ఆ లారీల పర్మిట్లు రద్దు చేసే దిశగా ప్రభుత్వ ఆలోచన
గనుల శాఖ, రవాణాశాఖల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యం
చేవెళ్ల ప్రమాద నేపథ్యంలో కసరత్తు
సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడ్‌తో దూసుకెళ్లే లారీల పర్మిట్లు రద్దు చేసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర లోడ్ ఉందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అధిక బరువు, అధిక వేగం వెరసి టిప్పర్‌ను అదుపు తప్పేలా చేసిందని పేర్కొంటున్న నేపథ్యంలో, ఓవర్‌లోడ్ ట్రక్కులను నియంత్రించాల్సిందేనన్న ఒత్తిడి ప్రభుత్వంపై పెరిగింది. అధికారుల అవినీతితోనే ఈ ట్రక్కులు యథేచ్ఛగా తిరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. దీంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గనులు, రవాణాశాఖలు సంయుక్తంగా నడుం బిగిస్తే తప్ప ఓవర్ లోడ్ నియంత్రణ సాధ్యం కాదు.
ఈ రెండు శాఖలు ఉమ్మడిగా చర్యలు తీసుకునేలా ఓ కసరత్తు జరుగుతోంది. ట్రక్కుల్లో సరుకు నింపేప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒకవేళ ఓవర్‌లోడ్‌తో ట్రక్కులు రోడ్డు మీదకు వస్తే వాటి నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు చేపట్టాలన్నది ఆలోచన. ఓవర్‌లోడ్‌తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించటం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయటం, మళ్లీ అదే పునరావృతమైతే ట్రక్కు పర్మిట్లను రద్దు చేసి, ఇసుక, సిమెంటు, కంకర లాంటి లోడ్‌లను తరలించేందుకు వాటికి వీలు లేకుండా చేయాలన్నది ఈ కసరత్తు ఉద్దేశం.
గతంలోనూ చాలా నిబంధనలు, పరిమితులు ఉన్నా, వాటిని కాగితాలకే పరిమితం చేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాజా అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ముందుగా యంత్రాంగంలో భయం రావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్ లోడ్ లారీలు రోడ్డెక్కితే అందుకు సంబంధిత సిబ్బంది, అధికారులను కూడా బాధ్యులను చేసి వారిపై కూడా చర్యలు చేపట్టాలన్నది ప్రజల సూచన. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
రీచ్‌ల నుంచే అక్రమాలు
ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రీచ్‌ల నుంచే అక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ట్రక్కుల్లో తరలించే ఇసుక వివరాలు వెల్లడిస్తూ జారీ అయ్యే వే బిల్లుల్లో చూపే ఇసుక పరిమాణానికి, వాస్తవంగా ట్రక్కుల్లో నింపే ఇసుక పరిమాణానికి తేడా ఉంటోంది. రీచ్ నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించే ప్రభుత్వ సిబ్బంది, ఇసుక తరలించే ప్రైవేటు వ్యక్తులు కూడబలుక్కొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిమితికి మించిన లోడ్‌తో ట్రక్కు ప్రయాణిస్తుంటే దాన్ని గుర్తించాల్సిన రవాణాశాఖ కూడా చివరకు ఇందులో భాగమవుతోంది.
రోడ్లమీద ట్రక్కులను ఆపి వాటి లోడ్ ఎక్కువ ఉందా, సరిగ్గానే ఉందా అని తేల్చేందుకు రవాణా శాఖకు సాధనాలు అందుబాటులో ఉండటం లేదు. బరువు తూచే వే బ్రిడ్జిలు పరిమితంగా, దూరంగా ఉండటంతో గుర్తించలేకపోతున్నారు. అధిక బరువు ఉందని గుర్తించిన ట్రక్కులను సీజ్ చేసిన తర్వాత వాటిని ఉంచేందుకు కావాల్సిన ఖాళీ స్థలం కూడా అందుబాటులో ఉండటం లేదు. పోలీస్‌స్టేషన్లు, బస్టాండ్లు లాంటి చోట ఇప్పటికే వాహనాలు నిండిపోతుండటంతో కొత్తవాటిని పార్క్ చేసేందుకు ఆయా విభాగాల అధికారులు అంగీకరించటం లేదు. ఇది కూడా వాటిని నియంత్రించటానికి అడ్డంకిగా మారింది.
సిమెంటు కంపెనీల్లో మరో తీరు
ఇసుక రీచ్‌ల్లో అక్రమంగా ఎక్కువ ఇసుక లోడ్ చేసి, పరిమితికి లోబడే బరువు ఉన్నట్టు వే బిల్లులు జారీ చేస్తున్నారు. కానీ, సిమెంటు కంపెనీల్లో తీరు మరోరకంగా ఉంది. లోడ్ కోసం వచ్చే లారీ సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ఓవర్‌లోడ్ చేసి, వే బిల్లుల్లోనూ ఆ ఓవర్‌లోడ్‌నే చూపుతున్నారని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కంకర క్రషర్ల వద్ద ఎలాంటి పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా లోడ్ చేసి రోడ్ల మీదకు పంపుతారు. చేవెళ్ల ప్రమాదంలో బీభత్సం సృష్టించిన ట్రక్కు అలా ఓవర్‌లోడ్‌తో వచ్చిందే. త్వరలో గనుల శాఖ, రవాణాశాఖలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు.


