breaking news
overloaded
-
ఓవర్ లోడ్‌తో తిరిగితే అంతే!
సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడ్‌తో దూసుకెళ్లే లారీల పర్మిట్లు రద్దు చేసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర లోడ్ ఉందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అధిక బరువు, అధిక వేగం వెరసి టిప్పర్‌ను అదుపు తప్పేలా చేసిందని పేర్కొంటున్న నేపథ్యంలో, ఓవర్‌లోడ్ ట్రక్కులను నియంత్రించాల్సిందేనన్న ఒత్తిడి ప్రభుత్వంపై పెరిగింది. అధికారుల అవినీతితోనే ఈ ట్రక్కులు యథేచ్ఛగా తిరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. దీంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గనులు, రవాణాశాఖలు సంయుక్తంగా నడుం బిగిస్తే తప్ప ఓవర్ లోడ్ నియంత్రణ సాధ్యం కాదు.ఈ రెండు శాఖలు ఉమ్మడిగా చర్యలు తీసుకునేలా ఓ కసరత్తు జరుగుతోంది. ట్రక్కుల్లో సరుకు నింపేప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒకవేళ ఓవర్‌లోడ్‌తో ట్రక్కులు రోడ్డు మీదకు వస్తే వాటి నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు చేపట్టాలన్నది ఆలోచన. ఓవర్‌లోడ్‌తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించటం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయటం, మళ్లీ అదే పునరావృతమైతే ట్రక్కు పర్మిట్లను రద్దు చేసి, ఇసుక, సిమెంటు, కంకర లాంటి లోడ్లను తరలించేందుకు వాటికి వీలు లేకుండా చేయాలన్నది ఈ కసరత్తు ఉద్దేశం.గతంలోనూ చాలా నిబంధనలు, పరిమితులు ఉన్నా, వాటిని కాగితాలకే పరిమితం చేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాజా అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ముందుగా యంత్రాంగంలో భయం రావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్ లోడ్ లారీలు రోడ్డెక్కితే అందుకు సంబంధిత సిబ్బంది, అధికారులను కూడా బాధ్యులను చేసి వారిపై కూడా చర్యలు చేపట్టాలన్నది ప్రజల సూచన. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రీచ్‌ల నుంచే అక్రమాలు ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రీచ్‌ల నుంచే అక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ట్రక్కుల్లో తరలించే ఇసుక వివరాలు వెల్లడిస్తూ జారీ అయ్యే వే బిల్లుల్లో చూపే ఇసుక పరిమాణానికి, వాస్తవంగా ట్రక్కుల్లో నింపే ఇసుక పరిమాణానికి తేడా ఉంటోంది. రీచ్ నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించే ప్రభుత్వ సిబ్బంది, ఇసుక తరలించే ప్రైవేటు వ్యక్తులు కూడబలుక్కొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిమితికి మించిన లోడ్‌తో ట్రక్కు ప్రయాణిస్తుంటే దాన్ని గుర్తించాల్సిన రవాణాశాఖ కూడా చివరకు ఇందులో భాగమవుతోంది.రోడ్లమీద ట్రక్కులను ఆపి వాటి లోడ్ ఎక్కువ ఉందా, సరిగ్గానే ఉందా అని తేల్చేందుకు రవాణా శాఖకు సాధనాలు అందుబాటులో ఉండటం లేదు. బరువు తూచే వే బ్రిడ్జిలు పరిమితంగా, దూరంగా ఉండటంతో గుర్తించలేకపోతున్నారు. అధిక బరువు ఉందని గుర్తించిన ట్రక్కులను సీజ్ చేసిన తర్వాత వాటిని ఉంచేందుకు కావాల్సిన ఖాళీ స్థలం కూడా అందుబాటులో ఉండటం లేదు. పోలీస్స్టేషన్లు, బస్టాండ్లు లాంటి చోట ఇప్పటికే వాహనాలు నిండిపోతుండటంతో కొత్తవాటిని పార్క్ చేసేందుకు ఆయా విభాగాల అధికారులు అంగీకరించటం లేదు. ఇది కూడా వాటిని నియంత్రించటానికి అడ్డంకిగా మారింది. సిమెంటు కంపెనీల్లో మరో తీరుఇసుక రీచ్‌ల్లో అక్రమంగా ఎక్కువ ఇసుక లోడ్ చేసి, పరిమితికి లోబడే బరువు ఉన్నట్టు వే బిల్లులు జారీ చేస్తున్నారు. కానీ, సిమెంటు కంపెనీల్లో తీరు మరోరకంగా ఉంది. లోడ్ కోసం వచ్చే లారీ సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ఓవర్‌లోడ్ చేసి, వే బిల్లుల్లోనూ ఆ ఓవర్లోడ్నే చూపుతున్నారని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కంకర క్రషర్ల వద్ద ఎలాంటి పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా లోడ్ చేసి రోడ్ల మీదకు పంపుతారు. చేవెళ్ల ప్రమాదంలో బీభత్సం సృష్టించిన ట్రక్కు అలా ఓవర్‌లోడ్‌తో వచ్చిందే. త్వరలో గనుల శాఖ, రవాణాశాఖలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. -
3 రోజుల్లో 350 వాహనాలపై కేసులు
సాక్షి, హైదరాబాద్: గత మూడు రోజులుగా 350కి పైగా వివిధ వాహనాలపై కేసులు నమోదు చేస్తే అందులో 60కి పైగా ఓవర్ లోడ్‌తో ఉన్నాయని రవాణా శాఖ తెలిపింది. ఇప్పటికే 33 జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఓవర్ లోడ్ వాహనాలపై తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేసింది. త్వరలో మైనింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వాహనాలకు లోడ్ వేసే రీచ్‌లు, క్వారీలలోనే ఓవర్ లోడ్‌ను అరికట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో పేర్కొంది.2025 జనవరి 1 నుంచి నవంబర్ 6 వరకు మోటారు వాహనాల చట్టాలను ఉల్లంఘించిన 1,15,000కు పైగా వాహనాలపై కేసులు నమోదు చేసినట్టు తెలిపింది. వీటిలో 5 వేలకుపైగా ఓవర్ లోడ్‌తో వాహనాలు, 9వేలకు పైగా ప్రైవేట్ బస్సులు ఉన్నాయని వివరించింది. పరి్మట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహనాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపింది. -
లంచమిస్తే ఓవర్లోడ్కూ రైట్‌రైట్!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘోర దుర్ఘటన రాష్ట్రంలో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్న ఉదంతాన్ని కళ్లకు కట్టింది. తెలంగాణవ్యాప్తంగా భారీ సరుకు రవాణా వాహన యజమానుల కాసుల కక్కుర్తి, రవాణా అధికారుల మామూళ్ల మత్తు ఏ స్థాయిలో ఉంటోందో చెప్పకనే చెప్పింది. యమదూతల్లా టిప్పర్లు.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇసుక, కంకర, ఇటుకలు, నిర్మాణ వ్యర్థాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ట్రాన్స్పోర్ట్ మాఫియా.. కొందరు రాజకీయ నేతల అండదండలతో నిబంధనలను తుంగలో తొక్కుతోంది. ప్రధానంగా హైదరాబాద్ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నల్లగొండ నుంచి నిర్మాణ సామగ్రితో టిప్పర్లు, లారీలు ఓవర్‌లోడ్, ఓవర్ స్పీడ్‌తో యమదూతల్లా ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. నిబంధనలు గాలికి.. రాష్ట్రంలో ఏ రకం ట్రక్కు లేదా లారీ ఎంత బరువు మోసుకెళ్లాలో నిబంధనల్లో పొందుపరిచారు. ట్రక్కు తయారీ కంపెనీలు ఆయా ట్రక్కుల బరువు మోసే సామర్థ్యాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను లెక్కలోకి తీసుకొని ట్రక్కుల సామర్థ్య పరిమితులను ఖరారు చేశారు. ఆ మేరకు సింగిల్ యాక్సల్ (ఒక టైరు) 3 టన్నులు, సింగిల్ యాక్సల్ (2 టైర్లు) 6 టన్నులు, సింగిల్ యాక్సల్ (4 టైర్లు) 10.2 టన్నులు.రెండు యాక్సల్ (8 టైర్లు) 19 టన్నులు, మూడు యాక్సల్ (12 టైర్లు) 24 టన్నుల బరువును మోసుకెళ్లవచ్చు. కానీ రాష్ట్రంలో పరిమితికి మించి రెండు రెట్ల బరువును మోసుకెళ్తూ ట్రక్కులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. ట్రక్కుల వేగం, అవి మోసుకెళ్లే బరువుపై నియంత్రణ కొరవడడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనికితోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు ఈ నిబంధనల ఉల్లంఘనకు తోడవడంతో తరచూ భారీ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. కాసుల వేటలో అధికారులు.. ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నా చాలా మంది రవాణా శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పైపెచ్చు ట్రక్కుల యజమానుల నుంచి వసూళ్లకు తెగబడుతూ వాటిని యథేచ్ఛగా వదిలేస్తున్నారు. సోమవారం ప్రమాదానికి కారణమైన ట్రక్కులో 50 టన్నులకుపైగా బరువుగల కంకర ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి నిబంధనలు ఉల్లంఘించే ట్రక్కుల యజమానులపై భారీ పెనాల్టీలు, వరుస ఉల్లంఘనలకు పాల్పడితే వారి పర్మిట్లు రద్దు చేసే అధికారం రవాణా అధికారులకు ఉంది.అలాగే ఓవర్‌లోడ్ వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. కొన్ని మినహా దాదాపు అన్ని ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నా కేసులు మాత్రం అక్కడక్కడా నమోదవుతుండటం చూస్తే రవాణాశాఖ అధికారుల కాసుల కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణాలతోనే.. ఒకే ట్రిప్పులో ఎక్కువ లోడ్ తరలించడం ద్వారా డీజిల్ ఖర్చును తగ్గించుకోవాలన్నది ట్రక్కు యజమానుల ఆలోచన. అలాగే ఏకకాలంలో ఎక్కువ లోడ్ తరలిస్తే తక్కువ సమయంలో భారీ మొత్తం సంపాదించే వీలుంటుంది. డ్రైవర్‌కు చెల్లించే మొత్తం కూడా తగ్గుతుంది. లారీల నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. ఈ నాలుగు కారణాలతో ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.శిక్షణ లేకుండానే స్టీరింగ్... భారీ ట్రక్కుల డ్రైవింగ్ లైసెన్సు పొందేందుకు తగిన శిక్షణ అవసరమన్నది రవాణా శాఖ నిబంధన. కానీ శిక్షణ లేకున్నా డబ్బు దండుకొని అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు మాత్రం లేవు. దీంతో బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే ట్రక్కు డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చాలంటే ఆ కేంద్రాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. అయితే జీతాల భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేనందున ఆ భారం తిరిగి తమపైనే పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.క్వారీల్లోనే కంట్రోల్ చేయాలి మైనింగ్ క్వారీల్లోనే ఓవర్ లోడ్‌ను నియంత్రిస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచీ ఓవర్ లోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం. కంకర, డస్ట్, ఇసుక, గృహ నిర్మాణ వ్యర్థాలను తరలించేటప్పుడు పైన టార్పాలిన్‌తో కప్పాలి. రవాణా అధికారులకు ఈ ఉల్లంఘనలు కనిపించకపోవడం శోచనీయం. - మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఓవర్‌లోడు వాహనాలు సీజ్
హైదరాబాద్: జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించిన అధికారులు ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను సీజ్ చేశారు. వరంగల్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై గురువారం ఉదయం ఆర్టీఏ, విజిలెన్స్, సేల్స్‌టాక్స్ అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓవర్‌లోడుతో వెళ్తున్న 32 వాహనాలను గుర్తించి వాటిని సీజ్ చేయడంతో పాటు సుమారు రూ. 4 లక్షల జరిమానా విధించారు. -
30 ఓవర్ లోడ్ వాహనాలు సీజ్
వరంగల్: అనుమతులు లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. ఓవర్‌లోడుతో పాటు అనుమతి పత్రాలు లేకుండా సరుకులు రవాణా చేస్తున్న వాహనాలను తనిఖీలు చేపట్టారు. వరంగల్ అర్బన్ జిల్లా ఖిల్లావరంగల్ మండల పరిధిలో శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆర్టీఏ, విజిలెన్స్ అధికారులు పరిమితికి మించి లోడును తీసుకెళ్తున్న 30 లారీలను సీజ్ చేసి ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.


