చేసి డబ్బులు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారు. ఈనేపథ్యంలో రజనీరెడ్డి ఆదివారం నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరింది. గమనించిన కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చి.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పంజాగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో రవీందర్ రెడ్డి, రజనీరెడ్డి దంపతులు గత కొంత కాలంగా నివాసముంటున్నారు. రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో నాయకున్ని అని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. కాగా రజనీరెడ్డి అపార్ట్మెంట్ సమీపంలోని మహిళలు పరిచయం చేసుకొని తమకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయని, వాటిలో పెట్టుబడులు పెడితే.. పెట్టిన పెట్టుబడికి 45 రోజుల్లో రెట్టింపు ఇస్తానని మాయ మాటలు చెప్పింది. ఇది నమ్మిన కొంత మంది మహిళలు మొదట రూ. 5, రూ. 10 వేలు పెట్టుబడులు పెట్టారు. వీరికి రెట్టింపు చెల్లించడంతో నిజమేనని నమ్మినవారు తిరిగి మరికొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. అలాగే వారి బంధువులు, తెలిసిన వారితో కూడా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టించారు. ఇటీవల తమకు రావాల్సిన డబ్బు చెల్లించాలంటూ కొంత మంది రజనీరెడ్డి వద్దకు వెళ్లగా.. ‘డబ్బులు లేవు.. ఇవ్వను.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ సమాధానమిచ్చింది. మోసపోయామని గుర్తించిన బాధితుల్లో కొంత మంది నెల రోజుల క్రితం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. కేసు పరిశీలించిన పంజాగుట్ట పోలీసులు భారీ మొత్తంలో మోసం జరిగిందని కేసును సిసిఎస్‌కు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. అప్పటి నుండి కేసు విచారణలో పురోగతి లేకపోవడంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు స్థానిక కార్పొరేటర్ మహేష్ యాదవ్ సహాయంతో సోమవారం రజనీరెడ్డి నివాసం ముందు బైఠాయించారు. రజనీరెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. సుమారు 300 మంది బాధితులు రజనీరెడ్డి ఇంట్లోకి చొరబడి దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని కొంత మంది మధ్యవర్తులే డబ్బులు కాజేశారని రజనీరెడ్డి ఆరోపించగా వారెవరో చెప్పాలంటూ బాధితులు నిలదీశారు. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.