Hot weather
-
మండుటెండల్లో... అనారోగ్య సమస్యల బారిన పడకూడదంటే..!
వేసవి వచ్చేసింది. ఎండలు చండప్రచండంగా నిప్పులు చెరుగుతున్నాయి. భూతాపం పెరుగుతుండటం వల్ల ఇటీవలి ఏడాదుల్లో వేసవులు మరింత దుర్భరంగా మారుతున్నాయి. భూతాపం పెరుగుదల ఫలితంగా సముద్రాలు వేడెక్కుతున్నాయి. ఆ ప్రభావం భూమ్మీద ప్రతిచోటా పడుతోంది. నడి వేసవిలో దేశవ్యాప్తంగా పలుచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తాకిడి పెరుగుతున్నాయి. వేసవిలో ఎండల బాధ ఒకవైపు అయితే, మరోవైపు ఎండలతో పాటు ఇబ్బంది పెట్టే రకరకాల ఆరోగ్య సమస్యలు జనాలను సతమతం చేస్తాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వేసవి తాపం నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పగటి వేళల్లో ఆరుబయటకు వెళ్లడం క్షేమంకాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎండల ధాటి ఎలా ఉన్నా, అనివార్య పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు సహా రకరకాల వృత్తుల్లోని వారు నడివేసవి మధ్యాహ్న వేళల్లో కూడా ఆరుబయటకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉంటున్నాయి. వేసవి తీవ్రత నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వేసవిలో వడదెబ్బ బారినపడటం; దాహార్తి తట్టుకోలేక వీథుల్లో అపరిశుభ్ర పరిసరాల్లో దొరికే చెరకు రసం, పండ్లరసాలు వంటివి తాగడం వల్ల జీర్ణకోశ సమస్యల బారినపడటం; ఎండ ధాటికి చర్మం కమిలిపోవడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండల ధాటికి తోడు రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా జనాలను బాధిస్తాయి.వేసవిలో ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ సోకడం; శరీరమంతా చెమటకాయలు పుట్టుకొచ్చి చర్మం మంటపెట్టడం; విపరీతమైన చెమటల వల్ల ఒంట్లోని నీరంతా బయటకు పోయి డీహైడ్రేషన్ ఏర్పడటం; వేడి వాతావరణంగా అలసట, నీరసం; చర్మంపై ర్యాష్, దురదలు, ఇన్ఫెక్షన్లు పెరగడం; కళ్లు పొడిబారి ఎర్రబడటం, కళ్లకు ఇన్ఫెక్షన్లు ఏర్పడటం; ఎండ వేడి నుంచి సేదదీరడానికి ఈతకొలనుల్లోకి దిగితే, వాటిలోని నీటి కాలుష్యం వల్ల చెవులకు, ఇన్ఫెక్షన్లు సోకడం; ఉబ్బసం రోగులకు సమస్య తీవ్రం కావడం; రకరకాల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రావడం; నీటి కాలుష్యం, ఆహార కాలుష్యం వల్ల రకరకాల జీర్ణకోశ సమస్యలు కలగడం వంటి సమస్యలు బాధిస్తాయి. తగిన ముందు జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యలను చాలా వరకు నివారించుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒకవేళ ఈ సమస్యలు తలెత్తినట్లయితే, వెంటనే ప్రాథమిక చికిత్స చేయడం, అవసరమైతే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది.వడదెబ్బ బారిన పడొద్దు...వేసవిలో ఎండ వేడి వల్ల తలెత్తే సమస్యల్లో తీవ్రమైనది వడదెబ్బ. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిన ప్రాంతాల్లో వడదెబ్బ సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, ఒక్కోసారి వడదెబ్బ ప్రాణాంతకంగా మారే పరిస్థితులు కూడా ఉంటాయి. తీవ్రమైన ఎండలో ఎక్కువసేపు ఉండటం, తగినంత నీరు తాగకపోవడం, ధారాళంగా గాలి సోకని ప్రదేశాల్లో ఉండటం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మితిమీరిన శారీరక శ్రమ చేయడం వల్ల వడదెబ్బ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వడదెబ్బ సోకినప్పుడు తీవ్రమైన జ్వరం రావచ్చు. తలనొప్పి, తలతిరగడం, విపరీతమైన నిస్సత్తువ, అలసట, చర్మం పొడిబారిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వాంతులు కావడం లేదా మలబద్ధకం ఏర్పడటం, గందరగోళానికి లోనవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పరిస్థితి తీవ్రమైతే స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి రోజూ తగినంత నీరు తాగడం, కొబ్బరినీరు, మజ్జిగ, తాజా పండ్లరసాలు తాగడం మంచిది. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ధరించడం, చలవ కళ్లద్దాలు పెట్టుకోవడం, వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. వడదెబ్బ ముప్పు తగ్గాలంటే, కెఫీన్ పానీయాలు, మద్యపానం బాగా తగ్గించుకోవాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వడదెబ్బ సోకవచ్చు. అలాంటప్పుడు వడదెబ్బ సోకిన బాధితులను వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్లాలి. ఫ్యాన్ లేదా ఏసీ కింద ఉంచాలి. శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. చల్లని నీళ్లు లేదా ఓఆర్ఎస్ ఇవ్వాలి. పరిస్థితి తీవ్రమై, స్పృహకోల్పోయే పరిస్థితులు ఉంటే, వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లాలి.జీర్ణకోశ సమస్యలు...వేసవిలోని వేడి వాతావరణంలో వండిన ఆహారం ఎక్కువసేపు నిల్వ ఉండదు. పగలు వండిన ఆహారం సాయంత్రానికే పాడైపోతుంది. అపరిశుభ్ర పరిసరాల్లో ఆహారం వండే టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లలో ఆహార పదార్థాలు తినకపోవడమే మంచిది. అలాగే, అపరిశుభ్ర పరిసరాల్లోని పండ్లరసాలు, చెరకురసం బండ్ల వద్ద పానీయాలు తాగకుండా ఉండటం మంచిది. అపరిశుభ్ర పరిసరాల్లో పాడైన ఆహారం తీసుకున్నా, పానీయాలు తీసుకున్నా వేసవిలో జీర్ణకోశ సమస్యల ముప్పు ఎక్కువవుతుంది. కలుషిత ఆహార పానీయాల కారణంగా వేసవిలో టైఫాయిడ్, అతిసార వ్యాధులు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, ఇంట్లో తాజాగా వండిన ఆహారం తీసుకోవాలి. ఇంట్లో వండిన ఆహారమైనా ఎక్కువసేపు నిల్వ ఉన్నది తినకపోవడమే మంచిది. తాగే నీరు, తినే ఆహారం స్వచ్ఛంగా, శుభ్రంగా ఉండేటట్లు చూసుకుంటే వేసవిలో జీర్ణకోశ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ వాంతులు, విరోచనాలు, జ్వరం, తలతిరగడం, నిస్సత్తువ వంటి సమస్యలు తలెత్తితే, డీహైడ్రేషన్ వల్ల నీరసించిపోకుండా ఉండటానికి ఓఆర్ఎస్ తీసుకోవాలి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి, వారి సూచనల మేరకు మందులు వాడుకోవడం తప్పనిసరి.వేసవిలో దోమల బెడదవేసవిలో కూడా కొన్నిచోట్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండే చోట్ల, పరిసరాల్లో మురుగునీటి గుంతలు ఉండే పరిసరాల్లో దోమలు విజృంభిస్తాయి. వేసవి రాత్రుళ్లలో గాలి సోకడం కోసం చాలామంది ఇళ్ల కిటికీలను తెరిచి ఉంచుతారు. ఇవి దోమలకు రాచమార్గంగా ఉంటాయి. కిటికీలు తెరిచినా, దోమల బెడద లేకుండా ఉండాలంటే, కిటికీలకు దోమలు చొరబడని రీతిలో తెరలను అమర్చుకోవాలి. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. దోమ తెరలు వాడాలి. దోమలు కుట్టకుండా ఉండటానికి శరీరానికి క్రీమ్స్ రాసుకోవాలి. దోమల బారిన పడితే డెంగీ, మలేరియా, చికున్ గున్యాలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యా«ధులు సోకితే జ్వరం, ఒంటినొప్పులు, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలి.వేసవిలో కంటి సమస్యలువేసవిలో ఎండ తీవ్రతకు రకరకాల కంటి సమస్యలు తలెత్తుతాయి. ఎండలోని అతినీలలోహిత కిరణాల ప్రభావంతో పాటు దుమ్ము« దూళి కాలుష్యం వల్ల కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, కళ్ల నుంచి నీరు కారడం, తరచుగా పుసులు రావడం, కళ్లు మంటపెట్టడం, కళ్ల వాపు, వెలుతురు చూసినప్పుడు ఇబ్బంది కలగడం, కనుపాపపై పుండుç ఏర్పడం వంటి సమస్యలు కలుగుతాయి. వీటిలో కొన్ని అలెర్జీల వల్ల, ఇంకొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు పదేపదే చేతితో కళ్లు రుద్దకుండా ఉండాలి.కళ్లు తుడుచుకోవడానికి శుభ్రమైన పొడి రుమాలు లేదా న్యాప్కిన్ వాడుకోవాలి. కళ్లు బాగా ఎర్రబడటం, పుసులు రావడం, చూపు మసకబారడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే కంటివైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవడం మంచిది. వేసవిలో కంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అతినీలలోహిత కిరణాలను వడగట్టగలిగే చలవ కళ్లద్దాలను ధరించడం మంచిది. అలాగే, నేరుగా ఎండ కళ్ల మీద పడకుండా ఉండటానికి గొడుగు లేదా టోపీ వాడుకోవడం మంచిది.ఎండల ధాటిని మనం ఎలాగూ తగ్గించలేం. కాబట్టి, ఎండలు ఎక్కువగా ఉండేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మాత్రమే చేయగలం. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికి తగినట్లుగా వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి ఇంట్లో ఎవరో ఒకరు వడదెబ్బ బారినపడి, తీవ్ర అనారోగ్యానికి లోను కావచ్చు. అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఎండల తీవ్రత పెరిగే కొద్ది ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే, ఎండల వేడి వల్ల వచ్చే ఇబ్బందులను పూర్తిగా అధిగమించి, సురక్షితంగా ఉండవచ్చు. చర్మ సమస్యలువేసవిలో ఎండలోని అతినీలలోహిత కిరణాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మం కందిపోవడం, చెమటలు ఎక్కువై చెమటకాయలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. చెమటకాయలను నివారించుకోవాలంటే రోజుకు రెండు మూడుసార్లు శుభ్రంగా స్నానం చేయాలి. శరీరాన్ని పూర్తిగా పొడిగా తుడుచుకున్న తర్వాత వదులుగా ఉండేలా చెమటను తేలికగా పీల్చుకునే కాటన్ దుస్తులు ధరించాలి. ఉక్కపోత ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాన్, కూలర్ లేదా ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది. అప్పటికీ చెమటకాయలు ఉంటే, ఉపశమనానికి ప్రిక్లీహీట్ పౌడర్ లేదా కేలమైన్ లోషన్ వాడటం మంచిది. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సన్‌స్క్రీన్ వాడాలి. సన్‌స్క్రీన్ వల్ల చర్మం కందిపోకుండా ఉంటుంది.రోజూ తగినంత మంచినీరు, కొబ్బరినీరు, పానకం, తాజా పండ్ల రసాలు వంటివి తీసుకోవడం, తేలికగా జీర్ణమయ్యేలా తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది. వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం వల్ల చెమటకాయలే కాకుండా, చర్మానికి రకరకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం కూడా ఉంటుంది. రోజూ శుభ్రంగా స్నానం చేయడం, చర్మం పొడిగా ఉండేట్లు చూసుకోవడం, గాలిసోకి చెమటను పీల్చుకునేలా ఉండే కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా చర్మానికి ఇన్ఫెక్షన్లు సోకినట్లయితే, వారు వాడే తువ్వాళ్లు, దుస్తులు వేరుగా ఉంచి, ఉతకడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించి, వారి సూచనలపై తగిన చికిత్స తీసుకోవాలి.వృద్ధులకు జాగ్రత్తలువేసవిలో వృద్ధులు మరింతగా ఇబ్బంది పడతారు. ఎండల ధాటికి వృద్ధులు త్వరగా అలసట చెంది, నీరసించిపోతారు. ఇక డయాబెటిస్, బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారి పరిస్థితి మరింత కష్టంగా ఉంటుంది. వేసవిలో వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇబ్బందుల నుంచి గట్టెక్కగలుగుతారు.⇒ వేసవిలో వృద్ధులు త్వరగా డీహైడ్రేషన్‌కు లోనయ్యే అవకాశాలు ఉంటాయి. అందువల్ల తరచు మంచినీళ్లు, గ్లూకోజ్, మజ్జిగ, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగడం మంచిది.⇒ చక్కగా గాలి వచ్చే గదుల్లో ఉండాలి. ఫ్యాన్, కూలర్, ఏసీ ఉన్న చోట ఉండటం మంచిది.⇒ ఎండ తీవ్రత ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించుకోవాలి.⇒ బీపీ, సుగర్ సమస్యలతో బాధపడేవారు వైద్యుల సూచనపై వేళకు మందులు వేసుకోవాలి.⇒ ఉప్పు, నూనెలు తక్కువగా ఉండే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.⇒ తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి.⇒ విపరీతంగా చెమటలు పోయడం, తలతిరగడం, గుండె వేగం పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుల వద్దకు వెళ్లాలి.పిల్లలకు జాగ్రత్తలువేసవి తీవ్రత ఆరోగ్యవంతులైన పెద్దలకే దుర్భరంగా ఉంటుంది. అలాంటప్పుడు వేసవిలో పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటించినట్లయితే, వేసవి తాపం నుంచి పిల్లలకు రక్షణ కల్పించవచ్చు.⇒ పిల్లలు ఆటల్లో పడితే ఆకలి దప్పులను మరచిపోతారు. వేసవిలో దాహంగా ఉన్నా, లేకపోయినా పిల్లల చేత మంచినీళ్లు, కొబ్బరినీరు, పండ్లరసాలు వంటివి తాగిస్తూ ఉండాలి.⇒ పగటి పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయట ఆటలు ఆడనివ్వకండి.⇒ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా టోపీ లేదా గొడుగు వాడాలి.⇒ పిల్లలకు తేలికగా జీర్ణమయ్యే ఆహారం పెట్టాలి. ఇంట్లో తాజాగా వండిన ఆహారంతో పాటు పుచ్చకాయలు, కీరదోసకాయలు, పెరుగు వంటివి ఇవ్వడం మంచిది.⇒ పిల్లలకు వేసవిలో తేలికపాటి వదులైన కాటన్ దుస్తులు వేయడం మంచిది.⇒ చెమటకాయల నివారణ కోసం తరచు స్నానం చేయించాలి. స్నానం తర్వాత శరీరం పూర్తిగా పొడిగా ఉండేలా తుడిచాక దుస్తులు తొడగాలి.⇒ పిల్లల్లో అలసట, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఎండ తీవ్రత ఎప్పుడు ప్రమాదకరం?వేసవిలో ఎండ తీవ్రత 35 డిగ్రీల సెల్సియస్ దాటినప్పటి నుంచి సమస్యలు పెరుగుతాయి. వేసవి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉన్నప్పుడు బయట ఎక్కువసేపు తిరిగే వారిలో డీహైడ్రేషన్, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఎండల ధాటి 40–45 డిగ్రీలకు చేరుకుంటే, ప్రమాద స్థాయి మరింతగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి చేరినప్పుడు బయట ఎక్కువసేపు ఉంటే త్వరగా అలసట, నీరసం ముంచుకొచ్చి, డీహైడ్రేషన్‌కు లోనవడం, వాంతులు, తలతిరగడం, వడదెబ్బకు లోనవడం వంటి ప్రమాదాలు తలెత్తవచ్చు.ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటినట్లయితే, వడదెబ్బ సోకే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చు. గడచిన పదేళ్లలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగానే నమోదవుతున్నాయి. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.5–42.5 డిగ్రీల వరకు; తెలంగాణలో 41.5 నుంచి 43.5 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. విజయవాడ, కర్నూలు, రామగుండం, భద్రాచలం వంటి కొన్ని ప్రాంతాల్లో వేసవి సగటు గరిష్ఠ ఉస్ణోగ్రతలు 45–47 డిగ్రీల వరకు కూడా నమోదవుతున్నాయి. అందువల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకినప్పటి నుంచి తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించడం మంచిది. -
బోగీలు భగభగ.. ఏసీలో చల్లగా..
సికింద్రాబాద్–హౌరా మధ్య తిరిగే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ థర్డ్ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్‌కే వీల్లేకుండా ఉంది.ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్ లిస్ట్‌లో 47వ నంబర్ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్ ఎకానమీ క్లాస్ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్‌లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ కోచ్‌లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్‌లు నెల ముందే నిండిపోతున్నాయి.దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్‌లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్‌లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్‌లోని ఓ కూపేలో 8 బెర్త్‌లుంటే, ఎకానమీ ఏసీ కోచ్‌లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్‌లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ కోచ్ కంటే తక్కువ చార్జీ సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్‌లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్ కోచ్‌ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్ పరిధిలో ఎకానమీ కోచ్‌లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్‌లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో ‘రిగ్రెట్’ (ఐఆర్సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది. సరిపడా రేక్స్ లేవు వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్‌లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్ జారీ చేసింది. రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్ కోచ్‌లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్ కోచ్‌లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి. థర్డ్ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్ బస్సులో తీసుకున్నామార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్ బస్సులో బుక్ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్‌లింగంపల్లి (హైదరాబాద్) -
ఏసీతో పనిలేకుండానే హీట్‌ని బీట్ చేద్దాం ఇలా..!
సూర్యుడి ప్రతాపం రోజు రోజుకి ఎక్కువవుతోంది. పది దాటితో బయటికి రావడమే కష్టంగా ఉంది ఈ సమ్మర్లో. ఇక రాత్రిళ్లు ఉక్కపోతలు, తట్టుకోలేని ఉడుకుతో కంటిమీద కునుకు పడితే ఒట్టు అంటూ వాపోతుంటారు ప్రజలు. ఆరుబయట సేద తీరదామన్న..పక్కపక్కనే బిల్డింగ్లు ఉండటంతో గాల్పు కొడుతూ వేడిగా ఉంటుంది. రవ్వంత గాలి కూడా రాదు. ఏసీ లేనిదే పనికాదేమో అన్నంతగా సమ్మర్ తారెత్తిస్తుంటుంది. అలాంటప్పడు ఏసితో పనిలేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంటిని చల్లగా మార్చుకుని హాయిగా నిద్రపోవచ్చు. అదెలాగా చూద్దామా..!.ఇంట్లోనే ఫ్యాన్‌తో..బయటి చల్లగాలి లోపలికి వచ్చేలా కిటికీ దగ్గర ఉండే ఫ్యాన్‌ను ఉంచండి లేదా గదిలోపల గాలిప్రసరణ మెరుగుపరుచుకునేలా సీలింగ్ లేదా స్టాండింగ్ ఫ్యాన్‌ను ఉపయోగించండి. రాత్రి సమయంలో వేడి గాలిని బయటకు నెట్టేలా కిటికీలో బయటకి ఎదురుగా ఫ్యాన్‌ను ఉంచండి. అలాగే ఇత ఓపెనింగ్‌ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేలా చూసుకోండికర్టెన్లు లేదా బ్లైండ్‌లతో మూసి ఉంచడంనేరుగా సూర్యకాంతి గదిలో పడకుండా నిరోధించాలి. అంటే కిటికీలు మూసేయడం. కర్టెన్లు, బ్లైండ్‌లతో కవర్ చేయడం లేదా తడికల్లాంటివి ఏర్పాటు చేసుకోవడం. లేతరంగు లేదా ఇన్సులేటెడ్ కర్టెన్లు ఉపయోగించడం మంచిది.ఇవి 40% వరకు వేడిని తగ్గిస్తాయి.రాత్రిపూట గాలి ప్రసరణ కోసం కిటికీలు తెరవడంఫ్యాన్ ముందు మంచు నీరు లేదా మాములు నీళ్లు బకెట్ ఉంచడం..బాష్పీభవన శీతలీకరణను సృష్టించడానికి ఫ్యాన్ ముందు ఒక బకెట్ మంచుగడ్డ లేదా చల్లని నీటిని ఉంచండి. ఈ పద్ధతిఫ్యాన్ద్వారా వచ్చే గాలిని చల్లబరుస్తుంది. ఇది పొడి వాతావరణంలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది.నేలపై పడుకోవడం..వేడిగాలి పెరుగుతుంది కాబట్టి నేలపే కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల చల్లదనంగా అనిపిస్తుంది.తేలికైనా.. గాలి ఆడే దుస్తులు ధరించడంతేమను దూరం చేసి.. చర్మం శ్వాస తీసుకోవడానికి వీలు కల్పించే కాటన్ లాటి తేలికైన వదులు దుస్తులను ధరించాలి. ఇవి తేమను దూరం చేస్తాయి. చర్మం శ్వాస తీసుకోవడానికి అనుమతించడమే గాక శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయిపరుపు, దిండ్లు చల్లగా ఉండేలా చేయడం..పడుకునే ముందే..బెడ్షీట్లు, దిండ్లు, పరుపు చల్లగా ఉండేలా కేర్ తీసుకుంటే హాయిగా నిద్రపట్టేస్తుంది.తడి తువ్వాళ్లు లేదా స్ప్రే బాటిళ్లు..తడి తువ్వాళ్లు వేయడం లేదా చల్లటి నీటితో నిండిన స్ప్రే బాటిల్ రిఫ్రెషింగ్ చల్లదనాన్ని అందిస్తుంది. నిద్రించడానికి ముందు మంచం మీద తడిగా ఉన్న టవల్‌ను ఉంచండి తద్వారా పరుపు చల్లగా ఉంటుంది. వేడిని ఉత్పత్తి చేసే వాటిని నివారించడంఉపయోగంలో లేనప్పుడు ఇన్కాండిసెంట్ బల్బులు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌లను ఆపివేయండి. తక్కువ వేడిని విడుదల చేసి, శక్తిని ఆదా చేసే LED బల్బులను ఎంచుకోండి.తేలికగా తినండి, హైడ్రేటెడ్‌గా ఉండండిహైడ్రేటెడ్గా ఉండటానికి తగినంత నీరు తాగండి. ప్రోటీన్ అధికంగా ఉండే భోజనాలను నివారించి.. పండ్లు, స్మూతీస్ వంటి తాజా చల్లని ఆహారాలు తీసుకోవడం మంచిది.ఈ పద్ధతులన్ని ఎయిర్ కండిషనింగ్ ఖర్చు లేకుండా వేడి వాతావరణంలో సౌకర్యవంతంగా ఉండటానికి సహాయపడతాయి.(చదవండి: స్లిమ్‌గా బాలీవుడ్ చిత్ర నిర్మాత హన్సల్ మెహతా.. మౌంజారోతో పది కిలోలు..!) -
వేసవి ఉక్కపోతల్లో డ్రెస్సింగ్ స్టైల్స్ అదిరిపోవాలంటే..!
వేసవిలో వివాహ వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కాలానికి తగినట్టు డ్రెస్సింగ్ ఉండాలి. అలాగని లుక్‌లో రిచ్‌నెస్ ఏ మాత్రం తగ్గకూడదు. ఎంపిక పెద్ద టాస్క్. సీజన్‌కి తగినట్టు సౌకర్యంగా ఉండేలా, అందరిలో ప్రత్యేకంగా కనిపించేలా ఉండాలంటే మనదైన స్టైల్ స్టేట్మెంట్ను చూపించాలి. వేసవిలో ఉక్కపోతలో డ్రెస్సింగ్ స్టైల్స్ ఆహ్లాదంగా... ఆకట్టుకునేలా ఉండాలి. మిగతా సీజన్లో ఎంత బ్రైట్ కలర్స్‌ని ఎంపిక చేసుకున్నా,.. సమ్మర్లో మాత్రం పేస్టల్ కలర్స్‌కి మంచి డిమాండ్ ఉంటుంది. వీటికే కాంట్రాస్ట్ బ్లౌజ్‌లు, లైట్‌షేడ్స్ ఉన్నవి, అవి కూడా హెవీ వర్క్‌తో కాకుండా ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. ఫ్లోరల్స్... ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలకు లెహంగా అయినా, వివాహ వేడుకకు శారీ అయినా ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవడం వల్ల అకేషన్ కాస్తా ఆహ్లాదంగా మారిపోతుంది. పేస్టల్, గోల్డ్, సిల్వర్ కలర్స్‌లో ఉన్నా ఫ్లోరల్స్తో ఉన్న లైట్ వెయిట్ పట్టు చీరలకు, మరో డిజైనర్ పల్లూని జత చేసి వధువు, ఆమె తరపు స్నేహితులు.. మహారాణీ స్టైల్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ఇండో వెస్ట్రన్... మన హ్యాండ్లూమ్ పట్టు చీరల్లోనూ లైట్ వెయిట్వి ఎంపిక చేసుకోవాలి. వాటికి పూర్తి కాంట్రాస్ట్ బెలూన్ స్లీవ్స్, స్లీవ్‌లెస్, యునిక్‌గా ఉండే బ్లౌజ్ డిజైన్స్ సరైన ఎంపిక అవుతుంది. శారీ గ్రాండ్‌నెస్ అంతా బ్లౌజ్ డిజైన్‌లో చూపించవచ్చు హెవీ ఎంబ్రాయిడరీ అవసరం లేకుండానే. లినెన్ అండ్ కాటన్ స్టైల్... వొవెన్ బార్డర్ ఉన్నవి, లినెన్స్, కాటన్స్ని ఉపయోగించి కూడా తమదైన స్టైల్ స్టేట్మెంట్తో ఈ సీజన్ వేడుకలో పాల్గొనవచ్చు. కాంట్రాస్ట్ స్టైలిష్ బ్లౌజులు, మనవైన సంప్రదాయ ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న ప్లెయిన్ శారీస్‌ను కూడా ఈ వేడుకలకు ఎంచుకోవచ్చు. వీటితోపాటు చందేరీ స్టైల్స్‌తోనూ గ్రాండ్లుక్ను తీసుకురావచ్చు. ఆభరణాల ఎంపిక... ముత్యాలు, పచ్చలు, ఇతర బీడ్స్‌తో చేసిన లేయర్డ్ జ్యువెలరీ ఈ వేసవికి సరైన ఎంపిక అవుతుంది. వీటి వల్ల చెమటతో పెద్ద ఇబ్బంది ఉండదు. పైగా, ధరించిన డ్రెస్‌కు హైలైట్‌గా నిలుస్తాయి.(చదవండి: ఏ క్షణమైనా గుండెపోటు తప్పదనుకున్నా..! కాలమిస్ట్ శోభా డే కుమార్తె వెయిట్ లాస్ స్టోరీ) -
కాస్త ఎండ పట్టున ఉండండి..!
ప్రస్తుతం మానవుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలా... రాత్రుళ్లు త్వరగా పడుకుని, ఉదయం త్వరగా లేవడం దాదాపు అసాధ్యంగా మారింది. నగరజీవితం, ఉరుకుల పరుగుల ఉద్యోగాలు, వేళాపాళా లేని ఆఫీసు పనివేళలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైట్ షిఫ్టుల్లో పనిచేసే వారు ఉదయం అంటే ఏంటో తెలియని దుస్థితికి చేరుకున్నారు. వాకిళ్లు లేని ఇరుకు ఇళ్లు, గూళ్లలాంటి అపార్ట్మెంట్లు కావడంతో సూర్యరశ్మి సోకడం గగనమైపోయింది. కేవలం రాత్రిషిప్టులు చేసేవారే కాదు, పగటిపూట పనిచేసేవారూ సూర్యరశ్మికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నగరాల్లో పెరుగుతోన్న అపార్ట్మెంట్ కల్చర్ కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాగైతే శరీరానికి కావాల్సిన ‘విటమిన్–డి’ అందేది ఎలా? అందుకే ‘కాస్త ఎండ పట్టున ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి’. అవును మానవ శరీరానికి విటమిన్ –డి ఎంతో ముఖ్యమైంది. ఈ విటమిన్ లోపం శరీరంపై చూపే ప్రభావం, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చో ఈ రోజు ‘హెల్త్’లో మీకోసం.. విటమిన్–డి ఎలా తయారవుతుందంటే..! సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు ‘విటమిన్–డి’ని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో ‘విటమిన్–డి’ హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన ‘విటమిన్–డి’ మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. అనారోగ్య సమస్యలు.. శరీరానికి సరిపడ మోతాదులో ‘విటమిన్–డి’ లభించకపోతే తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. దీంతో డయాబెటిస్ వస్తుంది. విటమిన్–డి లోపంతో ఆకలి మందగించడం, బరువు తగ్గటం, నిద్రలేమి వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ఈ కోవలోకి మరో సమస్య వచ్చి చేరింది. అదే తలనొప్పి. విటమిన్డి లోపంతో తలనొప్పి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలక పోవడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు గుండె, ఊపిరితిత్తులు ఉండే ఎముకల గూడు భాగం(ఉరోస్థి)లో నొప్పిగా ఉండడం, క్షణక్షణానికీ భావోద్వేగాలు మారడం, వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, ఒంటి దురద, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీసుకోవాల్సిన ఆహారం... విటమిన్ డి లోపాన్ని జయించాలంటే చర్మానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవటమే మంచి చికిత్స. కానీ ఎండ వల్ల తగినంత విటిమిన్ లభించని పరిస్థితి ఉంటే తీసుకునే ఆహార పదర్థాల ద్వారా కూడా కొంతలో, కొంత సమస్యను తగ్గించుకోవచ్చు. విటమిన్ డిని అందించే కొన్ని ఆహార పదార్థాలు... ముష్రుమ్స్ (పుట్టగొడుగులు)... పుట్టగొడుగుల్లో విటమిన్ డి మాత్రమే కాదు విటమిన్ బి5 కూడా మెండుగా ఉంటుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్‌డితో పాటు జింక్, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. పాలు.. పాలు ‘విటమిన్–డి’ని సమృద్ధిగా అందిస్తాయి. ఒక గ్లాసు పాలలో మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరం. అంతే కాదు పాలలో ‘యాంటీ ఏజింగ్’ లక్షణాలు కూడా ఉంటాయి. గుడ్డు... రోజుకో గుడ్డు తప్పనిసరి అని ఆహార నిపుణులు చెబుతుంటారు. గుడ్డు అంతలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరీ. గుడ్లలో విటిమిన్–డి, విటమిన్ బి12 , ప్రోటీన్లు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి గుడ్డును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి. చీజ్... విటమిన్ డి కి మరో మూలాదారం చీజ్. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఎంతో మేలు చేస్తుంది. చేపలు.. విటమిన్–డి అధిక మొత్తంలో లభించే ఆహార పదార్థాల్లో చేపలు మొదటి స్థానంలో ఉంటాయి. చేపలను కనీసం వారానికి ఒకసారైనా కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్ ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచివి. -
భక్తులకు భానుడి సెగ
సాక్షి, అమరావతి : ఆగస్టు నెల వేసవి మాసాన్ని తలపిస్తోంది. వాస్తవంగా అయితే ఇప్పటికే వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉంది. అయితే వరుణుడు కరుణించకపోగా.. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆగస్టులో ఆశించినస్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే అనూహ్యంగా ఈశాన్య రుతుపవనాలు తీరాన్ని దాటి వెళ్లిపోవటంతో ప్రస్తుతం వేసవి వాతావరణాన్ని తలపిస్తోంది. గతకొద్దిరోజులుగా ఓ మోస్తరు ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 34 డిగ్రీలు నమోదైంది. ఉదయం నుంచే ఎండలు ఉదయం 7.30గంటల నుంచే సూర్యడు తన ప్రతాపాన్ని ప్రదర్శించటం ప్రారంభించారు. ఉదయం 10గంటల నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చాయి. మిట్టమధ్యాహ్నం అయితే బయటకు వెల్లేందుకు జనం వెనకడుగేశారు. ఎండ తీవ్రత సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగింది. కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులు ఘాట్ల వద్దకు చేరుకున్నా.. ఎక్కువ సమయం ఉండలేక ఇంటిముఖం పట్టటం కనిపించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో స్నానానికి దిగిన వారు బయటకు రావటానికి ఇష్టపడలేదు. కొందరు ఎండలకు భయపడి గంటల కొద్దీ నీటిలోనే గడిపారు. దాహం దాహం.. పుష్కర డ్యూటీలో ఉన్న ఉద్యోగులు, వాలంటీర్లు మంచినీరు దొరక్క అల్లాడిపోయారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో అనేక ఘాట్లలో మంచినీరు ఏర్పాటు చేయకపోవటంతో ఘాట్ల సమీపంలో ఉన్న దుకాణాల్లో వాటర్ బాటిల్స్, ప్యాకెట్స్ కొనుగోలు చేసి గొంతు తడుపుకోవడం కనిపించింది. కొంతమంది సిబ్బంది నదిలో జేసీబీలతో ఇసుకన తోడి ఉన్న గుంటలో ఉన్న నీటితో దాహం తీర్చుకోవటం కనిపించింది. అదే విధంగా విధుల్లో ఉన్న ఉద్యోగులు ఘాట్లలో ఉండలేక చెట్లు, పిండప్రదానం చేసే షెడ్ల వద్దకు చేరుకున్నారు. కొన్నిచోట్ల టెంట్ల ఏర్పాటు ఎండ తీవ్రతను గమనించిన అధికారులు కొన్ని ఘాట్లలో టెంట్లు ఏర్పాటు చేశారు. వేసవితాపాన్ని గమనించిన ఎస్ వెంకటేశ్వర్లు దంపతులు సీతానగరం ఘాట్‌కు వెళ్లే మార్గంలో పుచ్చకాయలు కొనుగోలుచేసి వచ్చి వెళ్లే పుష్కర భక్తులకు పండును కోసి ఇవ్వటం కనిపించింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 50పుచ్చకాయలను కోసి ఒకటి, రెండు దబ్బలు ఇచ్చి భక్తుల తాపాన్ని తీర్చటం గమనార్హం. -
ఎండల తీవ్రతపై డేంజర్ బెల్స్
విశాఖపట్నం : ఎండల తీవ్రతపై విశాఖ వాతావరణ కేంద్రం డేంజర్ బెల్స్ మోగించింది. ఇప్పటికే భానుడి భగభగలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. తాజా నివేదికలో ఎండ తీవ్రత మరింత పెరగనుందని పేర్కొంది. మరో రెండు రోజులపాటు తీవ్రమైన ఎండకు వడగాలులు కూడా తోడవుతాయని తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకి రాకూడదని హెచ్చరించింది. ఒకటి, రెండు చోట్ల క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి జల్లులు కురిసే అవకాశం కూడా ఉందని విశాఖ వాతావరణ కేంద్రం సోమవారం వెల్లడించింది. -
తిరువూరులో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
విశాఖపట్నం/తిరువూరు, ఛత్తీస్‌గఢ్‌నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, దక్షిణ కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, అయితే దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, మరో రెండు రోజులు వేడి సెగలు కొనసాగే అవకాశమున్నట్టు పేర్కొంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం అధికంగా ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని తిరువూరులో గరిష్టంగా 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రతతో పట్టణంలోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు రెంటచింతలలో గరిష్టంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.. రెంటచింతల-45.4, రామగుండం-43.8, ఒంగోలు-43.1, నిజామాబాద్-42.8, నెల్లూరు-42.7, తిరుపతి-42.6, నందిగామ-42.1, గన్నవరం-42.1, కావలి-41.4, హైదరాబాద్-40.9, కర్నూలు-40.9, బాపట్ల-40.4, అనంతపురం-40.3


