ఇసుకాసురులు

Sand Mafia in Warangal District - Sakshi

గోదావరి తీరంలో ఇసుక తోడేళ్లు

రాత్రి, పగలు తేడా లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు

నిత్యం రెండు వేల లారీల్లో దూర ప్రాంతాలకు రవాణా 

మామూళ్ల మత్తులో అధికారులు

పగటి వేళ కొంతైనా కంట్రోల్‌లో ఉంటున్న ఇసుక ఓవర్‌ లోడు దందా.. రాత్రివేళలో విచ్చలవిడిగా సాగుతోంది. ఈ దందాకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అధికారులు తమ మౌనంతో వత్తాసు పలుకుతుండడం గమనార్హం. దీన్ని అలుసుగా తీసుకుని కొంత మంది కాంట్రాక్టర్లు ఒక్క పర్మిట్‌ కాగితం పైన రెండు ట్రిప్పుల లారీల అధిక లోడును తీసుకుపోతున్నారు. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారే కరువయ్యారు.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : 
గోదావరి తీరంలో ఇసుక తోడేళ్ల రాజ్యం నడుస్తోంది. అందిన కాడికి సహజ సంపదను కొల్లగొడుతూ అక్రమార్జనకు పాల్పడుతున్నాయి. ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ఆదాయాన్ని తమ ఖజానాలో ఎంచక్కా జమ చేసుకుంటున్నాయి. కళ్ల ముందే అక్రమ దందా కనిపిస్తున్నప్పటికీ సంబంధిత టీఎస్‌ఎండీసీ, పోలీసు, రవాణా, రెవెన్యూ తదితర ప్రభుత్వ విభాగాలు తమకేం పట్టిందిలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుం డడంతో ఇసుక అక్రమ రవాణా ‘మూడు లారీలు.. ఆరు అదనపు బకెట్లు’గా విలసిల్లుతోంది.

నిబంధనలకు తూట్లు..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహదేవాపూర్‌ మండలం కాళేశ్వరం బ్యారేజీ పనుల వేదికగా సాగుతున్న ఇసుక దందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ముంపు ప్రాంతంలో ఇసుక తరలింపు పేరుతో క్వారీలు దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. గోదావరిలో అందినకాడికి ఇసుకను తోడేస్తూ కోట్లు కూడబెట్టుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బ్యాక్‌ వాటర్‌ నిల్వ ఉండేందుకు క్వారీలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో భాగంగా మహదేవాపూర్, కాటారం మండలాల్లో మొత్తం 22 క్వారీలకు పర్మిషన్‌ జారీ చేసింది. ప్రస్తుతం ఆయా మండలాల్లో 18 క్వారీల్లో ఇసుక అమ్మకాలు సాగుతున్నాయి. 

ఈ క్వారీల నుంచి 22 టన్నుల సామర్థ్యం కలిగిన లారీలు నిత్యం సగటున రెండు వేల వరకు వరంగల్, హైదరాబాద్‌ నగరాలకు ఇసుకను తరలిస్తున్నాయి. వీటిలో ప్రతీ లారీలో కనీసం ఐదు టన్నుల ఇసుక ప్రభుత్వ లెక్కల్లోకి రాకుండా కాంట్రాక్టర్ల ఖాతాలోకి వెళ్తొంది. ముఖ్యంగా అన్నారం బ్యారేజీ పరిధిలో తాళ్లగడ్డ 1, 2, పలుగుల 1, 2, మహదేవాపూర్‌ 3, 4, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, పూస్కుపల్లి, కాటారం మండలంలోని దామెరకుంట 1, 2 క్వారీల్లో అధికలోడు దందా ఇష్టారాజ్యాంగా నడుస్తోంది. కాగా, ఈ దందాను టీఎస్‌ఎండీసీ అ«ధికారులు, కాంట్రాక్టర్లు దగ్గరుండి మరీ నడిపిస్తున్నట్లు సమాచారం. క్వారీ దగ్గర టీఎస్‌ఎండీసీ సిబ్బంది రూ. 200 నుంచి రూ. 300 వరకు లారీల డ్రైవర్ల వద్ద అక్రమంగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

వే బ్రిడ్జిలే కీలకం..
ఇసుక అక్రమ తరలింపులో వేబ్రిడ్జిలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇసుకను తక్కువ తూకం వేస్తూ నిర్వాహకులు తప్పుడు కాగితాలు ఇస్తున్నట్లు సమాచారం. ఎక్కువ లోడు ఉన్నా తక్కువగా ఉన్నట్లుగా వేబిల్లులు జారీ చేస్తున్నారు. ఇందుకు ప్రతిఫలంగా వేబ్రిడ్జిల వద్ద లారీల లోడును తూకం వేసేందుకు రూ.100 నుంచి రూ. 500 వరకు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఆయా చోట్ల మామూళ్ల వ్యవహారం జోరుగా సాగుతుండడంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక నగరాలకు తరలిపోతుంది. దీన్ని అరికట్టాల్సిన రెవెన్యూ, మైనింగ్, రవాణా, పోలీసుశాఖ అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేస్తూ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.   

Read latest Warangal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top