ఆన్సర్‌ షీట్లు తారుమారు!  | Blurred answer sheets fuel concerns over CBSE re-evaluation process | Sakshi
Sakshi News home page

ఆన్సర్‌ షీట్లు తారుమారు! 

May 26 2026 6:26 AM | Updated on May 26 2026 6:26 AM

Blurred answer sheets fuel concerns over CBSE re-evaluation process

సీబీఎస్‌ఈ పునర్‌మూల్యాంకనంలో లోపాలు  

ఒకరి జవాబు పత్రం మరొకరి పేరిట అప్‌లోడ్‌  

12వ తరగతి విద్యార్థుల ఆందోళన  

సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టామన్న సీబీఎస్‌ఈ వర్గాలు 

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకెండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఆన్సర్‌ షీట్ల పునర్‌మూల్యాంకనంలో లోపాలపై విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంటర్నెట్‌లో బోర్డు అప్‌లోడ్‌ చేసిన తమ జవాబు పత్రాల స్కాన్డ్‌ కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని ఆరోపిస్తున్నారు. దీంతో ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎం) వ్యవస్థలో జవాబు పత్రాల మధ్య పొంతన కుదరడంలో లోపం ఉండవచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

విద్యార్థుల అసలైన జవాబు పత్రాలు, ఇంటర్నెట్‌లోని స్కాన్డ్‌ కాపీల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని చెబుతున్నారు. అవి రెండూ ఒక్కటి కాదని అంటున్నారు. అంటే మిస్‌మ్యాచ్‌ జరుగుతోందని విమర్శిస్తున్నారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థుల్లో చాలామంది మార్కులు తక్కువగా రావడంతో పునర్‌మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి జవాబు పత్రాలను సీబీఎస్‌ఈ సిబ్బంది నెట్‌లో అప్‌లోడ్‌ చేశారు.

 వాటిని పరిశీలించిన విద్యార్థులు కంగు తింటున్నారు. అవి తాము సమాధానాలు రాసిన పత్రాలు కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరొకరి జవాబు పత్రాలను తమ పేరిట అప్‌లోడ్‌ చేశారని చెబుతున్నారు. ఢిల్లీకి చెందిన వేదాంత్‌ అనే విద్యార్థి తన అనుభవాన్ని సోషల్‌ మీడియాలో పోస్టుచేశాడు. తనది కాని ఫిజిక్స్‌ ఆన్సర్‌ షీట్‌ను తన పేరిట అప్‌లోడ్‌ చేశారని తెలిపాడు. అందులో ఉన్న చేతిరాత తనది కాదని పేర్కొన్నాడు. రీవాల్యుయేషన్‌లో తనకు అన్యాయం జరిగిందని వెల్లడించాడు.  

సాంకేతిక సమస్యలపై దృష్టి పెట్టాం: ప్రధాన్‌  
వేదాంత్‌ ఆవేదన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతడికి మద్దతిచ్చారు. కానీ, కొందరు వ్యతిరేకించారు. జాతి వ్యతిరేకిగా, పాకిస్తానీగా వేదాంత్‌పై ముద్రవేశారు. సంజన అనే మరో విద్యార్థినిది కూడా ఇదే వ్య«థ. ఆమె కెమిస్ట్రీ ఆన్సర్‌ షీట్‌ తారుమారయ్యింది. 70 మార్కులకు గాను 11 మార్కులే వచ్చాయి. ఆన్సర్‌ షీట్‌ మొదటి పేజీలో విద్యారి్థని పేరు, వివరాలు సరిగ్గానే ఉన్నాయి. రెండో పేజీ నుంచి మొత్తం మారిపోయాయి. సీబీఎస్‌ఈ అధికారులను సంప్రదించడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని సంజన కన్నీరు పెట్టుకుంది. చాలామంది విద్యార్థులు ఇదే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. తమ ఆవేదనను సోషల్‌ మీడియాలో పోస్టుచేస్తున్నారు. 

ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం: సీబీఎస్‌ఈ  
ఈ ఏడాది పరీక్షల్లో పునర్‌మూల్యాంకన సేవలు ప్రారంభమైనప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అన్నిరకాల సాంకేతిక సమస్యలపై ఐఐటీ–మద్రాస్, ఐఐటీ–కాన్పూర్‌ నిపుణులు దృష్టి పెట్టారని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. ఈ సమస్య పరిష్కారమయ్యేలా సీబీఎస్‌ఈకి సహకరిస్తారని తెలిపారు. రీవాల్యూయేషన్‌ ప్రక్రియలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మిస్‌మ్యాచ్‌ ఆన్సర్‌ షీట్ల సమస్య పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీబీఎస్‌ఈ వర్గాలు వెల్లడించాయి. ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా స్వీకరిస్తున్నామని, విద్యార్థులకు సహాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశాయి. విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో ఉన్నతాధికారులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, ఎవరికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టారని తెలియజేశాయి. ప్రతి ఫిర్యాదునూ చురుగ్గా పరిష్కరిస్తున్నట్లు సీబీఎస్‌ఈ అధికారులు చెబుతున్నారు.  

ప్రశ్నిస్తే దేశ ద్రోహిగా ముద్ర వేస్తారా? 
ప్రధాని మోదీ అహంకారాన్నిజెన్‌ జెడ్‌ దించేయడం తథ్యం  
సీబీఎస్‌ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారు: రాహుల్‌ గాంధీ 
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ద్వయం మరో కీలక సంస్థను అక్రమాలకు ప్రతీకగా మార్చేసిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ అహంకారాన్ని జెన్‌ జెడ్‌ దించేయడం తథ్యమని తేల్చిచెప్పారు. సీబీఎస్‌ఈ ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎం)లో లోపాలపై రాహుల్‌ సోమవారం స్పందించారు. ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. పునర్‌ మూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఆన్సర్‌ షీట్లు తారుమారైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒకరి జవాబు పత్రాన్ని మరొకరి పేరిట అప్‌లోడ్‌ చేసినట్లు బాధిత విద్యార్థులు చెబుతున్నారు. ఈ వ్యవహారం పట్ల రాహుల్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. పరీక్షల నిర్వహణలో ఎన్ని అవినీతి, అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ మంత్రి ఇంకా కురీ్చని పట్టుకొని వేలాడుతున్నాడని మండిపడ్డారు. సీబీఎస్‌ఈని కూడా అక్రమాల పుట్టగా మార్చారని ఆరోపించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement