
ఉద్యోగాలే కాదూ.. వేతనాల్లోనూ కోత
బాబు వస్తే జాబు గ్యారంటీ.. ఇంటికో ఉద్యోగం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది.
►కొత్త కాంట్రాక్ట్ విధానంలో వేతనం రూ.వెయ్యి తగ్గింపు
►లబోదిబోమంటున్న సర్కారీ ఆస్పత్రుల సెక్యూరిటీ సిబ్బంది
తణుకు అర్బన్ : బాబు వస్తే జాబు గ్యారంటీ.. ఇంటికో ఉద్యోగం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన టీడీపీ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు ఊడిపోవటంతోపాటు, వేతనాల్లోనూ కోత పడుతోంది. కొత్త కాంట్రాక్ట్ విధానాల కారణంగా వైద్య విధాన పరిషత్ పరిధిలో గల ఏరియా, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న 35 మంది సెక్యూరిటీ సిబ్బంది వేతనంలో నెలకు రూ.వెయ్యి చొప్పున కోత పడనుంది.
గత నెల 1వ తేదీ నుంచి కొత్త కాంట్రాక్ట్ విధానం అమలులోకి వచ్చింది. వంద పడకల ఆస్పత్రులైన ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, జండిరెడ్డిగూడెం ఆసుపత్రుల్లో పనిచేస్తున్న 18మంది సెక్యూరిటీ సిబ్బందికి కొత్త కాంట్రాక్టు పద్ధతిలో పాత వేతనాలు రూ.6,700 కాగా, వివిధ రూపాల్లో మినహాయింపులు పోను రూ.5,800 వేతనాలు చెల్లించేవారు. ప్రస్తుతం కొత్త విధానంలో రూ.4,800 చేతికి వస్తుండటంతో వీటిని తీసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉద్యోగ భద్రతతోపాటు జీతాలు పెరుగుతాయని ఆశగా చూస్తున్న సిబ్బందికి ప్రభుత్వ విధానం షాకిచ్చింది. వేతనాలు పెరగకపోగా, ఉన్న వేతనంలో కోత విధించడంపై మండిపడుతున్నారు.
గతం కంటే పనిభారం పెరిగినప్పటికీ ఎప్పటికైనా ఉద్యోగ భద్రత కలుగుతుందన్న ఆశతో ఆస్పత్రులను అంటిపెట్టుకుని ఉన్న తమకు కొత్త ప్రభుత్వం వేతనాల్లో కోత విధించ డంపై సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఓవైపు ఏడాదిలో రెండుసార్లు ఇంటి అద్దెలు పెరుగుతుండటం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుండటం, పిల్లల చదువులు భారంగా మారిన పరిస్థితుల్లో కూడా చాలీచాలని జీతాలకు నెట్టుకొస్తున్న తమ బతుకులతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని వాపోతున్నారు.
పాత కాంట్రాక్ట్ విధానం అమలవుతున్న 50 పడకల ఆస్పత్రులైన పాలకొల్లు, భీమవరం, నరసాపురం, చింతల పూడి, కొవ్వూరు ఆస్పత్రుల్లో మాత్రం ప్రస్తుతానికి పాత వేతనాలు అమల్లో ఉన్నా, త్వరలో వీరికి కూడా కొత్త కాంట్రాక్టు విధానం అమలుచేయనున్నట్టు తెలిసింది. పదేళ్లకు పైబడి ఉద్యోగాలు చేస్తున్న వారిని సాగనంపేందుకే ప్రభుత్వం ఈ చర్య చేపట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేతనాల తగ్గింపు ద్వారా మరొక ఇద్దరిని అదనంగా తీసుకునే అవకాశం ఉందని కాంట్రాక్టర్లు అంటున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి.