breaking news
kapu united void
-
పవన్ బొమ్మ పెట్టినా కాపుల ఓట్లు రావు
సాక్షి, అమరావతి: మంగళగిరి టీడీపీ కార్యాలయం మీద పవన్ బొమ్మ పెట్టినా, పత్రికల్లో ప్రకటనలు (యాడ్స్)లో పవన్ ఫొటో వాడినా టీడీపీకి కాపు ఓట్లు రావని చంద్రబాబుకు కాపు ఐక్య వేదిక కరాఖండిగా చెప్పింది. జనసేనకు జనబలం, ధనబలం లేదని పవన్‌తో ఎంత బలంగా చెప్పించినా నమ్మేందుకు జనం అంత అమాయకులు కాదని ఎద్దేవా చేసింది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిరీ్వర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోందని తెలిపింది. ఈ మేరకు చంద్రబాబుకు రాసిన బహిరంగ లేఖను కాపు ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్, కన్వీనర్లు పెద్దిరెడ్డి మహేష్, బోడపాటి పెదబాబు గురువారం మీడియాకు విడుదల చేశారు. ఆ లేఖ సారాంశమిదీ.. ‘కాపు సామాజికవర్గానికి చంద్రబాబుకు ఉన్నంత చాణక్య తెలివితేటలు లేకపోవచ్చు గానీ, చైతన్యం మెండుగా ఉంది. చంద్రబాబు తీరుతో టీడీపీ, జనసేన కూటమి విజయావకాశాలను చేజేతులారా పాడుచేసుకున్నారు. జనసేన అండ లేకుండా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోరాటం చేయలేదు. కేవలం 24 ఎమ్మెల్యే, మూడు ఎంపీ సీట్లు ఇచ్చి పవన్‌తో యుద్ధం చేయించి కాపు సామాజికవర్గాన్ని అడ్డు పెట్టుకుని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం ఫలించదు. 2014లోనే జనసేనకు కనీసం 24 సీట్లు ఇచ్చినా పవన్‌కు ప్యాకేజీ స్టార్ అనే అప్రతిష్ట వచ్చేది కాదు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే మాటలను బాబు ఇప్పటివరకు ఖండించలేదు. 2014లో చతికిలపడిపోయిన టీడీపీని జనసేన, బీజేపీ నిలబెట్టాయి. బాబు సహజగుణానికి తగ్గట్టుగానే 2019 ఎన్నికల్లో బీజేపీ, జనసేనను వదిలేసి ఫలితాన్ని చవిచూశారు. ఇప్పుడు చంద్రబాబు డైరెక్షన్లో మాట్లాడుతున్న పవన్ రెండు చోట్లా తనను ఓడించారని పదే పదే ప్రజలను నిందించడం సరికాదు. పవన్ ఓటమిలో టీడీపీ పాత్ర, వ్యక్తిగత వైఫల్యం ఏమిటో ప్రజలకు తెలుసు.’ 2019లో మీ స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు? ‘బుధవారంనాటి జెండా సభలో పవన్ మాట్లాడుతూ స్నేహమంటే చివరి వరకు అని స్వయంగా ప్రకటించారు. మరి 2019లో మీ ఇరువురి స్నేహాన్ని ఎవరు చెడగొట్టారు చంద్రబాబూ? ఆ రోజు మీ డైరెక్షన్ మేరకే విడిగా పోటీ చేశారా? పవన్ ఓటమిలో మీ పాత్ర లేదా? ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలని మీరు చేసిన ప్రయత్నం ఫలించిందా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. నాలుగున్నరేళ్లపాటు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారాన్ని పంచుకుని, సడెన్‌గా యూటర్న్ తీసుకుని ప్రజాధనంతో కేంద్రంపై ఉద్యమాలు చేయించారు. ప్రధాని మోదీని తిట్టారు, తిట్టించారు. ఇపుడు బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్నారు. రాజమండ్రి జైలుకు వచ్చి పవన్ మీకు మద్దతు ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటనేది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు వాడుకుని పవన్‌ను మడత పెట్టేస్తే.. ఆయన అభిమానులు, కాపులు కలిసి మిమ్మల్ని మడత పెట్టేస్తారని గమనించండి.’ త్యాగాలు ఇతరులే చేయాలా? మీరు చేయరా? ‘24 ఎమ్మెల్యే సీట్ల కోసం యుద్ధం చేయాల్సిన అవసరం మాకేంటి? 151 సీట్ల కోసం టీడీపీ వాళ్లే యుద్ధం చేసుకుంటార్లే అనే పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది. పవన్‌ను లోక్‌సభకు పోటీ చేయించి ఢిల్లీ పంపేస్తారని, బాబుకు ఇబ్బంది లేకుండా చేసుకుంటారంటూ ప్రజల్లో చర్చ జరుగుతోంది. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను కలవడానికి పవన్ ఇష్టపడినప్పటికీ ఆయన్ని అడ్డుకున్నది చంద్రబాబే అని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఉంది. నాదెండ్ల మనోహర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజారాజ్యం మాదిరిగా జనసేనను నిర్విర్యం చేసి దెబ్బతీస్తారనే అనుమానం బలపడుతోంది. ఇలా నమ్మించి మోసం చేయడాన్ని కాపులు ఏమాత్రం జీర్ణించుకోరన్న నగ్న సత్యాన్ని గత అనుభవాల దృష్ట్యా మీరు గ్రహించాల్సి ఉంది. త్యాగాలు చేయాలని తమరు ఇతరులకు చెప్పడమేనా? మీరు త్యాగాలు చేయరా? పవన్‌ను మోసం చేయడం ద్వారా మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారనే నగ్న సత్యాన్ని గ్రహించాలి’ అని ఆ లేఖలో కాపు ఐక్య వేదిక నేతలు చంద్రబాబుకు స్పష్టం చేశారు. -
దేశం’ వ్యతిరేకులపై కేసుల
తుని/కిర్లంపూడి : కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై అధికార తెలుగుదేశం పార్టీ పోలీసుల చేత పెట్టించే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని కాపు ఉద్యమసారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. టీడీపీకి గతంలో శత్రువులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించాలని యనమల సోదరులు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తే మరో ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. ఎవరికీ భయపడవద్దని, తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.ఐక్యగర్జనకు సహకరించిన వారికి రుణపడి ఉంటా.. గత నెల 31న వెలమ కొత్తూరు వద్ద కాపు ఐక్యగర్జన సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబుకు ముద్రగడ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. తునిలోని చినబాబు ఇంటి వద్ద మాట్లాడుతూ కాపు జాతి కోసం నిర్వహించిన సభకు సహకరించిన అందరికీ రుణపడి ఉంటానన్నారు. నెల రోజుల పాటు సభ కోసం కష్టపడి పనిచేసిన వారికి హృదయ పూర్వక అభినందనలు చెప్పారు. తుని నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు. మీడియా సోదరులపై దాడి సరి కాదు..కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జరిగిన సంఘటనల్లో మీడియా సోదరులపై దాడి చేయడం సరికాదని ముద్రగడ అన్నారు. ఆ రోజు జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని, మంచి మనసుతో స్వీకరించాలని కోరారు. నాయకులు గుండా వెంకటరమణ, వాసిరెడ్డి ఏసుదాసు, నీలగిరి చిట్టిబాబు, పెంటకోట నాగు, జి. లక్ష్మణరావు, రాంబాబు, గోపు చంటి బాబు, లోవ దేవస్థానం మాజీ ఛైర్మన్ దూలం మాణిక్యం, నరిశే శివగణేష్, మాకినీడి గాంధీ, కుసనం దొరబాబు ముద్రగడ వెంట ఉన్నారు.రాష్ర్టంలో అల్లకల్లోలానికి సర్కారు కుట్ర రాష్ర్టంలో అల్లకల్లోలం సృష్టించటానికి ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నుతోందని, ప్రభుత్వం పెద్దల సహకారంతోనే ఐక్యగర్జన సందర్భంగా విధ్వంసకాండకు పూనుకున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు మీ అనుచరులు ఆడిన ఆటలు ఆపండి. గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం. గురువారం సాయంత్రంలోగ జీవో ఇవ్వకపోతే శుక్రవారం ఉదయం 9గంటలకు నా భార్యతో సహా ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాను’ అని స్పష్టం చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని వేల మందిని జైల్లో పెట్టినా వెనకంజవేయబోమన్నారు. దీక్ష సమయంలో గన్‌తో పేల్చుకుంటానని ఆరోపణలు చేస్తున్నారని, రివాల్వర్‌ను, గన్ను జగ్గంపేట సీఐకి అప్పగించానని చెప్పారు. దీక్షా సమయంలో తనకు సంఘీబావం తెలిపేందుకు ఎవరు రావద్దని, తమ గ్రామాలలోనే ఇళ్లముందు నిల్చుని గంటసేపు ప్లేట్‌పై శబ్దం చేయాలని కోరారు. -
ముద్రగడపై రైల్వే పోలీసుల కేసు
విజయవాడ: తుని రైల్వేస్టేషన్ సమీపంలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనం కేసులో కాపు ఐక్య గర్జన నిర్వాహకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంపై తుని గవర్నమెంట్ రైల్వే పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ దుర్ఘటనలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ 24 బోగీలు దహనమైన విషయం విదితమే. రైల్వే ట్రాక్‌పైకి రావడంతోపాటు రైలును అడ్డగించడం, రైలును దహనం చే సినందుకు గాను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్‌తో పాటు రైల్వే యాక్ట్ సెక్షన్లు 161, 162, 163, 164 కింద కేసు కేసు నమోదు చేశారు. రైలు దహనం ఘటనలో ముద్రగడతోపాటు మరికొంతమంది (ముద్రగడ పద్మనాభం అండ్ అదర్స్)పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసు అధికారులు చెప్పారు. కాపు నేతల్లో ఆగ్రహం కాపు ఐక్య గర్జనకు తాను బాధ్యుడినని, రైలు దహనంతోపాటు జరిగిన దుర్ఘటనలకు రాష్ట్రప్రభుత్వానిదే బాధ్యతని ముద్రగడ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయనపైనే కేసు నమోదు చేయడం కాపు సామాజిక వర్గం నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది.