breaking news
Naxlas
-
ఏపీలో హైఅలర్ట్
సాక్షి,అమరాతి: ఏపీలో హైఅలర్ట్. అడవిని వదిలిన మావోయిస్టు అగ్రనేతలు రాష్ట్రంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 60-70 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసు వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే విజయవాడ పరిసర ప్రాంతాల్లో 28 మంది మావోయిస్టులు పట్టుబడగా.. ఏలూరులో మరో 12 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు, కాకినాడ, అల్లూరి జిల్లాలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టిసారించారు. మరోవైపు ఇవాళ ఉదయం విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.ఆపరేషన్ కగార్ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది.భారీగా ఆయుధాలు డంప్ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఈ పరిణామంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ఇదీ చదవండి: విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్ -
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. సీఎం ఎదుట లొంగిపోనున్న ‘ఆశన్న’
ముంబై: మావోయిస్టు పార్టీ భారీ ఎదురుదెబ్బ. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోనున్నారు. గురువారం (అక్టోబర్ 16) ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట సరెండర్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మావోయిస్టు ఉద్యమానికి ఓ కుదుపేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మావోయిస్టు అగ్రనేత ఆశన్న (వాసుదేవ్ రావు) నేతృత్వంలోని 70 మంది మావోయిస్టులు జగదల్పూర్ చేరుకుని ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎదుట లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారని జాతీయ మీడియా కథనాలు ధృవీకరిస్తున్నాయి. తమ ఆయుధాలను సైతం అప్పగించే ఈ బృందంలో డీకేఎస్డ్సీ సభ్యులు రాజమన్, రనితలతో సహా ఉత్తర బస్తర్, మాడ్ డివిజన్లకు చెందిన పలువురు. డివిజన్ కమిటీ సభ్యులు, కంపెనీ, ప్లాటూన్ కమాండర్లు, పార్టీ పార్టీ కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది.ఇదిలా ఉంటే బుధవారం ఉదయం మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అత్యంత మేధావి, ఆలోచన పరుడిగా పేరుపొందిన మల్లోజుల వేణుగోపాల్ రావు మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. మల్లోజులతో పాటు ఆయన నాయకత్వంలో 60 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయిన విషయం తెలిసిందే. -
ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల మృతి
న్యూఢిల్లీ: భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఈ సంఘటన బిహార్‌లోని గయ జిల్లా బస్కత్వా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఏకే అసాల్ట్ రైఫిల్, ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నామని సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు ఆయన వివరించారు.


