మార్చి 1న విడుదల

ysr kadapa to vijayawada plane services from march 1st - Sakshi

కడప నుంచి విజయవాడకు ప్రారంభం కానున్న విమాన సర్వీస్‌

కేంద్ర ప్రభుత్వ ఉడాన్‌ పథకం ద్వారా విమానయోగం  

సాక్షి, కడప : ఎన్నో ఏళ్ల క్రితం బ్రిటీషు హయాంలో నెలకొల్పిన కడప ఎయిర్‌పోర్టుకు కేంద్రం పుణ్యమా అని కొత్త కళ వస్తోంది. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో ఎయిర్‌పోర్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఎయిర్‌పోర్టు అద్భుతంగా ఉన్నా విమాన రాకపోకలు మాత్రం అప్పుడప్పుడు మాత్రమే సాగేవి. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం రీజినల్‌ కనెక్టివిటీ స్కీం ద్వారా చిన్నచిన్న స్టేషన్లను కలుపుతూ అందరికీ విమానయోగం కల్పించాలన్న సంకల్పంతో ప్రధాని పలు విమాన సర్వీసులను ప్రారంభించారు. అప్పటి నుంచి కేంద్రం ప్రయాణికులతో సంబంధం లేకుండా విమాన యాజమాన్యాలకు సీట్ల అనుగుణంగా డబ్బులు చెల్లిస్తూ వస్తోంది. తద్వారా కడప లాంటి ఎయిర్‌పోర్టులకు కూడా మహర్దశ వస్తోంది. ప్రతిరోజు రెండు విమాన సర్వీసులు కడప మీదుగా నడవనున్నాయి.

ఇప్పటికే హైదరాబాద్, చెన్నై సర్వీసులు హైదరాబాద్‌ నుంచి ట్రూజెట్‌కు చెందిన విమానం రాకపోకలు సాగిస్తోంది. ప్రతిరోజు హైదరాబాద్‌ నుంచి ఉదయం కడపకు రావడం, అనంతరం కడప నుంచి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేది. ఈ సర్వీసును 2017 ఏప్రిల్‌ 27వ తేదీన ప్రధాని మోదీ రిమోట్‌ ద్వారా ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా సాగుతోంది. కడప నుంచి చెన్నైకి కూడా గత ఏడాది నవంబర్‌ 16 నుంచి విమాన సర్వీస్‌ను ప్రారంభమైంది. ప్రస్తుతం కడప–హైదరాబాద్, కడప–చెన్నైల మధ్య సర్వీస్‌లకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన ఉంది.

మార్చి 1నుంచి విజయవాడకు సర్వీస్‌     కడప నుంచి రాజధానికి సర్వీస్‌ నడిపేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మార్చి 1 నుంచి కడప–విజయవాడ సర్వీస్‌ ప్రారంభం కానుంది. అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. దీంతో రాజధాని ప్రాంతానికి కడప నుంచి వెళ్లడానికి విమాన సర్వీస్‌ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు ప్రయాణికులు కూడా టిక్కెట్లు బుక్‌ చేసుకున్నారు. WWW.TQUJET.COM   టిక్కెట్లు బుక్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది.

ప్రయాణికులకు ట్రూజెట్‌ ఆఫర్‌
కడప నుంచి విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ప్రస్తుతం కడప నుంచి రైళ్లు, ఏసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్‌ కంటే కూడా విమానంలో తక్కువ చార్జీ అంటే ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఎందుకంటే ట్రూజెట్‌ సంస్థ కడప నుంచి విజయవాడ విమాన సర్వీసు ప్రారంభాన్ని పురస్కరించుకుని బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. కేవలం రూ.798 ప్రారంభ ధరగా నిర్ణయించారు. త్వరపడిన వారికే లిమిటెడ్‌ సీట్ల మేరకు అవకాశం లభిస్తుంది.

సద్వినియోగం చేసుకోవాలి
కడప నుంచి హైదరాబాద్, చెన్నై, విజయవాడలకు విమాన సర్వీసులు నడుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కడప ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ పూసర్ల శివప్రసాద్‌ పిలుపునిచ్చారు. విజయవాడ–కడప మధ్య నడుస్తున్న విమాన సర్వీసులకు ముందస్తుగా రిజర్వేషన్‌ చేసుకుంటే టిక్కెట్‌ ధర తగ్గుతుందన్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలన్నారు. కడప నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైలకు సర్వీస్‌లు ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Read latest YSR News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top