
5 లక్షల కిలోమీటర్ల వెడల్పయిన రంధ్రం
గుర్తించిన ‘నాసా’సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ
భానుడి నుంచి వెలువడుతున్న సౌరగాలులు
వాషింగ్టన్: ఎల్లవేళలా భగభగమండుతూ భూగోళంపై జీవకోటికి ప్రాణాధారమైన లోకబాంధవుడు సూర్యుడిలో భారీ రంధ్రాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ గుర్తించింది. ఈ రంధ్రం ఏకంగా 5 లక్షల కిలోమీటర్ల వెడల్పున సీతాకోకచిలుక ఆకారంలో ఉండడం విశేషం. అందుకే బట్టర్‌ఫ్లై హోల్ అని పిలుస్తున్నారు. సూర్యుడి వాతావరణంలో అత్యంత అరుదుగా సంభవించే ఈ పరిణామం గురువారం నాసా కెమెరా కంటికి చిక్కింది.
ఈ రంధ్రం భూమి వాతావరణాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఉండడం గమనార్హం. సూర్యుడి బయటి పొరను ‘కరోనల్ హోల్’అంటారు. సూర్యుడి నుంచి ఉద్భవించే సౌర గాలులు అంతరిక్షంలోకి వెళ్లిపోవడానికి వీలుగా ఈ పొరలోని ఆయస్కాంత క్షేత్రాలు అప్పుడప్పుడు తెరుచుకుంటాయి. అలా తెరుచుకున్నప్పుడు రంధ్రం మాదిరిగా కనిపిస్తుంది. కానీ, 5 లక్షల కిలోమీటర్ల రంధ్రం కనిపించడం అరుదైన విషయమే.
టెలిస్కోప్ చిత్రాల్లో కరోనల్ హోల్స్ నల్ల రంగులో దర్శనమిస్తాయి. ఈ ప్రాంతంలో సాధారణంగా ఉండే వేడి ప్లాస్మా మాయం కావడమే ఇందుకు కారణం. ఉదయభానుడి కరోనల్ రంధ్రం నుంచి వెలువడుతున్న సౌర గాలులు ప్రస్తుతం భూమి దిశగా దూసుకొస్తున్నాయి. అంతరిక్షం గుండా ప్రయాణించి, భూమికి సంబంధించిన అయస్కాంత క్షేత్రాన్ని ఢీకొట్టనున్నాయి. ఈ సౌరగాలుల ప్రవాహం ఈ నెల 14వ తేదీన భూమికి చేరుకొంటుందని అంచనా వేస్తున్నారు.
సౌరగాలులు భూమిని ఢీకొట్టినప్పుడు భూఅయస్కాంత తుఫాన్లు సంభవిస్తాయి. వీటిని జీ1(స్వల్ప), జీ2(మధ్యస్తం)గా కొలుస్తారు. ఈ తుఫాన్ల వల్ల ప్రాణనష్టం ఏమీ ఉండదు గానీ ఉప్రగహాల కార్యకలాపాలు, సాంకేతిక వ్యవస్థలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉపగ్రహ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడొచ్చు.
సూర్యుడి, భూమి ఆయస్కాంత క్షేత్రాల మధ్య అనుసంధానం సందర్భంగా అంతరిక్షం గురించి కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సూర్యగోళం, భూగోళం మధ్య బంధాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని సీతాకోకచిలుక రంధ్రం అందిస్తుందని అంటున్నారు. మొత్తానికి సూర్యుడి నుంచి వెలువడుతున్న సౌర గాలుల ప్రవాహాన్ని సైంటిస్టులు నిశితంగా పరిశీలిస్తున్నారు.