breaking news
Permits canceled
-
ఓవర్ లోడ్‌తో తిరిగితే అంతే!
సాక్షి, హైదరాబాద్: పరిమితికి మించిన లోడ్‌తో దూసుకెళ్లే లారీల పర్మిట్లు రద్దు చేసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్‌లో పరిమితికి మించిన కంకర లోడ్ ఉందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. అధిక బరువు, అధిక వేగం వెరసి టిప్పర్‌ను అదుపు తప్పేలా చేసిందని పేర్కొంటున్న నేపథ్యంలో, ఓవర్‌లోడ్ ట్రక్కులను నియంత్రించాల్సిందేనన్న ఒత్తిడి ప్రభుత్వంపై పెరిగింది. అధికారుల అవినీతితోనే ఈ ట్రక్కులు యథేచ్ఛగా తిరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యమే. దీంతో దిద్దుబాటు చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గనులు, రవాణాశాఖలు సంయుక్తంగా నడుం బిగిస్తే తప్ప ఓవర్ లోడ్ నియంత్రణ సాధ్యం కాదు.ఈ రెండు శాఖలు ఉమ్మడిగా చర్యలు తీసుకునేలా ఓ కసరత్తు జరుగుతోంది. ట్రక్కుల్లో సరుకు నింపేప్పుడే లోడ్ పరిమితులను పాటించేలా, ఒకవేళ ఓవర్‌లోడ్‌తో ట్రక్కులు రోడ్డు మీదకు వస్తే వాటి నిర్వాహకులకు భయం పుట్టేలా చర్యలు చేపట్టాలన్నది ఆలోచన. ఓవర్‌లోడ్‌తో దొరికే లారీలను తొలుత సీజ్ చేసి యజమానులకు భారీ ఫైన్లు విధించటం, డ్రైవర్ లైసెన్సు రద్దు చేయటం, మళ్లీ అదే పునరావృతమైతే ట్రక్కు పర్మిట్లను రద్దు చేసి, ఇసుక, సిమెంటు, కంకర లాంటి లోడ్లను తరలించేందుకు వాటికి వీలు లేకుండా చేయాలన్నది ఈ కసరత్తు ఉద్దేశం.గతంలోనూ చాలా నిబంధనలు, పరిమితులు ఉన్నా, వాటిని కాగితాలకే పరిమితం చేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. తాజా అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ముందుగా యంత్రాంగంలో భయం రావాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవర్ లోడ్ లారీలు రోడ్డెక్కితే అందుకు సంబంధిత సిబ్బంది, అధికారులను కూడా బాధ్యులను చేసి వారిపై కూడా చర్యలు చేపట్టాలన్నది ప్రజల సూచన. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. రీచ్‌ల నుంచే అక్రమాలు ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న ఇసుక రీచ్‌ల నుంచే అక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ట్రక్కుల్లో తరలించే ఇసుక వివరాలు వెల్లడిస్తూ జారీ అయ్యే వే బిల్లుల్లో చూపే ఇసుక పరిమాణానికి, వాస్తవంగా ట్రక్కుల్లో నింపే ఇసుక పరిమాణానికి తేడా ఉంటోంది. రీచ్ నిర్వాహకులు, వాటిని పర్యవేక్షించే ప్రభుత్వ సిబ్బంది, ఇసుక తరలించే ప్రైవేటు వ్యక్తులు కూడబలుక్కొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు. పరిమితికి మించిన లోడ్‌తో ట్రక్కు ప్రయాణిస్తుంటే దాన్ని గుర్తించాల్సిన రవాణాశాఖ కూడా చివరకు ఇందులో భాగమవుతోంది.రోడ్లమీద ట్రక్కులను ఆపి వాటి లోడ్ ఎక్కువ ఉందా, సరిగ్గానే ఉందా అని తేల్చేందుకు రవాణా శాఖకు సాధనాలు అందుబాటులో ఉండటం లేదు. బరువు తూచే వే బ్రిడ్జిలు పరిమితంగా, దూరంగా ఉండటంతో గుర్తించలేకపోతున్నారు. అధిక బరువు ఉందని గుర్తించిన ట్రక్కులను సీజ్ చేసిన తర్వాత వాటిని ఉంచేందుకు కావాల్సిన ఖాళీ స్థలం కూడా అందుబాటులో ఉండటం లేదు. పోలీస్స్టేషన్లు, బస్టాండ్లు లాంటి చోట ఇప్పటికే వాహనాలు నిండిపోతుండటంతో కొత్తవాటిని పార్క్ చేసేందుకు ఆయా విభాగాల అధికారులు అంగీకరించటం లేదు. ఇది కూడా వాటిని నియంత్రించటానికి అడ్డంకిగా మారింది. సిమెంటు కంపెనీల్లో మరో తీరుఇసుక రీచ్‌ల్లో అక్రమంగా ఎక్కువ ఇసుక లోడ్ చేసి, పరిమితికి లోబడే బరువు ఉన్నట్టు వే బిల్లులు జారీ చేస్తున్నారు. కానీ, సిమెంటు కంపెనీల్లో తీరు మరోరకంగా ఉంది. లోడ్ కోసం వచ్చే లారీ సామర్థ్యాన్ని పట్టించుకోకుండా ఓవర్‌లోడ్ చేసి, వే బిల్లుల్లోనూ ఆ ఓవర్లోడ్నే చూపుతున్నారని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇక కంకర క్రషర్ల వద్ద ఎలాంటి పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా లోడ్ చేసి రోడ్ల మీదకు పంపుతారు. చేవెళ్ల ప్రమాదంలో బీభత్సం సృష్టించిన ట్రక్కు అలా ఓవర్‌లోడ్‌తో వచ్చిందే. త్వరలో గనుల శాఖ, రవాణాశాఖలతో సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసి ఓ కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. -
‘హెచ్–4’ అనుమతులు రద్దు?
వాషింగ్టన్: హెచ్–4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోవడానికి ఉన్న అనుమతులను రద్దు చేయడానికి ఉద్దేశించిన విధాన ప్రక్రియ తుది దశలో ఉందని అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ఓ ఫెడరల్ కోర్టుకు గురువారం తెలిపింది. హెచ్–4 వీసాదారులకు వర్క్ పర్మిట్లను రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతం హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) వద్ద ఉందనీ, డీహెచ్ఎస్ ఆమోదం పొందాక దీనిని మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ ఆఫీస్‌కు పంపుతామని ప్రభుత్వం కోర్టుకు తెలియ జేసింది. అనంతరం కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తారంది. ఇంతకుముందు చెప్పినట్లుగానే హెచ్–4 వీసాలకు వర్క్ పర్మిట్లను రద్దు చేసేందుకే తాము మొగ్గుచూపుతున్నట్లు డీహెచ్ఎస్ కోర్టుకు వెల్లడించింది.హెచ్–1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాములకు మంజూరు చేసేవే ఈ హెచ్–4 వీసాలు. హెచ్–4 వీసాదారులూ ఉద్యోగాలు చేసుకునేందుకు నాటి అధ్యక్షుడు ఒబామా అనుమతులిచ్చారు. ప్రస్తుతం కనీసం 70 వేల మంది హెచ్–4 వీసాదారులు ఉద్యోగాల్లో ఉన్నారు. వారిలోనూ 93 శాతం మంది.. అంటే దాదాపు 65 వేల మంది భారతీయులే. హెచ్–4 వీసాలకు వర్క్ పర్మిట్లు రద్దు చేస్తే వీరందరూ ఉద్యోగాలు చేసుకునే వీలుండదు. ఈ ప్రతిపాదనపై పలువురు అమెరికా చట్టసభల సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. -
అమెరికాపై రష్యా దౌత్య ప్రతీకారం
మాస్కో: అమెరికా చర్యకు రష్యా ప్రతిచర్యలకు ఉపక్రమించింది. మాజీ గూఢచారి సెర్గీ స్క్రిపాల్పై బ్రిటన్‌లో జరిగిన విష ప్రయోగానికి రష్యానే కారణమంటూ అమెరికా గత వారం సియాటెల్‌లోని రష్యా రాయబార కార్యాలయాన్ని మూయించి, అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించింది. ఇందుకు బదులుగా తీసుకుంటున్న చర్యల్లో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి అనుమతులు రద్దు చేస్తూ అందులోని 60 మంది దౌత్యాధికారుల్ని బహిష్కరించనున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. -
పేరుకు ఉచితం.. దోపిడీ యథాతథం
అధికారపార్టీ అనుచరుల గుప్పెట్లో ఇసుక రీచ్‌లు నిత్యం వందలాది ట్రాక్టర్ల ద్వారా తరలింపు శాఖల మధ్య సమన్వలోపం నర్సీపట్నం: ఉచిత ఇసుక విధానం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడంతో ఇక అందరికీ ఇసుక లభిస్తుందని ప్రజలు ఆశించారు. కాని అధికారపార్టీ అనుచరులు ఇసుక రీచ్‌లను వారి గుప్పెట్లో పెట్టుకుని యథేచ్ఛగా ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. అనుమతులు రద్దు చేసిన రీచ్‌ల్లో కూడా అధికార బలంతో తవ్వకాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక రీచ్‌ల వలన సామాన్యులకు ఎలాంటి లాభం చేకూరడం లేదు. ఎప్పట్లాగే ట్రాక్టర్ ఇసుక రూ. 2 వేలు పెట్టి ఇసుక కొనుగోలు చేసుకుంటున్నారు. అధికార పార్టీ నేతలకు భయపడి అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఓ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా ఇసుక తవ్వేస్తుండడంతో ఆ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖలు ఎవరికి వారే యమునాతీరే చందంగా వ్యవహరిస్తుండడంతో ట్రాక్టర్లలో ఇసుక తరలించే వారికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. పాలసీ మారినా..: కొద్దికాలం క్రితం వరకు ఇసుక కష్టాలు అందరినీ వెంటాడాయి. వేలకు వేలు వచ్చించి రోజల తరబడి వేచి చూస్తేగాని లభించడం గగనంగా మారింది. డ్వాక్రా సంఘాల పేరిట కొందరు ఇసుక అమ్మకాలతో భారీగా వెనకేసుకున్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రూపాయి కూడా చెల్లించకుండా తీసుకోవచ్చని అదేశాలిచ్చింది. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన రీచ్‌ల్లోనే తవ్వకాలు చేయాలని పేర్కొంది. దీంతో ఇసుక లభించడం సులభతరమైనా సామాన్యులు మాత్రం సొమ్ము వెచ్చించక తప్పడం లేదు. ట్రాక్టర్ల యజమానులు సమీపంలో రీచ్‌ల నుంచి పెద్ద ఎత్తున ఇసుక త వ్వి తరలిస్తున్నారు. మూసేసిన రీచ్‌లోనూ తవ్వకాలు : రెవెన్యూ విడిజన్ పరిధిలోని మాకవరపాలెం మండలం నారాయణరాజుపేట ఇసుక రీచ్, కోటవురట్ల మండలంలో పందూరు, గొట్టివేడ, చౌడువాడ, కైలాసపట్నం, గొలుగొండ మండలం తాండవ జలాశయం పరిధిలోని ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అనుమతులు ఇచ్చే సమయానికి నారాయణరాజుపేట ఇసుక రీచ్ ఖాళీ అయింది. పరిసర ప్రాంతాల్లోని తాగునీటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని నారాయణరాజుపేట రీచ్ అనుమతులను రద్దు చేశారు. అయినప్పటికీ అధికార పలుకుబడితో కొందరు నేటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. మిగిలిన కీలకమైన రీచ్‌ల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుగుతున్నాయి. రీచ్‌లో నిత్యం వందలాది ట్రాక్టర్లు వరుస కడుతున్నాయి. ఆయా రీచ్‌ల్లో ఎవరూ ప్రశ్నించేవారు లేకపోవడంతో ఓ క్రమపద్ధతి అంటూ లేకుండా ఎక్కడికక్కడ తవ్వకాలు జరిపేస్తున్నారు. రీచ్‌లోకి ట్రాక్టర్ ప్రవేశించగానే ఎక్కడ ఇసుక ఉంటే అక్కడే తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఒక మీటరు మించి ఎక్కువ లోతులో తవ్వకాలు జరపకూడదు. అలా చేస్తే ఆ ప్రాంతంలో భూగర్భ జలాలపై ప్రభావం చూపుతుంది. అయినా సరే ఏవీ పట్టించుకోవడం లేదు. రీచ్‌లకు ఏర్పాటు చేసిన హద్దులను సైతం పట్టించుకోకుండా తవ్వకాలు జరుపుతున్నారు. ఉచిత ఇసుకపై అటు గనులశాఖ, ఇటు రెవెన్యూ, పోలీసు శాఖలు ఏవీ పెద్దగా పట్టించుకోవటం లేదు. రీచ్‌ల్లో తవ్వకాలను పర్యవేక్షించటం లేదు. రహదారులపై వెళ్లే వాహనాలను మాత్రమే ఆపి విచారించి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. అనుమతి లేకుండా తవ్వితే చర్యలు.. ఆర్డీవో ఈ విషయమై ఆర్డీవో కె.సూర్యారావును వివరణ కోరగా అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే తప్పని సరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఆయా మండలాల తహసీల్దార్లకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అనుమతులు లేని రీచ్‌ల్లో తవ్వకాలు జరిపితే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


