breaking news
Migraine headaches
-
కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..
ప్రతి ఒక్కరి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. అలా చూసినప్పుడు తలనొప్పి చాలా సాధారణ సమస్య. అయితే కొన్ని జబ్బులకు తలనొప్పి ఒక సూచనలా, ఒక లక్షణంగా కూడా కనిపించవచ్చు. అందుకే తరచూ తలనొప్పితో బాధపడేవారిలో దాని కారణం కనుగొనడం కూడా డాక్టర్లకూ తలనొప్పే. తలనొప్పుల్లో రకరకాలు ఉంటాయి. రకరకాల కారణాలతోనూ వస్తుంటాయి. ఎప్పుడో ఒకసారి తలనొప్పి కనిపించినా లేదా ఏదైనా ప్రత్యేక కారణంతో అప్పుడప్పుడూ వచ్చే తలనొప్పుల గురించి అంతగా పట్టించుకోనక్కర్లేదుగానీ... కొన్ని తలనొప్పులను చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిందే. అసలు స్థూలంగా చూసినప్పడు తలనొప్పులను ఎలా విభజించుకోవచ్చు. ఏయే సందార్భాల్లో తలనొప్పుల సీరియస్‌గా తీసుకోవాలో చూద్దాం.గతంతో పోలిస్తే ఇప్పుడు తలనొప్పులు మరింత తరచుగా కనిపిస్తూ ఉన్నాయి. పైగా ఒకప్పుడు కాస్త పెద్దవయసువారిలో తరచూ కనిపించే ఈ తలనొప్పులు ఇటీవల చిన్నవయసువారిలోనూ కనిపిస్తున్నాయి. ఇక కొన్ని తలనొప్పులు జీవనశైలి మార్పుల వల్ల వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేగాటన కట్టడమూ సరికాదు. ఇలా చిన్నవయసు వారిలో తలనొప్పులు కనిపించగానే కళ్ల డాక్టర్‌తో కళ్లను పరీక్షింపజేసుకోవడమూ మామూలే. అలాగని మొత్తం కేసులను కళ్ల సమస్య ఖాతాలోనూ వేయడం సరికాదు. అందుకే తరచూ వస్తున్న తలనొప్పులను... అవి వచ్చే వేళలనూ, ఏదైనా ప్రత్యేక సందర్భంలో అంటే ఏదైనా వాసనలు పీల్చినప్పుడో లేదా ఏవైనా కాలుష్యాలకు గురైనప్పుడో వస్తుంటే వాటిని డాక్టర్లకు వివరించడమూ అవసరం. అప్పుడవి ఏ కారణంగా వస్తున్నాయో అంచనా వేయడానికీ డాక్టర్లకు అవకాశముంటంది.తలనొప్పుల గురించి విపులంగా...ప్రైమరీ తలనొప్పులు : సాధారణంగా ఇవన్నీ మెదడులోని రసాయనాల సమతౌల్యత తప్పడం వల్ల తలలో ఉద్భవించే తలనొప్పులని చెప్పవచ్చు. వీటిలో ప్రధానమైనవి...మైగ్రేన్...తలనొప్పులన్నింటిలోనూ మైగ్రేన్ చాలా సాధారణమైనది. ఇది టీనేజీలో చాలా ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందునా యువకుల్లో కంటే యువతుల్లో మరింత ఎక్కువ. సాధారణంగా ఒక వయసు వచ్చాక దానంతట అదే తగ్గిపోయే అవకాశం ఉన్నప్పటికీ... అది వచ్చినప్పుడు నొప్పి తీవ్రత భరించలేనంతగా ఉంటూ చాలా ఎక్కువగా బాధిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పాదక వయసులో ఉన్న చాలా మందిలో వాళ్ల పనిగంటలనూ, స్కూలు పిల్లలూ, విద్యార్థుల్లో వాళ్లు చదివే సమయాన్ని ఎక్కువగా వృథాచేసే తలనొప్పి ఇదే.లక్షణాలు...ఈ తలనొప్పి చాలా సందర్భాల్లో తలకు ఒకే వైపు వస్తుంటుంది. అందుకే చాలా సందర్భాల్లో చాలాచోట్ల దీన్ని ‘పార్శ్వపు నొప్పి’ అని కూడా అంటుంటారు. అయితే కొంతమందిలో మాత్రం కొన్ని సార్లు ఇది తలకు ఇరుపక్కలా వస్తుంటుంది. వచ్చినప్పుడు రెండు నుంచి నాలుగు గంటలు మొదలుకొని... కొన్ని సందర్భాల్లో 72 గంటల వరకూ రావచ్చు. తీవ్రమైన తలనొప్పితో పాటు వికారం / వాంతులు; కాంతిని చూడలేకపోవడం, వెలుతురు లేని చీకటి గదిలో ఉండాలనిపించడం... లేదా చూసినా, శబ్దాలు విన్నా తలనొప్పి విపరీతంగా పెరగడం, నిద్రపడితే తగ్గడం వంటి లక్షణాలుంటాయి. కొంతమందిలో కళ్లకు చిత్రవిచిత్రమైన కాంతి వలయాలు, కాంతిపుంజాలు, మెరుపులూ (ఆరా / ఫ్లాషింగ్ లైట్స్) కనిపిస్తాయి.కారణాలు... మైగ్రేన్‌కు చాలా కారణాలే ఉండవచ్చు. ఉదాహరణకు... తీవ్రమైన ఒత్తిడీ, యాంగై్జటీ; తమకు సరిపడని పదార్థాలేవైనా తినడం (ఉదాహరణకు చాక్లెటు, ఛీజ్, వెన్న, సోయా సాస్, కాఫీలోని కెఫిన్, ప్రాసెస్ చేసిన మాంసాహార పదార్థాలు, సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మ జాతి పండ్లు వంటివి... ఇవి వేర్వేరు వ్యక్తుల్లో వేర్వేరుగా ఉండవచ్చు); తగినంత నిద్రలేకపోవడం, సమయానికి తినకుండా ఆకలితోనే ఉండిపోవడం, తీవ్రమైన శారీరక శ్రమ తర్వాతా, వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, అగరుబత్తీలూ లేదా కొన్ని రసాయనాలతో తయారుచేసిన సెంట్ల నుంచి వచ్చే బాగా ఘాటైన వాసనలు, ఆల్కహాల్ (ముఖ్యంగా రెడ్‌వైన్), చైనీస్ ఫుడ్ ఐటమ్స్ (ముఖ్యంగా చైనా సాల్ట్ వాడిన పదార్థాలు), యువతుల్లో హార్మోన్ల మార్పులు, తలస్నానం చేస్తూనే తలకు బిగుతైన హెయిర్ బ్యాండ్ ధరించడం, ఎండకు ఒక్కసారిగా ఎక్స్పోజ్ కావడం, మలబద్దకం వంటి అంశాలు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించడంతో పాటు మరింత తీవ్రతరం చేస్తాయి.ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్...ఇవే కాకుండా కొందరిలో వారికి మాత్రమే ప్రత్యేకమైన కారణాలు కూడా మైగ్రేన్‌ను ట్రిగర్ చేయవచ్చు. అంటే మైగ్రేన్ అన్నది ఒక్కొక్కరిలో ఒక్కోకారణం వల్ల వచ్చే అవకాశమూ ఉంది. అందుకే మైగ్రేన్ రావడానికి ముందు 6– 12 గంటల వ్యవధిలో ఏమైనా తిన్నారా, దేనికైనా ఎక్స్పోజ్ అయ్యారా వంటి అంశాలను డాక్టర్లు అడిగి తెలుసుకుంటారు. దీని ద్వారా నిర్దిష్టంగా తలనొప్పి ఏ కారణంగా వస్తుందో తెలుస్తుంది. ఈ కారణాలను మైగ్రేన్‌ను ప్రేరేపించే అంశాలు (ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్)గా చెబుతారు.నిర్ధారణ ఇలా...మైగ్రేన్ నిర్ధారణకు నిర్దిష్టంగా వైద్య పరీక్ష అంటూ ఏదీ ఉండదు. అంటే మైగ్రేన్ అనేది నిర్దిష్టంగా ఏ వైద్యపరీక్షలోనూ తెలిసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే దాన్ని పట్టి ఇచ్చే ΄్యాటర్న్ అంటూ ఏదీ ఉండదు. అందుకే... తలనొప్పుల నిర్ధారణ కోసం చేసే అన్ని వైద్యపరీక్షల్లోనూ ఏ లోపమూ కనిపించకపోవడంతో పాటు... మైగ్రేన్‌లో కనిపించే ఒకవైపు తలనొప్పి లేదా దాని లక్షణాలతో అది తరచూ అదేపనిగా వస్తుండటం, మాటిమాటికీ తిరగబెడుతుండటం వంటి లక్షణాలతో దీన్ని నిర్ధారణ చేస్తారు.చికిత్స..మైగ్రేన్‌కు రెండు రకాల చికిత్స చేస్తారు. మొదటిది... తలనొప్పి తీవ్రతను వెంటనే తగ్గించడానికి చేసే తక్షణ చికిత్స. రెండోది... ఆ తర్వాత అది మళ్లీ తిరగబెట్టకుండా ఉండేందుకు ఇచ్చే దీర్ఘకాలిక చికిత్స. ఇందుకోసం డాక్టర్ల సలహా మేరకు మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ముందులు వాడాల్సి ఉంటుంది. ఇక మైగ్రేన్‌కు మందులతో పాటు యోగా, ధ్యానం (మెడిటేషన్) వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఇటీవల మందులతో తగ్గని కొన్ని మైగ్రేన్లకు బొటాక్స్ ఇంజెక్షన్‌ను ఉపయోగించి కూడా చికిత్స చేస్తున్నారు. మెగ్నీషియమ్, రైబోఫ్లేవిన్ (బి2 విటమిన్) సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు (గోధుమ వంటి ధాన్యాలు– పండ్లు, ఆకుకూరల్లో ఇవి అధికం) తీసుకోవడం ద్వారా కూడా ఉపశమనం దొరకుతుంది.క్లస్టర్ హెడేక్... మైగ్రేన్‌తో పోలిస్తే... ఇది కాస్తంత అరుదుగా కనిపించే తలనొప్పి. కంటి పాపల వెనక బాగా తీవ్రమైన నొప్పితో ఇది మొదలవుతుంది. రెండు మూడు గంటలపాటు తీవ్రంగా బాధిస్తుంది. ఒక్కోసారి ఇది మాటిమాటికీ తిరగబెడుతూ కొద్దిరోజుల పాటు వస్తూ ఉంటుంది. రోజూ ఒకే వేళకు కనిపిస్తూ ఉంటుంది. ఏడాదిలో 8–10 వారాల పాటు రావచ్చు. ఒకసారి అలా వచ్చాక మళ్లీ ఏడాది పాటు మళ్లీ రాకపోవచ్చు. అయితే... ఆ మరుసటి ఏడాది కూడా మొదటిసారి వచ్చినట్లే మళ్లీ 8–10 వారాల పాటు అదే వేళకు వస్తూ ఉంటుంది.చికిత్స...దీనికి తక్షణ చికిత్సగా ఆక్సిజన్‌ను అందిస్తారు లేదా ముక్కు ద్వారా పీల్చే ట్రి΄్టాన్ మందులను ఇస్తారు. ఇలా మొదట వచ్చే నొప్పిని తగ్గిస్తారు. ఇక ఆ తర్వాత ఈ తరహా తలనొప్పిని రాకుండా చేయడానికి దీర్ఘకాలిక చికిత్స అందించాల్సి ఉంటుంది.టెన్షన్ హెడేక్ : తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారికి విపరీతమైన తలనొప్పి రావడం మనలో చాలా మందికి తెలిసిన విషయమే. ఈ నొప్పి తలకు ఇరువైపుల గానీ లేదా కొన్నిసార్లు తలలో అన్నివైపులా ఉంటుంది. కొన్ని సార్లు చాలాకాలం (దీర్ఘకాలం పాటు) వస్తుంటుంది. ఒత్తిడి తీవ్రతను బట్టి తలనొప్పి తీవ్రత కూడా పెరుగుతుండటం, ఒక్కోసారి రోజులూ, నెలల తరబడి కనిపించడం కూడా జరుగుతుంటుంది. మార్కెట్లో దొరికే సాధారణ తలనొప్పి మందులతోనే దీన్ని తగ్గించుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ ఒత్తిడి తగ్గించుకోడానికి అవలంబించే మార్గాలతో ఈ తలనొప్పి కూడా తగ్గుముఖం పట్టే అవకాశముంది.క్రానిక్ డైలీ హెడేక్... దీర్ఘకాలం పాటు రోజూ వచ్చే మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులను తగ్గించుకోడానికి తరచూ నొప్పి నివారణ మందులు వాడటం వల్ల వచ్చే తలనొప్పి ఇది. మాత్ర వాడగానే మొదట్లో తలనొప్పులు తగ్గినప్పటికీ ఒక దశ తర్వాత నొప్పి నివారణ మందు తీసుకోగానే ఈ తరహా తలనొప్పి వస్తూ ఉంటుంది.ప్రైమరీ కాఫ్ అండ్ లాఫ్ హెడేక్... తీవ్రంగా దగ్గడం లేదా గట్టిగా చాలాసేపు నవ్వడం లేదా గట్టిగా తుమ్మడం వల్ల అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. చాలా అరుదుగా ఇది తలలోని సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్ వంటి ద్రవాలను అడ్డుకోవచ్చు. ఒక్కోసారి తలలోని రక్తనాళాలనూ అడ్డుకోవచ్చు. ఒక్కోసారి గుండె నుంచి మెడ ద్వారా తలలోకి రక్తాన్ని తీసుకెళ్లే కెరోటిడ్ ఆర్టరీ అనే మంచి రక్తనాళం సన్నబడటం వల్ల కూడా ఈ తరహా తలనొప్పి రావడానికి అవకాశముంది.ప్రైమరీ స్టాబింగ్ హెడేక్... తలలో కత్తితో పొడిచినట్లుగా ఉండే తలనొప్పిని ఈ పేరుతో పిలుస్తారు.ప్రైమరీ హెడేక్ అసోసియేటెడ్ విత్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్... సెక్స్‌లో పాల్గొన్నప్పుడు భావ్రపాప్తి పొందే సమయంలో అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి ఇది. సెక్స్ ముగిశాక వచ్చే ఈ తలనొప్పి సాధారణంగా పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎర్గాటమైన్ లేదా ఇండోమెథాసిన్ వంటి మందులను సెక్స్‌కు ముందుగా వాడటం ద్వారా ఈ తరహా తలనొప్పిని నివారించవచ్చు. ఇక దీర్ఘకాలం పాటు ఈ నొప్పి రాకుండా ఉండటానికి ప్రొపనలాల్, డిల్టియాజెమ్ వంటి మందులు సూచిస్తారు.హిప్నిక్ హెడేక్... ఈ తరహా తలనొప్పి నిద్రలో మొదలై... నిద్రలేచాక కూడా దాదాపు 15–30 నిమిషాల పాటు వస్తూనే ఉంటుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిలో అందునా మరీ ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ఒక కాఫీ తాగడం లేదా లిథియమ్ మాత్రలు వంటివి ఈ తరహా తలనొప్పికి చికిత్స.తలనొప్పులు స్థూలంగా ఎన్ని రకాలంటే...తలనొప్పుల తీరుతెన్నులు, వాటి నిర్ధారణ పద్ధతులు, చికిత్సలూ, ఇతరత్రా చాలా అంశాల ఆధారంగా తలనొప్పులను చాలారకాలుగా విభజించవచ్చు. అయితే... తలనొప్పులు ఎందుకొస్తున్నాయనే కారణాలూ లేదా అవి ఉద్భవించే తీరుతెన్నులను బట్టి నిపుణులు వాటిని ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. అవి...1. ప్రైమరీ తలనొప్పులు : ఈ తలనొప్పులు నేరుగా తలలోనే పుడతాయి. అంటే... ఈ నొప్పులకు కారణం తలలోనే ఉంటుంది. అంటే ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు వాటి రిఫరల్ పెయిన్ తలకు పాకడం వల్ల ఇవి రావడం లేదనీ... ఇవి నేరుగా తలలోనే పుడుతున్నాయని అర్థం.2. సెకండరీ తలనొప్పులు: ఈ తరహా తలనొప్పులు ఇంకేదో బయటి కారణంతోగానీ లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్య కారణంగా గానీ వస్తుంటాయి. అంటే... తలలో గడ్డలు ఏర్పడటం లేదా తలకు గాయం కావడం లేదా పక్షవాతం వంటి కారణాల వల్ల ఈ తలనొప్పులు రావచ్చు. అందుకే వీటిని సెకండరీ తలనొప్పులుగా చెప్పవచ్చు.3. క్రేనియల్ న్యూరాల్జియా లేదా ఫేషియల్ పెయిన్స్‌తో పాటు ఇతర తలనొప్పులు : తల లోపల 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. ఈ నరాలు ఏవైనా కారణాలతో ఉద్రిక్తతకు లోనైతే వచ్చే తలనొప్పులను ఇలా చెప్పవచ్చు.సెకండరీ తలనొప్పులు...నేరుగా తలలో పుట్టే నొప్పులు కాకుండా... ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులివి. వీటిలో ఈ కింద పేర్కొన్నవి కొన్ని ప్రధానమైన తలనొప్పులు.మెనింజైటిస్... ఇది మెదడు పొరల్లో ఒకదానికి వచ్చే ఇన్ఫెక్షన్ కారణంగా తలనొప్పి వస్తుంది. ఇందులోని లక్షణాలు... తలనొప్పితో పాటు జ్వరం, వాంతులు, మెడ బిగుసుకుపోయి ఉండటం, వెలుగు చూడటానికి ఇబ్బందిగా ఉండటం లేదా శబ్దాలు వినడానికి ఇబ్బందిగా ఉండటం. మెనింజైటిస్ సమస్యను సీఎస్ఎఫ్ (మెదడులోని ద్రవం – సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్)ను పరీక్షించడం ద్వారా నిర్ధారణ చేయవచ్చు.బ్రెయిన్ ట్యూమర్... మెదడులో ఏర్పడే గడ్డల వల్ల తలనొప్పి వస్తుంది. ఇలా వచ్చే తలనొప్పిలో.... మెదడులోని గడ్డ పెరుగుతున్న కొద్దీ నొప్పి కూడా పెరుగుతూ పోతుంది. కొన్ని సందర్భాల్లో వారాల తరబడి తలనొప్పి వస్తూనే ఉంటుంది. నిద్రలేవగానే నొప్పి ఎక్కువగా ఉండవచ్చు. కొందరిలో తలనొప్పితో పాటు వాంతులూ కావచ్చు. ఒక్కోసారి ఫిట్స్ కూడా రావచ్చు. ముందుకు ఒంగినప్పుడు తలనొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది లేదా ఏదైనా వస్తువులను ఎత్తినప్పుడు తలనొప్పి మరింత పెరుగుతుంది.ఇంట్రాక్రేనియల్ హేమరేజ్ తలనొప్పులు... తల (పుర్రె)లో అంతర్గత రక్తస్రావం కావడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. అకస్మాత్తుగా తలనొప్పి వచ్చి శరీరంలోని ఏదైనా అవయవం బలహీనంగా కావడం లేదా చచ్చుబడిపోయినట్లుగా కావడం జరగవచ్చు. ఒక్కోసారి మాట ముద్దముద్దగా రావడం వంటి మార్పులూ కనిపించవచ్చు. ఈ తరహా తలనొప్పిని సీటీ స్కాన్ పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు.టెంపోరల్ ఆర్టిరైటిస్... ఇది సాధారణంగా 60 ఏళ్ల వారిలో కనిపించే తలనొప్పి. ఆ వయసు వారిలో మొదటిసారి కనిపించే తలనొప్పి ఇది. దీనితో పాటు జ్వరం, బరువు తగ్గడం, దవడ నొప్పి, ఏదైనా నములుతున్నప్పుడు నొప్పి పెరగడం, రాత్రిళ్లు నొప్పి ఎక్కువగా ఉండటం, కణతల వద్ద నొక్కినప్పుడు నొప్పి ఎక్కువగా ఉండటం వంటివి ఇందులో కనిపించే లక్షణాలు. రక్తపరీక్ష చేయించినప్పుడు ఈఎస్ఆర్ చాలా ఎక్కువగా ఉంటుంది. టెంపొరల్ ఆర్టరీ బయాప్సీ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు.గ్లకోమా హెడేక్... కంట్లో ఇంట్రా ఆక్యూలార్ ప్రెషర్ అనే ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే తలనొప్పి ఇది. ఇందులో తలనొప్పితో పాటు వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సమస్య నెమ్మదినెమ్మదిగా క్రమక్రమంగా బాధితులకు తెలియకుండానే చూపును హరించి వేస్తుంది. కాబట్టి తలనొప్పి బాధిస్తున్నప్పుడు డాక్టర్‌ను సంప్రదించడం తప్పనిసరి. ఇవే గాక... పక్క మీద తలగడ సరిగా లేనప్పుడు, మన దేహం భంగిమ (పోష్చర్) సరిగా లేనప్పుడు కూడా తలనొప్పులు వస్తుంటాయి. ఇలా ఇతరత్రా కారణాలతో వచ్చే తలనొప్పులు చాలా ఎక్కువగానే ఉంటాయి.క్రేనియల్ న్యూరాల్జియా...మన తలలోని పుర్రెను క్రేనియమ్ అంటారు. ఇందులో కీలకమైన 12 నరాలు ఉంటాయి. వీటినే క్రేనియల్ నర్వ్స్ అంటారు. వీటి నుంచి వచ్చే తలనొప్పులను ‘క్రేనియల్ న్యూరాల్జియా’ అంటారు. న్యూరా.. అంటే నరం అనీ, అలాగే ఆల్జియా అంటే నొప్పి అని అర్థం. అందుకే ఈ తరహా తలనొప్పులను క్రేనియల్ న్యూరాల్జియా అని చెబుతుంటారు.ఆక్సిపెటల్ న్యూరాల్జియా... ఎక్కువ తీక్షణమైన కాంతిని చూసినప్పుడు తలలోని వెనుక భాగంలో (ఆక్సిపెటల్ అనే ప్రాంతంలో) ఉండే నరాలు ఉద్రిక్తతకు గురై తలనొప్పి రావచ్చు. ఇలా వచ్చే తలనొప్పిని ఆక్సిపెటల్ న్యూరాల్జియా అంటారు.ట్రైజెమినల్ న్యూరాల్జియా... ట్రైజెమినల్ నర్వ్ అని పిలిచే ఈ నరం... నుదుటి నుంచి చెంప, దవడ వరకు అంటే దాదాపు పూర్తి ముఖానికి వెళ్లే తలనరాలలో ప్రధానమైనది. ఇది తీవ్రంగా ఉద్రిక్తమైనపుపడు ఏ పదార్థాన్ని కూడా నమలలేనంత / తినలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇందులో ఉడికించిన కోడిగుడ్డులోని తెల్లటి భాగాన్ని కూడా నమలలేనంత తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. కనీసం మాట్లాడటం కూడా సాధ్యం కాదు. ప్రముఖ బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈ నొప్పితో చాలాసార్లు బాధపడ్డాడు. ఈ తరహా తలనొప్పిని ముందుగా మందులతో తగ్గిస్తారు. 95 శాతం కేసుల్లో మందులతోనే తగ్గుతుంది. అయితే మందులతో తగ్గనప్పుడు చిన్న శస్త్రచికిత్స లేదా రేడియో శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పిని శాశ్వతంగా తగ్గించవచ్చు.ఒక అపోహ – వాస్తవం... కొంతమంది హైబీపీ వల్ల తలనొప్పి వస్తుందని అపోహ పడుతుంటారు. నిజానికి హైబీపీ కారణంగా తలనొప్పి రావాలంటే బీపీ కొలత 180 / 110 ఉండాలి. అప్పుడు హైబీపీ కారణంగా తలనొప్పి వస్తుంది.తలనొప్పిని తీవ్రంగా పరిగణించి, ఎప్పుడు చికిత్సకు వెళ్లాలంటే...జీవితంలో మొట్టమొదటిసారే అయినప్పటికీ అది భరించలేనంత తీవ్రమైన తలనొప్పిగా వస్తున్నప్పుడు. మొదలు కావడమే తలబద్ధలైపోతూ భరించలేనంతగా తలనొప్పి వస్తున్నప్పుడు.సమయం గడుస్తున్నకొద్దీ ఏమాత్రం ఉపశమనం లేకుండా అసలేమీ తగ్గకుండా తలనొప్పి తీవ్రత అంతకంతకూ పెరుగుతూ పోతున్నప్పుడు.తలనొప్పితో పాటు జ్వరం/నీరసం/ఫిట్స్/ చేయి లేదా కాలిలో బలహీనత వచ్చి కళ్లు మసకబారుతున్నప్పుడు.పైకి లేస్తున్నప్పుడు లేదా ఏదైనా వస్తువును ఎత్తుతున్నప్పుడు లేదా ముందుకు వంగుతున్నప్పుడు తలనొప్పి వస్తుంటే.నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రాభంగం అవుతున్నప్పుడు పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తున్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించి సీటీ స్కాన్/ఎమ్మారై స్కాన్ అవసరాన్ని బట్టి మెదడు నుంచి నీరు తీసి చేసే సీఎస్ఎఫ్ (సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్) పరీక్ష వంటివి చేయించాల్సి ఉంటుంది.సాధారణ తలనొప్పి నివారణ ఇలా...తరచూ తలనొప్పి వస్తోందా? డాక్టర్‌ను సంప్రదించేలోపు ఈ జాగ్రత్తలు తీసుకోండి. తలనొప్పి రాకపోయినా భవిష్యత్తులో రాకుండా నివారించడానికి ఇవే జాగ్రత్తలు పనికివస్తాయి. అవి...కంప్యూటర్‌పై పనిచేసేతవారు కంటిపై ఒత్తిడి పడకుండా స్క్రీన్ ముందు కూర్చునేటప్పుడు యాంటీ గ్లేయర్ గ్లాసెస్ ధరించడం. అలాగే ప్రతి గంటకోమారు అయిదు నిమిషాల పాటు రిలాక్స్ కావడం. కంప్యూటర్‌పై పని చేసేవారు అదేపనిగా కనురెప్ప కొట్టకుండా తదేకంగా స్క్రీన్‌ను చూడటం సరికాదు.కుట్లు, అల్లికలు వంటివి చేసేవారు, అత్యంత సూక్ష్మమైన ఇంట్రికేట్ డిజైన్ల అల్లకం పని చేస్తుండేవారు తమ పనిలో తరచూ బ్రేక్ తీసుకుంటుండటం అవసరం.పిల్లల్లో తలనొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఐ సైట్ వల్ల తలనొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. తలనొప్పితో పాటు తల తిరగడం, వాంతుల కావడం వంటివి జరిగితే వెంటనే న్యూరాలజిస్టుతో పాటు కంటి వైద్యులనూ సంప్రదించడం మంచిది.రోజూ ప్రశాంతంగా కంటినిండా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్ర పోవాలి. కొంతమందికి వారి వ్యక్తిగత నిద్ర అవసరాలను బట్టి కాస్త ఎక్కువగా, తక్కువగా నిద్రపోతారు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరికి సరిపడినంతగా వారు నిద్రించడం మంచిది.మనకు సరిపడని పదార్థాలు తీసుకోవడం ఆపేయడం.ఆల్కహాల్, పొగతాగడం వంటి దురలవాట్లు తప్పనిసరిగా మానేయడం మేలు.కాఫీ, చాకొలెట్స్, కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ లాంటి పదార్థాలను మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కొన్ని రకాల శీతల పానియాలకు దూరంగా ఉండటం మంచిది.ఏదైనా అలవాటు తలనొప్పిని దూరం చేస్తుందనే అపోహతో (ఉదాహరణకు టీ, కాఫీ తాగడం వంటివి) పరిమితికి మించి తీసుకోవడం సరికాదు.ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. సరిపడని పెర్ఫ్యూమ్స్ను వాడటం మంచిదికాదు.తీవ్రమైన చప్పుళ్లకూ, చెవులు బద్దలు కొట్టే రణగొణ శబ్దాలకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. పరిసరాలు ప్రశాంతంగా ఉండటం వల్ల చాలారకాల తలనొప్పులు రాకుండా నివారించవచ్చు.ఇతర రకాల తలనొప్పులు... ఇవేగాక న్యూ డైలీ పర్సిస్టింగ్ హెడేక్ (ఎన్డీపీహెచ్), ప్రైమరీ థండర్‌క్లాప్ హెడేక్, క్లస్టర్ హెడేక్స్లో ఒక రకమైన ప్రైమరీ పారాక్సిస్మల్ హెమిక్రేనియా వంటి చాలా రకాల తలనొప్పుల కూడా ఉన్నాయి. కొన్నిసార్లు పంటినొప్పి, చెవినొప్పి, గొంతునొప్పి, కళ్లు నొప్పిగా ఉండటం వంటి కారణాలు కూడా తలనొప్పికి దారితీస్తాయి. అంటే దేహంలో ఒకచోట వచ్చిన నొప్పి మరోచోటికి పాకుతుంది. రిఫరింగ్ పెయిన్ కారణంగా ఈ నొప్పులు తలనొప్పి రూపంలో కనిపిస్తుంటాయి.తలనొప్పి వచ్చినప్పుడు అంతగా ఆందోళన పడకూడదు. అయితే మాటిమాటికీ తలనొప్పి వస్తుంటే మాత్రం డాక్టర్‌ను కలిసి కారణాన్ని కనుగొనేందుకు అవసరమైన నిర్ధారణ పరీక్షలు చేయించాలి. తెలిసిన కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవాలి.చివరగా... ముందుగా చెప్పినట్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో తలనొప్పి కనిపించకమానదు. అయితే మంచి జీవనశైలి (లైఫ్ స్టైల్) అలవాట్లతో చాలా రకాల తలనొప్పులను మాత్రమే కాదు... చాలా రకాల జబ్బులనూ నివారించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఉదయం నిద్రలేవగానే కనిపించే తలనొప్పలూ, వాటితో పాటు వాంతులు, వికారం, స్పృహ తప్పిపడిపోవడం వంటి తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా, వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించాలని తప్పక గుర్తుపెట్టుకోవాలి.- డా. ఎస్. రమేశ్, సీనియర్ న్యూరోసర్జన్ నిర్వహణ : యాసీన్ -
Migraine.. మాత్రలు లేకుండానే తగ్గాలంటే మ తినకూడని ఆహారాలు ఇవే!
-
మైగ్రేన్‌తో బాధ పడుతున్నారా.. పండంటి ఉపశమనం
జీవనశైలి సరిగా లేకపోవడం, అసమతుల్య ఆహారం, శరీరంలో తగినంత నీరు లేకపోవడం, పని ఒత్తిడి వంటి ఎన్నో కారణాలు మైగ్రేన్‌కు దారి తీస్తాయి. ఈ తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్ ఇచ్చే మందులతో పాటు కొన్ని రకాల పండ్లు తినడం వల్ల ఈ సమస్య నుంచి వేగంగా బయటపడొచ్చు. అవేంటో తెలుసుకుందాం..మైగ్రేన్ బాధితులు తినవలసిన పండ్లు ఇవేపుచ్చకాయ: మైగ్రేన్ బాధితులకు పుచ్చకాయ చాలా ప్రయోజనకరం. అందుకే మైగ్రేన్ బాధితులకు వైద్యులు పుచ్చకాయను సిఫార్సు చేస్తుంటారు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీన్ని తినడం వల్ల తలనొప్పిని తగ్గించడంలో, కండరాలను సడలించడంలో సహాయ పడుతుంది. నీటితో పాటు, పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి. చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్అరటిపండు: అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు లభిస్తాయి. అనారోగ్యంతో పోరాడే శరీర సామర్థ్యం పెరుగుతుంది. అరటిపండ్లలోని పొటాషియం, మెగ్నీషియం తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి.యాపిల్: యాపిల్ లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పెక్టిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అవకాడో: అవకాడో తినడం కూడా మైగ్రేన్ బాధితులకు చాలా మంచిది. ఇది తలనొప్పి, మైగ్రేన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అవకాడోలో మంచి మొత్తంలో రిబోఫ్లేవిన్, నియాసిన్, ఫోలేట్, పొటాషియం, లుటీన్, బీటా కెరోటిన్ వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడతాయి. ఈ పండ్లతో పాటు మైగ్రేన్ బాధితులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం కూడా చాలా ముఖ్యం. అలాగే యోగా, ధ్యానం, వ్యాయామం కూడా మైగ్రేన్ సమస్యను వేగంగా తగ్గిస్తాయి. చదవండి: రాయల్ వెడ్డింగ్ : గర్ల్‌ఫ్రెండ్‌తో జూ. ట్రంప్ స్టెప్పులు -
గర్బవతులకు మైగ్రేన్ వస్తే..
నాకు మైగ్రేన్ ఉంది. తరచుగా వస్తుంటుంది. ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడు నాకు మూడో నెల. ఎలాంటి మందులు వేసుకోవాలి? ఈ టైమ్‌లో మైగ్రేన్ బాధించకుండా ఏం చేయాలి? – టి. స్రవంతి, నాగ్‌పూర్ మైగ్రేన్ సర్వసాధారణమైన తలనొప్పి. మైగ్రేన్ నొప్పి మొదలవడానికి ముందు కొంతమందికి వాంతులు, వికారం, తల తిప్పినట్టవడం వంటివి ఉంటాయి. మీకు అలాంటి లక్షణాలు ఉంటాయా? ఉండవా? మీ మైగ్రేన్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ముందు మీరు మీ గైనకాలజిస్ట్‌తో చర్చించండి. దాదాపుగా సగం మందిలో ప్రెగ్నెన్సీలో సమయంలో మైగ్రేన్ తగ్గుతుంది. మందుల అవసరం కూడా తగ్గుతుంది. కానీ ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న కొందరిలో హై బీపీ, Pre eclampsia చాన్సెస్ పెరుగుతాయి. ప్రెగ్నెన్సీలో తగినంత విశ్రాంతి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం, టైమ్‌కి తినడం, యోగా, ధ్యానం లాంటివాటితో తలనొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పుడైనా తలనొప్పి మరీ ఎక్కువగా ఉంటే పారసిటమాల్ మాత్రను వేసుకోవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ అయిన మైండ్‌ఫుల్‌నెస్ లాంటివీ తలనొప్పి తగ్గేందుకు దోహదపడతాయి. ప్రెగ్నెన్సీ తొలినాళ్లలో క్రమం తప్పకుండా మెడిటేషన్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. ముందుగా.. మీకు దేనివల్ల మైగ్రేన్ పెరుగుతుందో చెక్ చేసుకోండి. ఆ ట్రిగర్ని మేనేజ్ చేస్తే ఎపిసోడ్స్ తగ్గుతాయి. కంటి నిండా నిద్ర చాలా అవసరం. ఎండలో తిరగటం, చీజ్, చాకోలేట్స్ మొదలైనవి కొందరిలో మైగ్రేన్‌ను ట్రిగర్ చేస్తాయి. మైగ్రేన్ ఎక్కువసార్లు వస్తూంటే ఒకసారి న్యూరాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సురక్షితమైన మందుబిళ్లలను అదీ తక్కువ మోతాదులో అదీ తక్కువసార్లు మాత్రమే తీసుకోమని సజెస్ట్ చేస్తారు. కొన్ని మందులు గర్భంలోని శిశువు ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే స్పెషలైజ్డ్ కేర్ టీమ్ పర్యవేక్షణలో ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో Ergotamine, Ibuprofen లాంటివి అస్సలు ప్రిస్క్రైబ్ చేయరు. తెలియకుండా మందులు వాడకూడదు. హైరిస్క్ కేర్ టీమ్‌ని సంప్రదించాలి. కొన్ని మందుల వల్ల బిడ్డకు పుట్టుకతో లోపాలు ఏర్పడవచ్చు. కొంతమంది ప్రెగ్నెన్సీ కంటే ముందే అధిక మోతాదులో కొన్ని మందులను తీసుకుంటూ ఉండి ఉంటే గర్భం నిర్ధారణ అయిన తర్వాత వాటిని మారుస్తారు. డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: పంపాతీరంలో హనుమంతునిచే త్రిశూలరోముడి హతం.. మునులకు ప్రశాంతత) -
ఎంతకీ తలనొప్పి తగ్గడం లేదా?
కొందరిలో తీవ్రమైన తలనొప్పి నెలల తరబడి కనిపిస్తుంది. మందులు వాడితే తగ్గుతుంది తాత్కాలికంగా.. ఆ తర్వాత మళ్లీ వేధిస్తుంటుంది. అసలు ఆ తలనొప్పి కి కారణాలేమిటో తెలుసుకుంటే చికిత్స చేయడం సులభం అవుతుంది. కంటిచూపు సమస్యలు, చెవి, దంతాల సమస్యలు లేనప్పుడు, మెదడు లో కంతులు, ఇతర వికారాల వంటి జబ్బుల గురించి ఆయా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. ఒకవేళ అలాంటివి లేకపోతే కేవలం క్రియాపరమైన మార్పులే తలనొప్పికి కార ణాలవుతాయి. ఉదాహరణకు మైగ్రేన్, మానసిక ఒత్తిడి, అధిక రక్తపోటు మొదలైనవి. నిద్రమామూలుగా పట్టి, మళ్లీ నిద్రలేవగానే వస్తుంటే అది మానసిక ఉద్వేగం, ఆందోళనలవంటి వత్తిడులుగా భావించవచ్చు. బీపీ, షుగర్ వంటి వ్యాధులుంటే ముందు వాటిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక ఒత్తిడిలో లక్షణంగా కూడా తలనొప్పి రావచ్చు. వత్తిడికి కారణాలు: ఆర్థిక సంబంధిత, ఉద్యోగపరమైన, కుటుంబపరమైన, సామాజికపరమైన, అత్యాశతో కూడిన వాంఛలకు సంబంధించిన అంశాలుంటాయి. అప్పుడప్పుడు కొన్ని మందుల వల్ల కూడా వత్తిడి అధికమవుతుంది. వీటిని విశ్లేషించి, సహేతుకంగా దూరం చేసుకోవాలి. రోజూ విరేచనం సాఫీగా అయ్యేట్టు చూసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం తక్కువగా ఉండే, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజాఫలాలు, గ్రీన్ సలాడ్స్, మొలకెత్తిన దినుసులు తీసుకోవాలి. రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరినూనెతో తలకు మృదువుగా మర్దనా చేయాలి. నిపుణుల పర్యవేక్షణలో శరీరానికంతటికీ మసాజ్, ధారాచికిత్స తీసుకోవడం. తేలికపాటి వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం. శ్రావ్యమైన సంగీతం, పాటలు వినడం. లేనిపోని ఆలోచనలకు దూరంగా ఉండడం... ద్వారా తలనొప్పిని దూరం చేసుకోవచ్చు. -
అమ్మో...తల పగిలిపోతోంది !
సాక్షి, గుంటూరు : గుంటూరు అరండల్‌పేటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య కొద్దిరోజులుగా తలనొప్పి వల్ల కాలేజీకి వెళ్లలేక ఇంట్లోనే ఉండి పోతోంది. తల్లిదండ్రులు ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లి పరీక్షలు చేయించగా మైగ్రేన్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. స్మార్ట్ ఫోన్లో అర్ధరాత్రి వరకు ఆన్లైన్ చాటింగ్‌లు చేస్తూ నిద్ర సక్రమంగా పోకపోవడం వల్ల వ్యాధికి గురైనట్లు నిర్ధారణ చేశారు. విజయవాడ చిట్టినగర్‌కు చెందిన కావేరి ఇంట్లో పనులు ఏమీ చేయకుండా తలనొప్పి వల్ల మంచానికే పరిమితమవుతూ ఉండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా..మైగ్రేన్ అని నిర్ధారణ చేశారు. వ్యసనాలకు బానిసైన భర్త ఇంట్లోకి నెలవారీ సరుకులు తేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఆమెలో విపరీతమైన ఆలోచనలు పెరిగిపోయి మైగ్రేన్ తలనొప్పి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆధునిక జీవనశైలి వల్ల నేడు అధిక సంఖ్యలో యువత మైగ్రేన్ బారిన పడుతున్నారని, ప్రతి రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు తలనొప్పి బాధితులు వస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. తలనొప్పి, మైగ్రేన్ వారోత్సవాల సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. యువతలోనే అధిక శాతం ఆధునిక జీవన శైలిలో యువతే ఎక్కువగా మైగ్రేన్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాలేజీ పిల్లలు, 30ఏళ్లలోపు ఉద్యోగాలు చేస్తున్న వారు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతూ మైగ్రేన్ బారిన పడుతున్నారు. ఉద్యోగాలు, చదువులో పోటీతత్వం ఏర్పడి ర్యాంకులు సాధించేందుకు ఒత్తిడికి గురవ్వడం వల్ల తలనొప్పి వస్తోంది. నిద్రలేమి, విచ్చలవిడిగా కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు వినియోగిస్తూ కంటికి సరిపడా నిద్ర లేకుండా ఉండటం వల్ల మైగ్రేన్ బారిన పడుతున్నారు.న్యూరాలజిస్టులు జిల్లాలో 20 మంది ఉండగా ఒక్కో వైద్యుడి వద్దకు ఐదుగురు బాధితులు తలనొప్పితో చికిత్స కోసం వస్తున్నారు. ప్రతి ఏడుగురిలో ఒకరు మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మైగ్రేన్ తలనొప్పికి కారణాలు మైగ్రేన్ ( పార్శ్వపు) తలనొప్పి వచ్చిన వారికి ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. ఇది చాలా వరకు తలకు ఒక పక్క మాత్రమే వస్తుంది. తలలో రక్తనాళాలు ఒత్తిడికి గురై వాయడం వల్ల వస్తుంది. కొన్నిసార్లు తలలో రెండు వైపులా ఈ నొప్పి వస్తుంది. తలలో కొట్టుకుంటున్నట్లుగా, నొప్పి వస్తూ పోతూ ఉన్నట్లుగా, తగ్గుతూ ... తీవ్రమవుతూ ఉన్నట్లుగా ఉంటుంది. కొందరికి వాంతులు అవుతాయి. మానసిక ఆందోళన, ఒత్తిడికి గురవ్వడం, అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగినా, ప్రయాణాలు ఎక్కువ చేసినా, భోజనం చేయడం ఆలస్యమైనా, అసలు భోజనం చేయకపోయినా, నిద్ర తక్కువైనా , ఎక్కువైనా తలనొప్పి రావొచ్చు. స్త్రీలలో హోర్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుక్రమం ముందు గానీ, తర్వాత గానీ వచ్చే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో రుతుచక్రం ఆగిపోయినప్పుడు సమస్య తీవ్రతరమవుతుంది. పార్శ్వనొప్పి జన్యుపరమైన సమస్య. వంశంలో ఒకరికి ఉంటే వేరొకరికి వచ్చే అవకాశం ఉంది. మగవాళ్ల కంటే స్త్రీలలో బాధితులు ఎక్కువ. లక్షణాలు పార్శ్వనొప్పి వచ్చిన మొదటి దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనల్లో మార్పు రావడం, వాసన, వెలుతురు పడకపోవటం, మెడనొప్పి ఉంటాయి. రెండో దశలో చూపు మందగించడం, జిగ్‌జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన భావన కలుగుతుంది. మాటలు తడబడటం, కాళ్లలో నీరసం ఉంటాయి. మూడో దశలో తలనొప్పి రెండు గంటల నుంచి మూడు రోజులపాటు ఉండొచ్చు. వాంతులు ఉంటాయి. నొప్పి ఒక వైపు ఉంటుంది. కాంతిని చూసినా, శబ్దాలు విన్నా చికాకు పుడుతుంది. నాలుగో దశలో తలనొప్పి తగ్గిన తర్వాత కొద్ది రోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, బీపీ, ఈఈజీ, సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మైగ్రేన్‌ను నియంత్రణలో పెట్టడం ద్వారా కొన్నాళ్లకు అదే తగ్గిపోతుంది. కానీ కొంత కాలం తర్వాత తిరిగి రావచ్చు. నెలకు రెండుసార్లు కంటే ఎక్కువగా తలనొప్పి వస్తున్నా, ఒక్కసారే వచ్చి ఎక్కువసేపు ఉంటున్నా ప్రత్యేక మందులు తీసుకోవాలి. జాగ్రత్తలు పాటించాలి మానసిక ఒత్తిడికి గురికాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అతిగా ఆలోచనలు చేయవద్దు. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతిలేని చోట, నిశ్శబ్దంగా ఉన్న చోట నిదురించాలి. ధ్యానం, యోగా, ప్రాణాయామం చేయాలి. తలనొప్పి వస్తుంటే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఎలాంటి తలనొప్పో నిర్ధారణ చేయించుకుని మందులు వాడాలి. – డాక్టర్ చక్కా శివరామకృష్ణ, న్యూరాలజిస్ట్, గుంటూరు -
శస్త్రచికిత్స లేకుండానే మైగ్రేన్ కు చెక్
వాషింగ్టన్ : మైగ్రేన్ తలనొప్పితో బాధపడే చిన్నారులకు ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే దాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ నూతన పద్ధతి చాలా సురక్షితమైందని, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని తాజా అధ్యయనంలో తేలింది. స్పెనోపాలటైన్ గాంగ్లియన్ గా పిలిచే ఈ పద్ధతిలో ఎటువంటి సూదుల అవసరం ఉండదని, సూదులకు బదులుగా చిన్నపాటి గొట్టాన్ని నాసికా రంధ్రాలకు జతచేసి చికిత్సను అందిస్తారు. ముక్కు వెనక భాగంలో ఉండే నరాలు మైగ్రేన్ నొప్పిని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు. 12 ఏళ్లు దాటిన యువకులు, పెద్దల్లో 12 శాతం మంది మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. యుక్తవయసులో ఉన్న వారి మైగ్రేన్ వల్ల రోజువారీ కార్యకలాపాలైన ఆటలు ఆడటం, పాఠశాలకు వెళ్లలేకపోవడం, సంగీతాన్ని ఆస్వాదించలేకపోవడం వంటివి జరుగుతున్నాయని తెలిపారు. -
మెనోపాజ్‌కు ముందు ఇదో ‘తలనొప్పి’!
సాధారణంగా టీనేజ్ దాటి వయసు పెరుగుతుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంటుంది. కానీ మెనోపాజ్‌కు చేరువైన కొద్దీ మైగ్రేన్ తలనొప్పి పెరుగుతుంటుందని ఇటీవలి కొన్ని అధ్యయనాల్లో తేలింది. గత కొన్నేళ్లుగా తమకు మైగ్రేన్ తలనొప్పి పెరుగుతోందని మహిళల నుంచి డాక్టర్లకు ఎక్కువగా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అయితే మెనోపాజ్‌కు చేరువవుతున్న కొద్దీ తలనొప్పి పెరగడంతో పాటు నెలలో పది రోజుల వరకూ తలపోటు ఉంటోందట. గతంలో కంటే ఈ తరహా కేసులు దాదాపు 60 శాతం పెరిగాయని ‘హెడేక్ : ద జర్నల్ ఆఫ్ హెడ్ అండ్ ఫేస్ పెయిన్స్’ అనే జర్నల్‌లో ప్రచురితమైంది. రుతుస్రావం ఆగడానికి ముందుగా ఉండే ‘పెరీమెనోపాజ్’ సమయంలో ఈ తలనొప్పులు మరింత ఎక్కువవుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. -
మైగ్రేన్ తలనొప్పి.. అశ్రద్ధ చేయొద్దు..
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. రక్తపోటు, మెదడులో కణితులు, రక్త ప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల తల నొప్పి వచ్చే అవకాశం ఉంది. మైగ్రేన్ స్త్రీలలో అధికంగా కనిపిస్తుంది. నొప్పి చాలా వరకు తలకు ఓ పక్క భాగంలో ఉంటుంది. మైగ్రేన్ రావడానికి కారణం... తలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనై వాయడం. పార్శ్వపు తలనొప్పికి కారణాలు: పార్శ్వపు తలనొప్పి ముఖ్యకారణం మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి. కొంత మందికి బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి ద్వారా తలనొప్పి వస్తుంది. అధికంగా ప్రయాణాలు చేయడం. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, రుతుచక్రం ముందుగా గానీ, తరువాత గానీ వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయం, రుతుచక్రం ఆగిపోయినప్పుడు ఈ సమస్య తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఎక్కువగా వస్తుంది. మైగ్రేన్ దశలు - లక్షణాలు: చాలా వరకు మైగ్రేన్ దానంతటదే తగ్గిపోతుంది. సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటలు కూడా పట్టవచ్చు. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ నొప్పి 4 దశలలో సాగుతుంది. పోడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రేషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. ఆరాఫేజ్: ఈ దశ నొప్పి మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు కాస్త మందగించినట్లుండటం, జిగ్‌జాగ్ లైన్స రావడం, తలలో సూదులతో గుచ్చినట్లు ఉండడం, మాటలు తడబడడం, కాళ్లలో నీరసం ఉంటాయి. నొప్పి దశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండవచ్చు. ఈ దశలో వాంతులు ఉంటాయి. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తరువాత కొద్ది రోజుల వరకు తల భారంగా ఉండటం, నీరసంగా ఉండటం, శ్రద్ధ లేకుండా ఉండటం జరుగుతుంది. వ్యాధి నిర్ధారణ: రక్త పరీక్షలు - సీబీపీ, ఈఎస్ఆర్ రక్తపోటును గమనించడం ఈఈజీ పరీక్ష సీటీ స్కాన్ (మెదడు) ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. తలలోని నరాలు రిలాక్సవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి, నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి. హోమియో వైద్యం: మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులు ఉన్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు తలనొప్పి వస్తే బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నీషియా ఇవ్వాలి. తరుచూ అధికంగా తలనొప్పి వస్తుంటే నేట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో తలనొప్పి వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల నొప్పి వస్తే ఇగ్నీషియా, సెపియా, కాక్యులస్, కాలికార్భ ఇవ్వాలి. స్కూల్‌కు వెళ్ళే ఆడపిల్లల్లో వస్తే కాల్కేరియా ఫాస్, నేట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. ఈ మందులు అవగాహనకు మాత్రమే. మందులను నిష్ణాతులైన హోమియో వైద్యుని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. డాక్టర్ మురళీ అంకిరెడ్డి, ఎం.డి హోమియో, స్టార్ హోమియోపతి సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, నేరేడ్మెట్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ మరియు కర్ణాటక అంతటా... ఫోన్: 7416 102 102, www.starhomeo.com


