breaking news
Arrows
-
వారెవ్వా.. సరికొత్త గిన్నిస్ రికార్డ్.. ‘కీహోల్’లోంచి ఏడు బాణాలు!
విలువిద్య పోటీల్లో గుండ్రటి బోర్డుపై ఉండే ‘బుల్స్ ఐ’ని ఆటగాళ్లెవరైనా గురిచూసి కొడితేనే ఆహా అద్భుతం అని మెచ్చుకుంటాం.. అలాంటిది ఓ చిన్న బెజ్జంలోంచి బాణాలను సంధించగల నేర్పరిని ఇంకేమని పొగడాలి?! ఎందుకంటే.. డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాత విలుకాడు లార్స్ ఆండర్సెన్ నమ్మశక్యంకాని రీతిలో దీన్ని చేసి చూపించాడు మరి!! సంప్రదాయ ‘ఒట్టోమ్యాన్’ విల్లును ఉపయోగించి 30 అడగుల దూరంలో అది కూడా కేవలం ఒక సెంటీమీటర్ సైజున్న ‘కీహోల్’లోంచి అలవోకగా ఏడు బాణాలను వెంటవెంటనే సంధించాడు. కీహోల్లోకి బాణాలు దూరగలిగేందుకు వీలుగా ఈకల్లేని కార్బన్ బాణాలను ఉపయోగించాడు. ఇటీవల అతను చేసిన ఈ ప్రయోగం ద్వారా ‘కీహోల్లోంచి వరుసగా అత్యధిక బాణాలను సంధించిన వ్యక్తి’గా సరికొత్త గిన్నిస్ రికార్డును సృష్టించాడు. ఇందుకు సంబంధించిన సుమారు నిమిషం నిడివిగల వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. ఆండర్సెన్ ప్రతిభను చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఆండర్సెన్ ఇప్పటికే ఈ తరహా ఎన్నో అద్భుతాలను చేసి చూపించాడు. చదవండి: మద్యం మత్తులో బీజేపీ ఎమ్మెల్యే కొడుకు హంగామా.. నడిరోడ్డుపై.. విల్లు నుంచి ఏకకాలంలో ఎన్నో బాణాలను గురిచూసి సంధించడం, కేవలం 4.9 సెకన్ల వ్యవధిలో 10 బాణాలను వదలడం, బాణాలు గాల్లో వంపు తిరిగేలా సంధించడం, కదిలే లక్ష్యాలను బాణాలతో ఛేదించడం వంటి ఎన్నో ప్రయోగాలను విజయవంతంగా చేశాడు. విలువిద్యకు పూర్వ వైభవం తెచ్చే ఉద్దేశంతోనే తాను ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నట్లు అతను చెప్పాడు. -
‘విల్లు, బాణాలతో జిహాదీలను ఎదుర్కొందాం’
లక్నో: జిహాదీలు దాడి చేస్తే ఎదిరించడానికి హిందువులు ఇళ్లల్లో విల్లు బాణాలు సిద్ధంగా ఉంచుకోవాలని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ పిలుపునిచ్చారు. తలపై టోపీలు, చేతిలో కర్రలతో ఉన్న ఓ గుంపు ఫొటోను ఆదివారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. ‘‘ఈ మూక మీ వీధికి, మీ ఇంటికి అకస్మాత్తుగా వస్తే రక్షించుకోవడానికి మీకేదైనా మార్గం ఉందా? లేకపోతే ఏర్పాటు చేసుకోవాలి. మిమ్మల్ని కాపాడడానికి పోలీసులు రారు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఎక్కడో దాక్కుంటారు. జిహాద్ ముగిసి, మూక వెళ్లిపోయిన తర్వాతే వస్తారు. అలాంటి ‘అతిథుల’ కోసం రెండు బాక్సుల కూల్‌డ్రింక్ సీసాలను, విల్లులు, బాణాలను ప్రతి ఇంట్లో ఉంచుకోవాలి’’ అని పోస్టు చేశారు. జైశ్రీరామ్ అంటూ ముగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన ఫేసుబుక్ పోస్టును సమర్థించుకున్నారు. సాక్షి మహారాజ్ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. -
మామఅల్లుళ్ల ఘర్షణ..హత్యాయత్నం
-
రాంబో బాణాలు.. రాకెట్ బాంబులు
న్యూఢిల్లీ: భద్రతా దళాలపై దాడులు చేయడం కోసం నక్సలైట్లు సరికొత్త ఆయుధ సంపత్తిని సమకూర్చుకున్నారు. రాంబో బాణాలు, రాకెట్ బాంబులు వంటి ఆధునిక, ప్రాణాంతక సామగ్రితో భద్రతా దళాలకు సవాలుగా నిలుస్తున్నారు. ఈ మేరకు వామపక్ష తీవ్రవాద శిబిరంలో నెలకొన్న ధోరణులపై అధ్యయనం చేసిన ఉమ్మడి భద్రతా దళం (జేఎస్సీ) తాజా నివేదిక వెల్లడించింది. భద్రతా బృందాలకు చెందిన స్నిఫర్ డాగ్స్‌ను ఏమార్చేందుకు మావోయిస్టులు ముడి బాంబులను జంతువుల మలంలో దాచేస్తున్నారని తెలిపింది. 2017 తొలి త్రైమాసికంలో భద్రతా దళాల స్నిఫర్ డాగ్స్ ఈ కారణంగానే గాయపడటం లేదా మృతి చెందాయంది. నక్సల్స్ దాడులకు ఉపయోగించే సరికొత్త పద్ధతుల్లో ప్రముఖమైంది.. పేలుడు పదార్థంతో కూడిన రాంబో బాణం అని పేర్కొంది. గన్ పౌడర్ లేదా మందుగుండు కలిగిన ఆ బాణం లక్ష్యాన్ని తాకగానే పేలుతుంది. రాంబో బాణాలు ఎక్కువ నష్టాన్ని కలిగించకపోయినా భద్రతా సిబ్బందిలో ఆందోళన కలిస్తాయని.. తద్వారా దాడి చేయడానికి మావోలకు ఉపయోగపడతాయంది. -
అబద్ధపు బాణం
‘‘అన్నా... కావాలంటే ఇంకో ఐదు రూపాయలు ఎక్కువ ఇస్తాను. ఊర్లో దిగబెట్టన్నా...’’ అన్నాడు సూర్యం, ఆగిన ఆటో దిగకుండానే.‘‘ఎన్నిసార్లు తమ్ముడూ చెప్పేది... టైం పదిన్నర అయ్యింది. ఈ టైంలో ఇక్కడిదాకా రావడమే ఎక్కువ. దిగి ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపో!’’ ఆటో డ్రైవర్ చిరాకుగా అన్నాడు.ఇంకా అడుక్కుంటే బాగోదనిపించింది సూర్యానికి. దిగి, ఆటోవాడికి డబ్బులిచ్చేసి, ఊరు వైపు నడవడం మొదలుపెట్టాడు.ఊర్లోకి వెళ్ళాలంటే మెయిన్ రోడ్డు దిగి, మట్టి రోడ్డు గుండా ఒక మైలు దూరం లోపలికి నడవాలి. చుట్టూ దట్టమైన చీకటి. అసలే వానాకాలం కావడంతో ఆకాశమంతా నల్లటి మబ్బులు. చంద్రుడి జాడే లేదు.‘చెత్త నా కొడుకులు... అవసరాన్ని అర్థం చేసుకోరు.’ ఆటో వాళ్ళని తిట్టుకుంటూ, ముందు జాగ్రత్తగా తనతో పాటు తెచ్చుకున్న పెన్ టార్చ్ వెలుతురులో ఒంటరిగా నడుస్తున్నాడు సూర్యం.సూర్యం పట్నంలో మాస్టర్స్ చదువుకుంటున్నాడు. ప్రతి ఆరు నెలలకీ సెలవులకి ఊరికొస్తుంటాడు. ఊరికొచ్చే ప్రతిసారి అతనికీ నడక మామూలే. దారి పొడవునా చిత్తడి చిత్తడిగా ఉంది. అక్కడక్కడా బురదనీటి గుంటలు, పశువుల పేడ. అన్నింటినీ జాగ్రత్తగా దాటుకుంటూ నడుస్తున్నాడతను. మిడతలు, కప్పల అరుపులు వికృతంగా వినిపిస్తున్నాయి. తీతువొకటి ఎక్కడ్నించో ఉండి కూస్తోంది. ఇంతలో ఆకాశాన్ని చీలుస్తూ మెరుపొకటి మెరిసింది. దాని వెనకాలే భయంకరమైన ఉరుము. ఒక్కసారి తలెత్తి పైకి చూసి, రెండడుగులేశాడో లేదో బాణాల్లా దూసుకొచ్చేశాయి చినుకులు. నడక వేగం పెంచాడు సూర్యం. వర్షంతో పాటూ మొదలైన ఎదురుగాలి అడుగు ముందుకు వేయనియ్యడం లేదతన్ని. బ్యాటరీ తక్కువైన పెన్ టార్చ్ మబ్బుగా వెలుగుతోంది. ఆ వెలుతురులో నడవడం కష్టంగా ఉందతనికి. వాన మాత్రం జాడించి కొడుతోంది. ఇక లాభంలేదని చుట్టూ చూశాడు సూర్యం. కరెంటు లేదేమో ఊరిలో ఎక్కడా ఒక్క లైటు కూడా వెలగడం లేదు. ఎడమవైపు శ్మశానాన్ని ఆనుకుని ఉన్న పాడుబడ్డ ఇంట్లోంచి మాత్రం మిణుకు, మిణుకుమంటూ వెలుగు కనిపిస్తోంది. ఏమాత్రం ఆలస్యం చేయలేదు సూర్యం. తల మీద బ్యాగు పెట్టుకుని అటువైపు పరిగెత్తాడు.ఆ ఊరి కాటికాపరి ధర్మన్న ఉంటాడా ఇంట్లో. ఆ ఇంటికి ముందు ఎప్పటిదో పేద్ద చింతచెట్టూ, ఎడమవైపు శ్మశానం, కుడివైపు రోడ్డు వరకూ దట్టంగా పెరిగిన రెల్లు గడ్డి, వెనకాలంతా నాయుడు గారి మావిడితోపు. వీటన్నింటి మధ్యలో తపో దీక్షలో ఉన్న మునిలా గుంభనంగా ఉన్న ఆ ఇల్లు. పగలు చూస్తేనే భయపడతారు ఆ ప్రదేశాన్ని. సాయంత్రం ఆరు దాటితే అటువైపు వెళ్ళడానికి కూడా ఎవరూ ధైర్యం చేయరు. కానీ ఇప్పుడు ఇంకో దారిలేదు సూర్యానికి.తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ధర్మన్నే ఆ ఊరికి కాటికాపరి. అతను భారీ ఆకారం. బుర్రమీసాలు, బట్టతల, భుజం మీద నల్లటి కండువాతో మనిషి భీకరంగా ఉంటాడతను. ధర్మన్న వాళ్ళది ఆ ఊరు కాదు. ఎప్పుడో కొన్నేళ్ళ కిందట వాళ్ళ నాన్న ఆ ఊరికొచ్చి చిన్నా చితకా పనులు చేసుకుంటూ, శవాల్ని కాల్చడం మొదలుపెట్టాడు. అదికాస్తా వారసత్వంగా ధర్మన్నకొచ్చింది.సూర్యానికీ, ధర్మన్నకి పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడో రెండు, మూడు సార్లు శ్మశానం దగ్గరకొచ్చినప్పుడు మాట్లాడ్డం తప్ప. ఇప్పుడతనితో ఏమని పరిచయం చేసుకోవాలి. అదే ఆలోచిస్తూ పరిగెడుతున్నాడతను. సూర్యం చింతచెట్టు దగ్గరకు రాగానే, అడుగుల చప్పుడు విని ‘‘ఎవురాడ?’’ అని హెచ్చరించాడు ఇంటి బయట అరుగు మీద కూర్చునివున్న ధర్మన్న.ఏం చెప్పాలో అర్థం కాక ‘‘నేను సూర్యాన్నీ... భద్రయ్య కొడుకునీ...’’ అరుస్తున్నట్టు చెప్పాడు సూర్యం చెట్టు కిందే నిలబడి.హోరు గాలి వల్ల ఒకరి మాటలు ఒకరికి సరిగా వినిపించడం లేదు.‘‘ఓహ్! ఒరె ఒరె భద్రయ్య కొడుకువా...? రా రా పంచ కిందకి రా.’’ అన్నాడు ధర్మన్న చేయి ఊపుతూ.సూర్యం తండ్రి భద్రయ్య నాటు వైద్యుడు కావడంతో ఊళ్ళో అందరికీ సుపరిచితుడు. ధర్మన్న రమ్మని పిలిచే సరికి ‘హమ్మయ్య’ అనుకుంటూ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిఅరుగు మీద కూర్చున్నాడు సూర్యం. వసారా పైకప్పుకి వేసున్న పెంకులు చినుకుల తాకిడికి టప టప మని శబ్దం చేస్తున్నాయి. పెంకుల చివర్నుంచి వర్షపు నీరు ధారలుగా కారుతోంది.‘‘ఏవిటి బాబు ఇంత రాత్రిలో, ఎక్కడినుంచీ..?’’ అడిగాడు ధర్మన్న, సూర్యాన్ని ఎగాదిగా చూస్తూ.‘‘ఏం లేదన్నా... పట్నం నుంచి వస్తున్నాను. ఆటో దిగానో లేదో వాన పట్టుకుంది.’’ క్లుప్తంగా చెప్పాడు సూర్యం, బ్యాగులోంచి తువ్వాలు తీసి తల తుడుచుకుంటూ.‘‘మాయదారి వాన. మూడు రోజుల నుండీ ఉండుండీ కురుస్తోంది.’’ అంటూ ఓసారి బయటకు చూసి నిట్టూర్చాడు ధర్మన్న.తరువాత ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. సూర్యానికి తోచక ఇంటిని పరికించి చూడటం మొదలుపెట్టాడు. ఇంతకు ముందులా లేదది. అన్నీ అస్తవ్యస్తంగా పడున్నాయ్. ఈదురు గాలికి అటువైపున్న అరుగు మీద పొయ్యిలో మంట ఇంకా రాజుకుంటూనే ఉంది.‘ఇందాక కనిపించిన వెలుగుకి కారణం ఈ మంటే కాబోలు’ మనసులో అనుకున్నాడు సూర్యం. అక్కడక్కడా పెంకుల మధ్యలోంచి ఉరుస్తోంది. ఉరిసిన చోటు నుంచి ఒకరకమైన వాసన వస్తోంది.‘‘ఏంటి బాబు అట్టా చూస్తన్నావ్’’ అన్నాడు ధర్మన్న సూర్యానికేసి చూస్తూ. ఉన్నట్టుండి అడిగేసరికి కాస్త తడబడి ‘‘ఏం లేదన్నా... ఊరికే చూస్తున్నా’’ అన్నాడు సూర్యం.‘‘ఆడదిక్కు లేని కొంపగదా. ఇట్టాగే ఉంటది.’’ అన్నాడు ధర్మన్న, జీవం లేని నవ్వొకటి నవ్వుతూ. ఆర్నెల్ల కిందట ఊరికొచ్చినపుడు అతని భార్య చనిపోయిందని స్నేహితులు చెప్పినట్టు గుర్తు సూర్యానికి. అవసాన కాలంలో ఆదుకోవడానికి పాపం పిల్లలు కూడా లేరతనికి. బిక్కు బిక్కుమంటూ ఒక్కడే కాలం గడుపుతున్నాడా ఇంట్లో.‘‘ఒంట్లో అంతా బాగుందా ధర్మన్నా?’’ అడిగాడు సూర్యం సానుభూతికొద్దీ.‘‘పర్వాలేదు బాబు,’’ అని ఓ క్షణం ఆగి మళ్ళీ తనే – ‘‘అవునూ... వచ్చే దారిలో ఆ నా కొడుకేవైనా కనబడ్డాడా?’’ అన్నాడు చీకట్లోకి పరిశీలనగా చూస్తూ.‘‘ఎవరన్నా...!?’’ అన్నాడు సూర్యం అర్థం కాక.‘‘అదే ఆ సుబ్బిగాడు.’’ లోగొంతుకతో అన్నాడు ధర్మన్న.సుబ్బిగాడు చచ్చి ముప్పై సంవత్సరాలవుతోంది. అప్పుడప్పుడు ఆ చుట్టుపక్కల కనిపిస్తుంటాడని ఊళ్ళో వాళ్ళంతా కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. సుబ్బిగాడు, ధర్మన్న చిన్నప్పటి నుంచీ మంచి స్నేహితులు. అందుకే సమయం దొరికినప్పుడల్లా సుబ్బిగాడి గురించీ, వాళ్ళెలా తిరిగిందీ, సుబ్బిగాడు ఎలా చనిపోయిందీ, అన్నీ వివరించి చెబుతుంటాడు ధర్మన్న. సూర్యం కూడా అలాంటి కథలు చాలానే విన్నాడు కానీ, స్వయంగా ధర్మన్న చెబితే వినాలనుకుని –‘‘లేదన్నా. నాకేం కనబడలేదే. అయినా చచ్చిన వాళ్ళు మళ్ళీ కనబడటం ఏంటి...? విచిత్రంగా..’’ అన్నాడు రెచ్చగొడుతూ. ‘‘మళ్ళీ కనబడకుండా పోవడానికి ఆడేవన్నా మామూలు చావా చచ్చింది? మాంచి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇదిగో ఇదే చింతచెట్టుకి ఉరేసుకు చచ్చాడు.’’ అన్నాడు ధర్మన్న ఏదో రహస్యం చెబుతున్నట్టు గొంతు మార్చి.‘‘అసలెందుకు చచ్చిపోయేడు ధర్మన్నా?’’ ముందుకు వొంగి కుతూహలంగా అడిగాడు సూర్యం. ‘‘ఎందుకంటే ఏవని చెప్పేది బాబూ? ఆడికట్టా రాసిపెట్టుంది. చిన్నప్పటి నుంచీ నాతోనే తిరిగేవోడు. ప్రతి విషయం నాతో పంచుకునేవోడు. నేనూ, ఆడూ కలిసి తిరగని చోటంటూ లేదీ ఊళ్ళో. అటువంటోడు చివరికి వోడి ప్రాణాలు వోడే తీసుకున్నాడు. ప్చ్...’’ అంటూ పెదవి విరిచాడు ధర్మన్న. ‘ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందన్నా?’’ అడిగాడు సూర్యం.‘‘కష్టం కాదు బాబు ఇష్టం. ఆడికి ఆ నాయిడోళ్ళ పిల్లంటే ఇష్టం’’ ధర్మన్న ఆ మాట చెప్పగానే కొరడా ఝళిపించినట్టునట్టు మెరుపొకటి మెరిసింది ఆకాశంలో. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు సూర్యం.ధర్మన్న మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు.‘‘నిద్ర లేచింది మొదలుకొని, రాత్రి పడుకునేదాకా ఆ పిల్ల గురించే చెప్పేవోడు. ఆ పిల్ల వెనకే తిరిగేవోడు. ధైర్యం చేసి ఒకసారి నా ఎదురుగానే పలకరించాడు. ఆ పిల్ల మొహం తిప్పుకుని వెళ్ళిపోయింది. అది జరిగిన నాలుగు నెలలకి ఓ రోజు నా దగ్గరికొచ్చి నానా హంగామా చేసాడనుకో. ఏవిట్రా విషయం అని అడిగితే, ఆ పిల్ల కూడా వీడంటే ఇష్టమని చెప్పిందన్నాడు. ఇక అది మొదలు ఇద్దరూ సందు దొరికినప్పుడల్లా ఈ ఇంటి వెనకున్న మావిడి తోపులో కలుసుకునేవోళ్ళు. అప్పుడప్పుడు నన్ను కూడా కాపలాకి తీసుకెళ్ళేవాడు. ఏ మాట కామాటే చెప్పుకోవాలి గానీ... ఆ పిల్ల, సుబ్బిగాడు మాంచీ ఈడు జోడూ.’’ అని ఆపి ఓసారి చుట్టూ చూశాడు ధర్మన్న. ఇంకా వర్షం కురుస్తూనే వుంది. చెంప మీద చెయ్యి పెట్టుకుని, శ్రద్ధగా వింటున్నాడు సూర్యం.‘‘వెధవ్వాన, ఎప్పుడూ లేనిది ఇవ్వాళ ఎందుకో దీని తాడు తెంచుకుంటోంది’’ అని సూర్యం వైపు తిరిగి మళ్ళీ చెప్పడం మొదలు పెట్టాడు.‘‘కొన్ని రోజులు అట్టా గడిచాక, ఓ రోజు ఎట్టా తెలిసిందో ఏమో నాయుడికి వీళ్ళిద్దరి విషయం తెలిసిపోయింది. నాయుడు తెలిసినా తెలియనట్టే ఉండి, ఓ రోజు తోపులో కాపు కాసి ఇద్దరినీ ఉన్నపళంగా పట్టుకున్నాడు. ఆ పిల్లని కొడుతూ ‘ఏవే నీకేం తక్కువ చేసానే నేను. ఎందుకింత పని చేసావ్..? మన ఇంటి పరువు తీసావ్ కదే. బజారుదానా!’ అని తిట్టుకుంటూ తీసుకెళ్ళిపోయాడు. పోతూ పోతూ తనతో పాటు వచ్చిన ఇద్దరు పాలేరుల్ని కళ్ళతో సైగ చేసి పోయాడు. వాళ్ళిద్దరూ కలిసి సుబ్బిగాడ్ని కట్టేసి చితకబాదారు. కాపలాగా చెట్టు మీద కూర్చున్న నాకు ఏం చేయాలో తెలియక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాలేర్ల కాళ్ళ మీద పడి, వదిలేయమని బతిమిలాడాను. వాళ్ళు వదిలేసి వెళ్లిపోయారు. అప్పటికే సుబ్బిగాడి పరిస్థితి దారుణంగా ఉంది. స్పృహ లేకుండా పడున్నాడు. వాడ్ని మా పాకలోకి తీసుకుపోయి, కాసిన్ని నీళ్ళు జల్లి లేపి కూర్చోబెట్టాను. నిస్త్రాణంగా గోడకి ఆనుకుని కూర్చున్నాడు వోడు. చీకటి పడగానే చెరుకొంచం గంజి తాగి పడుకున్నాం. ఆ రాత్రంతా వాడికి నిద్రపట్టలేదేమో మూలుగుతూనే ఉన్నాడు. నాక్కూడా నిద్రపట్టలేదు. ఎప్పుడో తెల్లవారు జామున కోడి కూసే వేళకు నిద్రపట్టింది.’’ అంటూ ఓ నిమిషం ఆగాడు ధర్మన్న.‘‘ఆ తర్వాత ఏమయింది ధర్మన్న?’’ ఉండబట్టలేక అడిగాడు సూర్యం.‘‘ఆ తర్వాత నువ్వు వినకూడదు బాబూ. అసలే ఒంటరిగా వెళ్తున్నావ్..’’ అన్నాడు ధర్మన్న ఎటో చూస్తూ.‘‘పర్వాలేదులే చెప్పు ధర్మన్నా.’’ అన్నాడు సూర్యం.పైకి అలా అన్నాడే కానీ అతనికి మనసులో కాస్తంత బెరుకుగానే ఉంది. ధర్మన్న చెప్పసాగేడు.‘‘ఆ రోజు పొద్దెక్కే వేళకు లేచి చూద్దునా... సుబ్బిగాడు నా పక్కన లేడు. మా పాక చుట్టుతా చూశాను. ఎక్కడా వాడి జాడే లేదు. సరే వాళ్ళ ఇంటికెళ్ళాడేమో చూద్దామని బయల్దేరబోతుంటే, నాయుడు పాలేర్లలో ఒకడు ఎదురొచ్చాడు. ఏవైందని అడిగేసరికి, నాయుడు నన్ను పిలుస్తున్నాడని చెప్పాడు. సరే వస్తాన్లే వెళ్ళమంటే, లేదూ వెంటబెట్టుకొని రమ్మన్నారు అన్నాడు. ఇక చేసేదేమి లేక వాడి వెంట నాయుడింటికి బయల్దేరాను. మేం వెళ్ళేసరికి నాయుడు వాలు కుర్చీలో కూర్చుని చుట్ట తాగుతూ కనిపించాడు. నన్ను చూసి రమ్మన్నట్టుగా చేతిని ఊపాడు. నేను నాయుడికి దగ్గరగా వెళ్ళాను. ‘ఎక్కడ దాచిపెట్టావురా సుబ్బిగాడ్ని?’ అన్నాడు నా వైపు చూసి కోపంగా.‘ఏవోనండీ...! పొద్దున్నుంచి ఎక్కడా కనపడలేదు.’ అన్నాను నేను భయంగా.‘నా కొడుక్కి ఎంత ధైర్యం ఉంటే రాత్రి మా ఇంట్లోకి దూరతాడురా. అందుకే పోలీసులకి చెప్పొచ్చినా ఎక్కడ కనపడితే అక్కడ కాల్చేయమని. నువ్వు గాని ఎక్కడైనా దాచావని తెలిసిందో నీక్కూడా అదే గతి.’ అని బెదిరించాడు నాయుడు. నేను మారు మాట్లాడకుండా ఇంటికొచ్చేశాను. ఇది జరిగిన రెండు రోజుల వరకూ సుబ్బిగాడు ఎక్కడా కనబడలేదు. ఆ తర్వాత రోజు పొద్దున్నే కనిపించాడు. శవంలా...! ఈ చింతచెట్టుకి వేళ్ళాడుతూ...!’’ అంటూ చింతచెట్టు వైపు చేయి చూపించాడు ధర్మన్న. సూర్యం అటు వైపు చూశాడు. ఇంకా సుబ్బిగాడు చెట్టు కొమ్మకే వేళాడుతున్నట్టు అనిపించిందతనికి.చలిగాలికో లేక ధర్మన్న చెప్పిన మాటలకో ఎందుకో అతని శరీరం సన్నగా వణికింది.‘‘ఆ రోజు రాత్రే నాయుడికీ, పోలీసులకీ భయపడి ఆడు ఉరేసుకుని చచ్చిపోయాడు బాబూ. ఆడు చచ్చినప్పటి నుండీ నాకు నిద్ర లేదు. రాత్రయితే చాలు చింతచెట్టు పైనుంచి రాళ్ళు విసురుతాడు. వేసిన తలుపుల్ని దబదబ కొడతాడు. మొన్నొకసారి చీకటి పడ్డాక నడుచుకుంటూ వస్తుంటే ఒరే ధర్మా... ఆగరా. నేనొక్కడినే ఉన్నాను. నువ్వూ నాతో పాటూ వచ్చెయ్ రా. అంటూ వెంటపడ్డాడు.’’ అని వాపోయాడు ధర్మన్న. ఇదంతా విన్నాక సూర్యానికి ఏదో తెలియని భయం ఒళ్ళంతా పాకింది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలనిపించలేదు. ఓసారి బయటకు చూశాడు. అప్పటికి వర్షం తగ్గి తెరిపినిచ్చింది. మబ్బులన్నీ ఎగిరిపోయి వెన్నెల కాస్తోంది. ‘‘సరే ధర్మన్నా... వర్షం తగ్గినట్టుంది. ఇక నేను వెళ్ళొస్తా’’ అని చెప్పి పైకి లేచాడు సూర్యం.‘‘జాగ్రత్తగా వెళ్ళు బాబూ’’ అన్నాడు ధర్మన్న.భయం భయంగానే అక్కడ్నించి బయల్దేరాడు సూర్యం.చీకట్లో అలా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సూర్యాన్ని చూసి మెల్లగా నవ్వాడు ధర్మన్న. ఆ నవ్వులో ఎవ్వరికీ తెలియని ఓ నిజం దాగుంది. ఆ నిజంలో...ఇలాంటి రాత్రే ఒక రాత్రి సుబ్బిగాడు ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటున్నాడు. అతని కంఠాన్ని ఎవరో రెండు చేతులతో పట్టుకుని గట్టిగా నులిమేస్తున్నారు. సుబ్బిగాడికి ఊపిరాడక పొలమారుతోంది. విడిపించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. కానీ కనికరం లేని ఆ కబంధ హస్తాల్లోంచి బయటపడలేక పోతున్నాడు. కాసేపలా పోరాడిన తర్వాత అతనిలో చలనం ఆగిపోయింది. అతని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ మరుక్షణం అతని మెడకో ఉచ్చు బిగించబడింది. ఒక మనిషి తనంతట తానుగా ఉరిపోసుకుంటే ఎలా ఉంటుందో అలానే అతని శరీరం చింతచెట్టు కొమ్మకు వేలాడదీయబడింది. ఈ తతంగం అంతా ముగిశాక, హంతకుడు భద్రంగా బొడ్డు దగ్గర ధోవతిలో దోపుకున్న చుట్ట తీసి వెలిగించుకున్నాడు. అది నాయుడు కాల్చే చుట్ట. కానీ కాలుస్తున్నది మాత్రం ధ...ర్మ...న్న. దరిదాపుల్లో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టూ చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, పాకలోకి వెళ్ళి, చూరులో దాచిన ఓ మూటను తీసి నేలమీద పెట్టాడతను. మందంగా వెలుగుతున్న చిమ్నీ లాంతరు మంటను కొంచెం పెంచి, ఆ వెలుతురులో మూట విప్పి చూశాక, ఆనందంతో అతని కళ్ళు మెరిసాయి. డబ్బు, రెండెకరాల పొలానికి సంబంధించిన దస్తావేజులు. నాయుడిచ్చినవి. మెల్లగా, వికృతంగా నవ్వాడతను. ఇప్పుడు నవ్వుతున్నట్టుగానే. అప్పటి నుంచీ సందర్భం దొరికిన ప్రతిసారీ అతను చెబుతూ వచ్చిన ఓ భయం పూసిన అబద్ధం అసలు నిజాన్ని మింగేసింది. యమధర్మరాజు లాంటి ధర్మన్నని ధర్మరాజుని చేసింది. అప్పటిదాకా ధర్మన్నకి మాత్రమే కనిపించే సుబ్బిగాడు, ఆ అబద్ధాన్ని విన్న తర్వాత ఊర్లో అందరికీ కనిపించసాగాడు.ఇవేవీ తెలియని సూర్యం మాత్రం ఊరివైపు ఆగకుండా పరిగెడుతున్నాడు. భయానికో, మరి దేనికో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెడుతున్నాడు. సమాజంలోకి ధర్మన్న సంధించి వదిలిన మరో అబద్ధపు బాణంలా. -
రేపటి ఫన్డేలో... అబద్ధపు బాణం
సూర్యం ఇంటికి వెళ్లాలి. పట్నంలో చదువుకుంటున్న అతను ఆర్నెల్లకొకసారి ఊరొస్తూ ఉంటాడు. ఈసారి భారీ వర్షం కురుస్తోంది. రోడ్డంతా చిత్తడి చిత్తడిగా ఉంది. ఊరవతల వరకే రవాణా సౌకర్యం ఉంది. ఇప్పుడతను ఊర్లోకి నడిచెళ్లాలి. వర్షం తగ్గేవరకూ ధర్మన్న ఇంటిముందు ఆగితే సరిపోతుందనుకున్నాడు. ధర్మన్న కాటికాపరి. ఆ ఊరి శ్మశానం పక్కనే చిన్న గుడిసెలాంటి ఇంట్లో ఉంటాడు. ‘‘దార్లో నీకేమైనా ఆ సుబ్బిగాడు కనిపించాడా?’’ అనడిగాడు ధర్మన్న, సూర్యాన్ని ఇంట్లోకి పిలుస్తూ. సుబ్బిగాడు చచ్చి ముప్ఫై సంవత్సరాలవుతోంది. అప్పుడప్పుడు చుట్టుపక్కల కనిపిస్తూంటాడని ఊర్లో వాళ్లంతా కథలు కథలుగా చెప్పుకుంటారు. ఎవరు ఆ సుబ్బిగాడు? చనిపోయాక కూడా ఎలా కనిపిస్తున్నాడు? ధర్మన్న ఆ రాత్రి, ఆ వర్షంలో సూర్యానికి చెప్పిన కథేంటీ? చదవండి.. ‘అబద్ధపు బాణం’ కథలో... -
బాణాలతో సైకో హల్చల్...
-
బాణాలతో సైకో హల్చల్...
తూర్పుగోదావరి: జనాల మీదకు బాణాలను ఎక్కుపెడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తున్న ఓ సైకో... తూర్పుగోదావరి జిల్లాలో హల్చల్ చేస్తున్నాడు. సైకో దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంఘటన చింతూరు మండలం వేగితోట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముత్తయ్య(30) గత కొంతకాలంగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. తాజాగా గ్రామంలో చలిమంట కాసుకుంటున్న దారయ్య, లాలమ్మ అనే ఇద్దరిపై ముత్తయ్య బాణాలు వేశాడు. దీంతో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు.