breaking news
bank pass books
-
ఆటోడ్రైవర్ బ్యాంక్ అకౌంట్లో వందల కోట్లు..!
బెంగళూరు: ఆటోడ్రైవరు బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయల బ్యాలెన్సు ఉంది. భారీగా డబ్బులు వచ్చిపడుతున్నాయి. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథకు బ్రేక్ పడింది. ఈ సంఘటన హుబ్లీ నగరంలో జరిగింది. కేశ్వాపురలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో ఒక ఖాతాదారు అకౌంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయల అక్రమ నగదు బదిలీ అయినట్లుగా వెలుగు చూసింది. ఈ ఖాతా ఓ ఆటో డ్రైవర్ ఇర్ఫాన్‌ది. సమాచారం అందుకున్న హుబ్లీ– ధార్వాడ పోలీసులు, సైబర్ క్రైం పోలీసులు అతని ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. అతని ఖాతాకు దేశంలోని వివిధ బ్యాంక్‌ల ఖాతాల నుంచి డబ్బులు వరదలా వచ్చి పడ్డాయి. గత రెండేళ్ల నుంచి ఈ ఖాతా చురుగ్గా ఉండగా, స్కాం వెలుగు చూడగానే ఫ్రీజ్ చేశారు. ఈ ఖాతా సంఖ్య– 54910200000346 గా తెలిపారు.ఖాతాదారుల ఫిర్యాదుతో కదిలిన డొంక సైబర్ నేరాల్లో డబ్బులు పొగొట్టుకున్న పలువురు బాధితులు 1930 సైబర్‌క్రైం హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి ఫలానా ఖాతాకు తమ డబ్బులు అక్రమంగా జమ అయినట్లు ఫిర్యాదులు చేయసాగారు. దీంతో ఆరా తీయగా ఇర్ఫాన్ డొంక కదిలింది. కుక్కింగ్ విత్ కేటరింగ్ అనే పేరుతో ఈ ఖాతా ఉంది. సుమారు 50 సార్లకు పైగా వివిధ ఖాతాల నుంచి డబ్బు జమ అయింది. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, ఒడిశా తదితర రాష్ట్రాల్లో సైబర్ మోసాల బాధితుల డబ్బు ఈ ఖాతాకే చేరింది. తనిఖీలో 16 పాస్ పుస్తకాలు దొరికాయి ఏసీపీ శివరాజ్ కటకబావి మీడియాతో మాట్లాడుతూ గోపనకొప్ప ఇర్ఫాన్ కాగినెలె అనే వ్యక్తి ఖాతాకు ఎక్కడెక్కడి నుంచో డబ్బు వస్తోందన్నారు. అతని ఇంట్లో తనిఖీ చేయగా 16 బ్యాంక్ పాస్ పుస్తకాలు దొరికాయని చెప్పారు. ఎంత మేర డబ్బులు బదిలీ అయ్యాయి. ఏయే మార్గాల్లో వచ్చాయి? అని బ్యాంక్ అధికారులను కూడా విచారిస్తున్నట్లు తెలిపారు. -
ఇందిరా సొసైటీ సీఈఓ అరెస్ట్
కర్నూలు, న్యూస్‌లైన్: కర్నూలు నగరంలోని ఇందిర పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం (ఇందిరా సొసైటీ) ముఖ్య కార్య నిర్వహక అధికారి ప్రేమ జయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ.21.25 లక్షల నగదుతో పాటు నాలుగు లెడ్జర్ బుక్కులు, ఏడు ఆహ్వాన పత్రాలు, పది ఇందిరా బ్యాంకు డిమాండ్ డ్రాఫ్ట్‌లు, 20 ఇందిరా బ్యాంకు పాస్ బుక్కులు, 50 ఇందిరా బ్యాంకు రికరింగ్ డిపాజిట్ బాండ్లు, కంప్యూటర్ స్వాధీనం చేసుకుని జిల్లా ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఎదుట హాజరు పరిచారు. శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రమైన రుద్రవరానికి చెందిన ప్రేమ జయలక్ష్మి 2008 జూన్‌లో అధికారుల అనుమతితో పగిడ్యాలలో ఇందిర పరస్పర సహాయక సహకార పొదుపు పరపతి సంఘం (ఇందిరా సొసైటీ) ఏర్పాటు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధగా ఇటీవల కర్నూలు పాతబస్టాండ్ సమీపంలోని వీఆర్ కాంప్లెక్స్‌లో బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించి కార్యకలాపాలను కొనసాగించారు. ప్రజల నుంచి భారీ ఎత్తున డిపాజిట్ల రూపంలో నిధులు సేకరించారు. వివిధ రకాల డిపాజిట్ల పేరుతో తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో రుణాలు అందిస్తామని రూ.98.59 లక్షలు వసూలు చేశారు. శనివారం(23వ తేదీ) నాబార్డు అధికారుల చేతుల మీదుగా రుణాలు పంపిణీ చేయనున్నట్లు వారి అనుమతి లేకుండా పేర్లతో ఆహ్వాన పత్రికలను ముద్రించి ప్రచారం చేయించారు. ఈ విషయం పోలీ సుల దృష్టికి వెళ్లడం, శుక్రవారం పెద్ద మొత్తంలో లబ్ధిదారులు కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగడంతో అసలు సమస్య బయటికి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేశారు. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.32.76 లక్షలు రీ సైక్లింగ్ చేయగా, రూ.65.83 లక్షలు బ్యాలెన్స్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఇందులో 26 మంది సభ్యులకు రూ.16.40 లక్షలు రుణంగా ఇవ్వగా, ముగ్గురు సభ్యులకు రూ.2.66 లక్షలు వాపసు ఇచ్చింది. మిగిలిన మొత్తంలో రూ.21.25 లక్షలు నగదుతో పాటు కార్యాలయంలోని పలు రికార్డులను ఒకటవ పట్టణ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మాయ మాటలు నమ్మి మోసపోవద్దు : ఎస్పీ తక్కువ వడ్డీకి ఎక్కువ రుణాలు ఇస్తామని, మనీ స్కీమ్‌లో చేరాలని ఎవరైనా చెబితే నమ్మి మోసపోవద్దని ఎస్పీ రఘురామిరెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మనీ స్కీమ్‌ల పేరుతో ఎవరైనా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే సమాచారం తమ దృష్టికి తీసుకువస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటరత్నం, డీఎస్పీ వైవి.రమణకుమార్, ఒకటవ పట్టణ సీఐ శ్రీనివాసులు, సీసీఎస్ సీఐ రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.


