breaking news
Dost
-
దోస్త్‌లో కొత్త కోర్సులు..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో కొత్త కోర్సులను దోస్త్‌లోకి తేవడంలో ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి విజయం సాధించింది. మూడోదశ కౌన్సెలింగ్‌లోకి వీటిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ఈ కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారీ సంఖ్యలో విద్యార్థులు ఈ కోర్సులకు ఆప్షన్లు ఇస్తున్నారు. ఇప్పటికే 67 కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల్లో సీట్లు తగ్గించుకొని, కొత్త కోర్సుల నిర్వహణకు ఆమోదం తెలిపాయి. చదువుతోపాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఉండేలా ఉన్న కాలేజీలకు అనుమతించాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. కొత్తగా ప్రవేశపెడుతున్న కోర్సులు కావడంతో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఒక బృందాన్ని కూడా రూపొందించే ప్రక్రియలో ఉన్నారు. మండలిదే పైచేయి... ఏడాది పాటు కసరత్తు చేసిన పలు కొత్త కోర్సులను విద్యాశాఖ ఉన్నతాధికారులు, సాంకేతిక విద్యామండలి అధికారులు అడ్డుకోవడం వివాదాస్పదమైంది. దాదాపు రూ.25 లక్షలు వెచ్చించి నిపుణుల చేత సిలబస్ కూడా రూపొందించారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు అన్ని యూనివర్సిటీలూ తొలుత ఆమోదం తెలిపాయి. ఇంజనీరింగ్‌కు సమాంతరంగా ఉన్న కోర్సులు కావడంతో ప్రైవేట్ కాలేజీలు విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్ద లాబీయింగ్ చేశాయి. దీంతో వర్సిటీలు బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీఓఎస్) ఇవ్వకుండా నిలిపివేశాయి. ఈ కారణంతో సాంకేతిక విద్యామండలి దోస్త్‌లోకి కొత్త కోర్సులను రానివ్వకుండా అడ్డుకుంది. దోస్త్ రెండు దశల కౌన్సెలింగ్‌లోనూ ఆప్షన్లలో ఇవి రాకుండా చేశారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగలిగారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూడోదశ కౌన్సెలింగ్‌లోకి కొత్త కోర్సులను చేర్చాలని సీఎంఓ ఆదేశించడంతో సమస్య పరిష్కారమైంది. భారీగా ఆప్షన్లు ప్రస్తుతం దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ నడుస్తోంది. ఈ నెల 16వ తేదీ వరకూ ఆప్షన్లు ఇచ్చేందుకు గడువు ఉంది. అవసరమైతే ఈ గడువును పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొత్త కోర్సుల వైపు విద్యార్థులు భారీగా దృష్టి పెట్టారు. ఇప్పటికే సీట్లు వచ్చిన విద్యార్థులు కూడా ఆప్షన్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.అవసరమైతే కాలేజీల్లో అంతర్గత స్లైడింగ్ ద్వారా కొత్త కోర్సులను ఎంచుకునే ఆలోచనలో ఉన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు కంప్యూటర్ సంబంధిత కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆఖరి దశ కౌన్సెలింగ్‌లోకి వీటిని చేర్చడంతో ఆప్షన్ల గడువు పెంచాలని విద్యార్థులు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ను స్వయంగా కలిసి, కొంతమంది ఫోన్ల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.ఇవీ కొత్త కోర్సులు.. ఉస్మానియా వర్సిటీలో బీకామ్–ఫైనాన్స్ టెక్నాలజీ బీకామ్– ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ బీకామ్– ఈ కామర్స్ ఎంకామర్స్‌అండ్ డిజిటల్ మార్కెటింగ్ కాకతీయ వర్సిటీలో బీఏ–సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్ బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పాలమూరు వర్సిటీలో బీఏ–డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్– ఈకామర్స్, ఎంకామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీకామ్– ఫైనాన్స్ టెక్నాలజీ శాతవాహన వర్సిటీలో బీఏ – డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్– ఈ కామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్స్అండ్ సైబర్ సెక్యూరిటీ తెలంగాణ వర్సిటీలో బీఏ– డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ బీకామ్ – ఈ కామర్స్, ఎం కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ బీఎస్సీ – డిజిటల్ ఫోరెన్సిక్స్ సైన్స్అండ్ సైబర్ సెక్యూరిటీ -
కొత్త కోర్సుల్లేవా దోస్త్?
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఈ ఏడాది అందుబాటులోకి వచ్చే అవకాశం కన్పించడం లేదు. మండలి, సాంకేతిక విద్య అధికారుల మధ్య వివాదమే దీనికి ప్రధాన కారణం. ఇంజనీరింగ్ విద్యకు సమాంతరంగా మండలి రూపొందించిన కోర్సులను సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపివేసింది. డిగ్రీ ద్వారా ఈ కోర్సులు చేయడం వల్ల అతి తక్కువ ఖర్చుతోనే అత్యధిక వేతనంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందే వీలుంది. అంతర్జాతీయంగా బహుళ జాతి కంపెనీల్లోనూ పేద విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా రూపొందించారు.ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యా మండలి విస్తృత ప్రచారం చేపట్టింది. రూ. లక్షలు వెచ్చించి ఇంజనీరింగ్‌లో యాజమాన్య కోటా సీటు పొందేకన్నా ఎమర్జింగ్ కోర్సులున్న డిగ్రీ విద్యను ఎంచుకోవాలని విద్యార్థులు సైతం ఆశపడ్డారు. వీటివల్ల బహుళజాతి సంస్థల్లో మంచి ఉద్యోగావకాశాలు వస్తాయని భావించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత విద్యా మండలి ద్వారా కోర్సుల వివరాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆసక్తి చూపడంతో అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో మండలి చైర్మన్ సమావేశం ఏర్పాటు చేసి కోర్సుల నిర్వహణకు ఒప్పించారు.బీవోఎస్ అనుమతులు ఆపిందెవరు?కొత్త కోర్సులు, సిలబస్‌ను రూపొందించేప్పుడు ప్రతీ యూనివర్సిటీ పరిధిలోని బోర్డ్ ఆఫ్ స్టడీస్ (బీవోఎస్) ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందులో విశ్వవిద్యాలయం అధికారులతో పాటు బయట నుంచి పారిశ్రామిక నిపుణులు, వ్యాపారవేత్తలూ ఉంటారు. పరిశ్రమలకు అవసరమైన రీతిలో సిలబస్, కోర్సుల రూపకల్పనపై ఈ బోర్డు చర్చిస్తుంది. కోర్సులపై ఏడాదిగా కసరత్తు జరుగుతున్నా, యూనివర్సిటీలు మాత్రం బీవోఎస్ సమావేశాలు నిర్వహించలేదు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి కారణంగానే తాము ముందుకు వెళ్ళడం లేదని పలు వర్సిటీల వీసీలు తెలిపారు.ఈ విషయమై ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంను వివరణ కోరగా బీవోఎస్‌లోని సభ్యులు వివిధ కారణాల వల్ల అందుబాటులో లేరని, అందుకే సమావేశం నిర్వహించలేదని తెలిపారు. ఇది సహేతుక కారణమే కాదని, సాంకేతిక విద్య అధికారుల ఒత్తిడే దీని వెనుక పని చేసిందని మండలి వర్గాలు అంటున్నాయి. అయితే కొన్ని వర్సిటీల నుంచి బీవోఎస్ అనుమతులు వచ్చాయని, వీటిని విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు. డిగ్రీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే దోస్త్ రెండో ఫేజ్ ఇప్పటికే పూర్తయింది. మూడో విడత నడుస్తోంది. ఇది కూడా ఈ నెల 16తో ముగుస్తుంది. అయినా కొత్త కోర్సులపై పంచాయితీ ఇప్పటికీ తెగకపోవడం, ఆన్‌లైన్‌లోకి ఇవి రాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.ఇంజనీరింగ్‌కు దీటుగా..డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటి కోర్సులను డిగ్రీలో ప్రతిపాదించారు. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను సైతం ప్రతిపాదించారు. ఈ మేరకు ఏడాదిగా కసరత్తు చేసిన ఈ కోర్సులను ఆపలేమని కౌన్సిల్ చెప్పడంతో సాంకేతిక విద్య ఉన్నతాధికారి బీవోఎస్ నివేదికలు ఇవ్వొద్దని వీసీలపై ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ప్రైవేటు కాలేజీల నుంచి భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.అసలు కారణం ఏమిటి?ఇంజనీరింగ్ ఫీజులు భారీగా పెరిగాయి. యాజమాన్య కోటా సీట్లు రూ. 10 నుంచి రూ. 20 లక్షల వరకూ పలుకుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ డిగ్రీ కోర్సుల వల్ల ఉపాధి అవకాశాలు అంతగా ఉండటం లేదు. తాజాగా మండలి ప్రతిపాదించిన కొత్త కోర్సులు ఇంజనీరింగ్ విద్యకు దీటుగా, మెరుగ్గా ఉండే వీలుంది. అందువల్ల విద్యార్థులు డిగ్రీ కోర్సులకు వెళ్తే ఇంజనీరింగ్ బీ కేటగిరీ సీట్లు నిండటం కష్టం. దీంతో యాజమాన్యాలు లాబీయింగ్ చేసి కోర్సులు ఆపాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలతో సాంకేతిక విద్య అధికారులు సంప్రదింపులు జరపడం, కౌన్సిల్‌పై కోర్సులు ఆపమని ఒత్తిడి చేయడం వివాదానికి కారణమైంది. -
కొత్త కోర్సులతో దోస్తీ కట్
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా కసరత్తు చేసి, విద్యార్థులను ఊదరగొట్టిన పది కొత్త కోర్సులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ ఆన్లైన్ సిస్టమ్ (దోస్త్) నుంచి వీటిని తొలగించారు. ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదపాలవుతోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులు కూడా సమర్పించిన దాదాపు 260 కాలేజీల పరిస్థితి అయోమయంలో పడింది. కొత్త కోర్సుల కోసం ఈ కాలేజీలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా వదులుకున్నాయి. కొత్తవి రాక, ఉన్నవి రద్దవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా విభాగం మధ్య కోల్డ్ వార్ దీనికి కారణం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు కొత్త కోర్సుల రద్దుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాజీకి అధికారులు మాత్రం తగ్గేదేలేదంటూ భీషి్మంచుకున్నారు. పెద్ద ఎత్తున నిధులు కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నా చేరేవారి సంఖ్య 2.25 లక్షలు దాటడం లేదు. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి ఏడాదిపాటు నిపుణులను నియమించుకుని, దాదాపు రూ.25 లక్షల వరకూ వెచ్చించి, డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలను మండలి చేపట్టింది. విస్తృతంగా పరిశోధన జరిపేందుకూ పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. ఈ క్రమంలో బీఏ, బీకాం, బీఎస్సీలో ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బోధన ప్రణాళికనూ సిద్ధం చేశారు. దీనికి అన్ని యూనివర్సిటీలూ ఆమోదం తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260 కాలేజీలు కొత్త కోర్సులను తెచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేసుకుంటామని చెప్పాయి. యూనివర్సిటీలు అదే పనిగా ఈ కోర్సులపై ప్రచారం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. వర్సిటీలు కూడా దోస్త్ పోర్టల్‌లో కోర్సులను అప్లోడ్ చేశాయి. వీటన్నింటినీ సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపేసింది. దోస్త్ పోర్టల్‌లో ఆప్షన్లు పెట్టేందుకు వీల్లేకుండా బ్లాక్ చేయడంతో వేలాది మంది విద్యార్థులు అమోమయంలో పడ్డారు. వాస్తవానికి ఈ కోర్సులన్నీ ఈ నెలాఖరుతో ముగిసే రెండో దశ కౌన్సెలింగ్‌లోకి ఉంటాయని అధికారులు నెల రోజులుగా చెబుతున్నారు. రద్దయిన కోర్సులన్నీ కీలకమైనవే... బీఏ, బీఎస్సీ, బీకామ్ ద్వారా బహుళజాతి సంస్థల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను ప్రవేశ పెడుతున్నట్టు ఉన్నత విద్యామండలి ఏడాదిగా ప్రచారం చేసింది. బీఏలో సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులను ఇంజనీరింగ్‌లో పూర్తి చేయాలంటే విద్యార్థి రూ. లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డిగ్రీలో ఈ కోర్సులు చేయడానికి మూడేళ్ల కాలంలో రూ. 50 వేలకు మించి ఖర్చు కాదు. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉపాధి లభించే వీలుంది. బీఎస్సీలోనూ డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటివి ఉన్నాయి. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను ప్రతిపాదించారు. వీటివల్ల బహుళజాతి సంస్థలో మంచి ఉపాధి వస్తుందని విద్యార్థులు భావించారు. వీటినీ ఇప్పుడు నిలిపివేస్తున్నారు. ఎవరి కోసం ఈ వివాదం? డిగ్రీ కోర్సుల ప్రక్షాళనకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకంగా ఉన్నాయి. సమాంతర కోర్సులు ప్రవేశపెడితే ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ సీట్లకు డిమాండ్ ఉండదనే వాదన తెచ్చాయి. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు, బలమైన లాబీయింగ్ కూడా నడిచినట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వంలోని కొంతమంది, ఉన్నతాధికారులు కీలకమైన కోర్సుల నిలిపివేతకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి, సిలబస్ రూపకల్పన చేస్తున్నప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులూ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. దోస్త్‌లో కోర్సులు రాకుండా ఆఖరులో అడ్డుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. -
రేపట్నుంచి డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఇందుకు సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్విసెస్–తెలంగాణ (దోస్త్–2026) నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేస్తారు. మొత్తం 969 కాలేజీలు దోస్త్ పరిధిలోకి వస్తాయి.వీటిల్లో 4,40,107 సీట్లున్నాయి. గత ఏడాది 2,05,140 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని, దీనివల్ల డిగ్రీలో అడ్మిషన్లు పెరుగుతాయని బాలకిష్టారెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో మండలి వైస్ చైర్మన్లు ప్రొ.ఎస్కే మహమూద్, ప్రొ.ఇటికాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు. దోస్త్ మూడు దఫాలుగా..: ఈ ఏడాది కూడా డిగ్రీ కోర్సుల్లో సీట్లను మూడు విడతల్లో భర్తీ చేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. విద్యార్థులు రూ. 200 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వచ్చే నెల 14న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత రిజిస్ట్రేషన్ చేసుకునే వారు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీల్లో నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30న కాలేజీల్లో విద్యార్థులకు ఓరియంటేషన్‌ను నిర్వహిస్తారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు జూలై 1 నుంచి ప్రారంభమవుతాయి.


