NPT
-
మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే!
అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది. ఎన్పీటీకి బైబై చెప్పే పక్షంలో ఇరాన్ అణు విధానంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయి. అణుబాంబు ఇరాన్ వద్ద గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా ఎన్పీటీపై ఇరాన్ 1968 జులైలో సంతకం చేసింది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనంటూ ఓ అణ్వస్త్రరహిత దేశంగా అది 1970 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని ధృవీకరించింది కూడా. 1967 జనవరి 1 నాటికి అణ్వస్త్రాలను పరీక్షించిన ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలను ఈ ఒప్పందం అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. ఆ ఐదు దేశాలు క్రమంగా నిరాయుధం కావాలని, ఇతర అణ్వస్త్రరహిత దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని లేదా వాటిని సేకరించకూడదని ఎన్పీటీ ఉద్బోధిస్తోంది. ఈ ఒడంబడిక వివక్షాపూరితమని విమర్శకులు వాదిస్తారు. ఎన్పీటీలో 191 దేశాలు పార్టీలుగా ఉన్నాయి. ఆయుధ నియంత్రణలో ఈ ఒప్పందానికి విస్తృత ప్రాముఖ్యం ఉంది. విశేషమేంటంటే... అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఎన్పీటీలో భాగస్వాములు కాదు. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ ఎన్నడూ ‘ఎన్పీటీ కూటమి’లో సభ్యదేశాలుగా చేరనేలేదు. ఉత్తర కొరియా మాత్రం 1985లో సభ్యత్వం స్వీకరించినా 2003లో నిష్క్రమించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడానికి, అణ్వాయుధాల విస్తరణను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒప్పందాల్లో ఎన్పీటీ ఒకటి. దీని ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అణు పారదర్శకత, కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఎన్పీటీకి ఇరాన్ చెల్లుచీటీ ఇచ్చే పక్షంలో ఆ పరిణామం ప్రపంచ అణు రాజకీయాల్లో ఓ ప్రధాన మలుపు అవుతుంది. ఎన్పీటీ నుంచి బయటికొచ్చేస్తే అణు కార్యక్రమం పరంగా పలు కీలక బాధ్యతల నుంచి ఇరాన్ విముక్తమవుతుంది. అప్పుడిక అణ్వాయుధం తయారుచేయబోమని అది ఎవరికీ ప్రమాణాలు చేయాల్సిన పని లేదు. అంతేకాదు... ఇరాన్ అణుకేంద్రాలపై ఐక్యరాజ్యసమితి కాపలాదారైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణ, నిపుణుల తనిఖీలు కూడా ఉండబోవు! అంటే... ఇరాన్ అణు కార్యకలాపాలు ఇకపై అంతగా ప్రపంచ దేశాల కంటబడవు. అసాధారణ పరిణామాలు తమ మహోన్నత జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడవేశాయని ఏ దేశమైనా భావించినప్పుడు మూడు నెలలు ముందుగా నోటీసు ఇచ్చి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి ఎన్పీటీలోని ‘ఉపసంహరణ క్లాజు’ వీలు కల్పిస్తోంది. ఒప్పందంలో 11 ఆర్టికల్స్ ఉండగా వాటిలో ఒకటి సభ్యత్వ ఉపసంహరణ గురించి వివరిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆరంభమైన గత నెల 28 నుంచి ఇరాన్ పార్లమెంటు ఇప్పటివరకు సమావేశమవలేదు. ఎన్పీటీ ‘ఉపసంహరణ బిల్లు’ను పార్లమెంటుకు సమర్పించారని ఇరాన్ ఎంపీ మాలిక్ షరియతి తాజాగా వెల్లడించారు. అయితే ఆ బిల్లుపై ఎప్పుడు లాంఛనంగా చర్చిస్తారు? అది ఎప్పుడు ఆమోదం పొందుతుంది? వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా నిరోధించాలంటే అణ్వాయుధాలు కలిగివుండటం అవసరమా? అనే అంశంపై ఇరాన్ అంతర్గతంగా చర్చించింది. తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సైనిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నందున ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఇరాన్ నిరుడే భావించింది. ఒకవైపు పౌర అణు కార్యక్రమానికి కట్టుబడుతూనే సాధ్యమైనంత త్వరగా ఎన్పీటీ నుంచి ఇరాన్ తప్పుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) అనుబంధ తస్నిమ్ వార్తాసంస్థ గురువారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్పీటీకి ఇరాన్ టాటా చెబితే అందరికీ అర్థమయ్యేదొకటే... ఆ దేశానికి అణుబాంబే ముఖ్యమని! అణ్వస్త్రాన్ని తయారుచేయడమే దాని లక్ష్యమని!!- జమ్ముల శ్రీకాంత్ -
భారత్‌కు స్వభ్యత్వం.. అమెరికాపై చైనా ఫైర్!
అంతర్జాతీయ అణుసరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో అమెరికాపై చైనా ఘాటుగా విరుచుకుపడింది. ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది దిగిపోయే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు ఇచ్చే వీడ్కోలు కానుక కాదని నోరుపారేసుకుంది. అణు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేసే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డుతోంది చైనాయేనని అమెరికా విదేశాంగశాఖ అసిస్టెంట్ సెక్రటరీ నిషా దేశాయ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈవిధంగా స్పందించింది. ఎన్ఎస్జీలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చే విషయంలో ఇప్పట్లో తన వైఖరి మార్చుకునే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చింది. 'ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, ఎన్పీటీ రహిత దేశాల సభ్యత్వం విషయంలో మా వైఖరి ఇదివరకే స్పష్టం చేశాం. దానిని నేను పునరుద్ఘాటించబోను. కానీ, ఎన్ఎస్జీలో సభ్యత్వం అనేది ఒక దేశం మరొక దేశానికి ఇచ్చే వీడ్కోలు కానుక కాదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. 48 దేశాల ఎన్ఎస్జీలో సభ్యత్వం విషయంలో ఎన్పీటీ (అణునిరాయుధీకర ఒప్పందం)ని బూచిగా చూపెట్టి భారత్‌కు చైనా మోకాలడ్డుతోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్ఎస్జీలో తీసుకోవాలంటే.. అందుకు గ్రూప్ విధివిధానాలను సవరించాలని, అందరి ఏకాభిప్రాయం తీసుకోవాలని చైనా మొండిగా వాదిస్తోంది. తన అనుయాయి పాకిస్థాన్ కోసమే చైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. -
భారత అణు ఒప్పందానికి చైనా మద్దతు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ టోక్యో పర్యటన సందర్భంగా కుదిరిన భారత్ - జపాన్ అణు ఒప్పందానికి చైనా మద్దతు తెలిపింది. అంతర్జాతీయ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి కట్టుబడిన దేశాలకు శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని ఉపయోగించుకోడానికి హక్కు ఉంటుందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. భారత్-జపాన్ చేసిన సంయుక్త ప్రకటనలో దక్షిణ చైనా సముద్రం గురించిన ప్రస్తావన ఉండటంపైనా చైనా స్పందించింది. ఈ విషయంలో తాము తమ పాత విధానానికే కట్టుబడి ఉంటున్నట్లు తెలిపింది. పౌర అణు ఒప్పందం మీద సంతకాలు కుదరడానికి ముందు చైనా మీడియాలో మాత్రం దీనిపై విపరీతంగా విమర్శలు వచ్చాయి. కానీ మీడియా అభ్యంతరాలను గెంగ్ ఏమాత్రం పట్టించుకున్నట్లు కనిపించలేదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబుల బారిన పడిన ఏకైక దేశమైన జపాన్.. ఇన్నాళ్ల నుంచి ఎప్పుడూ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం గురించిన విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. జపాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకున్నా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) మీద సంతకాలు చేయని మొట్టమొదటి దేశం భారతదేశమే. ఎన్పీటీ మీద సంతకం పెట్టడానికి నిరాకరించడం వల్లే అణు సరఫరాదారుల బృందంలో భారతదేశం చేరడాన్ని చైనా గట్టిగా వ్యతిరేకిస్తోంది. కానీ, అలాంటి చైనా ఇప్పుడు జపాన్ -భారత్ ఒప్పందానికి మద్దతు పలకడం ఆశ్చర్యంగా ఉంది. -
ఇదే ఏడాదిలో ఎన్ఎస్జీ మరో భేటీ!
న్యూఢిల్లీ: ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)పై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీ(అణు సరఫరాదారుల కూటమి)లో సభ్యత్వంపై ఈ ఏడాదిలోనే మరోమారు భేటీ జరిగే అవకాశం ఉంది. గత గురు, శుక్రవారాల్లో సియోల్‌లో జరిగిన ఎన్ఎస్జీ ప్లీనరీ భారత్ సభ్యత్వంపై చైనా వ్యతిరేకతవల్ల నిర్ణయం లేకుండానే ముగియడం తెలిసిందే. దీంతో భారత్ వాదనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని, కూటమి మళ్లీ భేటీ అయ్యే అవకాశం ఉందని చైనాకు ఎన్ఎస్జీ చెప్పింది. భారత్ సభ్యత్వంపై అనధికార చర్చలు జరిపేందుకు అర్జెంటీనా రాయబారి రఫెల్ గ్రోస్సి నేతృత్వంలో ఓ ప్యానెల్‌ను ఎన్ఎస్జీ ఏర్పాటు చేసింది. సభ్యత్వంతో నష్టమే: యశ్వంత్ ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వంపై మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ నేత యశ్వంత్ సిన్హా విమర్శించారు. సభ్యత్వంతో భారత్‌కు నష్టమన్నారు. -
భారత్‌కు ప్రధాన అడ్డంకిగా మారిన చైనా!
సియోల్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో భారత్‌కు చైనా ప్రధాన అడ్డంకిగా మారింది. 48 దేశాల అణుసరఫరాదారుల బృందంలో ఒకటి రెండు దేశాలు మినహా మిగతా దేశాలన్ని భారత్‌కు అనుకూలంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిట్లు సమాచారం. అయితే చైనా మాత్రం నాన్-ప్రొలిఫరేషన్ ట్రిటీ(ఎన్పీటీ)పై సంతకాలు చేసిన దేశాలకు మాత్రమే ఎన్ఎస్జీలో సభ్యత్వం కలిపించాలనే వాదనను వినిపిస్తూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ఇకపోతే ఎన్పీటీపై సంతకం చేయని మరో దేశం పాకిస్తాన్‌కు ఎన్ఎస్జీలో సభ్యత్వానికి చైనా సపోర్ట్ చేస్తుండటం విశేషం. ఎన్పీటీపై సంతకం చేయని పాక్‌కు కూడా ఎన్ఎస్జీలో సభ్యంత్వం కల్పించాలన్న చైనా వాదనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో భారత సభ్యత్వానికి అనుకూలం అని తెలిపిన స్విట్జర్లాండ్ కూడా శుక్రవారం..ఎన్పీటీపై సంతకం చేసిన దేశాలకే సభ్యత్వం కల్పించాలనే వాదనను వినిపిస్తుండటం కొంత ప్రతికూల అంశం.


