breaking news
The prayer hall
-
ఆకలి తీర్చే గుడి
చార్ల్స్ వాకర్ పోస్నెట్... దాదాపుగా వందేళ్ల కిందట ప్రజల ఆకలి తీర్చడానికి ఈ గుడిని కట్టాడు. ఆసియాలోనే పెద్దదైన ఈ ప్రార్థనా మందిరం ఐదు వేల మంది ఒకేసారి ప్రార్థన చేసుకోగలిగినంత విశాలమైనది. ఈ గుడి నేటికీ ఆధ్యాత్మిక ఆకలిని తీరుస్తూనే ఉంది. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చి బిషప్ రెవరెండ్ ఎ.సి. సాల్మన్ రాజుతో ‘సాక్షి’ ముఖాముఖి. మీరు క్రీస్తును ఎప్పుడు దర్శించారు? దైవం మీద అంత నమ్మకం ఎప్పుడు ఏర్పడింది? కసాయిగల్లి అని నిజామాబాద్‌లో మంచి వ్యాయామశాల ఉండేది. నా పాతికేళ్ల వయసులో అక్కడ రోజూ విపరీతంగా కసరత్తులు చేసేవాడిని. ఇంటికి వచ్చి పచ్చి ఆవు పాలు తాగేవాడిని. అప్పుడు బ్రోసల్ హార్సిస్ అనే జబ్బు వచ్చింది. మన దేశంలో ఇది చాలా అరుదు. ఆ జబ్బు పేరు కూడా అప్పట్లో నాకు తెలియదు. సాయంత్రం ఐదు నుంచి పొద్దున్న ఆరు గంటల వరకు విపరీతమైన జ్వరంతో బాధపడేవాడిని. అంతకు రెండేళ్ల క్రితం పెళ్ళిచేసుకున్నాను. చిన్న బిడ్డ కూడా ఉన్నాడు. జ్వరంతో ఏడాది పాటు విపరీతంగా బాధపడ్డాను. అప్పటి వరకు వ్యాయామం చేయడం, యవ్వనంలో ఉండటం వల్ల బలవంతుడిని అనుకునే నేను ఆ జబ్బుతో చాలా వేదనపడ్డాను. ఆ రోజుల్లోనే రెండు లక్షలకు పైగా వైద్యానికి ఖర్చయ్యింది. అలాంటి పరిస్థితిల్లో ఒక రోజు ‘ప్రభూ, నా తండ్రి దేవుడవు నీవే, నా దేవుడవు నీవే కదా ఏంటి నాకీ రోగం?’ అని ఏడుస్తూ ప్రభువుతో చెప్పుకున్నాను. ‘నన్ను స్వస్త పరిస్తే జీవితాంతం నీ సేవకునిగా ఉండిపోతాను’ అన్నాను. అలా దైవానికి నాకు మధ్య ఒక ఒప్పందం జరిగింది. మరుసటి రోజు తమిళనాడులోని వెల్లూరు మిషనరీ ఆసుపత్రికి వెళ్లాం. ఏదో పని మీద ఆస్ట్రేలియా నుంచి ఓ డాక్టర్ వచ్చారు. అక్కడి వైద్యులు మాకెవరికీ ఇతని జబ్బు అర్థం కావడం లేదని చెబితే, అతను చూపించమన్నాడు. నన్ను అతని వద్దకు తీసుకెళ్లి, మళ్టీ టెస్ట్‌లు చేశారు. అవి చూసిన డాక్టర్ ‘ఇదేం భయంకరమైన రోగం కాదు. జంతువు పొదుగు నుంచి క్రిములు పాల ద్వారా ఇతని శరీరంలో చేరాయి. దీని వల్ల రాత్రుళ్లు జ్వరంగా ఉంటుంది’ అని తేల్చారు. 30 రూపాయల మందులను ఇచ్చారు. మూడు రోజులు ఆ మందులు వాడాను. ఏడాదిగా బాధిస్తున్న రోగం తగ్గిపోయింది. ఆ డాక్టర్ రూపంలో నాకు దేవుడు దర్శనమయ్యాడు. ఈ రోగం దేవుని క్రియగా భావించాను. మరొక నిదర్శనం ఉంది. నా బీకామ్ సర్టిఫికెట్లు యూనివర్సిటీ గొడవల్లో సీజ్ చేశారు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేశాను. వెల్లూరు ఆసుపత్రి నుంచి ఇంటికి రాగానే నా సర్టిఫికెట్లు పోస్టులో వచ్చి, ఇంట్లో ఉన్నాయి. అప్పటి నుంచి ఈ సేవలో నిమగ్నయ్యాను. ఎంతో మందికి దైవ సందేశాలు ఇచ్చే మీ దృష్టిలో దైవం అంటే ఎవరు? ప్రేమను ప్రకటించడమే క్రీస్తు సమాధానం, ప్రేమ, దయ.. ఇవే క్రీస్తుకు కావల్సింది. సాటి జీవుల పట్ల కరుణ, దయ, ప్రేమను ఎవరు చూపుతారో వారిలో దైవం ఉంటుంది. అలాంటి క్రీస్తును మా తండ్రి నమ్ముకున్నారు. ఆయన మార్గంలో నేను నడిచాను. మానవ జ్ఞానానికి అతీతమైనది, మానవునికి తనను తాను కనపరుచుకునేది దైవశక్తి. అది ఏ మతమైనా కావచ్చు. మానవుడు తనకై తాను నిర్మించుకున్న ఈ లోకంలో తనను కాపాడేవాడు కావాలి. ఆ విధంగా దైవం గురించి వెతుకుతూ వెతుకుతూ తనలోనే దైవాన్ని దర్శిస్తూ వచ్చాడు. అలా నాలో క్రీస్తును దర్శించాను. అంటే, కష్టంలోనే దైవాన్ని తెలుసుకోగలమంటారా? ముమ్మాటికి. అది కూడా వ్యక్తిగత సంఘటనల ద్వారానే తెలుసుకోగలరు. మానవుడు తన అనుభవంతో తనకు దేవుడితో ఎలాంటి సంబంధం ఉందో తెలుసుకుంటాడు. అలాగని, దేవుడిని ప్రూవ్ చేసే వాళ్లు ఇంతవరకూ పుట్టలేదు. నీకు–దేవునికి మధ్య ఉన్న సంబంధం ఎవరూ చెప్పలేనిది. కష్టంలో ఏ దేవుడు కనపడితే ఆ దేవుడికి మొక్కుతావు. ఈ లోకంలో ఎందరో దేవుళ్లున్నారు. వాళ్లందరి రూపంలో మంచినీ, సాయాన్ని పొందుతున్నావు. అదంతా నీ అనుభవం. నేను క్రీస్తును గ్రహించాను. నమ్మాను. ఏసు నాకు దేవుడు. భక్తులు తమ సమస్యలు తీరి, ఆనందంగా ఈ చర్చికి వచ్చి మీకు తెలియజేసిన సందర్భాలు? ఎన్నో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక .. మొదలైన ప్రాంతాల నుంచి వారానికి లక్షమందికి పైగా ఈ ఆలయానికి వస్తుంటారు. వారి విశ్వాసం ఎలాంటిదంటే ఇది వారికి ఓ పుణ్యక్షేత్రం. పిల్లలు లేనివారికి పిల్లలు కలుగుతారని, రోగం ఉన్నవారికి రోగం తగ్గుతుందని నమ్మకం. ఈ చర్చికి ఒకసారి వచ్చి ముఖం చూపిస్తే చాలు స్వస్తత పొందుతారని వారి విశ్వాసం. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల పుట్టు వెంట్రుకలు తీయించే తల్లిదండ్రులనూ ఇక్కడ మీరు చూడచ్చు. ఇక్కడ కులమతాల పట్టింపుల్లేవు. భక్తే ప్రధానం. ప్రేమించే ప్రభువు మీద కోపం కలిగిన సందర్భాలు? తెలిసీ తెలియని వయసులో నా ఇష్టానుసారం ప్రవర్తించేవాడిని. ఇరవై ఏళ్ల వయసులో బాగా తుంటరి పనులు చేసేవాడిని. అప్పట్లో స్నేహితులతో కలిసి ఒక డ్యాన్స్షో చేశాను. డబ్బులు బాగానే వచ్చాయి. ఆ అహంకారంతో మా నాన్న దగ్గరకు వెళ్లి ‘ఇదిగో నాన్న డబ్బులు’ అన్నాను. అప్పుడు ఆయన ‘నేను గురువును. నా కొడుకుగా నువ్వూ గురువువి కావాలనుకున్నాను’ అన్నాడు. అప్పుడు నేను ‘సరేలే.. గురువుగా ఉండి నువ్వీ డబ్బు సంపాదించగలవా? తీసుకో..’ అని నిర్లక్ష్యంగా ఆయన ముందు ఆ డబ్బు పెట్టాను. ఆయన ‘నాకు నువ్వు కావాలి. ఏసుకు నువ్వు కావాలి. ఈ డబ్బు కాదు’ అన్నాడు కోపంగా ఊగిపోతూ! నాకు విపరీతమైన కోపం వచ్చి, ఇంటి నుంచి వెళ్లిపోయాను. ఎక్కడెక్కడో తిరిగి ఆ రాత్రి ఒంటరిగా ఊరి బయట ఓ పాడుబడిన ఇంటి ముందు పడుకొని ఉన్నాను. ఒంటిమీద తడిగా అనిపించడంతో మెలకువ వచ్చి లేచాను. మా నాన్న, ఆయన కన్నీళ్లు నా మీద పడుతున్నాయి. ఆయన ఏడ్వడం మొదటిసారి చూశాను. ‘ఏసు పిలుస్తున్నాడు.. రా’ అన్నాడు. ఆ ప్రభువే నన్ను ఆజ్ఞాపిస్తున్నట్టు అనిపించింది. ఏమీ మాట్లాడకుండా నాన్నతో వెళ్లిపోయాను. మా నాన్న ‘ప్రభూ.. నాకు నువ్వు కనపడి ఓ మార్గం చూపించావు. ఇప్పుడు నా కొడుకు కూడా నీ దగ్గరకు వచ్చాడు’ అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రార్థనలో ఏదో తెలియని అనుభూతిని పొందాను. తెలియకుండానే పాపక్షమాపణార్థంగా నేనూ ప్రార్ధన చేశాను. ఆ క్షణమే నా వ్యాపకాలను వదిలిపెట్టి ప్రభువు సన్నిధికి చేరాను. అప్పుడు నాకు నేనుగా క్రైస్తవుడిని అయ్యాను. మతం మారి వచ్చినవారికి మీరిచ్చే మార్గదర్శకాలు? దైవాన్ని చేరుకోవడానికి మతం ఒక మార్గంగా ఉపయోగపడుతుంది కానీ, ఇదీ అందరికీ అర్ధం కాదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవం ఇక్కడి సంస్కృతినే అలవర్చుకుంటుంది. చాలా మంది దీనిని వేరు వేరుగా అర్థం చేసుకుంటారు. మన దేశ మహాత్మ్యం ఏంటేంటే.. నాకు నచ్చింది నేను ఎంచుకోవచ్చు. ఏసును నేను నమ్ముకున్నాను. ఈ మార్గంలోకి వచ్చేవారికి దేవుడి వాక్యమే మార్గం. కొత్తగా నేర్పించేది ఏమీ లేదు. ఇది అర్ధమైతే చాలు. పాపం మరణంతో సమానం. అయితే, పాపిని కూడా క్షమించేవాడు దేవుడు. మానవుడు దేవుడు కాలేడు. కానీ, దేవుడి గుణాల్లోకి రాగలుగుతాడు. దీని వల్ల ప్రేమ, సహనం, కరుణ, దయ.. అన్నీ అలవడతాయి. అదే దైవత్వం. ఒకసారి క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత ఇతరులతో కనెక్టివిటీ బాగా పెరుగుతుంది. ఎవరో చెబితే కాదు, నీకు దేవునితో నడవాలన్న రోజున నువ్వే వస్తావు. దైవం అంటే ఎదుటిమనిషికి సాయపడటమే! అలా సాయమందించిన సందర్భాలు.. నేను ఎక్కడ నుంచి వచ్చానో నా మూలాలను మర్చిపోను. వైద్య, విద్య పరిచర్యలలో ఎంతో మందికి చర్చి చేయూతనిచ్చింది. ఇక్కడ 1300 సంఘాలున్నాయి. మూడు వందల మంది అయ్యవార్లు ఉన్నారు. వీళ్లంతా గ్రామాల్లోకి వెళతారు. విద్య, వైద్యసదుపాయాలు చూస్తారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. పెద్ద చదువులు చదివినా, నైపుణ్యాలు లేక ఉద్యోగం రాని ఎంతో మంది ఉన్నారు. అలాంటివాళ్లకి స్కిల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఓ మార్గం చూపించాలనుకుంటున్నాను. నా ప్రేమ వెనుక ఏసు ప్రేమ ఉంది. ఏ కులమైనా, మతమైనా విద్యను దానం చేయాలి. బతకగల శక్తిని ఇవ్వాలి. ఇవి నా జీవిత ధ్యేయాలు. – రెవరెండ్ ఎ.సి.సాల్మన్ రాజు – నిర్మలారెడ్డి చిల్కమర్రి – సి.హెచ్.నీలయ్య, సాక్షి, మెదక్ -
ప్రార్థనా మందిరం వరండా కూల్చివేత
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో ఓ ప్రార్థనా మందిరం వరండాను అక్రమంగా నిర్మిస్తున్నారని బుధవారం మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. ఫలితంగా పట్టణంలో ఉద్రి క్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొందరు యువకులు వెళ్లి మునిసిపల్ కమిషనర్ చాంబర్‌పై దాడిచేసి తలుపులు పగులగొట్టారు. ఈ సందర్భంగా వారిలోనే ఇద్దరు గాయపడ్డారు. మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే వారిని పోలీసులు వదిలిపెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శ్రీకాళహస్తి పట్టణంలోని పూసలవీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రార్థనామందిరం దాదాపుగా పూర్తయింది. బుధవారం ఉదయం మునిసిపల్ కమిషనర్ శ్రీరామ్‌శర్మ సిబ్బందితో కలసి వెళ్లి ఆక్రమణలో ఉందంటూ ఆ ప్రార్థనామందిరం వరండాను కూల్చివేశారు. దీంతో జనం ఆగ్రహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వరండాను ఎలా కూల్చివేరంటూ నిలదీశారు. మురుగుకాలువపై వరండా నిర్మించారని.. ఆక్రమణను తొలగించడానికి నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదంటూ అధికారులు సమాధామిచ్చారు. ఇటు వైపు వంద ఇళ్లు, అటు వైపు వంద ఇళ్లకు పైగా కాలువపైనే వరండాలు నిర్మించారని, వాటిని పట్టించుకోకుం డా ఈ వరండానే కూల్చడం దారుణంటూ మండిపడ్డా రు. దీంతో పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం అక్కడి చేరుకున్నారు. అరుపులు కేకలతో గందరగోళంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కమిషనర్‌పై దాడి జరిగే అవకాశాలు చోటుచేసుకున్నాయి. కమిషనర్, సిబ్బంది జేసీబీని వదిలిపెట్టి కార్యాలయానికి వెళ్లిపోయారు. తర్వాత జనం జేసీబీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగారు. ‘మీకు ఆలయాలు ఎంత పవిత్రమో... మాకు మా ప్రార్థనా మందిరాలు అం తే పవిత్రం... అలాంటిది ఎలా కూల్చివేస్తావ్’ అం టూ జేసేబీని అడ్డుకున్నారు. పొరబాటైం ది.. వదిలిపెట్టండి ప్లీజ్ అంటూ బతిమాలడంలో అతడిని వదిలిపెట్టారు. తర్వాత పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లారు. కమిషనర్‌తో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు దాదాపు 10మంది యువకులు కమిషనర్ చాంబర్‌పై దాడిచేసి తలుపులు పగులగొట్టారు. ఈ సందర్భంగా వారిలోనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మరకలతో కార్యాలయం తడిసింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పరారయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటకిషో ర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కమిషనర్ పరిస్థితిని వివరించారు. మరోవైపు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వరండాను కూల్చడంతో పాటు కమిషనర్ తమవారిపై దౌర్జన్యం చేశారని, వాటిని పట్టించుకోకుండా తమ పిల్లలు మున్సిపల్ కార్యాల యంపై దాడిచేశారంటూ అదుపులోకి తీసుకోవడం ఎం తవరకు న్యాయమని డీఎస్పీని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డిని కూడా జనం నిలదీశారు. పరిస్థితి విషమిస్తున్నట్లు గుర్తించిన డీఎస్పీ వెంటనే అదుపులో ఉన్న ఏడుగురిని వదిలిపెట్టారు. దీంతో వారు శాంతించి వెళ్లిపోయారు. ఇలా నాలుగు గంటలపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద గందరగోళం ఏర్పడింది. తర్వాత డీఎస్పీ మైనారిటీల నాయకులు సిరాజ్‌బాషా, గోరా, జానీబాషా, బషీర్, షాకీర్‌ఆలీ, గోస్బాషా తదితరులతో చర్చించారు. శాంతియుత వాతావరణం కోసం తమతో సహకరించాలని కోరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయాయి. కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు వరండా కూల్చివేత పై బుధవారం రాత్రి పలువురు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్‌శర్మపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ మేరకు వన్‌టౌన్ సీఐ చిన్న గోవింద్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.