మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే! | parliament is preparing bill to leave nuclear non proliferation treaty | Sakshi
Sakshi News home page

మా ఆశ, శ్వాస... అణ్వస్త్రమే!

Mar 28 2026 9:25 PM | Updated on Mar 28 2026 9:30 PM

parliament is preparing bill to leave nuclear non proliferation treaty
  • అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందానికి టాటా?
  • ఇరాన్ పార్లమెంటులో బిల్లు

అమెరికా-ఇజ్రాయెల్ కలసికట్టుగా తనపై యుద్ధం చేస్తున్న నేపథ్యంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ) నుంచి వైదొలగాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు వీలు కల్పించే ఓ ‘ఫాస్ట్ ట్రాక్’ బిల్లును ఇరాన్ పార్లమెంటు చురుగ్గా పరిశీలిస్తోంది. ఎన్పీటీకి బైబై చెప్పే పక్షంలో ఇరాన్ అణు విధానంలో గణనీయ మార్పులు చోటుచేసుకుంటాయి. అణుబాంబు ఇరాన్ వద్ద గతంలోనూ లేదు, ఇప్పుడూ లేదు. అయినా ఎన్పీటీపై ఇరాన్ 1968 జులైలో సంతకం చేసింది. తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనంటూ ఓ అణ్వస్త్రరహిత దేశంగా అది 1970 ఫిబ్రవరిలో ఆ ఒప్పందాన్ని ధృవీకరించింది కూడా. 

1967 జనవరి 1 నాటికి అణ్వస్త్రాలను పరీక్షించిన ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలను ఈ ఒప్పందం అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. ఆ ఐదు దేశాలు క్రమంగా నిరాయుధం కావాలని, ఇతర అణ్వస్త్రరహిత దేశాలు అణ్వాయుధాలను అభివృద్ధి చేయకూడదని లేదా వాటిని సేకరించకూడదని ఎన్పీటీ ఉద్బోధిస్తోంది. ఈ ఒడంబడిక వివక్షాపూరితమని విమర్శకులు వాదిస్తారు. ఎన్పీటీలో 191 దేశాలు పార్టీలుగా ఉన్నాయి. ఆయుధ నియంత్రణలో ఈ ఒప్పందానికి విస్తృత ప్రాముఖ్యం ఉంది. విశేషమేంటంటే... అణ్వాయుధాలు కలిగిన భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియా ఎన్పీటీలో భాగస్వాములు కాదు. భారత్, పాకిస్థాన్, ఇజ్రాయెల్, దక్షిణ సూడాన్ ఎన్నడూ ‘ఎన్పీటీ కూటమి’లో సభ్యదేశాలుగా చేరనేలేదు. ఉత్తర కొరియా మాత్రం 1985లో సభ్యత్వం స్వీకరించినా 2003లో నిష్క్రమించింది. 

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాల కోసం ప్రోత్సహించడానికి, అణ్వాయుధాల విస్తరణను అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా అమల్లో ఉన్న అతి ముఖ్యమైన ఒప్పందాల్లో ఎన్పీటీ ఒకటి. దీని ప్రకారం ఇరాన్ ప్రస్తుతం అణు పారదర్శకత, కఠిన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఎన్పీటీకి ఇరాన్ చెల్లుచీటీ ఇచ్చే పక్షంలో ఆ పరిణామం ప్రపంచ అణు రాజకీయాల్లో ఓ ప్రధాన మలుపు అవుతుంది. ఎన్పీటీ నుంచి బయటికొచ్చేస్తే అణు కార్యక్రమం పరంగా పలు కీలక బాధ్యతల నుంచి ఇరాన్ విముక్తమవుతుంది. అప్పుడిక అణ్వాయుధం తయారుచేయబోమని అది ఎవరికీ ప్రమాణాలు చేయాల్సిన పని లేదు. అంతేకాదు... ఇరాన్ అణుకేంద్రాలపై ఐక్యరాజ్యసమితి కాపలాదారైన అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) పర్యవేక్షణ, నిపుణుల తనిఖీలు కూడా ఉండబోవు! అంటే... ఇరాన్ అణు కార్యకలాపాలు ఇకపై అంతగా ప్రపంచ దేశాల కంటబడవు. 

అసాధారణ పరిణామాలు తమ మహోన్నత జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో పడవేశాయని ఏ దేశమైనా భావించినప్పుడు మూడు నెలలు ముందుగా నోటీసు ఇచ్చి అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి తప్పుకోవడానికి ఎన్పీటీలోని ‘ఉపసంహరణ క్లాజు’ వీలు కల్పిస్తోంది. ఒప్పందంలో 11 ఆర్టికల్స్ ఉండగా వాటిలో ఒకటి సభ్యత్వ ఉపసంహరణ గురించి వివరిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులు ఆరంభమైన గత నెల 28 నుంచి ఇరాన్ పార్లమెంటు ఇప్పటివరకు సమావేశమవలేదు. ఎన్పీటీ ‘ఉపసంహరణ బిల్లు’ను పార్లమెంటుకు సమర్పించారని ఇరాన్ ఎంపీ మాలిక్ షరియతి తాజాగా వెల్లడించారు. 

అయితే ఆ బిల్లుపై ఎప్పుడు లాంఛనంగా చర్చిస్తారు? అది ఎప్పుడు ఆమోదం పొందుతుంది? వంటి అంశాలపై అనిశ్చితి నెలకొంది. భవిష్యత్తులో తమపై దాడులు జరగకుండా నిరోధించాలంటే అణ్వాయుధాలు కలిగివుండటం  అవసరమా? అనే అంశంపై ఇరాన్ అంతర్గతంగా చర్చించింది. తమ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ అనూహ్య దాడులు చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సైనిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నందున ఎన్పీటీ నుంచి వైదొలగాలని ఇరాన్ నిరుడే భావించింది. ఒకవైపు పౌర అణు కార్యక్రమానికి కట్టుబడుతూనే సాధ్యమైనంత త్వరగా ఎన్పీటీ నుంచి ఇరాన్ తప్పుకోవాలని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) అనుబంధ తస్నిమ్ వార్తాసంస్థ గురువారం ఓ కథనం ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్పీటీకి ఇరాన్ టాటా చెబితే అందరికీ అర్థమయ్యేదొకటే... ఆ దేశానికి అణుబాంబే ముఖ్యమని! అణ్వస్త్రాన్ని తయారుచేయడమే దాని లక్ష్యమని!!
- జమ్ముల శ్రీకాంత్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement