breaking news
Navy vessel
-
గల్లంతైంది ఎందరు...ఏమయ్యారు!?
నౌకలో ఉన్నది 28 మంది కంటే ఎక్కువేనా? జాడలేనివారి సంఖ్యను తప్పుగా చూపుతున్నారా? ‘టీఆర్వీ-72’ మునకఘటనపై గోప్యత పాటిస్తున్న నౌకాదళ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించిన కొందరు! సాక్షి, విశాఖపట్నం: ‘నవంబర్ 6, గురువారం..సాయంత్రం 6.30 నిమిషాలు.. తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్వీ)-72 నౌక ఇంజిన్లోకి నీరు రావడం మొదలైంది. క్రమంగా నౌక అంతటా వ్యాపించి ముంచేసింది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు సిబ్బంది గల్లంతయ్యారు.’-నాలుగు రోజుల క్రితం నౌకాదళ అధికారులు చెప్పిన మాటలు ఇవి. ఆ తర్వాత వారి నుంచి ఒక్క ప్రకటన కూడా విడుదల కాలేదు. గల్లంతైన వారు ఏమయ్యారో చెప్పడం లేదు. అత్యంత గోప్యత పాటిస్తున్నారు. ఏ చిన్న సమాచారం బయటకు పొక్కినా సహించమంటూ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు. కాగా, గల్లంతయిన వారు అసలు ఎందరు అనే అనుమానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఘటనపై ‘సాక్షి’కి లభించిన విశ్వసనీయ సమాచారం ఇలా ఉంది... ఆ రాత్రి ఏం జరిగింది? యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడోలను తిరిగి సేకరించడానికి టోర్పెడో రికవరీ వెహికల్(టీఆర్వీ)-72ను ఉపయోగిస్తుంటారు. ఆ రోజు కూడా అదే చేశారు. తొలుత ఒక టోర్బెడోనూ విజయవంతంగా ప్రయోగించి వెనక్కు తీసుకువచ్చారు. రెండో టోర్పెడోను ప్రయోగించిన తర్వాత దానికి సేకరించేందుకు టీఆర్వీ-72 ప్రయత్నించింది. ఆ సమయంలో నేవీ సిబ్బంది డాక్పైనే ఉన్నారు.అకస్మాత్తుగా డాక్పైకి సముద్రం నీరు వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే నౌక మునగడం ప్రారంభించింది. కేవలం 30 సెకన్లలో నౌక అంతటా నీరు చేరింది. ఈ హఠాత్ పరిణామానికి నిశ్చేష్టులైన సిబ్బంది ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు. అందుబాటులో ఉన్న చిన్న బోట్లలో ఎక్కి కొందరు తప్పించుకున్నారు. మరి కొందరు లైఫ్ జాకెట్ల వేసుకుని ధైర్యం చేసి సముద్రంలో దూకేశారు. అలా దూకిన వారు చిమ్మ చీకట్లో, నడిసముద్రంలో దాదాపు గంటన్నరపాటు నరకం చూశారు. బతుకుతామో లేదో తెలియక, మృత్యువు కోరల్లో ఆయువు కోసం పోరాడారు. మునిగిపోయిన నౌక ఉన్న ప్రాంతం నుంచి అతి కష్టం మీద ఈదుకుంటూ వెళుతుండగా ఓ విద్యుత్ లైట్ కనిపించింది. దగ్గరకు వెళ్లగా అది ఓ నౌకగా తెలిసింది. వెంటనే రక్షించమని కేకలు వేస్తూ, ఆ నౌకలోని సిబ్బంది సాయంతో బతికి బయటపడ్డారు. అక్కడి నుంచి ఒడ్డుకు చేరుకుని నేవీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన ప్రమాదం గురించి చెప్పారు. వారు వెంటనే నౌకలను,హెలికాప్టర్లను సంఘటన స్థలానికి పంపించారు. నౌకలో ఎంతమంది ఉన్నారు? సాధారణంగా ప్రతి నౌకలోనూ కెప్టెన్, ఎగ్జిక్యూటివ్ నావిగేషన్, ఇంజన్, నావిగేటింగ్, వెపన్స్, ఎలక్ట్రికల్, కుకింగ్, క్లీనింగ్ సిబ్బంది ఉంటారు. టీఆర్వీ-72లోనూ వీరందరి అవసరం తప్పనిసరి. అయితే నేవీ అధికారులు 28 మంది సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. కానీ ఆ సంఖ్య 30-35 మధ్య ఉంటుందని తెలిసింది. వారిలో నిజంగా గల్లంతైన వారెందరనేది తేలాల్సి ఉంది. ఆ ఆరుగురు వ్యక్తులు ఎవరు? టీఆర్వీ-72లో నేవీ సిబ్బందితో పాటు బయటి వ్యక్తులు కూడా ఉన్నట్లు సమాచారం. నిజానికి రక్షణ శాఖ నౌకలోకి ఇతరులను అనుమతించడం నిబంధనలకు విరుద్ధం. కానీ ఆరుగురు బయటి వ్యక్తులు ఆ రోజు నౌకలో ప్రయాణించినట్లు సమాచారం. వారంతా ఓ ప్రభుత్వ సంస్థకు చెందిన సిబ్బందిగా తెలిసింది. సబ్మెరైన్లు, నౌకలను విచ్ఛిన్నం చేసే టోర్పెడో(ఆయుధం)ను ఎన్ఎస్టీఎల్ తయారు చేస్తోంది. ఆ సంస్థ తయారు చేసిన టార్పెడోకు ఉండే మోటార్ల పనితీరును వీరు పరీక్షిస్తుంటారు. అయితే అది నౌక సముద్రంలోకి వెళ్లక ముందే జరుగుతుంది. కానీ నేవీ అధికారులకు, వారి సంస్థకు పరస్పర అవగాహన ఉండటంతో నిబంధనలను తోసిపుచ్చి వారిని నౌకలోకి అనుమతించినట్లు సమాచారం. అదృష్ట వశాత్తూ వారందరూ క్షేమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ బయటకు తెలిస్తే ఉద్యోగాలు పోతాయని భయపడి ఎవరికి వారు గోప్యత పాటిస్తున్నారు. అయితే ఉన్నతాధికారులకు మాత్రం సమగ్ర సమాచారాన్ని అందజేయకతప్పలేదు. ఈ నేపధ్యంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని విశాఖ నేవీ అధికారులు కలవరపడుతున్నారు. -
నౌక ఫిట్నెస్ లేదనడం సరికాదు
టోర్పెడో నౌక ప్రమాద బాధిత కుటుంబాలకు నేవీ చీఫ్ పరామర్శ విశాఖపట్నం: ఫిట్నెస్ లేకపోవడమే టోర్పెడో రికవరీ వెసల్ 72 నౌక మునిగిపోవడానికి కారణమనడం సరికాదని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. కె.థావన్ అన్నారు. ప్రమాద ఘటనలో అసువులు బాసిన నావికుడు జాకబ్, జాడ తెలియకుండా పోయిన లెఫ్టినెంట్ కమాండర్ .సుశీల్‌కుమార్ కుటుంబాలతో పాటు మరో ముగ్గురి కుటుంబాలను థావన్ ఆదివారం పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నౌకకు ఫిట్నెస్ సమస్య ఉంటే తూర్పు నావికా దళ చీఫ్ అనుమతి ఇవ్వరని వివరించారు. దుర్ఘటనకు దారి తీసిన కారణాలపై బోర్డు కమిటీ వేశామని, వాస్తవాలు అందులో తెలుస్తాయన్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుని పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న ధావన్ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఆదివారం హూటాహుటిన విశాఖ చేరుకున్నారు. విశాఖలోని ఈస్ట్‌పాయింట్ కాలనీలో నివాసముంటున్న లెఫ్టినెంట్ కమాండర్ వై.సుశీల్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఎంవీపీ కాలనీలోని నివాసముంటున్న మృతుడు జాకబ్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీష్ సోనీతో పాటు పలువురు నావికా దళ ఉన్నతాధికారులున్నారు. పలువురు నేవీ వైవ్స్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు కూడా బాధిత కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. -
తనిఖీ చేసిన తరువాతే సముద్రంలోకి వెళ్లిన నౌక:నేవీ చీఫ్
విశాఖపట్నం: తూర్పు నావికాదళానికి చెందిన ఆగ్జిలరీ(సహాయక) నౌక సామర్థ్యంపై వస్తున్న కథనాలను నేవీ చీఫ్ ఆర్కే ధవన్ ఖండించారు. ఆ కథనాలు అవాస్తవం అన్నారు. నౌక పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తరువాతే సముద్రంలోకి పంపినట్లు తెలిపారు. గురువారం రాత్రి నౌక నీట మునిగిన ఘటనలో మృతి చెందిన జాకబ్ కుటుంబాన్ని ధవన్ పరామర్శించారు. నౌక కోసం, గల్లంతైన సిబ్బంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. బాధిత కుటుంబాలకు నేవీ పూర్తిగా సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. టార్పెడో రికవరీ వెసల్ ట్రావ్-72 అనే నౌక ప్రమాదవ శాత్తు గురువారం రాత్రి నీట మునిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. 23 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. జాకబ్ మృతి చెందారు. మరో నలుగురు గల్లంతయ్యారు. వారి కోసం వెతుకుతూనే ఉన్నారు. **