లంచమిస్తే ఓవర్‌లోడ్‌కూ రైట్‌రైట్‌! | Tippers and lorries transporting goods beyond capacity in Telangana | Sakshi
Sakshi News home page

లంచమిస్తే ఓవర్‌లోడ్‌కూ రైట్‌రైట్‌!

Nov 4 2025 6:01 AM | Updated on Nov 4 2025 6:01 AM

Tippers and lorries transporting goods beyond capacity in Telangana

రాష్ట్రంలో యథేచ్ఛగా టిప్పర్లు, లారీల్లో సామర్థ్యానికి మించి సరుకు రవాణా 

ఖర్చు ఆదా, అధిక సంపాదన కోసం తక్కువ ట్రిప్పుల్లో ఎక్కువ లోడ్‌ తరలిస్తున్న యజమానులు 

నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మామూళ్లు దండుకుంటూ వదిలేస్తున్న అధికారులు 

ఓవర్‌లోడ్, అతివేగంతో ప్రమాదాలు జరిగినప్పుడే తూతూమంత్రంగా తనిఖీలు  

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం ఆర్టీసీ బస్సును టిప్పర్‌ ఢీకొట్టిన ఘోర దుర్ఘటన రాష్ట్రంలో ఓవర్‌లోడ్‌తో భారీ వాహనాలు యథేచ్ఛగా తిరుగుతున్న ఉదంతాన్ని కళ్లకు కట్టింది. తెలంగాణవ్యాప్తంగా భారీ సరుకు రవాణా వాహన యజ­మా­నుల కాసుల కక్కుర్తి, రవాణా అధికారుల మామూళ్ల మత్తు ఏ స్థాయిలో ఉంటోందో చెప్పకనే చెప్పింది. 

యమదూతల్లా టిప్పర్లు.. 
హైదరాబాద్‌లో నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తుండటంతో ఇసుక, కంకర, ఇటుకలు, నిర్మాణ వ్యర్థాలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఈ అవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు ట్రాన్స్‌పోర్ట్‌ మాఫియా.. కొందరు రాజకీయ నేతల అండదండలతో నిబంధనలను తుంగలో తొక్కుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌ శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నల్లగొండ నుంచి నిర్మాణ సామగ్రితో టిప్పర్లు, లారీలు ఓవర్‌లోడ్, ఓవర్‌ స్పీడ్‌తో యమదూతల్లా ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

నిబంధనలు గాలికి.. 
రాష్ట్రంలో ఏ రకం ట్రక్కు లేదా లారీ ఎంత బరువు మోసుకెళ్లాలో నిబంధనల్లో పొందుపరిచారు. ట్రక్కు తయారీ కంపెనీలు ఆయా ట్రక్కుల బరువు మోసే సామర్థ్యాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ వివరాలను లెక్కలోకి తీసుకొని ట్రక్కుల సామర్థ్య పరిమితులను ఖరారు చేశారు. ఆ మేరకు సింగిల్‌ యాక్సల్‌ (ఒక టైరు) 3 టన్నులు, సింగిల్‌ యాక్సల్‌ (2 టైర్లు) 6 టన్నులు, సింగిల్‌ యాక్సల్‌ (4 టైర్లు) 10.2 టన్నులు.

రెండు యాక్సల్‌ (8 టైర్లు) 19 టన్నులు, మూడు యాక్సల్‌ (12 టైర్లు) 24 టన్నుల బరువును మోసుకెళ్లవచ్చు. కానీ రాష్ట్రంలో పరిమితికి మించి రెండు రెట్ల బరువును మోసుకెళ్తూ ట్రక్కులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయి. ట్రక్కుల వేగం, అవి మోసుకెళ్లే బరువుపై నియంత్రణ కొరవడడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దీనికితోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు ఈ నిబంధనల ఉల్లంఘనకు తోడవడంతో తరచూ భారీ ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం సంభవిస్తోంది. 

కాసుల వేటలో అధికారులు.. 
ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నా చాలా మంది రవాణా శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పైపెచ్చు ట్రక్కుల యజమానుల నుంచి వసూళ్లకు తెగబడుతూ వాటిని యథేచ్ఛగా వదిలేస్తున్నారు. సోమవారం ప్రమాదానికి కారణమైన ట్రక్కులో 50 టన్నులకుపైగా బరువుగల కంకర ఉన్నట్లు తెలిసింది. వాస్తవానికి నిబంధనలు ఉల్లంఘించే ట్రక్కుల యజమానులపై భారీ పెనాల్టీలు, వరుస ఉల్లంఘనలకు పాల్పడితే వారి పర్మిట్లు రద్దు చేసే అధికారం రవాణా అధికారులకు ఉంది.

అలాగే ఓవర్‌లోడ్‌ వాహనాలు నడిపే డ్రైవర్ల లైసెన్సులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. కొన్ని మినహా దాదాపు అన్ని ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నా కేసులు మాత్రం అక్కడక్కడా నమోదవుతుండటం చూస్తే రవాణాశాఖ అధికారుల కాసుల కక్కుర్తి ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే రవాణా అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఆ తర్వాత చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  

ఈ కారణాలతోనే.. 
ఒకే ట్రిప్పులో ఎక్కువ లోడ్‌ తరలించడం ద్వారా డీజిల్‌ ఖర్చును తగ్గించుకోవాలన్నది ట్రక్కు యజమానుల ఆలోచన. అలాగే ఏకకాలంలో ఎక్కువ లోడ్‌ తరలిస్తే తక్కువ సమయంలో భారీ మొత్తం సంపాదించే వీలుంటుంది. డ్రైవర్‌కు చెల్లించే మొత్తం కూడా తగ్గుతుంది. లారీల నిర్వహణ వ్యయం కూడా తక్కువగా ఉంటుంది. ఈ నాలుగు కారణాలతో ట్రక్కులు, లారీల యజమానులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

శిక్షణ లేకుండానే స్టీరింగ్‌... 
భారీ ట్రక్కుల డ్రైవింగ్‌ లైసెన్సు పొందేందుకు తగిన శిక్షణ అవసరమన్నది రవాణా శాఖ నిబంధన. కానీ శిక్షణ లేకున్నా డబ్బు దండుకొని అధికారులు లైసెన్సులు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు ఉన్నప్పటికీ ట్రక్కు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు మాత్రం లేవు. దీంతో బస్సు డ్రైవర్లకు శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే ట్రక్కు డ్రైవర్లకు కూడా శిక్షణ ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ అది కార్యరూపం దాల్చాలంటే ఆ కేంద్రాల్లో సిబ్బంది సంఖ్యను పెంచాలి. అయితే జీతాల భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేనందున ఆ భారం తిరిగి తమపైనే పడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలపడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

క్వారీల్లోనే కంట్రోల్‌ చేయాలి  
మైనింగ్‌ క్వారీల్లోనే ఓవర్‌ లోడ్‌ను నియంత్రిస్తే చాలా వరకు ప్రమాదాలు తగ్గుతాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేం మొదటి నుంచీ ఓవర్‌ లోడ్‌ను వ్యతిరేకిస్తున్నాం. కంకర, డస్ట్, ఇసుక, గృహ నిర్మాణ వ్యర్థాలను తరలించేటప్పుడు పైన టార్పాలిన్‌తో కప్పాలి. రవాణా అధికారులకు ఈ ఉల్లంఘనలు కనిపించకపోవడం శోచనీయం. - మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement