ఆప్‌లో అంతర్గత విభేదాలు
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఉత్తర ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఓ సమావేశంలో చోటుచేసుకున్న ఘటన దీనిని ప్రతిబింబిస్తోంది. ప్రస్తుత విధానసభ ఎన్నికల్లో పార్టీ తరఫున రోహిణీ నియోజక వర్గంనుంచి రాజేష్గార్గ్ను తప్పించి ఆయన స్థానంలో చరంజీలాల్ గుప్తాకు అధిష్టానం టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన సమావేశానికి హాజరైన ఆశుతోష్‌ను... గార్గ్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ప్రశ్నలకు జవాబివ్వాలంటూ గద్దించారు. దీంతో ఆయన తప్పించుకునేందుకు యత్నించాడు. కొందరు గూండాలు ఆయనను తిరిగి వేదికపైకి బలవంతంగా తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా గార్గ్ మాట్లాడుతూ ‘దేనిని గురించి భయపడుతున్నాడు. వాస్తవాలను ఆలకించేందుకు అతనికి దమ్ము ఉండాలి’అని అన్నారు. అయితే ఈ ఘటనను అధిష్టానం ఖండించింది. ఈ విషయమై ఆశుతోష్ మాట్లాడుతూ ‘కొద్ది గందరగోళం చోటుచేసుకున్న మాట నిజమే. నిన్న నేను... నా మాజీ సహచరుడు రాజేష్ వద్దకు వెళ్లా. అధిష్టానం టికెట్ కేటాయించకపోవడంతో కోపంగా ఉన్నాడు. ఆ సమయంలో అతని అనుచరులు కూడా ఉన్నారు. దీంతో హంగామా చేసేందుకు యత్నించాడు. అయితే ఇందులో ఆగ్రహానికి లోనవడానికేమీ లేదు’ అని అన్నారు. రాజేష్...కొద్దిగా అసహనంగా కనిపించాడు. దీంతో అక్కడ ఉండాలనిపించలేదు. వచ్చేశా’ అని వివరించారు.