breaking news
Govt. hospitals
-
హ..హ..నుమతులు
► చీరాలలోని పలు భవననిర్మాణాల్లో నిబంధనలకు నీళ్లు ► ప్రభుత్వ ఆదేశాలనుఅపహాస్యం చేస్తున్న కార్పొరేట్లు ► బహుళ అంతస్తుల్లోఅగ్ని ప్రమాద నివారణ చర్యలు శూన్యం ► నోటీసులు జారీ చేసినా అప్రమత్తంకాని యజమానులు ► చీరాలే కాదు.. జిల్లా వ్యాప్తంగా బిల్డర్లందరిదీ అదే దారి ► నిద్రనటిస్తున్న సంబంధిత శాఖల అధికారులు మున్సిపాలిటీలో ఎన్వోసీ లేకుండా అపార్టుమెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. టౌన్ ప్లానింగ్ అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా అపార్టుమెంట్ల సంసృ్కతి పెరిగిపోతోంది. అగ్నిమాపక అనుమతులు లేకుండా భవనాలు నిర్మించినప్పటకీ వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారనేదీ బహిరంగ వాస్తవమే. 50 అపార్ట్మెంట్లు చీరాల పట్టణంతో పాటు కొత్తపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 50కిపైగా అపార్టుమెంట్లు ఉన్నాయి. వీటిలో కేవలం 5 అపార్టుమెంట్లకు మాత్రమే అగ్నిమాపకశాఖ అనుమతులు ఉన్నాయంటే భవన యజమానులు ఏ మేరకు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో తెలుసుకోవచ్చు. జిల్లా మొత్తంలో 350పైగా అపార్టుమెంట్లు ఉన్నా వీటిలో చాలా వాటికి అగ్నిమాకశాఖ అనుమతులు లేవు. బహుళ అంతస్తులు, వ్యాపార సముదాయాలు నిర్మించే బిల్డర్లు తప్పనిసరిగా అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలనే నిబంధనలు ఉన్నా అవి మాకు మినహాయింపు అనుకున్నారో ఏమో భవన నిర్మాణాల యజమానులు అనుమతుల ఊసే మరిచారు. చివరకు ఆస్పత్రులూ అంతే.. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ముందస్తు అగ్ని ప్రమాద నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో 12 నియోజకవర్గాల్లో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు 100 వరకు ఉన్నా కేవలం 10 నుంచి 20 వరకే అగ్నిప్రమాద నివారణ పరికరాలు ఏర్పాటు చేశారుు. విద్యా సంస్థలదీ అదే దారి విద్య వ్యాపారంగా మారిన ప్రస్తుత తరుణంలో కార్పొరేట్ విద్య పేరుతో అగ్గిపెట్టెల్లాంటి భవనాలు, 5 అంత స్తుల బిల్డింగ్‌ల్లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. విద్యా సంస్థలు నిర్వహించే భవనాల్లో అగ్నిప్రమాదం నుంచి తప్పించుకునే చర్యలు, పరికరాలు మచ్చుకైనా కానరావు. వాణిజ్య భవనాలది మరో రూటు ఎక్కడా చూసినా షాపింగ్ మాళ్లు కనిపిస్తున్నారుు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు రెవెన్యూ డివిజన్లలో వ్యాపార సముదాయాల భవనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వ్యాపార భవన సముదాయాలు ఏర్పాటు చేయాలంటే విధిగా ఎన్వోసీ తీసుకోవాలనే ఆదేశాలు ఉన్నా వ్యాపారులు అవేమీ పట్టించుకోవడం లేదు. అనుమతులిచ్చే సమయంలో నిర్లక్ష్యం భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే సమయంలో అగ్నిమాపకశాఖ నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండానే ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. బహుళ అంతస్తులు, వ్యాపార, విద్యా సంస్థల్లో అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నారా.. లేదా.. అని పరిశీలించాల్సిన వి ద్యాశాఖ అధికారులు.. కాసులకు కక్కుర్తిపడి అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు : నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించిన వారిపై చర్యలు తీసుకుంటున్నాం. కల్యాణ మండపాలు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్లకు ఎన్ఓసీ తీసుకోకుంటే ముందుగా నోటీసులు ఇస్తాం. ఆ తర్వాత కూడా స్పందించకుంటే ఆ కేసును కోర్టులో వేస్తాం. ప్రతి ఒక్కరూ విధిగా ఎన్ఓసీ తీసుకోవాలి - పెద్దిరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి పుట్టకొక్కులా పుట్టుకొస్తున్న అపార్టుమెంట్లు.. అగ్గిపెట్టెల్లాంటి షాపింగ్ మాళ్లు.. ఆస్పత్రులు, వ్యాపార సముదాయాలు.. అవన్నీ నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంగణాలు. వాటిల్లో ఏ చిన్న అగ్ని ప్రమాదం జరిగినా ధన, ప్రాణ, ఆస్తి నష్టాన్ని భారీగానే ఊహించవచ్చు. జిల్లాలో కొందరు వ్యాపారులు నిబంధనలకు నీళ్లొదిలి ఆకాశాన్ని తాకేలా భవనాలు నిర్మిస్తున్నా ప్రశ్నించే అధికారి లేడు. అగ్ని ప్రమాదాలు జరిగితే కనీసం ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు వెళ్లేందుకు కూడా అవకాశం లేదంటే ఆ భవనాల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొందరు కనీసం ఎన్వోసీ కూడా తీసుకోవడం లేదు. జిల్లాలో చాలాచోట్ల బహుళ అంతస్తులు అపార్టుమెంట్లు, కార్పొరేట్ ఆస్పత్రులకు కనీసం అనుమతులు లేవంటే అగ్నిమాపకశాఖ అధికారుల పనితీరును ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనలు కొందరు అపహాస్యం చేస్తున్నారు. - చీరాల -
ఉద్యోగాలే కాదూ.. వేతనాల్లోనూ కోత
►కొత్త కాంట్రాక్ట్ విధానంలో వేతనం రూ.వెయ్యి తగ్గింపు ►లబోదిబోమంటున్న సర్కారీ ఆస్పత్రుల సెక్యూరిటీ సిబ్బంది తణుకు అర్బన్ : బాబు వస్తే జాబు గ్యారంటీ.. ఇంటికో ఉద్యోగం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఊడిపోవటంతోపాటు, వేతనాల్లోనూ కోత పడుతోంది. కొత్త కాంట్రాక్ట్ విధానాల కారణంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో గల ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 35 మంది సెక్యూరిటీ సిబ్బంది వేతనంలో నెలకు రూ.వెయ్యి చొప్పున కోత పడనుంది. గత నెల 1వ తేదీ నుంచి కొత్త కాంట్రాక్ట్ విధానం అమలులోకి వచ్చింది. వంద పడకల ఆస్పత్రులైన ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జండిరెడ్డిగూడెం ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 18మంది సెక్యూరిటీ సిబ్బందికి కొత్త కాంట్రాక్టు పద్ధతిలో పాత వేతనాలు రూ.6,700 కాగా, వివిధ రూపాల్లో మినహాయింపులు పోను రూ.5,800 వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుతం కొత్త విధానంలో రూ.4,800 చేతికి వస్తుండటంతో వీటిని తీసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెరుగుతాయని ఆశగా చూస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం షాకిచ్చింది. వేతనాలు పెరగకపోగా, ఉన్న వేతనంలో కోత విధించడంపై మండిపడుతున్నారు. గతం కంటే పనిభారం పెరిగినప్పటికీ ఎప్పటికైనా ఉద్యోగ భద్రత కలుగుతుందన్న ఆశతో ఆస్పత్రులను అంటిపెట్టుకుని ఉన్న తమకు కొత్త ప్రభుత్వం వేతనాల్లో కోత విధించ డంపై సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ఏడాదిలో రెండుసార్లు ఇంటి అద్దెలు పెరుగుతుండటం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, పిల్లల చదువులు భారంగా మారిన పరిస్థితుల్లో కూడా చాలీచాలని జీతాలకు నెట్టుకొస్తున్న తమ బతుకులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వాపోతున్నారు. పాత కాంట్రాక్ట్ విధానం అమలవుతున్న 50 పడకల ఆస్పత్రులైన పాలకొల్లు, భీమవరం, నరసాపురం, చింతల పూడి, కొవ్వూరు ఆస్పత్రుల్లో మాత్రం ప్రస్తుతానికి పాత వేతనాలు అమల్లో ఉన్నా, త్వరలో వీరికి కూడా కొత్త కాంట్రాక్టు విధానం అమలుచేయనున్నట్టు తెలిసింది. పదేళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తున్న వారిని సాగనంపేందుకే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేతనాల తగ్గింపు ద్వారా మరొక ఇద్దరిని అదనంగా తీసుకునే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు అంటున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.