కాస్త ఎండ పట్టున ఉండండి..!

Stay away from Hot weather

ప్రస్తుతం మానవుల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలా... రాత్రుళ్లు త్వరగా పడుకుని, ఉదయం త్వరగా లేవడం దాదాపు అసాధ్యంగా మారింది. నగరజీవితం, ఉరుకుల పరుగుల ఉద్యోగాలు, వేళాపాళా లేని ఆఫీసు పనివేళలు దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నైట్‌ షిఫ్టుల్లో పనిచేసే వారు ఉదయం అంటే ఏంటో తెలియని దుస్థితికి చేరుకున్నారు. వాకిళ్లు లేని ఇరుకు ఇళ్లు, గూళ్లలాంటి అపార్ట్‌మెంట్లు కావడంతో సూర్యరశ్మి సోకడం గగనమైపోయింది. కేవలం రాత్రిషిప్టులు చేసేవారే కాదు, పగటిపూట పనిచేసేవారూ సూర్యరశ్మికి దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల నగరాల్లో పెరుగుతోన్న అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ కూడా దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. మరి ఇలాగైతే శరీరానికి కావాల్సిన ‘విటమిన్‌–డి’ అందేది ఎలా? అందుకే ‘కాస్త ఎండ పట్టున ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి’. అవును మానవ శరీరానికి విటమిన్‌ –డి ఎంతో ముఖ్యమైంది. ఈ విటమిన్‌ లోపం శరీరంపై చూపే ప్రభావం, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చో ఈ రోజు ‘హెల్త్‌’లో మీకోసం..

విటమిన్‌–డి ఎలా తయారవుతుందంటే..!
సూర్యకాంతిలో ఉండే అల్ట్రావైలెట్‌–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు ‘విటమిన్‌–డి’ని తయారు చేసుకుంటాయి. అనంతరం లివర్, కిడ్నీల్లో ‘విటమిన్‌–డి’ హైడ్రాక్సిలేషన్‌ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన ‘విటమిన్‌–డి’ మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది.

అనారోగ్య సమస్యలు..
శరీరానికి సరిపడ మోతాదులో ‘విటమిన్‌–డి’ లభించకపోతే తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతో పాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. అంతేకాదు ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్‌ త్వరగా ఖర్చు కాదు. దీంతో డయాబెటిస్‌ వస్తుంది. విటమిన్‌–డి లోపంతో ఆకలి మందగించడం, బరువు తగ్గటం, నిద్రలేమి వంటి సమస్యలు వేధిస్తాయి. అయితే ఈ కోవలోకి మరో సమస్య వచ్చి చేరింది. అదే తలనొప్పి. విటమిన్‌డి లోపంతో తలనొప్పి బారిన పడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా పురుషుల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది. తరచుగా తలనొప్పితో బాధపడేవారు బయట అంతగా గడపకపోవటం, శరీరానికి ఎండ సరిగా తగలక పోవడం దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు గుండె, ఊపిరితిత్తులు ఉండే ఎముకల గూడు భాగం(ఉరోస్థి)లో నొప్పిగా ఉండడం, క్షణక్షణానికీ భావోద్వేగాలు మారడం, వాతావరణం చల్లగా ఉన్నా తలలో చెమటలు పట్టడం, ఒంటి దురద, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

తీసుకోవాల్సిన ఆహారం...
విటమిన్‌ డి లోపాన్ని జయించాలంటే చర్మానికి తగినంత ఎండ తగిలేలా చూసుకోవటమే మంచి చికిత్స. కానీ ఎండ వల్ల తగినంత విటిమిన్‌ లభించని పరిస్థితి ఉంటే తీసుకునే ఆహార పదర్థాల ద్వారా కూడా కొంతలో, కొంత సమస్యను తగ్గించుకోవచ్చు. విటమిన్‌ డిని అందించే కొన్ని ఆహార పదార్థాలు...  

ముష్రుమ్స్‌ (పుట్టగొడుగులు)...
పుట్టగొడుగుల్లో విటమిన్‌ డి మాత్రమే కాదు విటమిన్‌ బి5 కూడా మెండుగా ఉంటుంది. తెల్లని పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల విటమిన్‌డితో పాటు జింక్, ప్రోటీన్స్‌ పుష్కలంగా లభిస్తాయి.

పాలు..
పాలు ‘విటమిన్‌–డి’ని సమృద్ధిగా అందిస్తాయి. ఒక గ్లాసు పాలలో మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో అవసరం. అంతే కాదు పాలలో ‘యాంటీ ఏజింగ్‌’ లక్షణాలు కూడా ఉంటాయి.

గుడ్డు...
రోజుకో గుడ్డు తప్పనిసరి అని ఆహార నిపుణులు చెబుతుంటారు. గుడ్డు అంతలా ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరీ. గుడ్లలో విటిమిన్‌–డి, విటమిన్‌ బి12 , ప్రోటీన్‌లు అధిక శాతంలో ఉంటాయి. కాబట్టి గుడ్డును కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలి.

చీజ్‌...
విటమిన్‌ డి కి మరో మూలాదారం చీజ్‌. ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఎంతో మేలు చేస్తుంది.  

చేపలు..
విటమిన్‌–డి అధిక మొత్తంలో లభించే ఆహార పదార్థాల్లో చేపలు మొదటి స్థానంలో ఉంటాయి. చేపలను కనీసం వారానికి ఒకసారైనా కచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా ట్యూనా, సాల్మన్‌ ఫిష్‌ ఆరోగ్యానికి చాలా మంచివి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top