breaking news
max bupa
-
కరోన 'రక్షణ' ఉందా..?
ఆరోగ్య బీమా అవసరాన్ని మనలో అధిక శాతం మంది ఇంతకాలం గుర్తించలేదు. కానీ, కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోంది. ఆరోగ్య బీమా అవసరాన్ని చాలా మంది గుర్తిస్తున్నారు. అందరికీ ఆరోగ్య బీమాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు.. ముఖ్యంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక విపత్కర పరిస్థితులను దృష్టిలోకి తీసుకుని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) కరోనాకు సంబంధించి ప్రత్యేక పాలసీలను ప్రవేశపెట్టాలని నిర్దేశించింది. దీంతో అన్ని ప్రముఖ సంస్థలు కరోనా కవచ్, కరోనా రక్షక్ పేరుతో రెండు రకాల పాలసీలను ప్రవేశపెట్టాయి. కరోనా కోసం బీమా సంస్థలు తీసుకొచ్చిన రెండు ప్రామాణిక పాలసీల్లో ఏది మీకు అనుకూలం..? వీటిల్లో కవరేజీ, మినహాయింపులు తదితర సమగ్ర అంశాలతో కూడిన ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది.. పాలసీల్లో వైరుధ్యం.. కరోనా కవచ్, కరోనా రక్షక్ రెండు రకాల పాలసీలు కోవిడ్–19 చికిత్సలకు పరిహారం చెల్లించేందుకు ఉద్దేశించినవి. కరోనా కవచ్ పాలసీ ఇండెమ్నిటీ ప్లాన్. అంటే కరోనా కారణంగా చికిత్సలకు అయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. తీసుకున్న బీమా మొత్తానికి ఇది పరిమితం అవుతుంది. ఇక కరోనా రక్షక్ పాలసీ అనేది బెనిఫిట్ పాలసీ. అంటే కరోనా బారిన పడితే ఎంచుకున్న బీమా మొత్తాన్ని ఒకే విడత చెల్లించేస్తుంది. కరోనా పాజిటివ్ అని తేలి, కనీసం 72 గంటలు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వస్తేనే కరోనా రక్షక్ పాలసీ ప్రయోజనం లభిస్తుంది. ప్రభు త్వం గుర్తింపు కలిగిన ల్యాబ్‌ల్లో పరీక్షల ద్వారా కరోనా నిర్ధారణ అయితేనే ఈ రెండు పాలసీల్లోనూ పరిహారం లభిస్తుంది. కరోనా కవచ్ పాలసీ విడిగా వ్యక్తులకు, లేదా కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ పాలసీ రూపంలో అందుబాటులో ఉంటుంది. కరోనా రక్షక్ పాలసీ అనేది కుటుంబానికి కాకుండా ప్రతీ వ్యక్తి విడిగా తీసుకోవాల్సిన పాలసీ. ఈ 2 రకాల పాలసీలు 105 రోజులు (3.5 నెలలు), 195 రోజులు (6.5 నెలలు), 285 రోజుల (9.5 నెలలు) కా లానికి లభిస్తాయి. ఆ తర్వాత అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. కనీస బీమా రూ. 50,000 నుంచి మొదలవుతుంది. గరిష్టంగా కరోనా కవచ్ పాలసీలో రూ.5 లక్షల బీమాను ఎంచుకోవచ్చు. కరోనా రక్షక్ ప్లాన్‌లో గరిష్ట బీమా రూ.2.5 లక్షలకు పరిమితం అవుతుంది. కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 65 సంవత్సరాల అర్హత మేరకు పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీల్లో ప్రీమియం వాయిదాల రూపంలో కాకుండా ఒకే విడత చెల్లించాలి. నెట్వర్క్ ఆస్పత్రుల్లో చేరడం ద్వారా కరోనా కవచ్ పాలసీదారులు నగదు రహిత చికిత్సలు పొందొచ్చు. ఈ పాలసీలను ఆయా బీమా సంస్థల పోర్టళ్లు, పంపిణీ చానళ్లు, ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. ఈ ప్రత్యేక పాలసీలను తీసుకోవచ్చా..? బీమా కంపెనీ ఏదైనా కానీ ఈ రెండు రకాల పాలసీలకు సంబంధించి అధిక శాతం నిబంధనలు ఒకే విధంగా ఉన్నాయి. ప్రీమియం, బీమా సంస్థ అందించే సేవల నాణ్యత, క్లెయిమ్‌లను వేగంగా ఆమోదించడం వంటి విషయాలను పరిశీలించాలి. అదే విధంగా బీమా కంపెనీల చెల్లింపుల చరిత్రను చూసిన తర్వాతే మీకు అనుకూలమైన సంస్థ నుంచి పాలసీని ఎంచుకోవాలి. ఈ పాలసీల్లో ప్రాంతాల వారీగా ప్రీమియంలో వ్యత్యాసం ఉండదు. రెగ్యులర్ హెల్త్ ప్లాన్లలో ప్రాంతాల వారీగా ప్రీమియం మారిపోవడాన్ని గమనించొచ్చు. కానీ కోవిడ్ పాలసీల్లో ప్రీమియం అన్ని ప్రాంతాల వారికి ఒకే రీతిలో ఉంటుంది. 40 ఏళ్ల వ్యక్తి మూడున్నర నెలల కాలానికి కరోనా కవచ్ పాలసీని ఎంచుకుంటే ప్రీమియం కనిష్టంగా రూ.636 నుంచి గరిష్టంగా రూ.3,831 వరకు ఉంటుంది. అదే 9.5 నెలల కోసం ఇదే వయసున్న వ్యక్తికి ప్రీమియం రూ.1,286–5,172 మధ్య ఉంటుంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఓ సమగ్రమైన ఆరోగ్య బీమా ఉండి, అందులో ఔట్ పేషెంట్ చికిత్సలకు కూడా కవరేజీ ఉండుంటే అప్పుడు ప్రత్యేకంగా కరోనా కవచ్ పాలసీని తీసుకోవాల్సిన అవసరం లేనట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇప్పటికే అమల్లో ఉన్న అన్ని హెల్త్ ప్లాన్లలో కరోనాకు కవరేజీ లభిస్తుంది. కాకపోతే కరోనా వల్ల ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తే.. అన్ని ప్లాన్లలోనూ పరిహారం రాకపోవచ్చు. కానీ కరోనా రక్షక్ పాలసీ ఎవరికైనా అనుకూలమే. ఎందుకంటే ఇప్పటికే హెల్త్ ప్లాన్ ఉన్నా కానీ.. కరోనా రక్షక్‌లో ఏకమొత్తంలో పరిహారం అందుకోవచ్చు. ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండి, బీమా మొత్తాన్ని మించిపోయినా అప్పుడు కరోనా రక్షక్ ఆదుకుంటుంది. కానీ, కరోనా రక్షక్‌లో పాజిటివ్‌గా తేలిన వ్యక్తి కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటేనే పరిహారం లభిస్తుంది. అయితే, ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ ప్లాన్ లేని వారు ప్రస్తుత కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో కరోనా కవచ్ లేదా కరోనా రక్షక్ను తీసుకోవడాన్ని తప్పకుండా పరిశీలించాల్సిందే. కవరేజీ వేటికి..? కరోనా కవచ్ పాలసీలో.. కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నా.. ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా గరిష్ట బీమా మేరకు పరిహారం పొందొచ్చు. ఆస్పత్రిలో కనీసం 24 గంటల పాటు చికిత్స పొందినప్పుడే ఖర్చులను చెల్లిస్తుంది. రూమ్ అద్దె, బోర్డింగ్, నర్సింగ్ చార్జీలు, ఐసీయూ, అంబులెన్స్ (రూ.2,000వరకు) చార్జీలను కూడా పొందొచ్చు. వైద్య, కన్సల్టెంట్, ఆపరేషన్ థియేటర్, పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌కు అయ్యే వ్యయాలకూ బీమా సంస్థ చెల్లిస్తుంది. ఒకవేళ ఇంట్లోనే ఉండి చికిత్స పొందితే.. గరిష్టంగా 14 రోజుల చికిత్స వ్యయా లను భరిస్తుంది. అది కూడా వైద్యుల సూచన మేరకు ఇంట్లో ఉండి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే పరిహారం కోసం క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. ఆయుర్వేద ఆస్పత్రిలో ఇన్ పేషెంట్‌గా చేరి చికిత్స తీసుకున్నా కరోనా కవచ్ పాలసీ కవరేజీనిస్తుంది. ఆస్పత్రిలో చేరడానికి ముందు అయిన ఖర్చులు (15 రోజులు), ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అనంతరం 30 రోజుల వరకు ఔషధాలు, ఇతర వ్యాధి నిర్ధారణ, వైద్యుల కన్సల్టేషన్ కోసం అయ్యే ఖర్చులనూ పొందొచ్చు. కరోనా కవచ్ పాలసీలు ‘హాస్పిటల్ డైలీ క్యాష్’ రైడర్‌నూ ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఆస్పత్రిలో చేరినప్పుడు వ్యక్తిగతంగా కొన్ని ఖర్చులు అవుతుంటాయి. అటువంటప్పుడు ఈ కవరేజీ అక్కరకు వస్తుంది. దీన్ని ఎంచుకుంటే బీమా మొత్తంలో 0.5 శాతాన్ని ప్రతీ రోజుకు బీమా సంస్థలు అందిస్తాయి. కాకపోతే 24 గంటలకు మించి ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలి. అదే కరోనా రక్షక్పాలసీ విషయంలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే ఎంచుకున్న బీమా పరిహారాన్ని ఏక మొత్తంలో పొందవచ్చు. ఉదాహరణకు రూ.2.5 లక్షల సమ్ ఇన్సూర్డ్ ఎంచుకున్నారనుకుంటే.. కరోనా పాజిటివ్ అయి 72 గంటలు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం క్లెయిమ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చు ఎంతయిందన్న దానితో సంబంధం లేకుండా బీమా సంస్థ రూ.2.5 లక్షలను చెల్లించేస్తుంది. 72 గంటల్లోపు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయితే ఈ పాలసీలో పరిహారం రాదు. వీటిని దృష్టిలో ఉంచుకోవాలి ఇతర హెల్త్ ప్లాన్లలో మాదిరే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీల్లోనూ 15 రోజులు వేచి ఉండే కాలం (వెయిటింగ్ పీరియడ్) అమల్లో ఉంటుంది. అంటే పాలసీ ఇష్యూ చేసిన మొదటి 15 రోజుల్లో కరోనా బారిన పడినా క్లెయిమ్‌కు అర్హత ఉండదు. పరిహారానికి సంబంధించి తగ్గింపు నిబంధనల్లేవు. పోర్టబులిటీ ఆప్షన్ ఉంటుంది. పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నది బీమా సంస్థలను బట్టి నిబంధనలు వేర్వేరుగా అమల్లో ఉండొచ్చు. వైద్య రంగంలో పనిచేసే సిబ్బందికి కరోనా కవచ్ పాలసీ ప్రీమియంలో 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు రకాల పాలసీల్లో మినహాయింపులు కొన్ని ఉన్నాయి. ఆమోదం లేని చికిత్సా విధానాలకు ఇందులో కవరేజీ లభించదు. కరోనా చికిత్సలో భాగంగా కొన్ని మందులను ప్రయోగాత్మకంగా ఇస్తున్న వార్తలను వింటూనే ఉన్నాం. నియంత్రణ సంస్థల ఆమోదంతో ఇస్తున్న ఔషధాలు, చికిత్సలకు సంబంధించే కవరేజీ లభిస్తుందని గుర్తుంచుకోవాలి. ప్రయాణ పరంగా ఆంక్షలు అమల్లో ఉన్న ఏ ఇతర దేశంలో పర్యటించినా పాలసీ రద్దయిపోతుంది. డే కేర్ చికిత్సలు (ఆస్పత్రిలో చేరకుండా తీసుకునే చికిత్సలు), ఔట్ పేషెంట్ చికిత్సలకు కరోనా కవచ్ పాలసీలో కవరేజీ ఉండదు. కరోనా ప్రత్యేక పాలసీలకు వస్తున్న స్పందన అనూహ్యం. పాలసీబజార్ వెబ్సైట్ నిత్యం 300–500 పాలసీలను విక్రయిస్తోంది. తీసుకుంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. – అముత్ చాబ్రా, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్, పాలసీబజార్ ఎక్కువ మంది తొమ్మిదిన్నర నెలల కాలానికి పాలసీ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ 40 శాతం మంది హాస్పిటల్ డైలీ క్యాష్‌ను ఎంచుకుంటున్నారు. – సుబ్రతా మోండల్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (అండర్‌రైటింగ్), ఇఫ్కోటోకియా జనరల్ ఇన్సూరెన్స్ కుటుంబంలోని ఇతర సభ్యులకు కవరేజీతోపాటు, ఇంట్లో ఉండి చికిత్స తీసుకున్నా ఖర్చులు చెల్లించే ఫీచర్లు ఉండడం ఎక్కువ ఆసక్తికి కారణం. – సుబ్రమణ్యం బ్రహ్మజోస్యుల, అండర్‌రైటింగ్ హెడ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ -
కరోనా కవచ్... బీమా కంపెనీల కొత్త పాలసీలు
కరోనా కారణంగా ఆస్పత్రి పాలైతే ఖర్చులను చెల్లించే హెల్త్ పాలసీలను ‘కరోనా కవచ్’ పేరుతో బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక స్వల్పకాలిక పాలసీలను (గరిష్టంగా 11 నెలల కాలంతో) జూలై 10 నాటికి తీసుకురావాలంటూ బీమా నియంత్రణ సంస్థ.. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అ«థారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ )గడువు పెట్టడంతో.. హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియాంజ్ జనరల్, మ్యాక్స్‌బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్ తదితర బీమా సంస్థలు ఇటువంటి పాలసీలను ప్రవేశపెట్టాయి. మ్యాక్స్‌బూపా మ్యాక్స్ బూపా సంస్థ తక్కువ ప్రీమియానికే కరోనా కవచ్ పాలసీని తీసుకొచ్చినట్టు ప్రకటించింది. రూ.2.5 లక్షల కవరేజీ కోసం 31–55 ఏళ్ల వయసు వారు రూ.2,200 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందని.. అదే ఇద్దరు పెద్దలు, ఒక చిన్నారి కోసం రూ.2.5 లక్షల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం రూ.4,700గా ఉంటుందని తెలిపింది. హెచ్డీఎఫ్సీ ఎర్గో కరోనా కారణంగా వ్యక్తులు ఆస్పత్రిలో చేరి చికిత్సలు తీసుకుంటే పరిహారం చెల్లించే సదుపాయంతో హెచ్డీఎఫ్సీ ఎర్గో సంస్థ కరోనా కవచ్ పాలసీని విడుదల చేసింది. ప్రభుత్వ గుర్తింపు ఉన్న వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో చేసిన పరీక్షతో పాజిటివ్ వచ్చి చికిత్స తీసుకుంటే అందుకయ్యే ఖర్చులను చెల్లిస్తుంది. అంతేకాదు కరోనా పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చే కోమార్బిడిటీ చికిత్సలకు కూడా ఈ పరిహారం అందుతుంది. ఒకటికి మించిన ఆరోగ్య సమస్యలను కోమార్బిడిటీగా చెబుతారు. అంబులెన్స్ చార్జీలను కూడా చెల్లిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఉండి చికిత్సలు తీసుకున్నా కానీ, 14 రోజుల కాలానికి అయ్యే ఖర్చులను భరిస్తుండడం ఈ పాలసీలోని అనుకూలాంశం. అల్లోపతితోపాటు ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ వైద్యాలకు కవరేజీ కూడా ఇందులో ఉంటుంది. రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీని ఎంచుకోవచ్చు. బజాజ్ అలియాంజ్ బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ కూడా ఇదే విధమైన పాలసీని ప్రవేశపెట్టింది. కనీసం రూ.50,000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల కవరేజీకి ప్రీమియం రూ.447–5,630 మధ్య ఉంటుందని కంపెనీ ప్రకటించింది. దీనికి జీఎస్టీ చార్జీలు అదనం. హాస్పిటల్ డైలీ క్యాష్ బెనిఫిట్ ఎంచుకుంటే ప్రీమియం రూ.3,620 మధ్య ఉంటుంది. 0–35 ఏళ్ల మధ్యనున్న వారు మూడున్నర నెలలకు రూ.50వేల కవరేజీని ఎంచుకుంటే ప్రీమియం కింద రూ.447తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. -
కుటుంబానికి ధీమా
35 ఏళ్లలోపు వ్యక్తి రెండు లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే ఏడాదికి సుమారుగా రూ. 2,500 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులకు విడివిడిగా పాలసీ తీసుకుంటే రూ. 10,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇలా వ్యక్తిగతంగానాలుగు పాలసీలు కాకుండా కుటుంబ సభ్యులందరికీ కలిపి 4 లక్షలకు వైద్య బీమా పాలసీ తీసుకుంటే రూ. 7,000 చెల్లిస్తే చాలు. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత. తక్కువ ప్రీమియంతో రెట్టింపు బీమా రక్షణ లభిస్తుండటంతో వైద్య బీమా రంగంలో ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలకు డిమాండ్ పెరుగుతోంది. అసలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయి? వాటి ప్రయోజనాలపై అవగాహన పెంచేదే ప్రాఫిట్ ముఖ్య కథనం. ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. కేవలం సంపాదించే వ్యక్తే కాకుండా కుటుంబ సభ్యులందరికీ వైద్య బీమా ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇండివిడ్యువల్ హెల్త్ పాలసీల అమ్మకాలు తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల అమ్మకాలు పెరుగుతుండటమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. దీంతో బీమా కంపెనీలు అత్యధికంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలపై దృష్టిసారిస్తున్నాయి. పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయం కూడా ఈ పాలసీలకు ఆదరణ పెంచుతోంది. మన దేశంలో వైద్య ఖర్చులు ఏటా 20% చొప్పున పెరుగుతున్నట్లు (హెల్త్ ఇన్ఫ్లేషన్) గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇలా వ్యయం పెరుగుతుండంటంతో అందరూ వైద్య బీమా పాలసీలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే... వ్యక్తిగతంగా అంటే ఒక వ్యక్తి పేరు మీద తీసుకునే పాలసీలను ఇండివిడ్యువల్ పాలసీలుగాను, అదే కొందరు వ్యక్తులు, సంఘాలు కలిపి తీసుకునే వాటిని గ్రూపు పాలసీలుగా పరిగణిస్తారు. ఈ రెండు కాకుండా కేవలం దగ్గరి రక్తసంబంధీకులు ఒక సమూహంగా ఏర్పడి తీసుకునే వాటిని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలంటారు. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోట ర్లో భార్య, భర్త, వారి పిల్లలు ఉంటారు. కానీ ఇప్పుడు కొన్ని కంపెనీలు కుటుంబంతో పాటు తల్లిదండ్రులు, అత్తమామలకు కలిపి కూడా పాలసీలను అందిస్తున్నాయి. చాలా బీమా కంపెనీలు ఆరుగురు కుటుంబ సభ్యులకు మించి ఈ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని ఇవ్వడం లేదు. అదే మాక్స్‌బూపా వం టి ఒకటి రెండు కంపెనీలు మాత్రం 13 మంది రక్తసంబంధీకుల వరకు పాలసీలను అందిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి?.. కేవలం సంపాదిస్తున్న వ్యక్తికే కాకుండా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య బీమా పాలసీ కలిగి ఉండాల్సిందే. ఇలా విడివిడిగా ఒక్కొక్కరి పేరుమీద పాలసీ తీసుకోవడం చాలా వ్యయంతో కూడుకున్నది. ఉదాహరణకు రమేష్ తన పేరు మీద రూ.2 లక్షలు, భార్య పేరు మీద రూ.లక్ష, కూతురు, కొడుకు పేరు మీద చెరో రూ.50,000కి పాలసీ చొప్పున మొత్తం నాలుగు పాలసీలు తీసుకున్నాడనుకుందాం. కానీ అనుకోకుండా కొడుక్కి అనారోగ్యం రావడంతో ఆసుపత్రి బిల్లు రూ.1.30 లక్షలు అయింది. కొడుకు పేరు మీద రూ.50,000 బీమా రక్షణ ఉండటంతో మిగిలిన రూ.80,000 జేబులోంచి పెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఇలా విడివిడిగా కాకుండా కుటుంబంలోని అందరికీ వర్తించే విధంగా నాలుగు లక్షలకు వైద్య బీమా తీసుకుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. అంతేకాదు, ప్రీమియం భారం కూడా తగ్గుతుంది. 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులకు 5 లక్షల వైద్య బీమాకు రూ.5,355 చెల్లించాలి. కేవలం భార్యాభర్తలకే అనుకున్నా ఇద్దరికీ విడివిడిగా తీసుకుంటే రూ.10,710 చెల్లించాలి. కానీ అదే బీమా కంపెనీ ఫ్యామిలీ ఫ్లోటర్‌ను రూ.7,321కే అందిస్తోంది. అంటే అదే బీమా రక్షణ లభించడమే కాకుండా ప్రీమియం రూ.3,389 తగ్గింది. ఎందుకు తక్కువ? బీమా కంపెనీల పాలసీ రూపకల్పన, ప్రీమియం లెక్కింపు వంటి అంశాల్లో యాక్చువేరియల్దే కీలకపాత్ర. వీరి అంచనాల ప్రకారం ఏడాదిలో ఒక కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు చాలా తక్కువ. సాధారణంగా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల్లో నలుగురు సభ్యులు ఉంటున్నారు. అంటే నలుగురులో ఏదైనా జరిగినా ఒకరికంటే ఎక్కువ క్లెయిమ్‌లు రాకపోవచ్చని అంచనా. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీల ప్రీమియంలు తగ్గిస్తున్నాయి. కొత్త పాలసీలు వ్యక్తిగత పాలసీల విక్రయం తగ్గి ఫ్యామిలీ ఫ్లోటర్‌కి డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలు ఈ దిశగా కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్నాయి. ఈ మధ్యనే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ విడుదల చేసిన కొత్త పథకానికి మంచి స్పందన వస్తోంది. దీంతో యునెటైడ్ ఇండియా కూడా ఈ రకమైన పథకాన్ని ప్రారంభించడానికి ఐఆర్డీఏకి దాఖలు చేసింది. ఇవికాకుండా అపోలో మ్యూనిక్, మాక్స్ బూపా, ఐసీఐసీఐ లాంబార్డ్, హెచ్డీఎఫ్సీఎర్గో వంటి కంపెనీలన్నీ ఫ్యామిలీ ఫ్లోటర్లను అందిస్తున్నాయి.