breaking news
Bhaktha Prahladha
-
92 ఏళ్ల తొలి తెలుగు టాకీ సినిమా.. బడ్జెట్ ఎంతో తెలుసా?
ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 92 ఏళ్లు పూర్తయ్యాయి. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా.రెంటాల జయదేవ ఎన్నో యేళ్లు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రిలీజై విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్లి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ఎం రెడ్డి కూడా తెలుగు వారే కావడం విశేషం. ఆ రోజుల్లో ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు.. దాదాపు 20 వేల రూపాయలు. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథానాయిక’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్‌ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ రోజును ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో మహారాష్ట్రలోని పుణేలో మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా ఉచిత ఫిల్మ్ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. -
అప్పట్లో SV రంగారావు రెమ్యూనరేషన్ ఎంత?
-
టాలీవుడ్ అంటే తెలుగు కాదు.. మరేంటి?
వెండితెర పూర్తి స్థాయిలో తెలుగు మాటలు నేర్చుకొని, ఈ రోజుతో 89 వసంతాలు నిండాయి. మూగ సినిమాలైన ‘మూకీ’లకు మాటొచ్చి, పూర్తి తెలుగు ‘టాకీ’లుగా మారింది సరిగ్గా 89 ఏళ్ళ క్రితం ఇదే రోజున! మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932లో ఫిబ్రవరి 6న థియేటర్లో తొలిసారిగా రిలీజైంది. అలా ఆ నాటి నుంచి పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు ప్రేక్షకులను వెండితెరపై పలకరించడం ప్రారంభమైంది. ఆ లెక్కన మన తెలుగు సినిమాకు ఇవాళ హ్యాపీ బర్త్ డే! మన తెలుగు సినిమా పరిశ్రమ 89 ఏళ్ళు నిండి, 90వ ఏట ప్రవేశిస్తున్నందున సినిమాను ప్రేమించేవారికీ, సినిమా రంగం మీద ఆధారపడినవారికీ ఇదో మెమరబుల్ డే!! దేశంలో ఇవాళ ప్రధాన సినీ పరిశ్రమలలో ఒకటిగా ఉన్నత స్థానానికి చేరుకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేసిన తొలి అడుగు అది. అయితే, తెలుగు సినిమా పెద్దలు, ప్రభుత్వాలు మాత్రం మన సంపూర్ణ తెలుగు టాకీ పుట్టినరోజును మర్చిపోయినట్లుంది. పరిశ్రమకు పండుగగా జరుపుకొనే ఈ సందర్భాన్ని విస్మరించి, నిర్లక్ష్యం చూపుతున్నట్టున్నాయి. మన తెలుగు టాకీ అలా తయారైంది! తొలి దక్షిణ భారతీయ టాకీ ‘కాళిదాస్’ రిలీజై, సక్సెసయ్యాక పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తొలి భారతీయ టాకీ, తొలి దక్షిణాది టాకీలతో అనుభవం గడించిన హెచ్.ఎం. రెడ్డికే దర్శకత్వ బాధ్యత ఇచ్చారు. అప్పుడు పూర్తి తెలుగు మాటలు, పాటల ‘భక్త ప్రహ్లాద’ తయారైంది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, ఫస్ట్ రిలీజ్ కూడా బొంబాయిలోనే జరగడం గమనార్హం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ప్రసిద్ధ ’ప్రహ్లాద’ నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె వి. సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రధారులు. ఇందులో టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. ఇక, ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’ చిత్రాలలో కూడా పనిచేసిన తరువాతి కాలపు ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో మొద్దబ్బాయిగా నటించారు. ఈ సినిమాకు చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. అలా ఆయన తొలి తెలుగు సినీ కవి అయ్యారు. పరిశోధనలో బయటపడ్డ మన సినిమా పుట్టినరోజు! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ – ఏకంగా ‘కాళిదాస్’ కన్నా ముందే – 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొన్నేళ్ళ పాటు ఆధారాలు లేని వినికిడి ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళు శ్రమించి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. 100% సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం మొదలై, నేటితో 89ఏళ్ళు పూర్తయ్యాయి. మన మాటలు రికార్డ్ చేసింది హాలీవుడ్ వాడే! పెట్టుబడి, సాంకేతిక సౌకర్యాలు, ఖర్చు – అన్నీ అతి తక్కువగా ఉన్న రోజులవి. ‘ఆలమ్ ఆరా’ కోసం ఆ రోజుల్లోనే హాలీవుడ్ నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ అనే అమెరికన్ సౌండ్ ఇంజనీర్‌ను ఇండియాకు రప్పించారు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. సౌండ్ ప్రూఫ్ స్టేజీలు లేని ఆ రోజుల్లో కేవలం స్టూడియోల్లో, అదీ బయటి శబ్దాలు ఉండని రాత్రి పూట షూటింగ్ చేశారు. అప్పట్లో పిక్చర్కీ, సౌండ్‌కీ వేర్వేరు నెగటివ్‌లు కూడా ఉండేవి కావు. కేవలం సింగిల్ సిస్టమ్‌లో ‘తానార్ రికార్డింగ్ ఎక్విప్మెంట్’తో మాటలు రికార్డు చేసేవారు. చివరకు షూటింగ్ స్పాట్లోనే ఏకకాలంలో యాక్టింగ్‌తో పాటు, మాటలు చెబుతూ, పాటలు పాడుతుంటే రికార్డింగ్ చేసేయాల్సిందే! అప్పట్లో చివరకు ఇవాళ్టిలా మాటలు రికార్డు చేసే బూమ్ లు కూడా ఉండేవి కావు. కెమేరా కంట్లో పడకుండా మైకులు రకరకాల చోట్ల దాచిపెట్టి, ఈ తొలి టాకీల్లో డైలాగ్స్, సాంగ్స్ రికార్డ్ చేసేవారు. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన జనానికి... తెర మీద బొమ్మలు మాట్లాడడం, పాటలు పాడడం ఓ వింత. అదీ మన సొంత తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడడం మరీ విడ్డూరం. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ దేశమంతటా, మరీ ముఖ్యంగా మన తెలుగునాట విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కానీ, మన తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలూ చాలానే ఉన్నాయి. ఈ తొమ్మిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా చాలానే పురోగమించింది. బాక్సాఫీస్ వేటలో పేటలు దాటి, దేశాల కోటలు దాటి ముందుకు ఉరికింది. అప్పటి ‘భక్త ప్రహ్లాద’ రోజుల నుంచి ఇప్పటి ‘బాహుబలి’ కాలం దాకా మన తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో తయారై, ఆ మాత్రం ఖర్చు వస్తేనే మహాద్భుతం అనుకొనే పరిస్థితి నుంచి ఇవాళ అనేక పదుల కోట్ల రూపాయల బడ్జెట్, వందల కోట్లల్లో వ్యాపారం, వసూళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చూసే కోట్లమంది జనంతో తెలుగు సినిమా అంకెల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల దగ్గర తడబడుతోంది. ఈ ప్రశ్నకు బదులేది? ఓ తెలుగు సినీ కవి అన్నట్టుగా... ‘పుట్టినరోజు పండగే అందరికీ! మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ మన సినిమా చరిత్రను భద్రపరిచే విషయంలో పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్లు, ప్రభు త్వాలు చేస్తున్నది చాలా తక్కువే. మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు మన తొలి తెలుగు సినిమా ప్రింటే లేకుండా పోయింది. టాకీలకే దిక్కు లేదు... ఇక మూకీల చరిత్ర మాట చెప్పనే అక్కర్లేదు. మన తొలి తెలుగు సినిమాల్లో మిగిలిన కొన్నింటి ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల ఉన్నాయి. కానీ, మిగిలిన ఆ కొద్ది 1930 – 40ల నాటి తెలుగు చిత్రాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించడానికి సినీపెద్దలు, ప్రభుత్వాలు చేçపడు తున్న చర్యలు శూన్యం. చరిత్రపై తమిళ, మల యాళ, బెంగాలీ చిత్రసీమలకున్న శ్రద్ధ మనకేది? మరోపక్క కొత్త కథాంశాలతో సినిమా తీయడానికి మలయాళ, తమిళ చిత్రసీమలలా మనమెందుకు ముందుకు రాలేకపోతున్నాం? ఒకప్పుడు థియేటర్ల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్న మనం ఇప్పుడు తెలుగు రాష్టాలు రెండూ కలిపినా 1600 హాళ్ళు కూడా లేని పరిస్థితిలో పడ్డామెందుకు? భారీ రెమ్యూనరేషన్లు, భారీ బడ్జెట్ల విషవలయంలో పడి ప్రేక్షకుడి నడ్డి విరిచేలా పన్ను పెంచుదాం, టికెట్ రేట్లు పెంచుదాం లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? ఇలా పరిశ్రమ వేసుకోవాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా, ఒకప్పుడు వీధి దీపాల మధ్య టెంట్లో టూరింగ్ టాకీసుల్లో నడిచిన సినిమా ఇవాళ ఏసీ హాళ్ళు, మల్టీప్లెక్సుల మీదుగా ఓటీటీ దాకా వచ్చేసింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుడు టీవీలు, కంప్యూటర్ల మీదుగా ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లలో ఓటీటీలో వినోదాన్ని వెతుక్కుంటున్నాడు. కరోనా వచ్చింది... మనల్ని విడిచి వెళ్ళకుండా ఇంకా ఉంది. ఏడు నెలల పైచిలుకు తరువాత థియేటర్లు తెరిచారు. మరో మూడున్నర నెలల తరువాత ఇప్పుడు హాళ్ళలో అన్ని సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాలులో జనం తగ్గారేమో కానీ, సినిమా పట్ల మన మనసుల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడికి సినిమా ఒక మోహం. తెరపై కొత్త బొమ్మ చూడడం తీరని దాహం. ఆ దప్పిక తీర్చడానికి హాలైనా, మరొకటైనా మనకొకటే. అందుకే కాలంతో పాటు మారుతున్న వెండితెర మాయాజాలానికి జేజేలు. లాంగ్ లివ్ సినిమా! మన తెలుగు సినిమా!! మన తొలి సినిమా విశేషాలు తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సెన్సార్ సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6న, బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ ఫస్ట్ ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’ తొలి రోజుల్లో సినిమా అంటే... భాషతో సంబంధం లేని మూగచిత్రాలు (మూకీలు). తర్వాత కాలంలో మూగకు మాటొచ్చింది. వెండితెర మాటలు నేర్చింది. పాటలు పాడసాగింది. మన తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. మాస్టర్ విఠల్, మిస్ జుబేదా నటించిన ఆ చిత్రానికి దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. తెలుగువాడైన హెచ్.ఎం. రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కడి నుంచి మన దేశంలోని విభిన్న ప్రాంతాలు, వివిధ భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మొదలైంది. తొలి భారతీయ టాకీ నిర్మించిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ సంస్థే ఆ తరువాత తొలిసారిగా దక్షిణాది భాషల్లో టాకీల రూపకల్పన మొదలుపెట్టింది. ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’ ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పనిచేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. బొంబాయిలోనే ‘ఆలమ్ ఆరా’కు వేసిన సెట్స్ ఉపయోగించుకుంటూ ఆ సినిమా తీశారు. ప్రధానంగా తమిళ మాటలు – పాటలు, కొంత తెలుగు డైలాగులు – కొన్ని త్యాగరాయ కీర్తనలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో ఆ ‘కాళిదాస్’ తయారైంది. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న తొలిసారిగా మద్రాసులోని సినిమా థియేటర్ ‘కినిమా సెంట్రల్’ (తర్వాత ‘మురుగన్ టాకీస్’గా మారింది)లో రిలీజైంది. ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ఆ దర్శక, నిర్మాతలే ప్రకటించిన ఆ సినిమా – మన దక్షిణాది భాషల్లో వచ్చిన ఫస్ట్ టాకీ! టాలీవుడ్ అంటే తెలుగు కాదు... బెంగాలీ! మొదట్లో బొంబాయి ఇంపీరియల్ స్టూడియోలో పనిచేసిన హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ విల్ఫోర్డ్ డెమింగ్ అక్కడ సౌండ్ రికార్డింగ్ మిషన్ పెట్టి, శబ్దగ్రహణమంతా తానే చూసేవారు. ‘ఆలమ్ ఆరా’ సహా బొంబాయిలో 5 చిత్రాలకు ఆయనే వర్క్ చేశారు. ఇంపీరియల్ స్టూడియోలో తయారైన ఫస్ట్ సౌతిండి యన్ టాకీ ‘కాళిదాస్’కు కూడా బహుశా ఆయనే సౌండ్ ఇంజనీర్. అంటే మన తెలుగు మాటల్ని, త్యాగరాయ కీర్తనల్నీ తెరపై వినిపించిన సౌండ్ ఇంజనీర్ ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న ఆ హాలీవుడ్ టెక్నీషియనే కావచ్చు. ఆ తరువాతి కాలంలో ఆయన కలకత్తాకు మకాం మార్చి, బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ సంస్థలో 2 చిత్రాలకు పని చేశారు. కలకత్తాలోని టాలీగంజ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన బెంగాలీ చిత్రసీమకు ‘టాలీవుడ్’ అని పేరు పెట్టిందీ ఆయనే! 1932లో ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ పత్రికకు కలకత్తా సినీ పరిశ్రమ గురించి రాసిన వ్యాసంలో ఆయనే మొదట ఆ పేరు వాడారు. అంటే తెలుగు చిత్రసీమను మనోళ్ళు ‘టాలీవుడ్’ అనడమే పెద్ద తప్పు అన్న మాట! - రెంటాల జయదేవ -
పౌరాణిక పాత్రలో రానా..
విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రానా, మరో ఆసక్తికరమైన చిత్రానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ జానర్ లో తెరకెక్కుతున్న 1945, హథీ మేరీ సాథీతో పాటు చారిత్రక చిత్రంగా రూపొందుతున్న మార్తాండ వర్మ సినిమాల్లో సినిమా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఓ పౌరాణిక చిత్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు. రుద్రమదేవి సినిమాతో ఆకట్టుకున్న దర్శకుడు గుణశేఖర్, త్వరలో హిరణ్య కశ్యప సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోసారి గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భక్త ప్రహ్లాదుడి కథను హిరణ్యకశ్యపుడి కోణంలో చూపించనున్నారట. ఈ సినిమాలో హిరణ్య కశ్యపుడిగా రానా నటించనున్నాడు. 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభం కానుంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. -
త్వరలో సెట్స్ మీదకు భక్త ప్రహ్లాద
రుద్రమదేవి సినిమాతో ఘన విజయం సాధించిన సీనియర్ దర్శకుడు గుణశేఖర్... మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. రుద్రమదేవితో భారీ చారిత్రక కథకు తెర రూపం ఇచ్చిన గుణ, ఇప్పుడు ఓ పౌరాణిక కథాంశాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు సినిమాగా రూపొందిన భక్త ప్రహాద కథతో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు. గతంలో హిరణ్యకశ్యప పేరుతో గుణశేఖర్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయకపోయినా.. ప్రహ్లాదుడి కథతోనే సినిమా చేస్తున్నట్టుగా తెలిపాడు గుణ. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టే ముందు కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న గుణశేఖర్ అక్కడే సినిమా చేయబోతున్నట్టుగా వెల్లడించారు. రుద్రమదేవి సినిమా తరువాత ప్రతాపరుద్రుడు అనే చారిత్రక చిత్రాన్ని రూపొందించనున్నట్టుగా ప్రకటించాడు. అయితే ప్రతాపరుద్రుడు కథకు మరింత రిసెర్చ్ చేయాల్సి ఉండటంతో ఆ సినిమాను వాయిదా వేసి హిరణ్యకశ్యపను తెర మీదకు తీసుకువచ్చాడు.రుద్రమదేవి కన్నా భారీగా ఈ సినిమాను రూపొందిచనున్నాడు.