ఆన్‌లైన్‌లో కొత్త పాన్‌ కార్డును పొందండిలా

రెండు రోజుల్లో శాశ్వత ఖాతా సంఖ్య తెలుసుకోవచ్చు

అత్యవసర సమయాల్లో ఆన్‌లైన్‌ సౌకర్యం ఉపయోగకరం

నిడమర్రు :  ఆదాయపు పన్ను శాఖ అందించే శాశ్వత ఖాతా సంఖ్య కార్డు (పాన్‌ కార్డు) కలిగి ఉండటం నగదు లావాదేవీల విషయంలో తప్పనిసరి అవుతుంది. బ్యాంకు లావాదేవీలకు, పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల్లో పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(పాన్‌ కార్డు) అవసరమవుతుంది. సార్వత్రికమైన ఈ 10 అంకెల అల్ఫాన్యూమరిక్‌ పాన్‌ కార్డును  ఆదాయపన్ను శాఖ ప్రతీ పన్ను చెల్లింపుదారుకు దీన్ని జారీ చేస్తుంది. అయితే ఈ కార్డుకోసం రాతపూరక దరఖాస్తు చేసుకుంటే 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. అయితే అత్యవసర సమయాల్లో ఈ పాన్‌ కార్డు(సంఖ్య) ఆన్‌లైన్‌ ద్వారా 48 గంటల్లో పొందే అవకాశం ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆదాయపన్ను శాఖ కల్పిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

పాన్‌ కార్డు జారీ ఇలా
పాన్‌ కార్డును భారత ఆదాయపన్ను శాఖ దీన్ని జారీ చేస్తుంది. దీని కోసం www.tun-nsdl.com అనే వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవ్వాలి. కనిపించే వెబ్‌సైట్‌ ముఖ చిత్రంలో దిగువభాగంలో ఆన్‌లైన్‌ పాన్‌ అప్లికేషన్‌ క్లిక్‌ చేయాలి. అక్కడ అప్‌లై ఆన్‌లైన్‌ వద్ద భారతీయులైతే న్యూ పాన్‌–ఇండియన్‌ సిటిజన్‌(ఫారం 49 ఏ)/విదేశీయులైతే న్యూ పాన్‌–ఫారిన్‌ సిటిజన్‌(ఫారం–49 ఏఏ) క్లిక్‌ చేయాలి. అక్కడ ఆన్‌లైన్‌ దరఖాస్తు విండో ఓపెన్‌ అవుతుంది. ఈ ఆన్‌లైన్‌ ఫారంలో చిరునామా, ఆదాయపన్ను శాఖ సర్కిల్, రేంజి, ఏరియా కోడ్, ఏవో కోడ్‌ వంటివన్నీ పూర్తి చేయాలి. ఆ వివరాలు అదే వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
గైడ్‌లైన్స్‌ చదవాలి : అదే విండోలో ఉన్న గైడ్‌లైన్స్‌ చదివి ఫారం రకాన్ని ఎంచుకోవాలి. డిజిటల్‌ సిగ్నేచర్‌ సర్టిఫికేట్‌ కావాలా..? డిజిటల్‌ సిగ్నేజర్‌ లేని సర్టిఫికెట్‌ కావాలా..? అనే ఆప్షన్‌ ఎంచుకుని వివరాలు మొత్తం నింపాలి. పాన్‌ కార్డుకు సంబంధించిన వివరాలన్నీ అదే వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు లభ్యమవుతాయి. అలాగే ఇదే వెబ్‌సైట్‌లో పాన్‌/టాన్‌ కార్డ్‌ దరఖాస్తు స్థితి తెలుసుకోవడం, ఇ–రిటర్న్‌ రిజిస్ట్రేషన్‌ స్థితి తెలుసుకోవడం పాన్‌కు సంబంధించిన ఫిర్యాదులు చేయడం, పాన్‌ డేటాలో మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు.

ఇలా సమర్పించాలి.. : వివరాలన్నీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంలో నింపి, అవసరమైన సపోర్టడ్‌ డాక్యుమెంట్లు జతచేసి సమర్పించాలి. దరఖాస్తు నెంబరు ప్రకారం ఎకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. ఈ నెంబర్‌ ప్రకారం మీ అప్లికేషన్‌ స్టేటస్‌ ట్రాక్‌ చేసుకోవచ్చు, సాధారణంగా 15 నుంచి 29 పనిదినాల తర్వాత పాన్‌ కార్డు వస్తుంది. కానీ ఇలా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కేవలం రెండు రోజుల్లో కేటాయిం చిన పాన్‌ కార్డు సంఖ్య తెలుసుకోవచ్చు. తర్వాత రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా పాన్‌కార్డు అందుతుంది. పాన్‌ కార్డు భారతదేశం పరిధిలో పంపించడానికి రూ.110 (జీఎస్టీతో సహా), ఇతర దేశాలకు పాన్‌ కార్డు పంపాల్సి వస్తే అన్ని సర్వీసులు కలుపుకుని రూ.1,020 (జీఎస్టీతో సహా) ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

ఆఫ్‌లైన్‌లో అయితే..
ఒకవేళ ఆఫ్‌ లైన్‌లో అయితే ఇదే వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్‌ చేసుకుని సంతకంతో కూడిన కలర్‌ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు కార్డుగా ఆధార్‌ కార్డు, చిరునామా గుర్తింపు పత్రం, రూ.110 డీడీ సమర్పించాలి.

Read latest West Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top