దోస్త్ పోర్టల్ నుంచి పది కొత్త డిగ్రీ కోర్సులు మాయం
అయోమయంలో డిగ్రీ కాలేజీలు
కొత్త వాటి కోసం ఉన్నవాటిని వదులుకున్న వైనం.. ఎమర్జింగ్ కోర్సుల నిలిపివేతపై విద్యార్థుల ఆగ్రహం
మండలి, సాంకేతిక విద్య వివాదంతో విద్యార్థులకు నష్టం
రంగంలోకి ప్రభుత్వం... అధికారుల మధ్య రాజీకి యత్నం
ఎవరికి వారు తగ్గేదేలేదంటున్న ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్: ఏడాది కాలంగా కసరత్తు చేసి, విద్యార్థులను ఊదరగొట్టిన పది కొత్త కోర్సులకు మంగళం పాడే పరిస్థితి ఏర్పడింది. డిగ్రీ ఆన్‌లైన్ సిస్టమ్ (దోస్త్) నుంచి వీటిని తొలగించారు. ఈ కోర్సుల కోసం ఉన్నత విద్యామండలి వెచ్చించిన లక్షలాది రూపాయలు బూడిదపాలవుతోంది. ఈ కోర్సుల్లో చేరేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్న విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లారు. కోర్సులను ప్రవేశపెట్టేందుకు దరఖాస్తులు కూడా సమర్పించిన దాదాపు 260 కాలేజీల పరిస్థితి అయోమయంలో పడింది. కొత్త కోర్సుల కోసం ఈ కాలేజీలు ప్రస్తుతం ఉన్న సీట్లను కూడా వదులుకున్నాయి. కొత్తవి రాక, ఉన్నవి రద్దవ్వడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనలో ఉన్నాయి. ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యా విభాగం మధ్య కోల్డ్ వార్ దీనికి కారణం. ఈ వ్యవహారాన్ని పరిష్కరించడంలో ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు కొత్త కోర్సుల రద్దుపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాజీకి అధికారులు మాత్రం తగ్గేదేలేదంటూ భీషి్మంచుకున్నారు.
పెద్ద ఎత్తున నిధులు
కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 4.6 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నా చేరేవారి సంఖ్య 2.25 లక్షలు దాటడం లేదు. ఇంజనీరింగ్‌తో సమానంగా డిగ్రీ కోర్సులను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు ఉన్నత విద్యామండలి ఏడాదిపాటు నిపుణులను నియమించుకుని, దాదాపు రూ.25 లక్షల వరకూ వెచ్చించి, డిగ్రీ కోర్సుల్లో సంస్కరణలను మండలి చేపట్టింది. విస్తృతంగా పరిశోధన జరిపేందుకూ పెద్దఎత్తున నిధులు వెచ్చించింది. ఈ క్రమంలో బీఏ, బీకాం, బీఎస్సీలో ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన బోధన ప్రణాళికనూ సిద్ధం చేశారు. దీనికి అన్ని యూనివర్సిటీలూ ఆమోదం తెలిపాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 260 కాలేజీలు కొత్త కోర్సులను తెచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఉన్న కొన్ని కోర్సులను రద్దు చేసుకుంటామని చెప్పాయి. యూనివర్సిటీలు అదే పనిగా ఈ కోర్సులపై ప్రచారం చేశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరేందుకు సంసిద్ధమయ్యారు. వర్సిటీలు కూడా దోస్త్ పోర్టల్‌లో కోర్సులను అప్‌లోడ్ చేశాయి. వీటన్నింటినీ సాంకేతిక విద్య కమిషనరేట్ ఆపేసింది. దోస్త్ పోర్టల్‌లో ఆప్షన్లు పెట్టేందుకు వీల్లేకుండా బ్లాక్ చేయడంతో వేలాది మంది విద్యార్థులు అమోమయంలో పడ్డారు. వాస్తవానికి ఈ కోర్సులన్నీ ఈ నెలాఖరుతో ముగిసే రెండో దశ కౌన్సెలింగ్‌లోకి ఉంటాయని అధికారులు నెల రోజులుగా చెబుతున్నారు.
రద్దయిన కోర్సులన్నీ కీలకమైనవే...
బీఏ, బీఎస్సీ, బీకామ్ ద్వారా బహుళజాతి సంస్థల్లో గరిష్ట ఉపాధి అవకాశాలు లభించే కోర్సులను ప్రవేశ పెడుతున్నట్టు ఉన్నత విద్యామండలి ఏడాదిగా ప్రచారం చేసింది. బీఏలో సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ల్యాండ్ అగ్రికల్చర్, రూరల్ డెవలప్‌మెంట్ వంటివి ఉన్నాయి. ఈ కోర్సులను ఇంజనీరింగ్‌లో పూర్తి చేయాలంటే విద్యార్థి రూ. లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. డిగ్రీలో ఈ కోర్సులు చేయడానికి మూడేళ్ల కాలంలో రూ. 50 వేలకు మించి ఖర్చు కాదు. ఇంజనీరింగ్‌తో సమానంగా ఉపాధి లభించే వీలుంది. బీఎస్సీలోనూ డేటాసైన్స్, ఏఐఎంఎల్, డిజిటల్ ఫోరెన్సిక్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ (ఆనర్స్) వంటివి ఉన్నాయి. వీటి బోధన ప్రణాళిక మొత్తం ఇంజనీరింగ్ విద్యతో సమానంగా రూపొందించారు. శరవేగంగా దూసుకొస్తున్న ఇ–కామర్స్ కోసం ఫైనాన్స్ టెక్నాలజీతో పాటు, డిజిటల్ మార్కెటింగ్ వంటి కోర్సులను ప్రతిపాదించారు. వీటివల్ల బహుళజాతి సంస్థలో మంచి ఉపాధి వస్తుందని విద్యార్థులు భావించారు. వీటినీ ఇప్పుడు నిలిపివేస్తున్నారు.
ఎవరి కోసం ఈ వివాదం?
డిగ్రీ కోర్సుల ప్రక్షాళనకు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు వ్యతిరేకంగా ఉన్నాయి. సమాంతర కోర్సులు ప్రవేశపెడితే ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ సీట్లకు డిమాండ్ ఉండదనే వాదన తెచ్చాయి. ఈ దిశగా విద్యాశాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తేవడంతోపాటు, బలమైన లాబీయింగ్ కూడా నడిచినట్టు విద్యాశాఖలో చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వంలోని కొంతమంది, ఉన్నతాధికారులు కీలకమైన కోర్సుల నిలిపివేతకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ కోర్సులపై ఏడాదిగా ఉన్నత విద్యామండలి నిపుణుల కమిటీలు ఏర్పాటు చేసి, సిలబస్ రూపకల్పన చేస్తున్నప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులూ ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. దోస్త్‌లో కోర్సులు రాకుండా ఆఖరులో అడ్డుకోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది.


