breaking news
prawn ponds
-
రొయ్యల చెరువులో విషప్రయోగం
అత్తిలి: గుర్తుతెలియని వ్యక్తులు రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో రొయ్యలు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లిలో జరిగింది. దీనిపై బాధితుడు అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, ఆయన సోదరులు స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల సరిహద్దులో ఉన్న 4.20 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొన్నేళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నారు. చెరువులో 3 లక్షల పిల్లలను వేయగా ప్రస్తుతం 94 కౌంట్‌కు చేరుకున్న రొయ్యలను మరో వారం రోజుల్లో పట్టుబడి పట్టనున్నారు.ఈ తరుణంలో రొయ్యల చెరువులో విష ప్రయోగం జరగడంతో సుమారుగా ఆరు టన్నుల రొయ్యలు మృతిచెందినట్లుగా చెబుతున్నారు. వీటి విలువ సుమారుగా రూ.15.90 లక్షలు ఉంటుందని బాధితుడు వెలగల అమ్మిరెడ్డి వెల్లడించారు. దీనిపై ఆయన అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెరువును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దీనిపై వెలగల అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఆరవల్లిలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబానికి చెందిన రొయ్యల చెరువులో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు విషం కలిపారని ఆరోపించారు. -
10 మోటార్ల చోరీ
కుడితిపాలెం(ఇందుకూరుపేట): మండలంలోని కుడితిపాలెంలో రొయ్యల గుంతల వద్ద ఏరియేటర్లకు సంబంధించిన 10 మోటార్లు, పది గేర్బాక్సులతోపాటు సుమారు వెయ్యి మీటర్లు వరకు విద్యుత్ వైరును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. బాధితుడి కథనం మేరకు నిడిముసలి గ్రామానికి చెందిన ఎరటపల్లి భాస్కర్‌రెడ్డి కుడితిపాలెంలో రొయ్యల గుంతలు సాగు చేస్తున్నారు. పంట పూర్తవడంతో గుంతలలో ఉపయోగించే ఏరియేటర్లుకు సంబంధించిన మోటార్లు, విద్యుత్ వైరును తీసి గదిలో ఉంచి భద్రపరిచాడు. రోజులాగే శుక్రవారం సాయంత్రం గుంతల వద్ద పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం వచ్చి చూసే సరకి గదికి వేసిన తలుపులు తెరుచుకుని ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై షరీఫ్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


