సూర్యుడిని కత్తిరించేశారు!  | Andrew McCarthy Rocket-Sun Masterpiece Captures Seemingly Frozen SpaceX Falcon 9 | Sakshi
Sakshi News home page

సూర్యుడిని కత్తిరించేశారు! 

Sep 20 2025 5:58 AM | Updated on Sep 20 2025 5:58 AM

Andrew McCarthy Rocket-Sun Masterpiece Captures Seemingly Frozen SpaceX Falcon 9

వాషింగ్టన్‌:  భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడిని కత్తిరించడం సాధ్యమా? భూమి కంటే 109 రెట్లు పెద్దదైనా సూర్యగోళాన్ని రెండు ముక్కలు చేయగలమా? అలా చేయడం సాధ్యమేనని ప్రముఖ ఖగోళ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ మెక్‌కార్తీ నిరూపించారు. నారింజ రంగులోని ఈ అద్భుతమైన చిత్రాన్ని తన కెమెరాలో బంధించారు. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ ఈ నెల 6న ఫాల్కన్‌–9 రాకెట్‌ను ప్రయోగించింది. అమెరికాలోని ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఆండ్రూ మెక్‌కార్తీ తన కెమెరాను క్లిక్‌మనిపించారు. 

రాకెట్‌ సూర్యుడిని చీలుస్తూ దూసుకెళ్లినట్లుగా చిత్రం ఆవిష్కృతమైంది. ఇందులో ఉదయ భాస్కరుడి ఉపరితలంలోని క్రోమోస్పియర్‌ హైడ్రోజన్‌ అల్ఫా లైట్‌లో చక్కగా కనిపిస్తోంది. గతంలోనూ ఇలాంటి దృశ్యాలు కెమెరా కంటికి చిక్కినప్పటికీ అవి సాధారణ తెల్లటి కాంతిలోనే కనిపించాయి. ఇలా కనువిందైన సోలార్‌ క్రోమోస్పియర్‌ దృశ్యాన్ని మాత్రం ఎవరూ బంధించలేకపోయారు. ఆ పని మెక్‌కార్తీ విజయవంతంగా పూర్తిచేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన సోలార్‌ టెలిస్కోప్‌తోపాటు అ్రస్టానమీ కెమెరా ఉపయోగించాడు. రాకెట్‌ లాంచ్‌ప్యాడ్‌ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తన కెమెరాను బిగించి, ఈ ఫొటో తీశాడు.

 రాకెట్‌ నుంచి చిమ్ముతున్న నిప్పుల వర్షం సూర్యుడి వర్ణంతో సరిగ్గా కలిసిపోయింది. సూర్యుడిని రెండు ముక్కలుగా కత్తిరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. సూర్యుడి క్రోమోస్పియర్‌తోపాటు రాకెట్‌ ఒకేచోట దర్శనమిస్తున్న తొలి ఫొటో ఇదేనని చెప్పొచ్చు. అస్ట్రోఫొటోగ్రఫీ, స్పేస్‌ అబ్జర్వేషన్‌లో ఇది కీలక ఘట్టం. ఇలాంటి అరుదైన దృశ్యాన్ని చిత్రీకరించే అవకాశం జీవిత కాలంలో ఒక్కసారే లభిస్తుందని మెక్‌కార్తీ ఆనందం వ్యక్తంచేశాడు. ఇది సైన్స్, ఆర్ట్‌ సమ్మేళనమని అభివర్ణించాడు. అంతరిక్షంలోని అందాలను ఒడిసిపట్టడంలో అతడు దిట్టగా పేరుగాంచాడు. సాధారణ టెలిస్కోప్‌తో చూడలేని ఎన్నో దృశ్యాలను తన ప్రతిభతో ప్రపంచానికి చూపించాడు. స్టార్‌లింక్‌ 10–57 మిషన్‌లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధకులు ఫాల్కన్‌–9 రాకెట్‌ను ప్రయోగించారు. 28 ఉపగ్రహాలను భూదిగువ కక్ష్యలో ప్రవేశపెట్టారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement