miss maching
-
ఆన్సర్ షీట్లు తారుమారు!
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి ఆన్సర్ షీట్ల పునర్మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్లో బోర్డు అప్లోడ్ చేసిన తమ జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్యవస్థలో జవాబు పత్రాల మధ్య పొంతన కుదరడంలో లోపం ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అసలైన జవాబు పత్రాలు, ఇంటర్నెట్లోని స్కాన్డ్ కాపీల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి రెండూ ఒక్కటి కాదని అంటున్నారు. అంటే మిస్‌మ్యాచ్ జరుగుతోందని విమర్శిస్తున్నారు. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలామంది మార్కులు తక్కువగా రావడంతో పునర్మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి జవాబు పత్రాలను సీబీఎస్ఈ సిబ్బంది నెట్లో అప్లోడ్ చేశారు. వాటిని పరిశీలించిన విద్యార్థులు కంగు తింటున్నారు. అవి తాము సమాధానాలు రాసిన పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరొకరి జవాబు పత్రాలను తమ పేరిట అప్లోడ్ చేశారని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన వేదాంత్ అనే విద్యార్థి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. తనది కాని ఫిజిక్స్ ఆన్సర్ షీట్‌ను తన పేరిట అప్లోడ్ చేశారని తెలిపాడు. అందులో ఉన్న చేతిరాత తనది కాదని పేర్కొన్నాడు. రీవాల్యుయేషన్లో తనకు అన్యాయం జరిగిందని వెల్లడించాడు. సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టాం: ప్రధాన్ వేదాంత్ ఆవేదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడికి మద్దతిచ్చారు. కానీ, కొందరు వ్యతిరేకించారు. జాతి వ్యతిరేకిగా, పాకిస్తానీగా వేదాంత్‌పై ముద్రవేశారు. సంజన అనే మరో విద్యార్థినిది కూడా ఇదే వ్య«థ. ఆమె కెమిస్ట్రీ ఆన్సర్ షీట్ తారుమారయ్యింది. 70 మార్కులకు గాను 11 మార్కులే వచ్చాయి. ఆన్సర్ షీట్ మొదటి పేజీలో విద్యారి్థని పేరు, వివరాలు సరిగ్గానే ఉన్నాయి. రెండో పేజీ నుంచి మొత్తం మారిపోయాయి. సీబీఎస్ఈ అధికారులను సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని సంజన కన్నీరు పెట్టుకుంది. చాలామంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ ఆవేదనను సోషల్ మీడియాలో పోస్టుచేస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం: సీబీఎస్ఈ ఈ ఏడాది పరీక్షల్లో పునర్మూల్యాంకన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అన్నిరకాల సాంకేతిక సమస్యలపై ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–కాన్పూర్ నిపుణులు దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా సీబీఎస్ఈకి సహకరిస్తారని తెలిపారు. రీవాల్యూయేషన్ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మిస్‌మ్యాచ్ ఆన్సర్ షీట్ల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీబీఎస్ఈ వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్వీకరిస్తున్నామని, విద్యార్థులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశాయి. విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారని తెలియజేశాయి. ప్రతి ఫిర్యాదునూ చురుగ్గా పరిష్కరిస్తున్నట్లు సీబీఎస్ఈ అధికారులు చెబుతున్నారు. ప్రశ్నిస్తే దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా? ప్రధాని మోదీ అహంకారాన్నిజెన్ జెడ్ దించేయడం తథ్యం సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారు: రాహుల్ గాంధీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ద్వయం మరో కీలక సంస్థను అక్రమాలకు ప్రతీకగా మార్చేసిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అహంకారాన్ని జెన్ జెడ్ దించేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీబీఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం)లో లోపాలపై రాహుల్ సోమవారం స్పందించారు. ‘ఎక్స్’లో పోస్టుచేశారు. పునర్ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్సర్ షీట్లు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి జవాబు పత్రాన్ని మరొకరి పేరిట అప్లోడ్ చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పట్ల రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో ఎన్ని అవినీతి, అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఇంకా కురీ్చని పట్టుకొని వేలాడుతున్నాడని మండిపడ్డారు. సీబీఎస్ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారని ఆరోపించారు. -
ఇన్‘ఫట్’ సబ్సిడీ
2014 ఇన్పుట్ పంపిణీ నిలుపుదల రెండేళ్ల తర్వాత రూ.50 కోట్ల నిధులు వెనక్కి మిస్‌మ్యాచింగ్ జాబితాలో రూ.10 కోట్లు పెండింగ్ అనంతపురం అగ్రికల్చర్: వర్షాలు సక్రమంగా కురవక.. పంటలు పండక రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ కొద్దోగొప్పో సాయమందినా కొంత ఊరట కలుగుతుంది..ఇలాంటి సమయంలో రైతులకు మంజూరైన పరిహారం పంపిణీ చేయకుండా రెండేళ్ల తర్వాత ఖజానాకు వెనక్కి పంపారు. ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందుతుందనుకున్న రైతన్నలకు మొండిచేయి చూపినట్లయ్యింది. 2014 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5,81,471 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిని నష్టపోయిన 5,79,640 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ.567,32,74,088 పరిహారం మంజూరు చేశారు. అందులో నకిలీ పాస్‌పుస్తకాలు, డబుల్ ఎంట్రీలు ఉన్నట్లు గుర్తించి వాటి కింద 7,529 మంది రైతులకు దక్కాల్సిన రూ.7.64 కోట్లు పరిహారం ఇవ్వకుండా మొదట్లోనే ప్రభుత్వానికి వెనక్కి పంపారు. అంతిమంగా 5,72,111 మంది రైతులకు రూ.559,68,40,424 నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇష్టారాజ్యంగా రైతుల జాబితాలు తొలిసారిగా ఇన్పుట్ సబ్సిడీకి ఆధార్ లింక్ చేసి ‘ఆన్లైన్ లైసెన్సు మేనేజ్మెంట్ సిస్టమ్ (ఓఎల్‌ఎంఎస్) కింద ఈ–రైతు సేవలు’ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఆన్లైన్ చేసే క్రమంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తడం, ముఖ్యంగా ఆధార్ నంబర్ డిస్ప్లే కాకపోవడం, డిస్ప్లే అయినా పెద్ద ఎత్తున తప్పులు దొర్లడం, వాటిని సరిచేయడానికి నానాపాట్లు పడ్డారు. ఇందులో కొందరు రైతులకు ఆధార్ లేకపోవడం, జాబితాలు తప్పుల తడకలుగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకోవడంతో జాబితాలు ఇష్టారాజ్యంగా మార్చేశారు. 2014 ఇన్పుట్ పంపిణీకి ఫుల్స్టాప్ ఖరీఫ్–2014 ఇన్పుట్ పంపిణీకి ఫుల్స్టాప్ పెట్టేశారు. అయినా పూర్తి స్థాయి పరిహారం రైతులకు పంపిణీ చేయకుండానే ముగింపు పలికారు. ఆర్థికంగా చితికిపోయి బక్కచిక్కిన రైతులకు అందాల్సిన రూ.50 కోట్ల వరకు పరిహారం అలా ప్రభుత్వ ఖజానాకు చేరిపోయింది. మరో రూ.10 కోట్లు మిస్ మ్యాచింగ్ జాబితాలో నిలిచిపోగా దాన్ని సరిచేసుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. పేరున్నా రాలేదంటూ ఇంకా చాలా మంది రైతులు వ్యవసాయశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా వేలాది మంది తిరిగి తిరిగి వేసారిపోయి ఆశలు వదిలేసుకున్నారు. ఇప్పటికీ రోజూ కనీసం 50 మంది రైతులు 2014 ఇన్పుట్ సమస్యపై జేడీఏ కార్యాలయానికి వస్తున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అర్హత ఉన్నా అందని పరిహారం అర్హత ఉన్నా చాలా మంది పేర్లు గల్లంతు కావడం, పేరున్నా పరిహారం తక్కువగా ఇవ్వడం, కొన్ని ప్రాంతాల్లో అయితే ఐదెకరాలున్న రైతులకు కూడా రూ.1,000 లేదా రూ.2 వేలు మాత్రమే దక్కింది. దీనికితోడు పరిహారం ఒకేసారి విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తూ రావడం వల్ల పంపిణీ ప్రసహనంగా సాగింది. ఒకటి, రెండు సార్లు కాదు.. ఏకంగా పది విడతలుగా పరిహారం విడుదల చేశారంటే ఎంత దయనీయంగా ఉందో తెలుస్తుంది. 2015 పరిహారం రెండేళ్ల తర్వాత పంపిణీ 2015 ఆగస్టులో తొలివిడతగా పరిహారం విడుదల చేయగా పదో విడత 2017 ఫిబ్రవరిలో విడుదల చేశారు. ఈ కారణాల వల్ల పరిహారం కోసం రైతులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఒకటి, రెండు సార్ల కంటే ఎక్కువ సార్లు తిరిగిన రైతులు ఎందరో అని చెప్పాలి. కొందరైతే 30 నుంచి 40 సార్లు మండలాలు, డివిజన్లు, జిల్లా కేంద్రం, బ్యాంకుల చుట్టూ తిరిగి అలసిపోయారు. తిరగడానికి, వచ్చిన ప్రతిసారీ ఆధార్, బ్యాంకు అకౌంట్, పట్టానెంబర్ జిరాక్స్‌ల కోసం, రానుపోనూ చార్జీల కోసం రూ.వేలు ఖర్చు చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు. పరిహారం రాని వారు పెద్ద సంఖ్యలోనే మిగిలారు. మిస్మ్యాచింగ్ను సరిచేసుకునేందుకు ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు రూ.521 కోట్లు పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయశాఖ జేడీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 2014లో దెబ్బతిన్న పంటల విస్తీర్ణం : 5.81 లక్షల హెక్టార్లు మంజూరైన ఇన్పుట్ పరిహారం : రూ.567.32 కోట్లు బాధిత రైతుల సంఖ్య : 5.79 లక్షల మంది రెండేళ్లుగా పంపిణీ చేసిన పరిహారం : రూ.521 కోట్లు పరిహారం అందుకున్న రైతుల సంఖ్య : 5.37 లక్షల మంది మిస్‌మ్యాచింగ్‌లో ఉన్న పరిహారం : రూ.10 కోట్లు పరిహారం పంపిణీ కాకుండా మిగిలింది : రూ. 51 కోట్లు పరిహారం దక్కని రైతులు సంఖ్య : 42 వేల మంది


