breaking news
Last week
-
ఇంత అమానుషమా!
వారం రోజుల వ్యవధిలో చానెళ్లలో కనబడిన వేర్వేరు దృశ్యాలు మానవత్వం గల ప్రతి ఒక్కరినీ కదిలించాయి. తొలి ఉదంతం ప్రభుత్వాసుపత్రిలో క్షయ బారిన పడి తనువు చాలించిన భార్య మృతదేహాన్ని భుజానకెత్తుకుని 60 కిలోమీటర్ల దూరం లోని స్వగ్రామానికి బయల్దేరిన ఒక నిరుపేద గిరిజనుడికి సంబంధించింది. అతని వెంట ఉబికివస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ నడుస్తున్న పన్నెండేళ్ల వారి కుమార్తె కూడా ఉంది. ఒడిశాలో ఆకలి, దారిద్య్రం విలయతాండవం చేస్తున్న కలహండి జిల్లాలోనిది ఈ ఘటన. వారిద్దరూ ప్రధాన రహదారిపై ఆ మృతదేహంతో పది పన్నెండు కిలోమీటర్లు నడిచాక పాత్రికేయుల కంటబడ్డారు కాబట్టి అది ప్రపంచా నికి వెల్లడైంది. రెండో ఉదంతం కూడా ఆ రాష్ట్రానికి సంబంధించిందే. బాలాసోర్ జిల్లాలో మరణించిన 80 ఏళ్ల వృద్ధురాలి భౌతికకాయాన్ని నడుం దగ్గర విరిచి ఒక కట్టెకు కట్టి మోసుకెళ్తున్న దృశ్యమది. యధాతథ స్థితిలో మృతదేహం తరలింపు సాధ్యం కాదు గనుక అలా చేశానని ఆ ఘోరానికి పాల్పడ్డ వ్యక్తి సంజాయిషీ ఇచ్చాడు. తన కళ్లెదుటే ఇలా జరగడం చూసి వృద్ధురాలి కొడుకు రోదిస్తుండటం కూడా ఆ దృశ్యంలో కనబడింది. మరొకటి మధ్యప్రదేశ్లోనిది. జబ్బుపడిన భార్యను ఆసుపత్రిలో చేర్పించేందుకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో కన్నుమూసిందని తెలియగానే ఆమె భర్తను, వారి అయిదునెలల పసికందునూ, వృద్ధురాలైన వారి బంధువునూ బస్సునుంచి గెంటేసిన ఉదంతమది. ఎడతెరపిలేని వర్షం, పైగా అటవీ ప్రాంతం... అలాంటిచోట నిర్దాక్షిణ్యంగా మృతదేహంతో సహా వారందరినీ నెట్టేస్తే ఎవరూ నోరెత్తలేదు. గంట తర్వాత అటుగా వాహనంలో వెళ్తున్న న్యాయ వాదులు వారిని గమనించి అంబులెన్స్ రప్పించి వారి స్వస్థలానికి చేర్చారు. ఈలోగా మృతదేహంతో ఆ ముగ్గురూ తడిసిముద్దయ్యారు. వీటన్నిటా బాధితులు అట్టడుగు వర్గాలవారు. పూటకు గతి లేని నిరుపేదలు. ఆ ప్రాంతాలన్నీ కనీస సౌకర్యాలు కూడా కరువై చెప్పనలవికాని కష్టాలు పడు తున్నవి. ఈ ఘటనల సమయంలో యాదృచ్ఛికంగా కెమెరాలు ఉండటంవల్ల అవి బయటి ప్రపంచానికి వెల్లడయ్యాయిగానీ అక్కడ బతుకులీడుస్తున్నవారికి మాత్రం అలాంటివి కొత్తగాదు. నిత్యం ఛీత్కారాలు... నక్సలైట్లో, వారి సానుభూతిపరులో కావొచ్చునన్న అనుమాన దృక్కులూ, వాటి పర్యవసానాలూ ఆ పేదజనానికి సర్వసాధారణం. భార్య శవాన్ని భుజాలకెత్తుకుని మధ్య యుగాల ఆవలినుంచి నాగరిక ప్రపంచంలోకి నడిచి వస్తున్నవాడిగా కనబడిన ఆదివాసి వల్ల మాత్రమే ఇప్పుడు కలహాండి ప్రాంతం వార్తలకెక్కలేదు. కొన్నేళ్లక్రితం ఆకలిచావులతో, అటు తర్వాత నుంచి నక్సల్ ఉద్యమంతో, ఎన్కౌంటర్ ఉదంతాలతో అది మార్మోగు తూనే ఉంది. మైనింగ్ కోసం వేదాంత ప్రాజెక్టుకు విలువైన అటవీభూముల్ని కట్టబెట్టడాన్ని నిరసిస్తూ గిరిజనులు కొన్నేళ్లుగా అక్కడ ఉద్యమిస్తున్నారు. పోలీసు కాల్పులు, చావులు, నిర్బంధాలు, కేసులు, జైళ్లు వారి జీవితంలో భాగమై పోయాయి. రెండేళ్లక్రితం ఇదే కలహండి జిల్లాలో వెట్టిచాకిరీ వెతల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ఇద్దరు యువ కుల చేతులు నరికి నడిరోడ్డుపై పడేసి పరారయ్యాడు. వారి ఆర్తనాదాలు విన్నవారు ఆసుపత్రిలో చేర్పించబట్టి ఆ యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. ఇవన్నీ చూసినప్పుడూ, విన్నప్పుడూ ఇంత అమానవీయమైన, అమానుషమైన సమా జంలో మనం ఉన్నామా అన్న దిగ్భ్రాంతికి లోనవుతాం. ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం వల్ల ఒరిగిందేమిటన్న సందేహం కలుగుతుంది. అట్టడుగు, నిరుపేద వర్గా లను తాకని అభివృద్ధి వల్ల ప్రయోజనమేమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ఉదంతాలు బట్టబయలైనప్పుడల్లా ఆవేదన చెందినట్టు, చర్యలు తీసుకుంటున్నట్టు కనబడటం మన ప్రభుత్వాలకు మామూలే. ఆ తర్వాత మళ్లీ మరొకటేదో మీడియాలో వెల్లడై పరువు పోయాక మళ్లీ ఈ తంతు అంతా పునరావృతమవు తుంది. ఒడిశా, మధ్యప్రదేశ్‌లు కాబట్టి పాత్రికేయులు ఈ ఘటనలను కనీసం లోకం దృష్టికి తీసుకురాగలిగారు. అదే ఆ పక్కనున్న ఛత్తీస్‌గఢ్ అయితే కేసులు, జైళ్లు తప్పకపోవచ్చు! ఆ రాష్ట్రంలో పాత్రికేయులు అక్రమ కేసుల్లో చిక్కుకుని జైళ్లలో మగ్గుతున్నారని భారతీయ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) నాలుగు నెలల క్రితం ప్రకటించింది. ఒడిశా, మధ్యప్రదేశ్‌లు రెండూ తమ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాలపై స్పందిం చాయి. బాధ్యులైనవారిపై చర్య తీసుకున్నాయి కూడా. భార్య శవాన్ని మోసుకెళ్లిన ఉదంతంలో ఒక నర్సును సస్పెండ్ చేసి, ఆసుపత్రి సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టును ఒడిశా రద్దు చేసింది. బహుశా వృద్ధురాలి శవాన్ని విరిచిన వ్యక్తిని పనిలోకి రానీయొద్దని కూడా ఆదేశాలిచ్చి ఉంటుంది. మధ్యప్రదేశ్ సర్కారు బస్సు డ్రైవర్‌నూ, కండక్టర్నూ అరెస్టు చేసింది. బస్సు పర్మిట్‌ను రద్దు చేసింది. ఈ అరకొర చర్యలే వ్యవస్థనంతటినీ ప్రక్షాళన చేస్తాయా? మారుమూల ప్రాంతాలకు వైద్య సౌకర్యాలనూ, రవాణా సదుపాయాలనూ కల్పించలేని తమ అశక్తత మాటేమిటి? వెనకబడిన ప్రాంతాలనూ, దారిద్య్రరేఖకు దిగువు నున్నవారిని అదే స్థితిలో శాశ్వతంగా ఉంచేసిన తమ చేతగానితనం సంగతేమిటి? అందుకు సిగ్గుపడాల్సింది పోయి, బహిరంగ క్షమాపణ అడగాల్సిందిపోయి కింది స్థాయి వ్యక్తులపై చర్య తీసుకుంటే సరిపోతుందా? నిజానికిది ఒడిశా, మధ్యప్రదేశ్‌లకు పరిమితమైంది కాదు. కొంతకాలం క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వా సుపత్రిలో ఒక శిశువును మూషికాలు కొరికి చంపేస్తే... విజయవాడ ప్రభుత్వాసు పత్రిలో చీమలు కుట్టి మరో శిశువు కన్నుమూసింది. అప్పుడూ ఇలాగే కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. బట్టబయలు కానంతవరకూ బాగున్నట్టు భ్రమింపజేయడం, వెల్లడయ్యాక కపటనాటకా లాడటం పాలకులు సాగిస్తున్నంత కాలమూ ఈ స్థితి మారదు. నిర్మాణాత్మకమైన పథకాల అమలుకు పోరాడితేనే, పాలకులపై ఒత్తిడి తెస్తేనే మార్పు సాధ్య మవుతుంది. -
ఈ వారమూ ఇంతేనా!?
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరి వారం కూడా పరిస్థితిలో మార్పు వచ్చే సంకేతాలేవీ కనిపించటం లేదు. లలిత్‌గేట్, వ్యాపమ్ అంశాలకు సంబంధించి ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు వర్షాకాల సమావేశాల ఆరంభం నుంచీ చేస్తున్న ఆందోళన మిగిలిన 4 రోజులు సైతం కొనసాగేట్లే కనిపిస్తున్నది. బీజేపీ నిందారాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తే.. కాంగ్రెస్ విధ్వంసక విపక్షంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. గతవారం 25 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయటంతో ఇరుపక్షాల మధ్య ఉద్వేగాల స్థాయి మరింత పెరిగింది. ఎప్పుడూ సాత్వికంగా కనిపించే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మునుపెన్నడూ లేనివిధంగా ఆగ్రహంతో కాంగ్రెస్ నేతలతో కలిసి పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ గడువు ముగియటంతో సోమవారం కాంగ్రెస్ సభ్యులంతా లోక్‌సభకు హాజరవుతారు. అయితే సభ కొనసాగటం మాత్రం అనుమానమే. కనీసం ఈ నాలుగురోజులైనా సభను సజావుగా సాగనివ్వాలని మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం చెన్నైలో విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తన బాధ్యత తెలుసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ కార్యకలాపాలను తిరిగి సజావుగా నడపడానికి కాంగ్రెస్ పార్టీ అర్థవంతమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ముఖ్యమైన ఎనిమిది బిల్లులు పార్లమెంట్లో పాస్ అయ్యేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ‘రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్’ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అభివృద్ధి నిరోధక పాత్ర పోషించిన కాంగ్రెస్ రాజకీయంగా దివాలా తీసిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ సంకుచిత రాజకీయ ఆలోచనలకు పార్లమెంటును వేదికగా చేసుకుందని ఆదివారం తన బ్లాగులో మండిపడ్డారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వాస్తవాలకు ఆమడ దూరంలో ఉన్నారని విమర్శించారు. నిరాధార అంశాలపై పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ అడ్డుకోవడం ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధమని నఖ్వీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప్రయత్నాలను అడ్డుకుంటూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తోందని ఆరోపించారు.