breaking news
Hero chance
-
భాగమతి మూవీ దర్శకుడిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: సినిమాలో హీరో అవకాశం ఇస్తానని నమ్మించి ఓ యువకుడిని నిలువెల్లా మోసం చేశారు. ఈమేరకు దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఠాణాలో కేసు నమోదైంది. కూకట్‌పల్లికి చెందిన నాయుడు హనుమంతరావు కుమారుడికి సినిమాలంటే మక్కువ. దీన్ని అవకాశంగా మలుచుకున్న అశోక్, విజయలక్ష్మీలు సినిమా అవకాశం ఇస్తామని నమ్మించారు.యువకుడి తల్లిదండ్రుల నుంచి పలు దఫాలుగా రూ.3.50 కోట్లు తీసుకున్నారు. అయితే అనుకోని కారణాలతో సినిమా పట్టాలెక్కలేదు. దీంతో ఇచ్చిన సొమ్ము వాపసు ఇవ్వాలంటూ బాధితులు దర్శకుడు అశోక్ బాబు, నిర్మాత విజయలక్ష్మీలను సంప్రదించారు. దీంతో వాళ్లు డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిరాకరించడంతో విసుగు చెందిన బాధితుడు హనుమంతరావు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దర్శకుడు అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
ప్రేమ + స్నేహం= ది ఎండ్
► వేషం ఇస్తానని మోసం ► సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడు ► పోలీసులను ఆశ్రయించిన బాధితులు బంజారాహిల్స్: తాను తీయబోయే సినిమాలో హీరో వేషం ఇస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి సినిమా కంపెనీ మూసేసిన దర్శకుడిపై బాధితులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్ జిల్లా బోదన్కు చెందిన రాజేంద్రనాయక్ అలియాస్ డీవీ సిద్దార్థ్ ఫిలింనగర్‌లోని అపోలో రోడ్డులో ఓం సాయిరాం ప్రొడక్షన్స్ పేరుతో సినిమా కార్యాలయం తెరిచాడు. తాను దర్శకుడిగా జూన్ 19న ప్రేమ + స్నేహం= సంగీతం అనే సినిమాను నిర్మిస్తున్నాని, ఇందుకు హీరోలు కావాలని ప్రకటించాడు. స్పందించిన రంగారెడ్డి జిల్లా మేడ్చల్ సమీపంలోని రాయిలాపురం గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌గౌడ్ తన అక్క పెళ్లి కోసం దాచిన రూ. 4 లక్షలు ఇంట్లోవారికి తెలియకుండా తెచ్చి హీరో వేషం కోసం ఇచ్చాడు. శ్రావణ్‌తో పాటు అదే ప్రాంతానికి రాజశేఖర్ రూ. 70 వేలు, కిషోర్ రూ. 30 వేలు... ఇలా చాలా మంది యువకులు వేషం కోసం డబ్బు చెల్లించారు. ఇందుకు గాను సదరు డైరెక్టర్ వారికి బాండ్ రాసిచ్చాడు. తీరా గత నెల 19న సినిమా ప్రారంభించాల్సి ఉండగా సిద్దార్థ్ మాయమాటలు చెప్పి దాటవేశాడు. వారం క్రితం సినిమా కార్యాలయం మూసేసి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. తాము మోసపోయానని గ్రహించిన బాధితులు బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సినిమాలో వేషాల కోసం తమతో పాటు చాలా మంది డబ్బులు చెల్లించారని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.


